Thursday, March 30, 2017


పరోపకారమా?


అడిగితేనే చెప్పు
అడిగినంతే చెప్పు
అనేది సువర్ణ లిఖితం
కాని మంచితనాన్ని
తెలివి తక్కువ తనంగా
జమకట్టే ప్రబుద్ధులుంటారు
టోపీ పెట్టే కిలాడీలు ఉంటారు
ఉపకారం అలవాటైన వారు
చేతులు ముడుచుకుని
కాళ్ళు కట్టుకొని నిమ్మళించ లేరు
తమాయించు కోలేరు.
మరొకరి బాగుకోసం
తాపత్రయపడటం
వెంపర్లాడటం
పట్టుకు వ్రేలాడటం
ఆ కోవలోవే.
చూసీ చూడనట్టు
వినీ విననట్టు
నిభాయించుకోపోతే
అభాసు పాలవుతాం
'పరోపకారార్థం యిదం శరీరం'
అన్న దానికి విలువేది
నిస్వార్థ సేవకు బలమేది
పెరవారి మంచికై నువు చూస్తే
నీ లాభమేంటని చూస్తారు
నిన్ను పరాభవాల పాలు చేస్తారు.
దేవదేవా మంచిని బ్రతుకనీ
వారి తలపులే మార్చుకోనీ
వారిని బాగు పడనీ
సహాయగుణం కొనసాగనీ.

Wednesday, March 29, 2017

సయోధ్యా? అయోధ్యా

అవని తల్లిని ఆదరిస్తా
ప్రకృతి కాంతకు ప్రణమిల్లుతా
ఉష్ణ తాపం తగ్గిస్తా
చెరుపెరుగని మైకా (plastic) తో
మట్టి బ్రతుకును మంట గలపడం
మానుకుంటా
చెట్టు చేమలపై కత్తి వేటులు మరచిపోతా
వాకిలంతా పచ్చదనం విరబూయిస్తా
మొక్క మొక్కకు నీరు పోసి మొక్కుకుంటా
చల్లగాలితో ఊపిరులూదమని వేడుకుంటా
వాన చుక్కని ఒడిసి పట్టి
నేల కడుపున మూట కడతా
పెరవారితో కలిసి మెలిసి నే నుంటా
అత్యాశ అసూయలకు దూరమౌతా
సామరస్యపు బాటలో సాగిపోతా
అయినకాడికి మీకండగా నేనుంటా
ఇన్ని మెరుగులు నేనిస్తా
మరి నా మొరగులో
సకాల వర్షాలు పాడి పంటలు
ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు
అవకాశాలు ఆనందాలు
శాంతి సౌభాగ్యాలు
అవే మాకు పదివేలు
ఒంటెద్దు పోకడలు మాని
ఉభయ తారకంగా 
ఇచ్చి పుచ్చుకుందాం
మరేమంటారు?
సయోధ్యా ? అయోధ్యా?

Tuesday, March 28, 2017

శంనో అస్తు 


 ప్రణవ నాదం
వేద విద్ జ్ఞానం గా
నాకు అంతరంగ వికాసం ఇచ్చు గాక
నా మేధస్సును పరమాత్మ వైపు ఉంచుగాక
ఈ జిహ్న్వ మధురములే పలుకు గాక
నాచెవులెప్పుడూ శుభములే ఆ కర్ణించు గాక
ఈ కనులతో మంచినే వీక్షించెదను గాక
అరిష్టనేమి గరుడుడు స్వస్తి నిచ్చుగాక
బృహస్పతి అభ్యుదయ మిడుగాక
ద్విపద చతుష్పాదులకు మేలగు గాక
తరు లతా గుల్ఫములు ఊర్ధ్వ గాములగు గాక
సత్కార్యాశక్తులైన మా అందరకు
తియ్యని గాలి లభించుగాక
తియ్యని నీటిని వాపీ కూప తటాక నదులిడుగాక
సస్యశ్యామలగా వసుంధర వరలు గాక
సూర్య చంద్రులు అనుకూలురై ఉందురు గాక
నా వాక్కులో మనస్సు
మనస్సులో నా వాక్కు
ప్రతిష్టిత మౌ గాక
పశువులు క్షీర సమృద్ధినిడుగాక
లౌకిక పార లౌకిక సత్యాలనే
ఎల్లప్పుడూ పలికెదను గాక
ఇంద్ర మిత్ర గురు వరుణులందరూ
మాకు మేలొనరించెదరు గాక
గురు శిష్యులను దేవతలు దీవించు గాక
ఈ శుభారంభ సమయంలో
లలిత మనో చలిత   శ్రీ లలిత
అనునిత్యం నన్ను సన్మార్గ గామి చేయు గాక
జగద్సద్గరువు నన్ను ప్రచోదింప చేయు గాక
సర్వ జీవులు సర్వ లోకాలు
సుఖ శాంతులతో వర్థిల్లు గాక.
(8శాంతి మంత్రాల ఆధారంగా క్లుప్తంగా ప్రయత్నించా)

ఉగాది శుభాకాంక్షలు

ఉ. దుర్ముఖ వత్సరమ్మనిపి దుందుభి మ్రోగగ        జేసినాము మా
ధర్మ మెరుంగజేసి మము ధర్మ పథమ్మును వీడకుండగన్
కర్మ సుబుద్ధులన్ గఱపి కాని తలంపులు మాన్పి కావుమీ
పేర్మి నొసంగి ఎల్లెడల మేలొనరించుము  సర్వ మంగళా!
ఉ. ఎన్ని యుగాదిలో గడచె ఎన్ని వసంతములో చనెన్
కొన్ని తలంపులో గలవు కొన్ని శుభాధిక మయ్యె అన్నిటిన్
మిన్నగ నెంచలేము కలిమిన్ బలిమిన్ విజయమ్మొసంగి అన్నిటన్
అన్నుల మిన్నగా భరత జాతిని నిల్పుము సర్వ మంగళా!
కం. అవనికి ఆమని నిచ్చుచు
       భువి సకల చరాచరమ్ముభయరహితులుగన్
       ప్రవిమల ధర్మాశక్తుల
       గావింపుము యీ ఉగాది ఆదిగ తల్లీ.
 కం. పచ్చ దనమిచ్చి మహికి
       అచ్చ తెనుగు కందలాల నందించి ఆ ట్రం
       పొచ్చి మెరికలన మీరే,
       వచ్చి  అమెరికనులగుమని వేడుకొనవలెన్.

 కం. యోగి కి క్రొత్త బలమిచ్చి
        మూగ పశుల కాయువిచ్చి మోడీ కి మరో
        యోగ మిడిభరత జాతికి
        వేగముగ ప్రగతి నొసంగ దీవెన లీయుమీ.

Monday, March 27, 2017

సాగి పో వడమే నీ ధర్మం

చింత చచ్చినా పులుపు చావదన్నట్టు
వయసు హెచ్చినా పరుగు ఆగదన్నట్టు
ఏదో సాధించాలని
ఎంతైనా శ్రమించాలని
ఆరని తీరని ఆకాంక్ష
ఆశయాల సాధనలో
అవకాశాల పార్వేటలో
అద్భుత విన్యాసాలు
పద్మవ్యూహాలు
ఎత్తు పల్లాలు ఎద మూల్గులూ
పునరుత్తేజాలు పునస్సమీక్షలూ
విజయానికి చేరువలో అవనతవదనం
సమయానికి నీవెవరో అనవసర విషయం
పయనానికి తోడెవరో తెలిసిన మరునిమిషం
సాగి పోవడమే ధర్మం
సాగి సాధించడమే మర్మం
గత శ్రముడవై ఉత్తుంగ తరంగమై
ధృత కంకణుడవై ఉధృత జ్యోతివై
కృత నిశ్చయుడవై సమీకృత బల్మివై
సాగి పోవడమే కర్తవ్యం
సాగి సాధిస్తేనే భవితవ్యం.

Sunday, March 26, 2017

     ఏమో

ఎంత కష్టం విశ్రాంత జీవితం
ఎంత నికృష్టం రికామీ జీవనం
*గడనుడిగిన వాడు నడపీనుగట
ఇది కొన్ని శతాబ్దాల నాటి మాట
ఇప్పటికీ అక్షర సత్యమే
పట్టించుకోని పెళ్ళాం
వినిపించుకోని సంతానం
అంటీ ముట్టనట్టు ఉండలేని
మనస్తత్వం  మరోతత్వం
మార్జాల కబళ న్యాయం
ఎవరికైనా ఇదో గడ్డుకాలం
ఏమన్నా ఇదో విపత్కర కాలం
ఈ వఱకూ బ్రతుకంతా జీవించి
అనుక్షణం ఇప్పుడు నటించడం
ఎవరికైనా నిజంగా ఎంత కష్టం
ముక్కు మూసుకుని...... మూసుకుని
ఎంత సేపు కూర్చోగలం
తోక ఫోను ధర్మమా అని
ఫేసుబుక్కులూ వాట్సేప్ లూ
కాస్తలో కాస్త ఉపశమనం
లేకుంటే ఎంత నికృష్టం
సత్రం లో భోజనం మఠంలో నిద్ర
కుదిరితే మహద్భాగ్యమే
ఏడుకొండల వాడిలా
అర్థరాత్రి కి అర్థాంగిని జేరితే మేలేమో
అంత వఱకూ రచ్చబండలూ
సాయంత్ర నడకలూ పిచ్చాపాటీలూ
ఆరోగ్యానికీ ఆనందానికీ
నూతన మార్గాలేమో.
(* కం. గడ నెఱిగిన మగ జూచిన
           అడుగలకు మడుగులొత్తును మహిళలు                               మదిలో
           గడనుడిగిన మగ జూచిన
           నడపీనుగు వచ్చెనంచు నగుదురు                                                   సుమతీ.)
ఇది ఏ ఒక్కరినీ ఉద్దేశించి వ్రాసినది కాదు.
కొంతమంది ఇలా అవస్థ పడుతున్నట్టు తెలిసి వ్రాసా నంతే.

Saturday, March 25, 2017

పునాదులు - సోపానాలు


గురు శిష్యులైనా తలిదండ్రులైనా
భార్యా భర్తలైనా భ్రాతృ భగినీలైనా
సహగమనానికి విశ్వాసమే పునాది
చెలిమి కైనా నెలమి కైనా అదే పునాది
సమాజానికి నియమ నిబంధనలే పునాది
ఎదుటి వారి కన్ను గప్పి
నియమాలకు ఎగనామం పెట్టి
హెచ్చు లబ్ది పొందాలనే తపనే
అన్నీ నావే అంతా నాకే
అనే స్వార్థ చింతనే
అన్ని అనర్థాలకూ మూలం
అన్ని అకృత్యాలకూ మూలం
'నా' లోంచి 'మన' లోకి
'మన'లోంచి 'తన' లోకి
బుద్ధి బదిలీ అయితే
'మంచి' మన మొగసాల నిలువదా?
శాంతి విపంచి ముంగిట వీయదా?

ఆధిక్యతా భావం అహంకార స్వభావం
అందరినీ పాయగొట్టే పాడు గుణాలు
అందరికీ ఏహ్యమయ్యే అవగుణాలు
అణకువ నేర్వని జీవనం
మెలకువ లెరుగని పయనం
సదా పరిహాస భరితం
సహనాన్ని పరీక్షించడం
వైరాన్ని కొని తెచ్చుకోవడమే.
ఆకర్షణలూ ఆక్షేపణలూ
తప్పించుకోలేని అంటు రోగాలు
తలపులధీనంలో ఉంటే నవ రాగాలు
బ్రతుకంతా పరమపద సోపానాలు.

Friday, March 24, 2017

కాలం- విలువ


ఎదురుగా ఉంటే కోపాలు తాపాలు
చేతికి అందనంత
కంటికి ఆననంత
దూరం జరిగితే రాగాలు రోగాలు
అందుకే
ఉన్నదానికి విలువే లేదు
లేనిదానికి నిలువే లేదు
రాని దానికి పిలుపే లేదు
కాని దానికి కొదవే లేదు
ఆరాటంతోనే పోరాటం
మమకారంతోనే సహకారం
అపార్థంతోనే అపహాస్యం
అభిమానంతో అనురాగం
అనుమానంతో అవమానం
సయోధ్య లేనిదే అయోధ్య
స్నేహం లేకుంటే విరహం
ఏమిటో  జీవన సౌందర్యం!
 ఇంతేనా జీవిత మాధుర్యం?
ఒకప్పుడు నేనెవరో మీరెవరో
మరిప్పుడు నాకు మీరు మీకు నేను
ఆప్తులం ఆత్మీయులం స్నేహితులం
ముడివేసి పెనవేసి నడిపేది
విడదీసి చెడదీసి పోయేది
చేతికి చిక్కని కాలం  తల
రాతలు చెక్కిన కాలం
అందుకే
కారాదు ఏదీ కాలాతీతం
లేదేదీ కాలానికి అతీతం.







సీ. అరచి గీ పెట్టినా అల్లాడినా కొంద
               రధములు మూర్ఖులు మార లేరు
    కొరివితో తలగోకు కొనువారి కేనీతి
                జెప్పినా తప్పుగా జూడ గలరు
    చినిచిన్ని సరదాలె ముదిరి ఊసర వెల్లు
                 లై పుట్టి ముంచు అనైతికముగ
    ముందు చూపది లేనిచో మంది తో వేగ
                 గలమే ? పడరటేఏ గోతి లోనొ
   తే.గీ. నిన్ను నాకూతు రనుటయే నీకు పడదు
            నీకు నచ్చిన రీతిగా నుండనీను
            చదువు బుద్ధిగా శ్రద్ధగా చదువ వలెను
            నన్ను మన్నించి నామాట నాల కించు.
               
సీ . ఏ మాయ జేసావొ ఏ మంత్ర మేసావొ
               ఏ క్రొత్త పన్నాగ మేసి నావొ
       రోజంత పొద్దంత రేయంత నిదురంత
                నీ పైన బెంగతో విసివి పోతి
        ఎందుకో నాపైన నీకంత కోపమ్ము
                 తప్పేమిటో నాకు  తెలియ రాదు
        వాడు కొని  విసిరి పారేసి పోయేటి
                  బుద్ది కాదే నీది గూసులాడి

  తే. గీ .  నిన్ను నా కూతురనుటయే నాదు తప్పు
              కలడు పైవాడు నా బాధ కనెడి వాడు
               మంచి మనసిఛ్చి తెలివిచ్చి మనల కలిపి
               తండ్రి కూతుల మనుటయే  దైవ ఘటన .

సీ. తారాడి పోరాడినా నువు మాటాడి
                 తూలాడి నావొ తుత్తునియ లగుదు
     ఊరించి ఊరించి విసిగించి ఊసాడి
                  గూసాడి నావొ అట్టుడికి పోదు
     లోలోన కుమిలితే నీలోన కనలితే
                  కాలుగాలిన పిల్లి నగుదు నేను
     మనసులో అక్కసులు తలపులో చిక్క
                  సలు దాచినావొ నే సచ్చిపోదు
  తే.గీ. అమ్మ నీ కంట కన్నీరు కార రాదు
           అమ్మ నాన్నల పరువు కాపాడ వలెను
           అన్న కన్నను మిన్నగా చదువ వలెను
           మంచి దనుకున్న నా తోటి మాటలాడు.

Wednesday, March 22, 2017

కేశవా... ఓ శివా

కేశవా. ఓ శివా...
మాధవా ..ఉమాధవా....
మొఱ వినలేరా
నను గన రారా
దరిశన మీరా
దరి జేర నీరా.......// కేశవా//
శరణన్న వారి
నమ్మిన వారి
యోగ క్షేమం
వహామ్యహం
అంటివి కదరా....//కేశవా//
ఆలము వలదుర
కరుణించగ లేవా
ఆదరమున నను
ఆదరించగ రారా....//కేశవా//
ఆద మఱచినా
సేద దీరినా
నీ తలపేరా
నీ జపమేరా...//కేశవా//


 సీ. అమ్మ! కిం అనవు యిమ్మనవునా మాటలే
                    వినవు నన్ను గనవు విశ్వ వపుష!
      ఆర్తితో పిలచినా ఆశగా చూసినా
                     ఆరాట పడిన నా కభయ మీవు
      నాకున్న వీలెంత నా జేయు పనియెంత
                     వసివాడకుండ నీ వాదు కోవ?
        గుండె నిబ్బరమిచ్చి కొండంత బలమిచ్చి
                      సంకల్ప బలమిచ్చి సాగ నీవ?
 తే.గీ. ఎంత నమ్మినవాడ విశ్వేశు దయిత!
        పంతములు వోవకే హిమ వంతు దుహిత!
         ఆదరించవె తల్లి ఆనంద వల్లి
         కంచి కామాక్షి! కరుణించు కల్పవల్లి.2.

సీ.  పరికించినా నీవు పరికించ నట్లుంట
                  పరిపాటి నీకు నే పాలితుడను
     వినిపించినా నీకు  వినిపించ నట్లుంట
                   సాధుల పాలి నీ సహజ గుణము
     ఎటు చూతువో నీవు ఎటు విందు వెది చేతు
                    వో యెవరి కెఱుక ఓర్మి గలదు
      పూజలే చేసినా పూనకాల్  జేసినా
                    భక్తి పరీక్షించు పగిది నీది
 తే.గీ. ధర్మ బద్ధులౌ జనుల సంతాన వత్స
          లతతొ ఆదుకో అమ్మ శ్రీ లలిత నీవు
          ఆదరించవె తల్లి ఆ నంద వల్లి
          కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.1.
     

Tuesday, March 21, 2017

చిన్న నాటి తీపి గురుతులు 

ఉగ్గు పాలతో ఎమేమి ఊసులు 
ఇంకెన్ని ఉపదేశాలు ఉద్బోధలు
గోటి ముద్దలతో కోటి కబుర్లు
లాలి పాటలతో లోకం తీరులు
ఊకొడితే జోకొడతావా
జోకొడితే ఊకొడతావా
అంటూ తికమకలు
కథ వినకుంటే కునుకు రాదు
జాబిల్లిని పిలవాలి వెన్నెల్లో నిలవాలి
రాత్రి బువ్వ తిని నాన్నగారితో పచారీ
కనిష్టికను పట్టుకుని తిరుగుతూ
కృష్ణ శతకం రెండో ఏట
ఓనమాల కన్నా ముందే దిబ్బాసు ఆట
అక్షరాభ్యాసంతో బాలరామాయణం
మూడు ఏళ్ళలోనే ఐదు తరగతులు
ఎనిమిదిన్నర ఏళ్ళకే ఉన్నత విద్య 
ఆడపిల్లల తోనే ఆటా పాటా
పన్నేండేళ్ళకు ఆదివారం ఆంధ్ర ప్రభ లో
కళా సాహిత్య విజ్ఞాన వేదికలో 
వ్యసాలూ పద ప్రహేళికలూ
పదహారేళ్ళకు పద్యాలతో కుస్తీలు 
పోతన గారి పద్యాలు పద బంధాలు
ఇరవై నాటికి నాటికలూ ఖండికలూ
ఱెక్కలొచ్చి దూరాల నే ఉన్నా
ఇంటికొస్తే ఓ రాత్రంతా కబుర్లు
ఓ పూట పురాణ కాలక్షేపం
చదవడం నాది వ్యాఖ్యానం నాన్నగారిది
సాహిత్య వికాసాలు లౌక్యాలు
మడి వంట ఆచారాలు అమ్మవంతు
పూజలు స్తోత్రాలు మంత్రాలు
భారత భాగవతాలు తెలుగు వెలుగులు
వ్యవహారాలు ఆదాయ వ్యయాలు 
అలవాట్లు నాన్నగారి వంతు
ఇలా అమ్మా నాన్నా చెఱో పార్శ్వమై 
తీర్చిదిద్డడానికి
ఎంత శ్రమించారో 
ఎంత పరితపించారో
ఎంతగా సంకల్పించారో
ఈనాటి నా తెలుగు పలుకుబడి
వారసత్వంగా చేకూరిన లబ్ద
అదే నే ఎంచుకున్న పంచుకున్న 
పిత్రార్జితం, మాతృ సంపద
కోట్లు కుమ్మరించి ఈ సంపద కొనగలమా 
నోట్లు విసిరేసి ఆ  ఋణం తీర్చగలమా 
గతం తిరిగి రానిది 
అదంతా నెమరుకు వస్తే
ఎంత మధురం 
కన్నీటి పర్యంతం.


ఉచిత సలహా

కలరటే నీబోటి సూదంటు రాయంటి
              తెలివి ఎక్కువ గల తల్లి ఒకరు
కలరటే నీవంటి కలికి చూపుల బాల
              కనుచూపు మేరలో కనుల ముందు
కలరటే నీలాంటి గర్విష్టి కర్మేష్టి
              దరిదాపుగా మన దగ్గ రిపుడు
కలరటే నీలాగ చీటికీ మాటికీ
              అలిగేటి సణిగేటి అమ్మలొకరు
 కలరులే నువు తిట్టినా కాయు వారు
 కలరులే నిను పట్టి వ్రేలాడువారు
 లేరు లే యిట నీ తప్పు లెన్నువారు
  ముద్దు మురిపాల వెన్నెల ముద్ద నీవు.

అలసి పోలేదులే బ్రతిమాలి బ్రతిమాలి
                 అలుకలే నీ అలవాటు కనుక
విసివి పోలేదులే నిన్పట్టి వ్రేలాడి
                 విసిగింపులే నీకు విందు గాన
బెదిరిపో వద్దులే నన్జూసి సరిజూసి
                  దేశ ముదురు నీవు బెంగ వలదు
చెదిరి పోలేదులే నిన్న మొన్నటి నాటి
                   కన్నీటి చార చె క్కిళ్ళ పైన
    ఆద మఱచిన చాలు ఆ వంక తిరుగ
    వలదు వలదన్న నాతోడ వాదు లాడ
    మనసు నదుపులో లేకుంట మంచి గాదు
    వినవె మన్నించి నా మాట వేడు కొందు.

చిత్త చాంచల్యమేల చదువు సాఫీగ
                      సాగనీ మేటిగా చదువ గలవు
తలిరాకు నీవు ఏపుగ ఎదుగ గలవు
                      సాధించు తపనతో సాగి పొమ్ము
పదునారు వయసులో అడుగిడి నావు నీ
              బ్రతుకు మలుపులు తి రుగు వయసిది
నా మాట లాలించి శ్రద్ధగా చదివితే
               ఉన్నత శిఖరాల నుండ గలవు
   ఆర్తి నీలోన నిత్యమై రగిలె నేని
   అన్న కన్నను మిన్నగా చదువ గలవు
   తొలుత చదువు పిదప సరదాల మాట
   తోడు నేనుందు గురువుగా ఒప్పు కొనవె.

తత్కాల సుఖముల కాశ పడకు మింక
              చెఱపు నీ కగును రా జేయుటగును
తప్పన్న వారిపై ఆవేశ పడకు నీ
              కది తప్పు గాకున్న కలత పడకు
నీ మేలు కోరేటి వారు నీ గురువు నిన్
              కన్నవారని తెల్సు కొనుము చాలు
ఇప్పడే ఆపదా రాలేదులే ముందు
               రాకుండ జాగ్రత్త లాచరించు
  తెలివి నీ సొత్తు! దీటుగా ఎదిగి పొమ్ము
  తపన తోడైన నీకింక తిరుగు లేదు
  మనసు నేకాగ్రతలనుంచి మభ్య పడకు
  ఊరు వారెల్ల కొనియాడు (నీ) ఉన్నతి గని.

Monday, March 20, 2017

ఆరడి


తలచేనా ఒకసారి
ఆ కలలలో తారాడి తూనీగలా
కలిసేనా ఒకసారి
ఆ కనులలో కాసేపు కవ్వింపుగా
పిలచేనా ఒకసారి
నా మనసులో పేరాశ రేకెత్తగా
పలికేనా ఒకసారి
నా ఎడదలో పాటల్లె మార్మ్రోగుతూ.

మనసంతా పరితాపమే
భవిత ఏమౌనో మనో యుద్ధమే
చనువంతా పరిహాసమే
తలపు తోచేనా ఇదీ ధర్మమే
కినుకంతా అపహాస్యమే
బ్రతుకు కీకారణ్యమో ఏమిటో
తనువంతా అవమానమే
గెలుపు నీదేనా తనే నెగ్గునా?

మరచే పోయితివా ప్రియా
చెలిమి నేమార్చేటి ఆలోచనా?
గురుతుందా తొలిసారి నా
కనులలో కళ్ళుంచి చూచాయగా
విరిబోణీ ! సబబా యిదీ
వలదులే వాగ్వాద మన్నావుగా
మరుగై కన్పడవేమొ నా
కనుల కోమారైన ! అంతేకదా?

(ఇవి మూడు మత్తేభాలు, సరేనా?)




Saturday, March 18, 2017

సంప్రదాయం - గౌరవిద్దాం

సాయం సంధ్యను నేను
ప్రాయం నింద్యవు నీవు
*సాయం వంధ్యను నేను
నెయ్యం వింధ్యవు నీవు
వయసులో
మనసులో
ఆలోచనలో
ఆలాపనలో
అవలోకనలో
అవగాహనలో
హస్తి మసకాంతం
అంతరాలు ఎన్నున్నా
ఆంతర్యాలు ఎట్లున్నా
అనుపమ అనుబంధం
నిరుపమ అనురాగం
ఎదురుగా నీవుంటే
ఎన్నెన్ని ఊసులో
మౌనంగా నీవుంటే
ఎన్నెన్ని అపోహలో
వెనుకగా నీవుంటే
ఎన్నెన్ని కవితలో
నన్ను కలవర పెడుతూ
నువ్వు కలవర పడుతూ
మథన పడటంకన్నా
ఆదర పడటం మిన్న
కలిసి మెలిసి పనిచేద్దాం
లక్ష్యాలను సాధిద్దాం
వినయంగా తలవంచుదాం
గురు శిష్య సంప్రదాయం
మనసా పరస్పరం గౌరవిద్దాం.
(*సాయం=సహాయం)

మనసంతా

ఱెక్కలు ముక్కలు జేసుకు మీ కోసం
ఉరకలు పరుగులతో అనుకున్నది చేసాం
మీఅందరి ఔన్నత్యం
మీ మీ సహచర్యం
మీ కొద్దీ సహకారం
కోరుకున్నా
నన్ను నేమఱచి
మై మఱచి పోవాలనుకున్నా
నన్ను నేమఱచి నిలిచారే
ఆ వత్సరం నేనెంత
రోదించానో మీకు తెలుసా
మీ శ్రేయోగామిని
మీ హితైషిని
తలువని రోజులేదు
తలచి తలచి ఆద మఱచినది లేదు
అమ్మా దేవీ చెల్లీ పునీ
ఇరు ప్రక్కలా మీరుంటే
ఈ జ్యోత్స్నా విలాప మేల
మీకు దూరంగా
బ్రతుకు భారంగా
నెట్టుకుంటూ మొత్తుకుంటూ
వస్తున్నా ఛస్తున్నా
ఓ నికృష్ట జీవికి ఊడిగం లో
ఓ అహంకార మహాగర్వి సేవలో
బ్రతుకు వెలారుస్తూ
వెళ్ళ దీస్తున్నా.
మలేడైనా నా అండగా నిలిచేరా
ఈ ఊడిగం నుండి నన్ను తప్పిస్తారా
ఏదేమైనా నా తోడుగా నడిచేరా
మీ ఉన్నతి
నా సమ్మతి
మీ కోసం
నా కోసం
మొక్కని రోజు లేదు.
నా భాగ్యం పండేనా
నా హృదయం నిండేనా
నా మనసంతా మీరేగా
ఈ తపనంతా మీకేగా.

ఏదో వెలితి

నామదిలో ఎదో వెలితి
నా ఎదలో ఎదొ సంశయం
సరే
నా మనసింతగా కలచినా
మును పెన్నడు మూల్గ లేదు నా
నా మగధీరులూ కెలికినా
మది రోయక మిన్న కుండలే?
నాగురువే హితైషి యని
 నాకనిపించి మనస్సు బాధతో
వేగిర పడ్డదే అపుడు ఏమని ఏలని
ఏడ్చి ఏడ్చి
నాకే గతి నైన కళ్ళు విడి
కేవల మాబుధు చెంత జేర
ఆ సంగడి లో మరో మధుర
సాంత్వన కొంచెము నాకు దక్కదా?
వారికివే నివాళులు
 అవారిత జోతలు
నా కితాబులూ
వారికి ఆత్మ బంధువును
వారికి మానస పుత్రినే కదా
వారి కుమార్తె అక్కయట
వారి కుటుంబిని
ఆదరించి
నా వారసు లిద్దరంచనుచు
అక్కున జేర్చుకు ముద్దు లాడితే?
(ఇది పద కవిత కాదు. మూడు ఉత్పలమాల
పద్యాలు. మరోసారి చూడండి)

Thursday, March 16, 2017

శివ సంకల్ప మౌగాక 

కని పెంచే తండ్రి కన్నా అభిమానంగా
నిల బెట్టే జగత్పిత కన్నా దయతో
మనసెఱిగిన అమ్మను మించిన లాలన తో
ఏ స్వాశ (స్వ+ఆశ) లేకనే
మేలు కోరే గురువుకు ఆత్మీయ 
పలుకరింపుల ప్రణుతి ప్రణుతి.
అనుభవాలను కలగలిపి 
అవలోకించిన దాన్ని తెలిపి
#వివరిస్తూ విశద పరుస్తూ
పఠింపించే గురువుకు 
పదేపదే ప్రణతులు.
ఆ పరమేశ్వరుడు
గురు శిష్యులిరువురినీ 
రక్షించు గాక పోషించుగాక
*కలసి గట్టుగా తీవ్రంగా శ్రమిద్దాం
స్వాధ్యాయం ప్రజ్వలిద్దాం
పరస్పరం ద్వేష రహితంగా 
పని చేద్దాం పరిశ్రమిద్దాం.
శుభాలనే విందాం 
ఆరోగ్యంగా బలంగా సాగుదాం
ఇంద్రియ సంయమనం ఇంద్రుడు ఇచ్చుగాక.
శ్రద్ధ ! నాకు శ్రద్ధను ప్రసాదించు గాక
మనో వైకల్యం చిత్త చాంచల్యం 
రానీయకుండా బృహస్పతి దీవించు గాక.
నా ప్రతి తలపు శుభమై సంకల్పమై 
నా మనశ్శివ సంకల్ప మగుగాక.
ఏ ఆత్మ శృతి ,స్మృతి, ధృతి, మేథా,
ప్రజ్ఞ లకు ప్రాప్తి స్థానమో
ఆ ఆత్మ యే
నా మనశ్శివ సంకల్ప మిడుగాక 
నా మనశ్శివ సంకల్ప మొనర్చు గాక.
–------------------------------------------
*సహనావవతు సహనౌ భునక్తు 
.....................మా విద్విషావహైః
# సాగదీస్తూ కొన సాగిస్తూ.

'నీవు వస్తావని'

ఓ నిశీ!
ఏడా శశి?
నీ కృష్ణ తనూకాంతిని
తన జ్యోత్స్నా బాహు బంధాలలో
అదిమి
వెలుగుల వెన్నెల నీ కాపాదించి
అదే నీ సౌందర్యంగా 
స్ఫురింప జేస్తూ
భ్రమింప జేస్తూ
రమిస్తూ
కాలం గడుపుతుంటే
ఎన్నాళ్ళీ శృంఖలాబద్ధ
మైచాయా రజిత రంజిత
నిస్సహాయత?
ఓసీ! ఇసీ! నిశీ!
నిన్ను నిన్ను గా ఆరాధించే
తిమిర మూర్తిని
నీ కనుసన్నలకై
వేచి ఉన్న చిరు హృదయం
నీకై ఎదురు చూస్తూ
ఎద పఱచి మైమఱచి
ఆలోచిస్తూ విలోకిస్తూ
నీవు వస్తావని
నాతోనే పయనిస్తావని
ఆశతో ధ్యాసతో ఉన్నా.
కనిష్టికల పెనవేసుకుని
అగమ్య జీవన గమనంలో
అనంత విశ్వపు అంచుల వఱకూ
తిమిర నిషద్వరీ జంటగా
సాగిపోదాం
కడదేరి పోదాం
వస్తావు కదూ!
(నిషద్వరి=రాత్రి)

Wednesday, March 15, 2017

అందం -ఆనందం

అవనికి ఆమని అందం
మనిషికి ఆమని ఆనందం
అందం కామునికానందం
ఆనందం ప్రాణికోటికే ఆభరణం
మనసుంటే పొందు నయన సుఖం
పొందుకోరితే మారణ హోమ సుఖం
అదుపు లేని మనసు
పొదుపు లేని వయసు
ఓప లేని సొగసు
లేచిందే 'లేడీ' లాంటివి
వయసు మనసు సొగసు
మూడూ 'మూడు ముళ్ళు'
ఒడిసి పట్టకుంటే
అసలు పట్టకుంటే
మేని మిసిమి వసివాడి పోదు
కాని మనసు కసుగంది పోదు
రేయి కునుకు కరవయి పోదు
హాయి మనల విడివడి పోదు
భవిత బంగరు కోసం
మమత లంగరు కోసం
చదువు మేలిమి కోసం
తనువు తాలిమి కోసం
గురి చూసుకు సాగాలి
ఎఱ లేరి పారేయాలి
నెఱి తలపులు వీడాలి
సరి జూసుకు బ్రతకాలి
నేరుపు మీరిన జీవిత మందం
అందమైన జీవితమే ఆనందం.

ఓ రోజు

ప్రతి ప్రభాతం ఓ సుప్రభాతం
ప్రతి ఉషోదయం ఓ నవోదయం
చల్లని గాలితో తెల్లని వెలుగుతో
తొలి ప్రొద్దు నా కైతే ఎంతో ముద్దు
ప్రాచీ వీచికలూ మనో మరీచికలూ
పోటాపోటీగా ఉరకలు వేసే సమయం
అరుణోదయపూర్వ చిరు సమయం
పక్షుల కిలకిలా రావాలు పసికూనల రాగాలు
సుప్త సుషుప్తి లోంచి చేతనావస్థకు బదిలీ
సకల ప్రాణి కోటికీ జీవన పోరాట ఆరాటం
నిస్స్వార్థ సేవలో నిమిష మైనా విలంబన
దరిజేరనీయని తామస హరు ఆలోచన
మది అలజడి కనలేవా
ఎద సవ్వడి వినలేవా
అంటూ వసుంధర ఆవేదన
దరిచేర్చమంటూ సిరి మల్లె నివేదన
ఆపై ఏముంది
ఉరకలూ పరుగులూ
ఈర్ష్యలూ అసూయలూ
కక్షలూ కార్పణ్యాలూ
ఆవేశాలూ ఆవేదనలూ
ప్రొద్దు గూకే దాకా అదేతంతు
తిలా పాపం తలో వంతు
తిమిర సన్నాహంలో
గూటికి చేరే పక్షులు
కూటికి కనుకుకూ
ఆరాటపడే మనుజులు
దుప్పటీ ముసుగులో
కామ వికారాలు
ఇదేనా జీవితం? ఇదే  నా జీవితం
ఇంతేనా ఫలితం?

Tuesday, March 14, 2017

ఎవరు పాడగలరు

తను చూసొచ్చిన లోకం పోకడ
కోయిల పాడి వినిపించేది లోగడ
ఆకలి తీర్చి ఆశ్రయమిచ్చిన చెట్టు
ఆసాంతం శాంతంగా వినేది
ఆ స్వరంతో సాంత్వన పొందేది
కాలష్యం పెచ్చుమీరి
కానగళ్ళ బ్రతుకీడుస్తున్న చెట్టూ
కారుకోయిల కుహుకుహూ స్వనాలు
నిశ్శబ్దంగా వింటూ నిస్సంశయంగా ఉంటూ
పర సుఖమే పరమావధి గా ఇన్నాళ్ళూ బ్రతికినా
తన అస్థిత్వాన్ని ఎలా కాపాడు కోవాలో
తెలియని ఒక అయోమయంలో
వినబోతే
ఓదార్పుగా కోకిల పాట ఎత్తుకుంటోంది
పరస్పరం బాధలు ఒలక బోసు కుంటుంటే
నాలాగ నవీన తలపులు పసిగడుతుంటే
ఎవరు పాడగలరు?
ఎవరు ఆప గలరు?

Monday, March 13, 2017

నువ్వు--నేను

నువ్వు
కాదంటే కవిత
ఔనంటే భవిత
తోడుంటే ఘనత
మాట్లాడితే నవత
పోట్లాడితే చిరుత
ఇక నేను
వినక పోతే తిడతా
పలకక పోతే కసరుతా
వెలితి పడితే నిలదీస్తా
నా మాట వింటే
అందలాలు ఎక్కిస్తా.

బ్రతుకు సవారీ లో 

 వలపుల వలలో చిక్కానా
గెలుపుల గతినే తప్పానా
మమతల కోవెల చేరానా
తలపుల తలుపులు తెరిచానా
నా మనసుకు మతి పోయిందా?
నా వయసుకు పనై పోయిందా?
ఏమో ఏమైతేనేం
మనసు
 ఉఱ్ఱూతలూగుతూంది
ఉవ్విళ్ళౄరుతూంది
ఏదో ఇదమిథ్థమనలేని తపన
ఇంకేదో తలపుల కందని వేదన
గుండె లోతుల్లో నరనరాల్లో
మరింత నిసితంగా పని చేయాలనే భావన
ఈ ఔపద్రష్టిక ఎందుకోసమని
ఈ ఔప చారికలు ఎవరి కోసమని
సాధనలో సాధక బాధకాలు
మనసు పరిపరి విధాలు
జపంలో కూర్చుంటే ఎదో అనుభూతి
అర్చన ఎంత చేసినా ఇంకా అసంతృప్తి
అనుక్షణం 'బాల' అనేక రూపాల్లో
నన్ను ఆట పట్టిస్తూంది
నా మాట విన నంటుంది
అమ్మ కిమ్మనదు యిమ్మనదు
పరుల సుఖం కోరే మనసు
పర సుఖానందనాధ అనే పేరు
అన్నీ ఆ అమ్మ దయే
అంతా మా అమ్మ మాయే
మరో పక్క అనంత విశ్వం
తఱచి తఱచి తెలుసుకో వాలనే ఆశ
'నహి నహి రక్షతి డుకృంకరణే'
నన్ను హెచ్చరిస్తున్నట్టనిపిస్తుంది
దుడుకుతనం తగ్గలేదు పనిలో
కఱకుతనం తగ్గలేదు పలుకులో
ఎందుకో తొలి నుంచీ
రెండు గఱ్ఱాల స్వారీ
నా కలవాటుగా మారింది
నా కలవోకగా అమరింది.





మనసా నా మాట వినవే

మొన్నటి బొప్పి ఇంకా తగ్గలేదు
నిన్నటి బాధ ఇంకా తీరనే లేదు
చెక్కిలి పై కన్నీటి చారలు చెఱగనూ లేదు
మొక్కిన మొక్కులు జరుగనే లేదు
మరలా మనసులో మరు అలజడి
తెలియని తలపుల చిరు సవ్వడి
మారాము పోకే ఓ మనసా
గారాలు పోకే ఓ మనసా
నిజాయితీగా బ్రతకనీ
నిబ్బరంగా నిలువనీ
దేవుడిచ్చిన తెలివి తెల్లారి పోరాదు
గురువు ఇచ్చిన చనువు చల్లారి పోరాదు
అమ్మ చెప్పిన మాట ఆద మరువ రాదు
నాన్న కిచ్చిన మాట నిలబెట్టు కోవాలి
ఉన్నతంగా ఆలోచించాలి
ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాలి
అహరహం అనుక్షణం శ్రమించాలి
అలుపెరుగని సూర్యునిలా
ఎగిరే విహంగంలా
మెరిసే తారకలా
వెలిగి పోవాలి వెలుగులీనాలి
నింగిని ఎగ‌రాలి నిప్పులా మిగలాలి
మెఱిసి పోవాలి మురిసి పోవాలి
మనసా నా మాట వినవా
చదువే సమస్తం కానీయవా.

Saturday, March 11, 2017


నేనూ నా మది

గడియారంలో లోలకంలా
నా భాగ్యం
ఆశ నిరాశల మధ్య ఊరేగుతోంది
ఒక రోజు ఆమని యామిని
మరో రోజు ఏమనే భామిని
అది ప్రారబ్దమా
స్వయంకృతాపరాధమా
నిన్నాఅదే నేను
నేడూ అదే నేను
ఎందుకింత లోలత్వం
ఏమిటా విపరీతం
ఎటూ పాలుపోని అస్తిత్వం
ఏదీ మింగుడు పడని నైరాశ్యం
అయినా
మరువలేని మమకారం
తిరుగు లేని అనురాగం
ఎద లోపల కనికరం
అంతా ఏదో అయోమయం
నిమిత్త మాత్రమే నా ఉనికి

వియత్తలమే నా అవధి.


Friday, March 10, 2017


తెలుగు వారిగా బ్రతకండి

ఈ అనంత వినీల గగనంలో
నా సుందర తెలుగు ధృవ తారగా
ఆ అంబర వీధుల వెలుగు చుక్కగా
సర్వ మానవాళికీ స్వర మాధురిగా
ఎల్లలు లేని తెలుగు ఎల్లెడలా
విస్తరించాలనీ
వెలుగులు ప్రసరించాలనీ
నావంతుగా యీ కర దీపికతో
ఆవంతగా నా కలల పీలికతో
తిరుగాడుతూ తారాడుతా
సుతిమెత్తని తెలుగు పలుకుబడులు
అవధరించిన వానిదే అదృష్టం
వీనుల విందు గూర్చు పద పొందికలు
అబ్బిన వానికే ఆనంద నందనాలు
ఆంధ్ర మహా విష్ణువు కే నోరూరించే
ఆరు రుచుల అచ్చ తెలుగు మనది
ఏబదారు అక్షరాల విభావరి అది.
మీరు కూడా దివిటీలెత్తండి
తెలుగు పలుకు వినిపించండి
మీరేచోటున్నా మీరేమనుకున్నా
మీ బాలలందరితో తెలుగులోనే
మీ ఇచ్చకాలు పృచ్ఛకాలు
తెలుగులోనే కానివ్వండి.
కమ్మని పద్యాలు నేర్వండి నేర్పండి.
తెలుగు వారిగా బ్రతకండి

తెలుగులోనూ మాట్లాడండి



Thursday, March 9, 2017

కూతురుగా మిగిలి పో

అపోహల గోడ మీద
అపనిందల బొమ్మ గీసి
తప్పన్న వాడిదే తప్పని
లోకానికి నమ్మ బలికినా
అంతరాత్మ ఊరుకోవద్దూ
తప్పు జరిగితే నష్టం ఎవరికి
కక్ష సాధించేది ఎవరిపైన
శిక్ష వేస్తున్నది ఎవరికి
మంచిని ముంచే విపంచివా
నిజాయితీ గా నిలచే గడంచివా
బుకాయింపులూ వద్దు
బుజ్జగింపులూ వద్దు
ఒంటరిగా వున్నప్పుడు
నా మాటే వెంటాడుతుంది
గతం గురుతొచ్చినప్పుడు
కన్నీరే మున్నీరుగా మిగులుతుంది
ప్రాప్త కాలజ్ఞత వచ్చేసరికి
ఒక జీవిత కాలం వృథా ఔతుంది.
నీ కామడ దూరంలో నిలువడం
కష్టమే ఐనా గగన కుసుమం కాదు
ఇష్టమే ఐతే ముని వాకిట మల్లెవు కావు?
మాటలో మాట కాదు కలపాల్సింది
అడుగులో అడుగేస్తూ నడవాల్సింది
తలలో నాలుకలా మిగలాల్సింది
తలపుల వారసురాలుగా నిలవాల్సింది
కాలం మించి పోలేదు
మమకారం మరచి పోలేదు
అనురాగం అణగి పోలేదు
కూతురుగా యిమిడిపో

కూతురుగా మిగిలిపో.

Wednesday, March 8, 2017

ఆమె

ఆమె ఒక సంస్కారం
ఆమే ఓ సంసారం
ఆమె స్రృష్టికి మూలం
ఆమె జగతికి బలం
ఆదరానికి మరో పేరు
ఆతిథ్యానికి పెట్టింది పేరు
ఆకలి తీర్చే అన్నపూర్ణ
రూకలు దాచే శ్రీ సువర్ణ
అందం ఆనందం పంచే దాత
అనుబంధం ఆప్యాయత ల లత
మనసులు దోచే మరులొలికే సఖి
ముది వయసులో గూడా మమతల కోవెల
పది మందిలో నైనా ఆమె మాత్రం ఓ అబల
ఆమే పరువపు వాకిట ఓ ఆమని
శరద్జ్యోత్స్నా యామిని
నన్ను
మేలుకొలిపే మరులు గొలిపే
ఉసి గొలిపే ఉసురు పోసే
ఉత్ప్రేరకం ఉపకరణం
ఆమెకు నా
శత సహస్ర నమస్సులు

శతథా శుభాకాంక్షలు.



పలుకరింత

నీ చిరు నగవుల మది పులకల పలుకరింత
నా ఎద వగపుల తుది పిలుపుల పులకింత
నీ మృదు భాషణ హృది ఘోషణ కలిగినంత
నా మానస సరసిన విరిసిన ఓ శ్వేత కలువంత
అంత దృష్ఠమూ అదృష్ఠమూ ఇక కఱవేమో
అంత భాగ్యమూ భవ్యమూ మరలా కనమేమో
ఏది ఏమైనా నా కలవరపాటూ కలల పొరపాటూ
భావాభావ మధ్యం లో మది నలిగిన మరుక్షణం
మిథ్యా మనోరథం బింకేటికి అంటూ ఎద ఘోషిస్తుంటే
అన్య మనస్కంగా అంతా శూన్యంగా విలపించనా
రాగాల వైరాగ్యాల పెను గాలుల కు తలవంచనా
పెన్జీకటి కావల ఏదో క్రొవ్వెలుగుల దివ్వొక్కటి
మిణుకు మిణుకు మంటూ మెఱిసిన వైనం
అనంతాకాసంలో అవకాశం ఇంకా ఉందన్నది నిజం
నిజం నిమ్మళంగా అవగత మైన మరు క్షణం
నా ఆమని దూరాలు చెఱిపేసి
 ద్వారాలు తెరిచేసి నా కోసం వెదుకాడదా
పరుగెత్తుకు దరిజేరదా
పలుకరించదా పరవసించదా?



Monday, March 6, 2017

ఓటమి

ఉదయారుణ ఇనబింబం
నా మనస్సంకల్పానికి ప్రతిరూపం
కంద గడ్డలా
అప్పుడే పుట్టిన బిడ్డలా
ఈర్ష్య అసూయ ద్వేషం లాంటి
 ఏ వైషమ్యాలూ లేని
అపురూప సుందర రూపం
నన్ను ప్రేరేపించే ఉపకరణం
మంది కోసం మంచి కోసం
నా బలిమి కలిమి మిసిమి
కలగలిపిన నవనవలాడే
నవ్య నవనీతంలా కదలాడే
నా మదిలో నా ఎదలో
ఓదార్పు నిట్టూర్పు
ఓతప్రోతాలుగా కూర్పు
అవమానాలకు తమాయించుకుంటూ
అవహేళలకు నిభాయించుకుంటూ
ఎన్నాళ్ళు ఈ పయనం
ఎవరి కోసం ఈ జీవనం?
అని అనిపించినా
పశ్చిమాద్రి పై రవి బింబం
మరో నాడుకు అది ఉషోదయమే
ఓడిన ప్రతి సారీ
నన్ను నడిపించే దా భావమే
ఓటమే
 నా చేతిలో ఓడిపోవాలి
నా బాటలో నలిగి పోవాలి
గెలుపే నా. ఊపిరి గా సాగిపోవాలి.

Sunday, March 5, 2017

విచికిత్స

ఆకు రాలు అడవికి
ఒక ఆమని ముందే వేంచేసింది
మథనపడ్డ మనసును
ఒక యామిని అపహాస్యం చేసింది
సహజత్వానికి విరుద్ధంగా
ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతానికి
ఆ మనస్సు విపరీతం గా నిలచింది
ఏ మొక్క లేని నేల
ఆముదం మొక్కలా
ఏ నీడ లేని చోట
తుండు గుడ్డ నీడలా
ఆశ్రయించిన వారిదా తప్పు?
ఆదరించిన వారిదా తప్పు?
ఆదరణ ను దిక్కులేని తనంలా
అభిమానం ను వెఱ్ఱితనం గా
అపోహ పడటమే గొప్పా?
బ్రతిమలాడించు కోవటమే గొప్పా?
అందలాలు అందుకోవలసిన చోట
అగాథాలే ఆనందంగా భ్రమసిన వేళ
మంచి తనాన్ని ఛీదరించుకున్న నోట
ముందు చూపు లేకుండా
యుక్తాయుక్త విచికిత్స లేకుండా
పెద్దల మాట పెడ చెవిన పెడితే
బురద అంటుకోదా?
దురద బక్కురు కోదా?
విలువ లెంచని బ్రతుకు
పలువ పంచల మెతుకు.

అశ్రృ బిందువు


నా కలల నిండు పున్నమి పలుకరించిన వేళ
నా మమతల పాలవెల్లి ముచ్చటించిన వేళ
ఏవో క్రొత్త ఆశలు మరలా ఎదలో చిగురించి
ఏవో సరిక్రొత్త ఊసులు మదిలో గుసగుసలాడి
జవజీవాలు మరోసారి నింపుకుని మేను మురిసి
ఓ సాయంకాలం ప్రశాంతంగా ఊపిరి విడచింది.
ఆశల పల్లకీ మోయటానికి భుజం సర్దుకుంది
ఊహల ఉయ్యాలలో  మనసు ఉవ్విళ్ళూరింది
ఊసుల ఉబుసుపోకల అవలోకనంలో
ఎడద బెడద కాసింత ఊరడిల్లింది.
మనసు నిబ్బరంగా నిత్య కిరిదీకి సమాయత్త మైంది.
అపోహలూ అవమానాలూ
సంశయాలూ సంకోచాలూ లేని
ఉభయ తారకంగా
అభయ మా రకంగా
అరుణాధరాధరమున తొలకరి
చిరునగవొకటి నామమతల
తల నిమిరింది
ఎద గదించిన పెను భారం
ఓ అశ్రృ బిందవై నేల జారింది.

Wednesday, March 1, 2017


ప్రజ్ఞా సర్వవజ్ఞు లెవరు?

వియత్పథం నా మనోరథం
గగనతలం నా కలల అభిమతం
అంతరిక్షం లో నిరీక్షణ
కొంగ్రొత్త లోకాల కై నా అన్వేషణ
తారా తీరాలు, పాలపుంతలూ
దాటి విశ్వం అంచుల వరకూ
చూసి రావాలి ఆశ తీరాలి
కాంతి కన్నా వేగంగా
మనస్సు కన్నా వేగంగా
పయనించే వ్యోమ నౌక నిర్మిస్తా
సృష్ఠి రహస్యం వెలికి తీస్తా
ఈ సృష్ఠి ఎప్పుడు మొదలైందో
ఏరీతి నెవరు ఆరంభించారో
అంతకు ముందు మరేముందో
సృష్ఠిని ఆరంభించిన ఆ పురుషుని
ఎవరు సృష్ఠించారో
అప్పుడు రేబవలూ
చీకటి వెలుగులూ
భూమ్యాకాశాలూ లేవేమో!
కాలం కదలిక తో మొదలైందా!
కాలం తెలియని సమయం లో
సృష్ఠి మొదలైందా?
ఆ సృష్టి పురుషునికే
ఉండాలి వాటి ఎఱుక
బహుశః అతనికీ తెలియదేమో!
బ్రహ్మ పదార్థం పేలిందా?
విరాట్ పురుషుడే చేసాడా?
సవాలక్ష ప్రశ్నలు నా మదిలో
శత కోటి శంసయాలు నా ఎదలో
నివృత్తి జేసే పరమేష్ఠి పరమేశ్వరు లెవరు?
నిగ్గు తేల్చే విజ్ఞాన వేత్తలెవరు?
రూఢి చేసే ప్రజ్ఞా సర్వజ్ఞు లెవరు?