Thursday, March 16, 2017

'నీవు వస్తావని'

ఓ నిశీ!
ఏడా శశి?
నీ కృష్ణ తనూకాంతిని
తన జ్యోత్స్నా బాహు బంధాలలో
అదిమి
వెలుగుల వెన్నెల నీ కాపాదించి
అదే నీ సౌందర్యంగా 
స్ఫురింప జేస్తూ
భ్రమింప జేస్తూ
రమిస్తూ
కాలం గడుపుతుంటే
ఎన్నాళ్ళీ శృంఖలాబద్ధ
మైచాయా రజిత రంజిత
నిస్సహాయత?
ఓసీ! ఇసీ! నిశీ!
నిన్ను నిన్ను గా ఆరాధించే
తిమిర మూర్తిని
నీ కనుసన్నలకై
వేచి ఉన్న చిరు హృదయం
నీకై ఎదురు చూస్తూ
ఎద పఱచి మైమఱచి
ఆలోచిస్తూ విలోకిస్తూ
నీవు వస్తావని
నాతోనే పయనిస్తావని
ఆశతో ధ్యాసతో ఉన్నా.
కనిష్టికల పెనవేసుకుని
అగమ్య జీవన గమనంలో
అనంత విశ్వపు అంచుల వఱకూ
తిమిర నిషద్వరీ జంటగా
సాగిపోదాం
కడదేరి పోదాం
వస్తావు కదూ!
(నిషద్వరి=రాత్రి)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home