Thursday, March 9, 2017

కూతురుగా మిగిలి పో

అపోహల గోడ మీద
అపనిందల బొమ్మ గీసి
తప్పన్న వాడిదే తప్పని
లోకానికి నమ్మ బలికినా
అంతరాత్మ ఊరుకోవద్దూ
తప్పు జరిగితే నష్టం ఎవరికి
కక్ష సాధించేది ఎవరిపైన
శిక్ష వేస్తున్నది ఎవరికి
మంచిని ముంచే విపంచివా
నిజాయితీ గా నిలచే గడంచివా
బుకాయింపులూ వద్దు
బుజ్జగింపులూ వద్దు
ఒంటరిగా వున్నప్పుడు
నా మాటే వెంటాడుతుంది
గతం గురుతొచ్చినప్పుడు
కన్నీరే మున్నీరుగా మిగులుతుంది
ప్రాప్త కాలజ్ఞత వచ్చేసరికి
ఒక జీవిత కాలం వృథా ఔతుంది.
నీ కామడ దూరంలో నిలువడం
కష్టమే ఐనా గగన కుసుమం కాదు
ఇష్టమే ఐతే ముని వాకిట మల్లెవు కావు?
మాటలో మాట కాదు కలపాల్సింది
అడుగులో అడుగేస్తూ నడవాల్సింది
తలలో నాలుకలా మిగలాల్సింది
తలపుల వారసురాలుగా నిలవాల్సింది
కాలం మించి పోలేదు
మమకారం మరచి పోలేదు
అనురాగం అణగి పోలేదు
కూతురుగా యిమిడిపో

కూతురుగా మిగిలిపో.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home