Wednesday, March 1, 2017


ప్రజ్ఞా సర్వవజ్ఞు లెవరు?

వియత్పథం నా మనోరథం
గగనతలం నా కలల అభిమతం
అంతరిక్షం లో నిరీక్షణ
కొంగ్రొత్త లోకాల కై నా అన్వేషణ
తారా తీరాలు, పాలపుంతలూ
దాటి విశ్వం అంచుల వరకూ
చూసి రావాలి ఆశ తీరాలి
కాంతి కన్నా వేగంగా
మనస్సు కన్నా వేగంగా
పయనించే వ్యోమ నౌక నిర్మిస్తా
సృష్ఠి రహస్యం వెలికి తీస్తా
ఈ సృష్ఠి ఎప్పుడు మొదలైందో
ఏరీతి నెవరు ఆరంభించారో
అంతకు ముందు మరేముందో
సృష్ఠిని ఆరంభించిన ఆ పురుషుని
ఎవరు సృష్ఠించారో
అప్పుడు రేబవలూ
చీకటి వెలుగులూ
భూమ్యాకాశాలూ లేవేమో!
కాలం కదలిక తో మొదలైందా!
కాలం తెలియని సమయం లో
సృష్ఠి మొదలైందా?
ఆ సృష్టి పురుషునికే
ఉండాలి వాటి ఎఱుక
బహుశః అతనికీ తెలియదేమో!
బ్రహ్మ పదార్థం పేలిందా?
విరాట్ పురుషుడే చేసాడా?
సవాలక్ష ప్రశ్నలు నా మదిలో
శత కోటి శంసయాలు నా ఎదలో
నివృత్తి జేసే పరమేష్ఠి పరమేశ్వరు లెవరు?
నిగ్గు తేల్చే విజ్ఞాన వేత్తలెవరు?
రూఢి చేసే ప్రజ్ఞా సర్వజ్ఞు లెవరు?





0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home