Tuesday, March 21, 2017

ఉచిత సలహా

కలరటే నీబోటి సూదంటు రాయంటి
              తెలివి ఎక్కువ గల తల్లి ఒకరు
కలరటే నీవంటి కలికి చూపుల బాల
              కనుచూపు మేరలో కనుల ముందు
కలరటే నీలాంటి గర్విష్టి కర్మేష్టి
              దరిదాపుగా మన దగ్గ రిపుడు
కలరటే నీలాగ చీటికీ మాటికీ
              అలిగేటి సణిగేటి అమ్మలొకరు
 కలరులే నువు తిట్టినా కాయు వారు
 కలరులే నిను పట్టి వ్రేలాడువారు
 లేరు లే యిట నీ తప్పు లెన్నువారు
  ముద్దు మురిపాల వెన్నెల ముద్ద నీవు.

అలసి పోలేదులే బ్రతిమాలి బ్రతిమాలి
                 అలుకలే నీ అలవాటు కనుక
విసివి పోలేదులే నిన్పట్టి వ్రేలాడి
                 విసిగింపులే నీకు విందు గాన
బెదిరిపో వద్దులే నన్జూసి సరిజూసి
                  దేశ ముదురు నీవు బెంగ వలదు
చెదిరి పోలేదులే నిన్న మొన్నటి నాటి
                   కన్నీటి చార చె క్కిళ్ళ పైన
    ఆద మఱచిన చాలు ఆ వంక తిరుగ
    వలదు వలదన్న నాతోడ వాదు లాడ
    మనసు నదుపులో లేకుంట మంచి గాదు
    వినవె మన్నించి నా మాట వేడు కొందు.

చిత్త చాంచల్యమేల చదువు సాఫీగ
                      సాగనీ మేటిగా చదువ గలవు
తలిరాకు నీవు ఏపుగ ఎదుగ గలవు
                      సాధించు తపనతో సాగి పొమ్ము
పదునారు వయసులో అడుగిడి నావు నీ
              బ్రతుకు మలుపులు తి రుగు వయసిది
నా మాట లాలించి శ్రద్ధగా చదివితే
               ఉన్నత శిఖరాల నుండ గలవు
   ఆర్తి నీలోన నిత్యమై రగిలె నేని
   అన్న కన్నను మిన్నగా చదువ గలవు
   తొలుత చదువు పిదప సరదాల మాట
   తోడు నేనుందు గురువుగా ఒప్పు కొనవె.

తత్కాల సుఖముల కాశ పడకు మింక
              చెఱపు నీ కగును రా జేయుటగును
తప్పన్న వారిపై ఆవేశ పడకు నీ
              కది తప్పు గాకున్న కలత పడకు
నీ మేలు కోరేటి వారు నీ గురువు నిన్
              కన్నవారని తెల్సు కొనుము చాలు
ఇప్పడే ఆపదా రాలేదులే ముందు
               రాకుండ జాగ్రత్త లాచరించు
  తెలివి నీ సొత్తు! దీటుగా ఎదిగి పొమ్ము
  తపన తోడైన నీకింక తిరుగు లేదు
  మనసు నేకాగ్రతలనుంచి మభ్య పడకు
  ఊరు వారెల్ల కొనియాడు (నీ) ఉన్నతి గని.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home