Monday, March 28, 2022

 

ఏలా మానుష జన్మ మీ భువిని మున్నే పున్నెముల్  జేసితో

కాలోద్దీపిత కార్య కారణములన్ కానిచ్చితో నెవ్వియో

ప్రాలంబంబుగ వ్రేలు కాపురముతో ప్రారబ్దమిట్లున్నచో

శీలామాలపు బుద్ధిగాక మరి సచ్ఛీలంబు నాకబ్బునే?


నీలాలంకృత దేవవర్త్మమున నేనేలా సితారా వలెన్

వ్రేలం జాలక సిగ్గుమాలిన బహువ్రీహీ సమానంబునై

యీ లోకంబున జావనేల? మనసున్ యిష్టార్థ సంప్రీతికై

ఆలుంబిడ్డల తృప్తికై సమయమంతాసాంతమున్ చెల్లెడున్.




Saturday, March 26, 2022

 కం.

శ్రీ లలితా కలితా కవి

తా లలనకు ప్రణతు లిడుము తాదాత్మ్యమునన్

నీలాలంకృత దేవికి

శూలికి నిక రాళ్ళపల్లి సుందరరామా. 1

ఉపకారంబని నూకొన

నపకారమ్మెదురువచ్చునందురు గదరా

అపసంతికి పనియెక్కువ

సుపథ మగునె రాళ్ళపల్లి సుందరరామా. 2


Monday, March 7, 2022

మగువ - తెగువ

  మగువ - తెగువ

ప్రకృతి పురుష సంగమమే సృష్టికి మూలం

ఆధిక్య న్యూనతలకు తావేలేని అనుబంధం

ఆ జీవన గమనం ఇరువురికీ చెరో సగం

అదే ధర్మం. అదే సత్యం. అదే నిత్యం.

అయినా ఇదిగో పురుషాధిక్య ప్రపంచం

బాధ్యతా రాహిత్యానికీ విలాసాలకీ నిలయం

వేనవేల వత్సరాలు గతించినా 

కనుచూపు మేరలో కనరాని సమానత్వం

ఎటుచూసినా అందరాని సమతౌల్యం

లింగ నిష్పత్తిలో ఎంతో అసమతౌల్యుం

నవనాగరిక ప్రపంచంలో కూడా

బ్రూణహత్యలూ అత్యాచారాలు 

వెకిలి నవ్వులూ షరా మామూలే

ఇప్పటికీ నారీ నారీ నడుమ మురారీ

అయినా మాతృత్వం ఓ అమృత తత్వం

ఆ మధురానుభూతి అబలలకే స్వంతం

అందుకే మగువా నీకు కావాలి తెగువ.

(మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో)

Sunday, March 6, 2022

 శా.

ఉద్యద్భాను సహస్ర కోటి కరముల్ యున్మీలనోన్మత్త సం

వేద్యంబౌ జగతీ లలామ నుదుటన్ వైశేషికమ్మై చనన్

సద్యోజాత వినమ్ర భావమున ప్రాక్సంధ్యా విధిన్ జేయుచో

హృద్యాంతర్గతమౌ కృతజ్ఞతలు విసృద్భావమై యొప్పెడిన్.

సీ.

కలగంటి  కనుగొంటి కలలోన కలకంఠి 

                       ముక్కంటి వాల్గంటి మోము గంటి

ఎలనాగ సిగలోన ఎదగందు వెలుగొందు

            నెలబాలు కనువిందు నెయ్యమందు

రాకేందు వదన సూర్యాంశు నయన చిద్గ

             గన సదన మరాళ గమన యమున

తే.గీ.

నవల చిరునవ్వు చెరగని నవ్య భవ్య

పరుల, పరుల సుఖానంద భరిత  చరిత

పంచదశ, షోడషాక్షరీ ప్రవిమలాస్య

కన్నులార కాంచినయట్లు కలనుగంటి.

మ.

కన్నుల్ కాయలు గాచిపోయినవి నిన్ కన్నార గన్గొంటకై

నిన్నున్నమ్మి యధోచితమ్ముగ మదిన్ నిత్యంబు సేవింపగా

యెన్నాళ్ళిట్లు నిరీక్షణం గడుపుటల్ యిష్టార్థ సంపూర్తికై

యన్నా సాంబశివా! మదాభిలిషి తమ్మందీయవా భార్గవా!




Friday, March 4, 2022

ఇచ్చేవాడు ఈశ్వరుడు

 శా.

నిన్నున్ గొ‌ల్చిన పుణ్యమో యఘమొ నన్నీరీతి నిల్పంగ నీ

వన్నింట న్నను వెన్కవెన్కకు కడున్ వాపోవ త్రోయంగ జూ

డన్నిన్నేమని నిగ్గదీతు విధి యడ్డంబైనదంచున్ యెదన్

నన్నున్ నేనిక తిట్టుకొందు నదియే నాపాలి యోదార్పగున్.

మ.

కన్నా నెన్నియొ స్వప్నముల్ బ్రతుకు సంఘర్షోచితమ్మంచు నీ

వున్నావన్నిట యండదండగ యటం చున్నా మహోత్సాహినై

యిన్నాళ్ళున్ యిపుడే గదా తెలిసెడిన్ యీ నీ యుదాసీనతన్

నిన్నేమీ యనలేనుగాని యిక నన్నే శక్తి మన్నించునో?

శా.

నీవే తప్ప యితఃపరంబెరుగ నే నిన్నాళ్ళు, యిప్డెట్లు వే

రే వారిన్ కడదేర్చ మంచడిగెదన్ రేవైన చావైన నీ

ద్రోవం దప్ప జుమీ పరాఙ్ముఖ పరా! దుర్భేద్య పాపాబ్దిలో

ద్రోవం దెన్నుయు కానరాక నిటులే దుర్వాసినై పోయెదన్.

మ.

తనువే శాశ్వతమా పరాత్పరునిపై ధ్యాసేనియున్ లేక నీ

మన సేలా యిహసౌఖ్య లాలస నసామాన్యంబుగా పారెడిన్

యనువై యున్నపుడే యితోధికముగా యార్జించరే పుణ్యమున్

తను వేరంచును తన్వు వేరనుచు చిత్తభ్రాంతిఁ దున్మాడరే.

ఉ.

ఇచ్చెడి వాడు యీశ్వరుడు యీ తను విచ్చినవాడతండె నా

కిచ్చకు దోప జేయునది యీశ్వరుడే కృత మియ్యదంచు వా

కృచ్చెడు వాడు నీశ్వరుడె సృష్టి సమస్తము నీశ్వరేచ్ఛ చే

చచ్చుచు పుట్టుచున్ జనుట చర్విత చర్వణ మీశ్వరేచ్ఛయే.

ఉ.

నేను నిమిత్త మాత్రుడను నేనని నాదని వాదులాడ నంతయున్

కానని వాని కూర్మియని కాయ నికాయము నీశ్వరోలగ

మ్మే నన యీ కుటుంబ భరమే ధరణీసుర జన్మమందున

న్నూనుచు నూగులాడుచు నుసూరు మటంచును నన్ను నిల్పెడిన్.