Wednesday, May 31, 2017

స్వోన్నతి

ఆత్మ విమర్శ విస్మరిస్తే
ప్రతి చర్యా ప్రతీ కారచర్యా
అహంకార పూరితమే
మేలుకీళ్ళ జిజ్ఞాసతో పనిలేదు
అంతా మంచే అన్నీ మేలే
ఆపదలో బాసటగా నిలచినా
ఆవేశంలో ఏవేవో వదరినా
ఆనక తీరికగా తీపి గురుతులు
నెమరుకు వస్తే బాధనిపిస్తే
తప్పొప్పులు తెలిసొస్తే
సరిదిద్దుకునే వైనం తెలియకుంటే
అపోహల నీలి నీడలో బ్రతకడమా
అగాధాల అంచులపై వ్రేలాడటమా
అనురాగాల మాధురికై వెతుకాడడమా
అవగాహనల సరసన సర్దుకోవడమా?
ఏదో ఒకరోజు నామనసు నన్ను కాదని
అహం ఆవలి గట్టున చతికల బడితే
గతానికి ప్రాయశ్చిత్తంలేదు
వర్తమానానికి యుక్తాయుక్తం తెలీదు
భవిష్యత్తు కు భరోసా లేదు.

అపాత్రత

కృతఘ్నుల కమనీయ సేవలో కడదేరిపోతూ
కృపారహితాత్ముల నికృష్ట వికారాలతో కుమిలిపోతూ
దయాహీనుల దౌర్భాగ్య దాస్యంలో దూషింపబడుతూ
మంచికోసం ప్రాకులాడుతూ మంచి చేసే తపనతో
ఊడిగాలు ఈసడింపులూ అవహేళనలూ అవమానాలు సహిస్తూ
పనికి మాలిన పనులు చేస్తూ వల్లమాలిన ప్రేమతో
ఎందుకలా అహరహం తపించాలి
ఎంతచేసినా ఎన్ని చేసినా మరుక్షణంలో పరగడుపా
ఏమి చేసినా మిన్ను ముంగిట నిలిపినా అంత తలపొగరా
అసంతుష్టులను విధాత కూడా సంతృప్తి పరుచలేడు
అవిశ్వాశులను విశ్వేశ్వరుడు కూడా వినిపించుకోడు
పంచభూతాలూ పనికి మాలిన వారి పంచకు చేరుకోబోవు
మనో నేత్రం తెరచుకుని జ్ఞానోదయం ఈ జన్మకు కలిగేనా
మరో నేస్తం చూసుకుని మనోభీష్టం మేరకు బ్రతికేనా

Thursday, May 25, 2017


ఆలికి కాలికిన్ సలుపు చూలికి మేతయు దుర్లభంబు నా
పాలికి పాఠశాల సలుపాయెను ఇప్డిదిగో వియాల వా
రున్ లలి తా ఉపాసకులు రూఢిగ రమ్మని పార్వతీ పురం
బాలము సేయరాదనుచు ఆనలు వెట్టిరి ఏమి చేతునో.



Wednesday, May 24, 2017



శ్రీ మాతా భువనేశ్వరీం శుభకరీం హ్రీంకార సంశోభిణీం
శ్యామా త్వం నిగమార్థ గోచర కరీం సౌభాగ్య విద్యేశ్వరీం
వామాంగీం కరుణార్ద్ర భావ నిలయాం వందే జగన్మాతరం
కామాక్షీం కరుణార్ద్ర భావ హృదయాం కామేశ్వరీం శాంకరీం

       గురువు... లఘువు

కూలి వాడైతేనేమి మా తండ్రి కర్షకుడైతేనేమి
ధర్మమెరిగిన మనసు కర్మ లో నలియని వయసు
కృషి ఉంటే అని గెలుపు బాట నందించిన తండ్రి
నాకైతే
మనసు తక్కువ కాదు వయసు తక్కువగాని
మేథ తక్కువ కాదు మేత తక్కువ గాని
చేత తక్కువ కాదు ఊత తక్కువగాని
చేసి చూపిస్తా నా సత్తా రుచి చూపిస్తా
ఎవరష్టు శిఖరాలు ఎంసట్ ఫలితాలు
నల్లేరుపై నడక నాలాంటి దమ్మున్న వారికి
' జీ' లు బిట్స్ ఏదైనా ఒకటే, గురి ఉన్న వారికి
చేయూత అందిస్తే చెయ్యెత్తి జైకొడతా
లక్ష్యం గిరిగీసి చూపిస్తే గురి చూసి నే కొడతా
ఎఱుక లేని పలుగాకులతో నా కేమి పని
ఎఱుకున్న గురువులకు లఘువునై నే నుంటా.

Sunday, May 21, 2017


వారాహీం నిగమత్రయీం గిరిసుతాం వందే పరాం శాంభవీం
తారానాయక శేఖరీం  జనని వార్తాళీం విశాలాక్షి మే
వైరాగ్యం కృపయా దధాతు మమలం వైదేహి కామేశ్వరీం
ప్రారబ్దమ్ తవ సేవనా ఫలమిదం ప్రాజ్ఞీశివే శాంకరీ

Saturday, May 20, 2017

చూసి నేర్వాలి

కాలనికి కాలుడికీ వ్యతీపాత పక్షపాతాలు లేవు
ధర్మ కర్మ ల విషయంలో స్వ పర బేధం లేదు
ఏ ప్రకృతి శక్తికీ లేని నియమ నిబద్ధత వారిది
సమయ పాలనకు ఆద్యులు ఆదర్శప్రాయులూ వారు
పరిశీలనాశక్తి తో చూసి నేర్వాలేగాని
జ్ఞానాన్ని పుస్తకాల్లోనే కొన నవుసరం లేదు
ఇంగితం పరేంగతం తెలియనివాడు ప్రాజ్ఞుడు కాలేడు
సహనానికి మరోపేరు ఒకరైతే
 సహాయానికి మారు పేరు మరొకరు
ఉపకారానికి ప్రతీకలు కొన్నైతే
ఉదారస్వభావానికి చిరునామా మరికొన్ని
కుక్షింభరత్వానికే కాలం వెళ్ళ బుచ్చడం కాదు
కువలయానందం కోసం కూడా శ్రమించాలి
భువన విజయపు బావుటా మనమూ మోయాలి
లబ్ది పొందడమే కాదు లబ్ద ప్రదాతలు కావాలి
పంచిపెట్టడంలోని మాధుర్యపు రుచి మరగాలి
నిస్వార్థత కాసింతైనా పాటించాలి
ఎప్పుడో కాదు ఇప్పుడే ఆరంభించాలి.

Friday, May 19, 2017

మిత్ర తాపం

మిత్ర తాపం రోజు రోజు కీ పెచ్చుమీరి పోతోంది.
వడగాడ్పులు ముచ్చెమటలు సర్వ సాధారణం
అలిగిన నవ వధువులా గుబురెండ గాభరా
ఇదెక్కడి చోద్యమోగాని ఒంటి మీద బట్ట నిలవదు
చన్నీళ్ళు శీతలపానీయాలతో కడుపు ఉబ్బుతోంది
ఉక్కపోతకు ఆయి విసుపు లేదు రేయిపగలు లేదు
మొక్కలు నాటి పెంచే మహనీయులు కనరారు
ఉన్నవి నరికేసే ప్రబుద్ధులనేకులు ప్రతిచోటా ఉన్నారు
నీడనిచ్చి ప్రాణవాయువునిచ్చే చెలిమి మొక్కంటే
కాంక్రీటు కీకారణ్య నిర్మాతలకేం తెలుసు మొక్క విలువ
పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు
ఏసీల‌లో బ్రతుకు వెలార్చే వారికేం తెలుసు
సామాన్యుని మనోగతం అతని అంతరంగం
మనిషైతే మనసైతే మీరూ ఓ మొక్క నాటండి
పాడిచేసి నీరుపోసి చంటిపిల్లలా సాకండి
మిమ్మల్ని చూసి చిరునవ్వులు రువ్వుతుంది
పలుకరించి పరవసించి మైమఱచిపోతుంది.
మిత్ర తాపం= ఎండ వేడిమి

Monday, May 15, 2017

     అమ్మ...నాన్న

గోరు ముద్ద తినిపిస్తూ ఊసులాడే అమ్మ
కనిష్ఠకను పట్టుకుని నడిపించిన నాన్న
నా జీవన నావకు ఊపిరులూదిన ఆద్యులు
ప్రతి మలుపు చాకచక్యంగా తిప్పిన చుక్కాని ఒకరు
ఒడిదుడుకులలో ఒబ్బిడిగా నడిపిన సరంగి మరొకరు
పరస్పరం పాత్రలు మారుతూ పరిస్థితిని చక్కదిద్ది
సమాజంలో నన్నూ ఓ గౌరవ వ్యక్తిగా నిలిపిన
సహజ సమాజ శిల్పులు మా అమ్మా నాన్నలు
హెచ్చు తగ్గులతో పని లేకుండా హితైషులు వారు
ప్రతి నిత్యంప్రాతః స్మరణీయం ఉభయ ప్రాధాన ద్వయం
వారికివే నా శత సహస్ర నమో వాకములు.

Sunday, May 14, 2017

         అమ్మ

మధురోహల మధురిమ, నా నడతల గరిమ
ముద్దు మురిపాలతో నను తీర్చిదిద్దిన మా అమ్మ
ఉగ్గుపాలతో గోటి ముద్దలతో నేర్పిన అమ్మ
పాటలు పద్యాలు ఊసులూ ఊహలూ నేర్పిన అమ్మ
అమ్మ చేతి వంట అమృత తుల్యం
అమ్మ చేతి ఆసరా వజ్రాయుధ తుల్యం
అమ్మకు అడుగడుగునా నే తోడుగా
అదో మహద్భాగ్యం అదో అమూల్య బంధం
అమరపురి లో వున్నా అమ్మ తలపులలో
అనిమేషం అనుక్షణం నేనుంటా.
మా అమ్మ ఆశీశ్శులు ప్రతి నిత్యం అందుకుంటా.

Saturday, May 13, 2017


శ్రీ విద్యా విభవాంతరంగ నిలయాం శ్రీ శ్రీ ప్రదాయీం ఉమాం
సావిత్రీం లలితాం పరాపర మహా సాధ్వీం జగన్మాతృకాం
జీవన్ముక్త మునీంద్ర సేవిత సుసౌశీల్యాం
భవానీం సదా
సేవాభాగ్య మహం దదాతు జననీం హే భార్గవీం శాంకరీమ్.
(శ్రీ శ్రీ= లక్ష్మి, సరస్వతి )

Friday, May 12, 2017

విభావరి

ఆశనిరాశల మధ్య పెనుగులాటల పెన్జీకటి
సాయం ప్రాతః సంధ్యల నడుమ విభావరి
ఒకవంక తేజోమయ తామసహరు ప్రచండ రూపం
ఆ వంక శీతశరజ్జ్యోత్స్నా పునీత అమృత హస్తం
పద్మినీకర కరాగ్ర స్పర్శ లో పావన పయనమా
కలువలరేని కరుణారస గంగలో స్నపనమా
ఎటూ తోచని ఏదీ పాలుపోని మనో వైకల్యం
యామినీ వధూటి మానస లాలస వైఫల్యం
ఛాయాపతి నీడలో తోడై నిలచితే నడచితే
ఎన్నో పరిభ్రమణాలు ఇంకెన్నో సంక్రమణాలు
విశ్వదర్శనాలు అవిశ్రాంత పయనాలు
నెలవంక వంక వంగితే చలువపందిళ్ళు
శరత్  హేమంత సిత శీత పులకింతల తెమ్మెరలు
ఒకపరి ఆనంద పూర్ణిమ వేరొకపరి నిరాశామవస
కాలమూ, ఇతర గ్రహాలు నిశావిధీ నిర్ణేతలా
నిశీ కనిష్టికల నందుకొనే సూర్యచంద్రుల
గతి,గమనమూ, విజ్ఞానమూ తన సర్వస్వమూ
వేనవేల వత్సరాలకూ తెలుపని మనోగతం
శశీ నిశీ రవీ తరతరాలకూ వీడని మౌనం
ఆ మౌనం జాగ్రత్సుషుప్తిల నడుమ జగతిని
లోలకంలా కల్లోలకంలా ఊలమాలలా నిలిపిన
అస్తి నాస్తి విచికిత్సాహేతు సాతోదరి! విభావరి.

Wednesday, May 10, 2017

కవనం అంటే

మనసు ఊహల వెంట పరుగులు తీస్తే
ఆ ఊహలకు అక్షర రూపమే కవనం
సుతి మెత్తగా మనస్సు గాయపడితే
ఆ గాయపు వ్యధే ఒక రసరమ్య గేయం
తన తలపునూ పలుకునూ ఈసడిస్తే
ఎద మూలుగల ప్రతి ధ్వనియే కవిత
ఆనంద నందనంలో ఆరాడి తారాడితే
ఆ విషయలాలసల అపురూపమే పద్యం
ఎవరో చెప్పిన దానితో జనించిన అసంతృప్తి
ఏదో విషాదం కంట బడితే నిషాదుని ఆవేదన
అరాచకాలు అకృత్యాలపై ఆవేశం ఆవేదన
నాకైనా మీకైనా మరెవరికైనా అదే పునాది
ఆలోచనలకు అక్షర రూపం కల్పించే ప్రతివాది
అతడే సమతావాది విప్లవ వాది నవతా వాది
అతని ప్రతి పలుకు మనసును గుచ్చే ములుకు
అటువంటి కవితా కృషీ వలురకు నమోనమలు
ఆ కవితా వధూటి నునులేత చెక్కిల పై
చిప్పరిల్లిన చెమట బిందువునై చిరు చిత్తడినై
తళతళా మెఱసిపోనా ముత్తెమై మురిసిపోనా.

Tuesday, May 9, 2017

జీవన పయనం

జీవన పయనం 

జీవితం ఒక నిత్య ప్రయాణం
కొందరికి గమ్యం తెలియని గమనం
ఏ సునిసిత లక్ష్యం లేని లక్షణం
మరి కొందరికి అగమ్య గోచరం
క్షణికానందమే అన్నిటా పరమావధి
మానవ బంధాలూ అనుబంధాలు
స్వార్థ చింతనతో వలసపోయాయి
ఆత్మాశ్రయ వాదం వారికి వేదం
తిరోగమనానికీ పురోగమనానికీ
అంతరం అభ్యంతరం లేని వైనం.
సర్వత్రా సర్వజ్ఞతా భావావేశం
సుద్దులు చెబితే బుద్ధావతారం
హద్దుల గిరి గీస్తే తిరుగుబాటు దనం
సద్దుకు పోతే తిరుగు బోతు లౌట ఖాయం
ఇంగితం పరేంగితం ఒకరిద్దరికే సొంతం
పట్టు మని పదమూడేళ్ళకే తెంపరితనం
తెలుగు బాలలేమౌతారో ఎలా ఎదుగుతారో
రేపటి సమాజాన్ని ఊహిస్తేనే కలవరం
చీకటి భవితవ్యాన్ని తలిస్తేనే కంపరం
సంభవామి యుగే యుగే అన్న భరోసా
ఆశావహ దృక్పథానికి ఊపిరులూదే మనసా.

Monday, May 8, 2017

చుక్కాని ఎవరు?

చుక్కాని ఎవరు?

అధ్యాపనంలో ఆదర్శ మార్గం లేదు
అధ్యయనంలో అంకిత భావం లేదు
గురువుకు గురుతర బాధ్యత అఖ్ఖర లేదు
ఛాత్రులకు గుమి కావాలి కాని గురి అవసరంలేదు
ఒకందుకు పోస్తే మరొకందుకు త్రాగే వైనం
ఆర్ష ధర్మం ఋషిప్రోక్తం గతకాలపు చిహ్నం
అంకనాల నగిషీల షరాబుల మాయా లోకం
జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం దేవుడెరుగు
చదువులలో మర్మ మెల్ల చదివే వారేరీ
చదివించెద నార్యులొద్ద అనే పితరులేరీ
ప్రభుతకు ఘనతల పైనే సాధికారం
వసతులు అనుమతులు అన్నీ ధన మయం
జనతకు కావలసింది ఎంగిలి బాషలో చదువు
ఉట్టి కెగురలేని వాడు స్వర్గానికెగిరే యత్నం
పుట్టి మునిగితే గాని బుద్ది రాని జనం
చేతులు కాలాక ఆకులు పట్టు కునే రకం
మన చేతలో ఉన్నదెంత  చేయ వలసిన దెంత
ఇథమద్థమని ఎఱుక చేసే నాథుడు ఏడీ
తెలుగు ఓడకు చుక్కాని ఎవరు
ఆంధ్ర భారతికి హారతు లెత్తేదెవరు
అవధాన సరస్వతిని ఔదల దాల్చేదెవరు
తెలుగు భాషామ తల్లిని సాకేదెవరు?


Thursday, May 4, 2017


శైలూషీం భువనేశ్వరీం శుభకరీం శ్వేతాంసు సంశోభితాం
జ్వాలామాలిని నిర్మితాగ్నివలయప్రాకార మధ్యస్థితాం
కైలాసాచల వాసినీంశివసతీం కైవల్య మీడే శివే
బాలాలీల దధాతుమాం పరసుఖానందం సదా శాంకరీ.

Wednesday, May 3, 2017



శ్రీ మాతా శుభకారిణీ విమల వాక్శ్రీ దేహిమాం శాంభవీ
హే మాతా భవ హారిణీ తవ సుతుం హేలా విలీలాం సదా
క్షేమానంద మనంతశాంతి విభవాం మేధాం దధాత్భార్గవీం
కామాక్షీం భయ హారిణీం సకల సౌభాగ్య ప్రదా శాంకరీ.

Tuesday, May 2, 2017

పరేంగితం

నిటారుగా నిలచే సత్తా కాసింతైనా లేదు
చిటారు కొమ్మల మిఠాయి పై ఆశ పోలేదు
ఆసరాగా నిలచి నిలబెట్టిన వారిపై గౌరవం లేదు
అంతా నా మహిమే అనే స్వోత్కర్ష ఆగలేదు
కక్కుర్తి మనసు కదను తొక్కడం మానలేదు
చేయూత అందుకుని ఆ చేతినే నఱికే బుద్ధి
ఏరు దాటగానే తెప్ప తగలేసి పోయి నట్టు
తిన్న ఇంటికే వాసాలు లెఖ్ఖ పెట్టే పాడు బుద్ధి
అటువంటి త్రాష్టుడెదురైతే తోడైతే తారస పడితే
అంతకన్న అమానుషం మరోటి కనరాదు
అంత కన్న ఘోరం వేరోటి తెలియ రాదు.
తాడే పామై కఱచి నట్టు నీడే దెయ్యమైనట్టు
నింగీ నేలా ఏకమైనట్టు ఉప్పెనొచ్చి పడ్డట్టు
మనసంతా కకలావికలం మిగిలేది యమునాతీరం
మంచి తనానికి సమాధులేసే మహనీయులు
సాధు స్వభావానికి పాతరేసే సహవర్తులు
అడుగడుగునా అందరికీ ఎదురౌతారు
నిష్కర్షగా లేకుంటే నిలువునా ముంచుతారు.