Friday, February 12, 2021

మృత్యువు

       మృత్యువు


ఓ మనిషీ! 

బంధాలు అనుబంధాలు అన్నీ నీ అపోహలే

కృతకబంగరు తీవెలే మరుగుపడే మమకారాలే

నీ నిజమైన హితైషిని నీతోనే వుంటూ

జాగ్రద్స్వప్న సుషుప్తులలోనూ నీకోసం నేనంటూ

నిరంతరం నిన్ను ఏమరపాటు లేకుండా

నడిపించే నీ చెలిమిని, ఔను నేను మృత్యువును.

కాలుని కనుసన్నలలో కాలాన్ని గణిస్తూ

నీ అంత్యకాలం కోసం ఎదురు చూస్తూ

నీ తోనే గమిస్తా నీ తోనే సంగమిస్తా

నీకు ముక్తినీ విముక్తినీ కలిగించే

నీ చెలిమిని. ఔను నేను మృత్యువును.

కర్మక్షయం కాగానే కాలకింకరులు రాగానే

నిన్ను వాటేసుకుంటా, కాటేసుకుంటా

నా ఆలింగనంలో లింగ భేదాలుండవు

నా ఆక్రమణంలో స్వపర భేదాలుండవు

నిజమైన నీ చెలిమిని నేనే! 

ఔను నేను మృత్యువును.

Tuesday, February 9, 2021

ఈ పయనం ఎటు?

 తలలు బోడైనంతనే తలపులు బోడగునా?

కుంతలాలు పండినా కుతంత్రాలు మానునా?

మాటలు వేషాలు మార్చినా ఆలోచన మారునా?

అక్కడైతే అయినవాళ్ళకీ ఇచటైతే సొంతానికీ

ఎలా ప్రభుత్వ సంపదను లాగించేద్దాం?

కంపెనీలు కార్ఖానాలు గనులు భూములూ సమస్తం

అయినకాడికి మనోళ్ళకే ఏదోలా మళ్ళించేద్దాం

కుదిరితే మనమే ఏదోలా నొక్కేద్దాం!

ఇదే నిరంతరం సాగుతున్న రాజకీయం

నా దేశం యేమైపోను? మా బిడ్డలు యేమైపోను?

అచట అంతా రామమయం అంటారు

ఇచట అంతా ఏసుమయం చేస్తారు

మందు బిర్యానీ పొట్లా లందితే శాన

ఓటు ముద్ర గుద్దేసే గుడ్డిజనం మనం

పాలకులకు ఒకటే పదవీ వ్యామోహం

పాలితులకు ఎంగిలి మెతుకులు ఉచితం

నా దేశం ఏమైపోతోంది? ఈ పయనం ౠటు పోతోంది?

తలచుకుంటే భయమేస్తోంది. దడ పుడుతోంది.