Tuesday, May 28, 2019


చం.
అరువది యైదు ఏండ్ల వయసాయెను నేటికి ఎంత చిత్రమో
పరుగున పారి పోయె మునుపంతయు పంతముబట్టి నట్లుగా
చిరుదరహాస చంద్రికల చిత్తరు వొక్కటి నా మనంబునన్
తరచుగ గోచరించు మమతా నవ బాంధవ మిత్ర చిత్రమై.
కం.
నందూరు వీథులందున
సందడిగా యాట లాడి సందుల దూరన్
అందర మొకటై మెలగిన
సుందర బాల్యపు గురుతుగ చూడరె గుంపున్.
తే.గీ.
చిట్టి పంతులుగారింంటి చివర నుండి
ఆట పాటల తోడ మా కాలమంత
గడచె నావీధి లోనె మాకదియె యదియె
స్వర్గసీమగా భావించి వరలినాము.
ఇంద్రగంటి రాజేశ్వరి యేమిటన్న
అదియె యందరకాజ్ఞగా యామె వెనుక
నేను రమణకుమారి సునిశిత కార్య
దక్షులగుచు యెదిగినాము తనకు తోడు
గా మెలగినాము రేబవల్ కలసి మెలసి
మొదట యీరంకి నరసింహ మూర్తి మాకు
ఆప్తు డయ్యె యిప్పటికినీ యాప్తు డతడు.
సీ.
మల్లికార్జను వెంట త్సప్పటి కోటేసు
      వాడపల్లి వెనుక వారిరువురు
మాయన్న, కోమాళ్ళపల్లి, యప్పలరాజు
     యొకవంక, సిరియాల ఒంటి గాను
ఇంద్రగంటి వెలగా బంటుపల్లి యొకటౌచు
      లగుడు పసగడుగుల వెనుక వరు
సగ చింతకాయల యప్పల కొండ హు
      షారుగా క్లాసంత సంద డేను
తే.గీ.
కాంత ద్వయంబు తొలుదొల్త కానబడుచు
మరల రాజేశ్వరి వెనుక రమణ కుమారి
అడుగడుగునా యటే  నాకు ఆశ్రయమ్ము
క్లాసు రూమంత కన్నుల కానబడెను.

Thursday, May 23, 2019


ఏమ్మాయ చేసావొ గా..ని
మహా వీచింది నీ గా..లి
ఎలా వీచింది ఇంత గా..లి
కనిపించని దైవాన్నే అడగాలి //  //
మరలో ఉందా మర్మం
మనలో దాగుందా మర్మం
విజయానికి అదే మార్గం
అనుకోవడమే సన్మార్గం //  //
ఇదో నమ్మలేని నిజం
గంప గుత్తగా ఓటేసిన నైజం
రాయలసీమకు నీళ్ళిచ్చినా కోపమా
పరిశ్రమలతో పరిగెత్తిన పాపమా
అమరావతితో అలరించిన వైనమా//  //
విధం చెడ్డా ఫలం దక్కని బాబు
పథకం సొమ్ములకూ రాని జవాబు
ఎలా కుదిరింది తిరకాసు బేరం
ఎలా మారింది జనం మమకారం//  //
పేచీలూ పంతాలూ పక్కన బెట్టి
    నేర్పుగా బొక్కసం చక్కబెట్టి
పారదర్శకంగా పాలించాలి
పాలితుల ఆకాంక్షలు నెరవేరాలి//  //

Sunday, May 19, 2019


మనసు మూల్గులు ఆలకించే ఆత్మీయులు లేరు
నన్ను నన్నుగా అభిమానించే సాత్వికులు లేరు
కష్టాల కాష్టాల కన్నీటి పన్నీటితో నిలిచే తోడు లేరు
నష్టాల బాటలో కనిష్టికను పట్టి నడిచే నరులు లేరు
భుజాన చేయుంచి సాంత్వన పలికే పెద్దన్న లేరు
చుక్కాని లేని నావను తీరం చేర్చే భరోసా లేదు
బ్రతకడానికి నిర్దిష్టమైన లక్ష్యం, గమ్యం లేవు
పరిశ్రమలూ పరాభవాలు స్వయంకృతాపరాధాలు
ఆశయాలూ ఆవేశాలూ ముందరికాళ్ళ బంధాలు
నెమరుకు రాని నిన్నలు మరపుకు కాని మొన్నలు
ఆశల హరివిల్లులా నిత్య నూతనంగా రేపులు

Wednesday, May 15, 2019


Down the memory lane
Crown the history alone
Do you need a sure proof
That I am a rural dwarf,
Mindful of others and nature
Wilful of staring and learning
Came a long way all along
Whispering and wondering any way
Imprints of early days of life
Pampers my mind often
Me a rural guy but ambitious 
Seek learn practice and preach
Who knows a tea / paper boy rules
Who stops me to ponder or wander
After sixty now I wonder
Sure I do my bit to cherish
And dawn to dusk work for it
Perform or perish wish me ever
With a smiling face like raising Sun.

Monday, May 13, 2019

 పర్జన్య వీరుడా

అపోహానంద బంధురా
ఆడంబరానంద సుందరా
పర్జన్య వీరుడా
సౌజన్య శూరుడా
వికటాట్టహాస నటనా తత్పరా
నీ వర్షోరు ధారా పరంపరలకై
నీ మమతానురాగ పలుకరింతలకై
నీ వచోసుధా ప్రవాహమునకై
నీ కరుణార్ద్ర దృగ్గాంగ ఝరీ స్నపనమునకై
అవనీ లలామ ఆబగా ఆకాశం వైపే చూస్తోంది
కర్తరీ భానుప్రతాప శోషిత మతియై
గాద్గతికయై, పర్యాప్తస్వేద జలాంగియై
నిరీక్షణాక్లేశ క్షోభితయై , చింతితయై
అనుక్షణం నీ రాకకోసం నీకోసం
ఎదురు చూసి ఎదురు చూసి
ఎదను పరచి ఎదురుకోలు పలకాలని
ధరణీ నవలామణి తహతహ లాడుతోంది
కనికరించవా చిలుకరించవా నీదయలు
పర్జన్య వీరుడా ? సౌజన్య శూరుడా?

Monday, May 6, 2019


"వారానికీ ఒక్కగానొక్క ఆదివారం. బయట ఎండ మండి పోతోంది. కాస్త ఓ కునుకు తీయనీయండఱ్ఱా!"
"నాన్నా మిమ్మల్ని నిద్రపోవద్దన్నామా? పడుకోండి"
"ఒరే బంటీ! రారా! కుమారీ వాళ్ళ పెరట్లో మామిడి చెట్టుకింద ఆడుకుందాం."
"సునీ! ఇంత ఎండలో ఎక్కడికే? ఏదో చదువుకోవడమో
ఆడుకోడమో ఇక్కడే అఘోరించండి" హుకుం జారీ చేసింది తల్లి.
మరో నాల్రోజులు గడిచాయి. ఉక్కబోత ఎక్కువైంది. పిల్లలు ఎండలో బయటికి పోకుండా ఉండాలని ఆలోచించాడు.
"ఇదిగో పిల్లలూ. ఎండలో బయటకు వెళ్ళకుండా మన పెరటి గుమ్మంలో ఆడుకోండి. మీకు కాలక్షేపానికి ఓ బెల్లందిమ్మ దానిమీద ఓ కత్తి ఓ చిన్న రాయి ఉంచా. వేరుశనగ కాయల మూట ఆ పక్కనే ఉంచా. మీరు మీ స్నేహితులతో కలసి ఈ వేసవి శలవుల్లో ఆ బెల్లమూ వేరుశనగ కాయలూ అవగొట్టేయాలి.

Sunday, May 5, 2019

     మరణం
ఈ మట్టికి మరణం వస్తే
నింగి కృంగి పోతుందేమో
నీటికే నిర్యాణం సంభవిస్తే
జలధులన్నీ ఎడారులయ్యేనా
ఈ గాలికి ఊపిరులాగిపోతే
జగత్తంతా శూన్యంగా మారేనా
ఆకాశాన సూరీడు కనుమూస్తే
తమస్సమాధిలో జగమంతా
మిగిలేనా అయోమయంగా
జాతస్యహి మరణం ధృవం
సృష్ట్యాదిలో జనించిన
ఈ మట్టీ నీరూ గాలీ ఏదీ
మరణానికి అతీతం కాదే
'లోకంబులు లోకేశులు లోకస్థులు
తెగిన తుది అలోకంబగు పెన్జీకటి'
ప్రళయంలో అన్నీ లయమై
మహా శూన్యమే మిగిలేది
మరలా ఏ విస్ఫోటనమో
దేవదేవుని ఉత్సుకతో
సృష్టికి మూలం కావాలి
మరో ప్రపంచం వెలయాలి.
(సరస్వతీ సమ్మాన్ 2018 పురస్కార గ్రహీత శివారెడ్డి గారి కవిత 'మట్టి'లో 'మట్టికి మరణం లేదు , మరణించే హక్కు లేదు' అన్నారు.
దానికి ప్రతిస్పందనగా యీ కవిత.)

Thursday, May 2, 2019


             మృగాడు

విశృంఖలత్వం మరిగి
విచక్షణత్వం మరచి
కండకావరం పెచ్చు పెరిగి
ఆధిక్యతాభావంతో విఱ్ఱవీగే
ప్రతీ మగాడూ ఓ మృగాడే.
ఏమాత్రం తీసిపోమంటూ
అన్నింటా పోటీపడే అమ్మాయిలు
'భీత హరిణేక్షణ'ల్లా పడుండాలనీ
కోట్లల్లో ఆస్థులు తీసుకురావాలనీ
లక్షల్లో జీతాలు తెచ్చి నా చేతికివ్వాలనీ
ఇంటిల్లిపాదికీ చాకిరీ చేయాలనీ
అయ్యగారన్నా అత్తమామలన్నా
అగ్గగ్గ లాడాలనీ నీరాజనాలు పట్టాలనీ
ఆశపడే ప్రతీ దున్నపోతూ ఓ మృగాడే
ఏడు పదుల పైబడిన ముసలి నక్కకు
రోషం పౌరుషం పెత్తనం నాకెక్కువంటూ
పాతికేళ్ళ అమ్మాయిలు దాసోహం
కావాలని ఆరాటపడే కుమతీ ఓ మృగాడే.