Monday, December 31, 2018

ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు


సీ.
నిశరాత్రి వేళలో  నిసర్గ సర్గమీ
            ఆంగ్లేయ నూతన వత్సరాది
బానిసత్వములోన భావదారిద్ర్యాన
           అంటించు కున్నట్టి అంటువ్యాధి
కూటి కోసమని నేర్చిన హూణ విద్యతో
          ప్రబలిన వేడుకై ప్రచుర మందె
మందు బాబుల జీవ హింసల పర్వమే
          పరదేశి ప్రహసన వత్సరాది
తే.గీ.
 ఖండ ఖండాంత రాల నఖండ మైన
 సర్వ మత జన బాహుళ్య  సామరస్య
 మై జగతి నెల్లెడలను మైత్రి గలుగ
వరలు చున్నదీ యాంగ్లేయ వత్సరాది.
తే.గీ.
సర్వ జనుల సుఖము గోరు సంప్రదాయ
బద్ధులగు హిందు వుల మా ని బద్ధతలను
గారవించి తెలుపు శుభా కాంక్ష లివ్వి
ఆంగ్ల నూతన వత్సర  సమయ మందు.

Saturday, December 29, 2018


సీ.
నీలాటి రేవులో నీలాటి వనితతో
        ఎకసక్కెములనాడి మేలమాడి
మావూరి వారిలో 'మావూరి బాల'తో
        ఆనంద మొందంగ నాటలాడి

Tuesday, December 25, 2018



    వినుతి

మ.
కలలో కన్నుల పంటగా కనిన సాకారం బగున్ నాకలల్
తలలో నాల్కగ నొద్దికై బ్రతుక నంతా మిథ్యయా శాంకరీ
కలిమిన్ గోరితినా యభీష్ట మిది కాకన్ యన్య మొద్దంటినా
బలవంతంబుగ పట్టు పట్టి నతిగా బంగార మిమ్మంటినా?
మ.
వినవే నామొఱ లొక్క సారి విని నా విజ్ఞాపనల్ దోషమై
న ననున్ కాదనవే దయామయి! శివే! నా కన్నులారా నినున్
కనుగొంటే పదివేలదే జనని నాకా యోగ మిప్పించవే
జననీ శార్వరి శాంకరీ గిరిజ నా జన్మంబు ధన్యంబునౌ.
మ.
కనులున్ కాయలు కాయునట్లు నిను నీ కళ్యాణ వైభోగమున్
గన నారాట పడున్ సదా యభయదా! కన్పింపవే యీశ్వరీ
మును నే జేసిన పాపమా యితర మా ముమ్మాటికీ నేరమా
కనవే శాంభవి శారదా పురుల! యాకర్ణింపవే నా వ్యధల్.
మ.
సిరులో సంపదలో మహా విభవమో చేలంబులో స్వర్ణమో
ధరణీ ఖండమొ రాజయోగమొ మహోదారంబుగా భార్గవీ
కరుణా సింధువు యిమ్ము యిమ్మనుచు నిన్ కాసింత బాధించితే
వరముల్ పెక్కులు కోరితే దొసగు నీ వాత్సల్యమున్ కోరెదన్.
మ.
వలదంచున్ వలదంచు వీలు పడ దే వాదోపవాదంబులా
ఖలుడా పొమ్మని పార ద్రోలకు విశాఖా మాతృ మూర్తీ! సదా
కొలచే వారికి కొంగు బంగరువు నాకున్ నాకుటుంబానికిన్
బలమై సంపదయై మదీయ కవితాభావమ్మువై యుండవే.

Monday, December 24, 2018



తే.గీ.
మా పెరటి తోటలో నొక్క మల్లె మొక్క
నెంతొ యపురూపముగ  నెంచి పెంచ
దినదినము ప్రోది జేసి నాది యను భావ
మేమొ ప్రాణ సమానమై మెలగి నాము.

నవ యవ్వన పౌరులార!

నవ యవ్వనాశ్వ సముదాయం నా దేశం
నవ యువ తరుణిమా శిబిరం యీ దేశం
యావత్ వసుంధరా గరిమ భరత భూమి
జ్ఞాన కర్మ క్రియా యోగ సంపుటిత వేద భూమి
మరో ఆదిశంకరులు మరో వివేకానందుడు
మరో రామానుజన్ మరో అబ్దుల్ కలామ్
ఈ జాతిని సమున్నతంగా ముందుండి నడిపించాలి
ప్రతి మనిషీ నిరంతర శ్రామికుడు కావాలి
ప్రతి మగువ సమానత్వం కోరుకోవాలి
ఈ జగతికి మనమే చుక్కాని కావాలి
భగవద్గీత సాక్షిగా కర్తవ్యాచరణ చేయాలి
దాయాదులూ పొరుగువారూ అబ్బుర పడాలి
నైపుణ్యం శ్రమైక గుణం మన సంపద కావాలి
అహరహం అందుకోసం శ్రమించాలి
గిల్లికజ్జాలూ అసూయా ద్వేషాలు వదలాలి
బానిసత్వ మనస్తత్వం పూర్తిగా మరవాలి
ఉత్పాదకతే ఊపిరిగా ఉద్యమించాలి
ఆరోగ్య భారతం అవిశ్రాంత శ్రామిక భారతం
అవనీ మండలంపై అగ్ర తాంబూలం అందుకోవాలి
అదీ నా కలల భావి భారత దేశం
రండి నడుం బిగించి కదలండి
యువతులార! యువకులార!
భావి భారత భాగ్య నిర్ణేతలార!
నవ యవ్వన భారత పౌరులార!

Sunday, December 23, 2018

  ఎలా సాగను?

నిమిత్తానిచ పశ్యామి అని
నిమ్మకు నీరెత్తినట్టుగా
నిమ్మళంగా ఉండాలని ఉంది.
మాయదారి మనసు
మహా చంచలం
అటో ఇటో పరుగులు
ధ్యానంలో కూడా దాన్ని
నిలువరించడానికి
నిశ్చలంగా నిలపడానికీ
నానా అగచాట్లు
మౌనంగా ఉందామన్నా
ఆలోచనా రాహిత్యం లేని
మూగ సంభాషణ
మౌనం ఎలా కాగలదు?
జపధ్యానార్చన విధులలో
తాదాత్మ్యం కొంత వరకూ
సాగుతున్నా ఏదో తపన
జీవితానికి
ఓ లక్ష్యమూ
ఓ సార్థకతా
ఎంతో ఆవశ్యకం
ధనమూల మిదం జగత్ లో
సాధనా? ధనార్జనా?
జోడు గుఱ్ఱాల స్వారీ సాగేనా?



Friday, December 21, 2018

   కేవలోహం

ఉన్నంతలో మంచి చేద్దామను కోవడమే తప్పా?
మున్నంతగా బాధ పడకూడదను కోవడం తప్ప
ఘనకీర్తులూ భుజకీర్తులూ పొందాలననుకోలేదే!
బుద్ధి జాఢ్య జనితోన్మాదుల్ కదా శ్రోత్రియుల్ అన్న
అల్లసాని పెద్దన్న మాట నిజంగానే అన్నుల మిన్న
కోరి కష్టాలు తెచ్చుకోవడం చేతిలో దురదెక్కువ వల్ల
కడుపు చేత పుచ్చుకోవడం కన్నీటి పర్యంతం కావడం
నీవే తప్ప యితఃపరం బెరుగ మన్నింపమని
కాళ్ళా వేళ్ళా పడడం లబోదిబో మనడం ఆగేనా
అందించిన ఊతకఱ్ఱ పట్టుకు నిటారుగా నిలవడం
మనసు తనువు స్థిమిత పడ్డాక మరలా ఏదో దుగ్ధ
పునరపి జననం పునరపి మరణం ఈ జీవన గమనం
ఉగాదితో ఆరంభించినా అమావాస్యతో ముగియడమే
ఎత్తు పల్లాలు లాభ నష్టాలు గెలుపోటములూ అన్నీ
ప్రతీ చర్యా  అంతా ఆ అమ్మ అభీష్టమే
ప్రతిచర్య  ప్రతిదీ అంతా ఆ  ఈశ్వరేచ్ఛయే.
మనుష్యామపి కేవలోహం క్రీడా ప్రతిమః.

Wednesday, December 19, 2018

        నేను ఎవరు?

సీ.
ఏ కణ సంయోగమో యోగమో యేమొ
         అండమై పిండమై అమరె నెటులొ
ఏ పూర్వ పుణ్యమో ఏరి సంకల్పమో
         ఒక తల్లి గర్భాన ఒదిగె నెపుడొ
ఓ అమ్మ కడుపులో తానుమ్మ నీటిలో
         పదినెల్లు పోరాడి బయట పడెనొ
బ్రతుకు జీవుడ! యంచు వెరపు లేదిపుడంచు
          కుయ్యిడె గొంతెత్తి కొసరి కొసరి
తే.గీ.
తను యెవరొ  తనువేమిటో తలుప లేక
ఎవరు తలి దండ్రులో యంచు తెలియ రాక
నేలపై బడ్డ తనెవర నెరుక లేక
నేను నేనను భావమే నేర్వ నపుడు.
సీ.
చన్నిచ్చి చంకిచ్చి లాలించి పోషించె
             నేపేగు బంధమో నేరు గాను
ఏ కణ మే గుణ మే ఋణ మే పణ
             మీ జన్మ నిచ్చెనో మేటి గాను
తళుకు బెళుకుల తనువు నడిపించెడి
             మనసుతో జతగూడి  మృదువు గాను
తనువుదో మనసుదో లోనున్న జీవిదో
             నేను నా దను యూహ నేర్పు గాను
తే.గీ.
వెలికి జూచు కనులు చూడ వేల లోన
మనసు తానేడ నున్నదో మరుగు గాను
ఆత్మ ఎటులుండునో ఎట గలదొ యేమొ
ఆత్మ నేనా మనసు నేన? తనువు నేన?
సీ.
తనువు కన్నను మున్ను కణములో నున్నదే
            నేనైన యీ మేను నేను కాదు
కణములో నున్న గుణమె యీ మనసు నున్న
            నెలవెరుగని మది నేను కాదు
కణములో నెటనుండి వస్తినో  తెలియమి
           నా కణమును కూడ నేను కాదు
రూపధారిగ వసించి నశించు జీవినా
                      నిజముగా జీవినీ నేను కాదు
తే.గీ.
నేను గాని యీ మేనిపై నేల తలపు?
నేను గాని యీ మనసెట్లు నిలువరింతు?
నేను గాని జీవిని గ నే నెరపు టెట్లు?
తెలివి గలవారు నేనేరొ తెలుప గలరు.
చం.
తెలియని 'నేను' కోసమని తెల్సిన మేనును నేను కాదనన్
తెలివగునా వితర్క మవదే యని సంశయ మేల నా మదిన్
వలదు వితండ వాదనలు వావిరిగా నిక నేను వేరు యీ
కలతల మేను వేరు కను గానని యామది వేరు రూఢిగా.
ఉ.
నేనెవరో మనస్సెవరొ నెయ్యపు మేనెవరో యెరింగినన్
యీ నయనమ్ములన్ ముడిచి యీమది నొక్కెడ కట్టిపెట్టి లో
లోనకు జూడ నేర్చినను లోపల దాగిన 'నేను' తెల్వదా
నేనది యాత్మయో యితర నే పథమో వివరంబుగా నటన్.
మ.
కనులన్ గానని శక్తి యొక్కటది నిక్కంబై యధోత్కృష్టమై
తనువున్ గూడి యుపాథిగా మెలగు నేతత్సంయమీంద్రమే
వినుతిన్ బొందిన యాత్మయౌ బుధులదే వేదప్రమాణంబుగా
మనసా జూడగ జెప్పి రందు పరమాత్మన్ గూడ నచ్చటే.





          
        

గాలివాన వెలిసింది

మూన్నాళ్ళ ముప్పతిప్పల 'పెథాయ' పెంట
కన్నీళ్ళు నింపింది అన్నదాతల కంట
మడిచేలో కుప్పకూలిందో బక్క ప్రాణం
వరిచేలో పనలలో కుళ్ళింది ధాన్యం
అరటి బోదెలు లబోదిబో మంటూ
నేలపై వేలపై సాష్టాంగ పడ్డాయ్
గాలి కెందుకంత పట్టరాని కోపం
కడలి కెందుకంత ఓపలేని ఉక్రోషం
నేల పిల్లపై పట్టపగలే పగలా వగలా
పుడమి తల్లి ప్రాణం గిజగిజ లాడేలా
వసుంధర అబలగా విలవిల లాడేలా
'గాడిమొగ' లోనో 'ఎదురు మొండి' లోనో
ఆర్తనాదాలూ విషణ్ణ వదనాలూ విని కని
చేసిన కాటికి జంఝాటానికి చాల్లే అనుకొని
సుడిగుండం ఆయువు గాలిలో కలిసేనా
నిరవధిక శ్రామిక మిత్రుడు  కమలాప్తుడు
తన శతపత్రేక్షణ కోసం వేయి కన్నులతో
కందగడ్డలా ఎఱ్ఱగా వెఱ్ఱిగా ఉదయాన్నే
కనిపిస్తే దిగివస్తే నింగి వంగి నిలచింది
అవని తల్లి చేయి సాచి పిలచింది
ప్రశాంత నవోదయం వెల్లి విరిసింది

Sunday, December 16, 2018

నెలకో తుఫాను

కంగాళీ కమతంలో బపూన్ లా
బంగాళాఖాతంలో తుఫాన్ లా
నెలకో పేరుతో పలకరింపులా?
మొన్నన గజ్ , నిన్న తితిలీ ,ఇపుడు పెథాయ్
ఇలా అయితే చాలానే ప్రాణాలు పోతాయ్
ఊళ్ళకు ఊళ్ళూ తుడిచి పెట్టుకు పోతాయ్
వరిచేలు పొట్టమీదున్నప్పు డొకటి
కోతలై పనలు పరిచాక మరోటి
నూర్పిళ్ళ సమయంలో ఇంకోటి
రైతన్న బ్రతికేదెలా? మెతుకు దొరికేదెలా?
పాపం నోరులేని జీవాలకు మేత పడేదెలా
కాకులూ పిచుకలూ పక్షులన్నీ విలవిలా
హాస్టల్లో పిల్లలు ఏంచేస్తారు బిక్కమొహాలు
ఈ తుఫాన్ లేవో మే నెలలో రారాదూ
ఏసీల అవుసరం లేకుండా అందరూ
బీదా బిక్కీ అనకుండా అనుభవించరూ
నమోగారిపై ప్రజావ్యాజ్యం వేసి
ఉచ్ఛతర న్యాయస్థానం లో నిలదీస్తే
ఆకాశమంత ఎత్తుకు ఏదో విగ్రహం పెట్టి
తుఫానులూ ఎండవేడిమీ వడదెబ్బలూ
ఆపేస్తాం కమలానికి ఓటేస్తే అని
ఛాతి విరుచుకు భరోసా ఇవ్వరూ?
దొంగవేషాలూ కుక్కమూతి పిందెలంటూ నాచంబా
ఆంద్రోళ్ళ మోసం ఇదంతా కారెక్కండి మీరంతా
బంగాళాఖాతం తాట నే తీస్తానంటూ కచరా
ట్రంప్ కో బంపర్ ఆఫర్ ఆంధ్రాకొచ్చేయమని పకపక
హమ్మయ్య లోటస్ పాండులో ఓ వారం రెస్టంటూ అన్న
తెల్లమొహం వేసుకుని దుప్పటి ముసుకు వేసుకుని
 ఎటూ పాలుపోని ఓ తెలుగోడు
ఎక్కడా వినే వాడు లేనిదీ వాడి గోడు.

Saturday, December 15, 2018

సాలీడు

లాలాజలంతో గొంతు తడి చేసుకోను
దానినే ఒక దారంగా  ఛత్రం అల్లుతాను
చూసే కళ్ళకు మనసొకటుండాలే కాని
అల్లసాని వారిలా నా అల్లిక జిగిబిగి
అదో గమ్మత్తైన జిహ్వ నైపుణ్య సిరి
అదే జీవనోపాధికి నాకున్న దారి
సహనం నా జీవం వయనం నా బలం
సాహసిస్తే  ఏదైనా కీటకం నాకు ఫలం
ఈ వసుంధరకు నేనే సేనాపతిని
ఈ భూధర గృహాలన్నిటికీ పతిని
కాకపోతే నాకో ఆగర్భ శత్రువు
చీపురుకట్ట. శుభ్రతే దాని క్రతువు
కర్కసంగా నిర్దాక్షిణ్యంగా ఈ మనుషులు
ఆ శత్రువును నాపై ప్రయోగిస్తారు
ఓడిపోయి రాలిపోయి పారిపోవలసిందే
కిమ్మన లేను కుమ్మేయ లేను
పునరపి జననం పునరపి మరణం
ఆకలి ఆగదుగా అలసిపోయానన్నా
మరలా మరోచోట చొంగ కార్చడమే

ఎన్ని గూడు లల్లినా నా గోడు వినేదెవరు

సహనం నా జీవం... కాదు కాదు
సహనం నా బలహీనత.. కాదు..కాదు
సహనం వినా లేదే వేరో మార్గం
కేవలం నేనో సాలీడను కులీనుడను.


శిఖరిణి:
కులాసా గా సాగాల్సిన బ్రతుకు చిక్కుల్లొ పడెనా
విలాసంగా ఉండాల్సిన సమయం వీధి బడెనా
చలాకీ పిల్లేమో చతికిల పడే చాయ కలదా
గులాబీ కే ముల్లుండు జర పదిలం కుయ్యిడకుమా.
అనూహ్యంగా చిక్కుల్లొ పడితివె మౌనం శరణమౌ
సునాయాసంగా చేదు కొను మనిషే చూడ గలడో
కనీసం నేనున్నా నని నిలబడే కమ్మని మనీ
షి నీకోసం నీ బాగు కొఱకు కృషి చేసే మనిషిగా
నిరాశా  నిర్మోహా భరిత ఘనత నీకేల వనితా
భరోసా నేనిస్తా యనగల ఘనుడై భవితనే
పరాధీనా విన్యాసముల తెగడే పామరుడు నీ
కరాలంబంబున్ జేయ వలసినదేగా శిఖరిణీ.
(శిఖరిణి= స్త్రీ)


Wednesday, December 12, 2018

వారాశి నగుచు


కన్నీటి సుడులతో
వెన్నీటి తడులతో
అగుపడని నిన్ను
అడిగాను మున్ను
తెరువేది నాకనీ
చూపేది నీవనీ.    //కన్నీటి//
అనుకోని నాడు
తెరువేదొ నాకు
చూపించి నావు
వెన్నంటి నీవు
నిన్నంటి నేను
కొనసాగి నాము  //కన్నీటి//
చిక్కొచ్చి నపుడు
నిక్కచ్చి  వపుడు
పెక్కిచ్చి నిలుపు
దిక్కెవరు తెలుపు
నిక్కమగు వేల్పు
మొక్కెదను మునుపు  //కన్నీటి//
ఆరాట పడిన
పోరాట మిడిన
ఏరాత లనుచు
నారాత గనుచు
నీరాక కొఱకు
వారాశి  నగుదు. //కన్నీటి//




Monday, December 10, 2018


ఉవ్వెత్తున పడి లేచే కెరటం
రెండు చేతులా వెనక్కి లాగేసినా
ఒక్క ఉదుటున మరలా ఎగసి పడేనా
సముద్రుడి కబంధ హస్తాల శృంఖలాలు
తప్పించుకు బయటపడే అలల పోరాటం
తీరం దాటాలనే అలుపే లేని అలల ఆరాటం
ఓడిపోయి వాడిపోయి ఏడ్చిన ప్రతిసారీ
కసి రగిలించే కర్తవ్యం బోధించే తరంగం
అయస్కాంతం లా ఆకర్షించే నా అంతరంగం
ఆ అలలతో గడిపిన ఏకాంతాలు
నా పరాజయాల చిరునామాలు
కడలి కన్నా కడలి తరంగమే మిన్న
అసలు కడలే లేకుంటే అల సున్నా.
అరేబియా సముద్రం అలిగి వెనుదిరిగిందా!
మరో నయా తీరం వెదుక మొదలిడిందా?
అయ్యో పాపం! ఎవరి కనుదృష్టి పడిందో
ముదనష్టపు పాపిష్టి కుళ్ళు కళ్ళబడిందో
నడి సంద్రంలో మనోడు కొత్తదీవి కడతాడో
ఏమైనా గుజరాతేగా నమో జత కడతాడో
కొలంబస్ లాగ శలవుపై అటకు వెడతాడో
ఏబైయ్యారంగుళాల ఛాతితో ఎత్తుకు పోయాడో
ఏమైయ్యుంటుంది! ఆ సముద్రుడికి?
 ఎందుకు వెనక్కి పోయాడో అలిగి!



Friday, December 7, 2018


శా.
అమ్మా నమ్మవె నాదు మాటలను నే మన్నేల  తిందున్ సరే
నమ్మం జాలవె నోరు జాపెదను  మన్నావాసనా లేశమున్
జిమ్మేనా నను కొట్టవే  వినకుమీ చింతామతుల్ బాలురన్
యిమ్మాయా విలు లేనిపోని వగు చాడీల్చెప్పి తిట్టించెడిన్.

Thursday, December 6, 2018

శారద

సీ.
శారద చంద్రికా  చలువంపు ముత్యంబు
                     సంగీత సాహిత్య సరసి!  తెనుగు
శారదా సరదాల సరిగమల సరము
                    కచ్ఛపీ నాదంబు కలికి! తెనుగు
శారదా దేవి ప్రస్థానాక్షర చాతురి
                     అవధాన సంవిధాన సిరి తెనుగు
శార దా యన యేబ దారు వర్ణముల శ్రీ!
                     సుస్పష్ఠ విస్పష్ఠ  సువిధ! తెనుగు
తే.గీ.
 విశ్ర మించక శ్రమియించు విపుల! తెలుగు
 విశ్వ మంతట వ్యాపించి వెలుగు తెలుగు
 విష్ణు కత్యంత ప్రీతి యౌ విమల! తెలుగు
 నిజ విశారద!యానంద నిపుణ! తెలుగు.
(1.శారద=శరత్కాల, 2.శారద = సరస్వతి, 3. శారద = లలితా పరా భట్టారికా, 4 .శార ద = చిత్ర వర్ణములు ఇచ్చునది)



Sunday, December 2, 2018

ఏది నందన వనం?

చల్లని శరత్ చంద్రికలలో
హేమంతపు హిమ సమీరాలలో
ఆరు బయట పిల్లా పాపా ఆటా పాటా
వేకువనే ఉహుహూ అంటూ చలిమంటలు
వరువాతనే కృత్తికా స్నానాలు
ఏటి పాయలో కార్తీక దీపాలు
అదంతా గతం నాకంతా మనోగతం
కార్తీక సోమవారం ఉపవాసం
తారా దర్శనం తరువాతే భోజనం
ఉదయం నుంచి తినకుండా దాచినవి
వెన్నెల వెలుగులో బాతాఖానీలో ఖాళీ
అర్థ శతాబ్దం వెనుక చవి చూసాం కనుక
ఇంకా నెమరుకు వస్తుంటాయి పాత జ్ఞాపకాలు
ఇప్పుడదంతా గతం నాకదంతా మనోగతం
నగర జీవనంలో వెన్నెల వెలుగులూ
చక్కని చలిలో సరదాలూ సంబరాలూ
అన్నీ కనుమరుగే అన్నీ పరగడుపే
గది నాలుగు గోడల మధ్య నేనో బందీ
ఊరటగా సాయం సమయం నడకా
సార విహీన జీవన గమనం
కొందరికిదే నందన వనం.