Monday, June 29, 2020

తే.గీ.
కర్మ పరిపక్వ మగునంత కాతు వండ్రు
దుఃఖభాజన దుర్విధి దుర్దశలను
మోసికొనిపోదు నట్లె విముక్తిలేక
మరణ మాసన్నమైన నీ స్మరణ నిమ్ము.

జపతపార్చన విధులను శాన నాచ
రించి కడకంట భక్తి నీ రీతి మెలగ
ముగిసి పోచుండె యీ జన్మమో భవాని!
మరణ సమయాన నీనామ స్మరణ మిమ్ము.

ఇచ్చితివి కొన్ని మరికొన్ని యీయవైతి
హెచ్చు తగ్గుల నెంచక నేగుచుంటి
భాగ్య మంతంతె మాకు సౌభాగ్య మంతె
అంతిమ ఘడియనైన  మనసా ఆదరించు.

ఐహిక సుఖ సంపదలకు యాశ లేదు
యనుభవించగ కాలము నసలులేదు
తృప్తిగా హంస యెగిరిపో తున్న చాలు
మరణమునకూడ నీ నామ స్మరణ జాలు.



Wednesday, June 24, 2020


సీ.
ఎన్నాళ్ళు కన్నీళ్ళు ఎన్నాళ్ళు కష్టాలు
          ఏటెల్ల కాలమున్ యింతయేన?
ఎదురీదుచున్ సాగ యెదకుందుచున్ రాగ
          ఆత్మ స్థైర్యము లేక అనవరతము
బెంగతో కృంగుచున్  బెంబేలు పడుచు నే
          ప్రతినిత్యమున్ యిట్లు బ్రతుకు టెట్లు
ఆలకింతువు గాని ఆదమరతువేల
          ఆపన్న ప్రసన్న వనుచు పిలుతు
  తే.గీ.
అమ్మ నీకన్న నాకున్న యాప్తు లెవరు
ఆదరించవె యమ్మ నా యార్తి గనుచు
నన్ను రక్షించవమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 48
సీ.
శరణు శరణనుచు చరణ యుగ్మము లంటి
         శరణాగతిని వేడ జాప్యమేల
క్షయకర్ముడను గానొ కాలమే సరిగాదొ
       కల్మష విదూరుడను గానొ కామి గానొ
నిత్యపూజారతిన్ నిమ్మళించెడి నాకు
        నిజ జీవితమునందు నీడ్పు లేల
పరసుఖానందుడై పరమపదింపగన్
      స్వ పరహితములను జంట జేసి
తే.గీ.
జనత కుపయుక్త మార్గమున్ సాగుచుంటి
భవిత తుందిల మొందక బాగు పడగ
నన్ను దీవించు మమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 49
సీ.
మోకాలిబంటిలో మోకరిల్లిచునుంటి
           కెందామరారూఢి కింపు గానె
పంచాగ్నిమధ్యలో పరితపించుచు నుంటి
         కేలూత నందీయ కేల నన్ను
ఊబిలో దున్నలా ఉస్సురనుచు నుంటి
        ఉద్ధరించగ నీకు యూహ రాదె
కుడితిలో యెలుకలా కుములుచుంటి వెఱసి
        నే మృగతృష్ణలో నీటికొఱకు
తేగీ.
యాశ పడుచుుంటినే? యడియాశ యగునె?
యార్తి సరిపోవలేదటే యడుగుటందు
నన్ను మన్నించవమ్మ యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.50

         
సీ.
శ్యామప్రభవు నీవు శ్యామా! ధవళకాంతి
        మేనతనిది బంధమెట్లుగలిగె?
రత్నమణిమయసర్వాభరణాలంకృ
 తవునీవు తను భస్మధారి యయ్యె
మధుర మంజుల యసమాన్యవాక్సుధ నీది
     పరమసాత్విక మితభాషి యతడు
సకల వాఙ్మయివీవు సర్వజ్ఞు డాతడు
     చిద్రూపివీవు సంచిద్విలాసి
తే.గీ.
శివుడు, సర్వజన శ్రేయంపు శీలి వీవు
విభుడు లయకారుడతడు సర్వేశ్వరుండు
సర్వ వైరుధ్యభావ సంసారమదియె
జగతికాదర్శదాంపత్య సారమనగ.


Friday, June 19, 2020


శా.
నీ పై నమ్మక ముంచినందులకు నన్నేరీతి చేకొందువో
నీ పాదార్చన కంకితమ్మగు జనానీకంబు జూపించుచున్
నా పాపాలకు శిక్ష చాలదని మౌనంబే జబాబందువో
కాపాడం మనసున్నచో కనవటే కాత్యాయనీ నా వ్యధల్.

Monday, June 15, 2020



మ.
అనిపించం వలదే మరొక్క పరి మాటాడన్ వినోదంబుగా
వినిపించం వలదే మనోభయము నావిశ్వాసమున్ సుంతయున్
తనుపుంచం వలదే సదుత్తముల కంతా చెప్పగా కోమలీ
కనిపించం వలదే త్వదీయ శుభసంకల్పంబుతో నెచ్చెలీ.

ఒకసారైనను నీ మనంబునను యేదో వెల్తి యన్పించదే
యొకమారైనను మాటలాడమనదే యుద్విగ్న సంకోచమున్
ఒకసారైనను గుర్తురాదె మనకెంతో మేలు చేసేరనిన్
ఒకమాటైనను చెప్పరాదె  తన కేదో మార్గమున్ జూపరే.

Saturday, June 13, 2020


మౌనవ్రత నిర్లక్ష్యవైఖరీ పరిసమాప్తమై
మేఘాడంబర తుషార హారహేలా యుక్తమై
ఆహ్లాదభర వాతావరణ సుశోభిత మనస్కుడనై
హృదయానందకర వార్తాసమాహారాతురుడనై
ఈ క్షణ మీక్షణ నిరీక్షణలతో ఉద్విగ్నమైన నాకు
చల్లని పిల్లగాలి సోకి పరవశించి మైమరచినట్లు
పరీక్షాఫలితాలతో పలుకరించింది మా బాల
ఆనందంలో ఆవేదనలో మనశ్శాంతికి నేనున్నా
ఆ భావన చాలు సంతృప్తిగా నిద్దుర పోడానికి.

Thursday, June 11, 2020

        కాలం మారిందా?

కాలం ఎటు వెళుతోందో తెలియకుంది
భూభ్రమణంలోనో గ్రహసంక్రమణాలలోనో
తేడా వచ్చిందేమో లేకుంటే ఏమిటీ
ప్రకృతి వైపరీత్యాలు వాతావరణ పరివర్తనాలు
రోహిణిలో మండే ఎండలు ఏమైపోయాయి?
కరోనాతో మండే గుండెలు మామూలైపోయాయి
అల్పపీడనాలు ఆవర్తనాలు వానలు కుమ్మేసాయి
నియమబద్ధతను తుంగలో తొక్కేసే పాలకులూ
వారికి వంత పాడుతూ ప్రకృతి వనరులూ
ప్రాణికోటి మనుగడనే నిలదీసిన కరోనాలు
కాలం మారిందా? కాలగమనం మారిందా?
మానవ జీవన విధానంను మార్చుకోమంటోందా?
మన ఆలోచనా పరిధిని పెంచుకోమంటోందా?
సహజీవన సంయోగంను అలవరచుకో మంటోందా?
శ్రమ యేవ జయతే అను విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
ఉచితాలకు అలవరచడం ఎంత వరకూ ఉచితం?
అలసత్వం సోంబేరితనం వంటబడితే పని చేసేదెవరు?
ముందు చూపులేని రాబందుల రాక్లస పాలనలో
నా దేశం యీ ప్రపంచం ఎటు పయనిస్తునట్టు?
ప్రశాంతమైన జనజీవన వైవిధ్యం వికసించేదెట్లు?

Friday, June 5, 2020


శా.
అంతా నీ కరుణా సుధా స్రవమె భావాభావ సర్వస్వమున్
అంతా నీదు కృపా ప్రసాదమె సమస్తాభ్యాస విన్యాసమున్
అంతా నీ వర ప్రాభవమ్మె కవనమ్మంతా దయాసాగరీ
అంతర్యామివి యాదరించి మనసంతా నీవధిష్టింపుమీ.౧

సంతోషంబులు శాంతి సౌఖ్యములు వాసావాసముల్ నీ దయన్
అంతోయింతగ లబ్దమయ్యె బ్రతుకన్ యారాట పోరాటమే
సంతానోజ్వల మార్గ కాముకము సత్సాంగత్య యోగంబుతో
కొంతైనన్ లభియించె శేష సమయ మింకో దృష్టి లేకుండగాన్. ౨

నీ సేవన్ రమియింప నిమ్ము  నను నో నీరేజ పత్రేక్షణా
నీ సేవా రతి యెక్కుడై నిరతమున్ నీ మంత్రమే ధ్యేయమై
నాసాగ్రంబున బ్రహ్మరంధ్రమున యనన్యాక్రాంత
సంవేష్టి వై
వాసంబుండ సనాతనీ దయల నీవా శ్రీ కరీ శాంకరీ. ౩

మనసంతా పలు భ్రాంతులే బ్రతు కసామాన్యమ్ముగా సాగుచో
ధన బాంధవ్యపు మోహమో యితరమో ధర్మాధికమ్మో తపో
ధన వ్యామోహమొ మంత్రమో హృదయ సంధానమ్మొ తారాడగా
చనునే యింక యుపాసనా విధులు మోక్షద్వారమున్ చేర్పగాన్. ౪

వినతుల్ తామర తంపరైనను "రసోవైసః " యనెట్లందుమో
తనువే దేవళమంచు యాత్మ పరమాత్మాభేద మూహించమే
తను వేరంచును వేరనన్ తనువు విస్తారంబుగా జెప్పరే
వినుతింపన్ దగుగాని నిన్ను వినతులా! వేవేల? దాక్షాయణీ. ౫
అమ్మా! నీ వలనన్ నిరంతరము నానందించితిన్ జీవితం
బమ్మా! యిచ్చుట నీకు జెల్లు వరముల్ పల్మార్లు గైకొంటకే
నమ్మా! మేమిట నుంట కాదనక నానా కోర్కెలన్ తీర్చుచున్
యమ్మా! బ్రహ్మ పధార్థమున్ తెలియ నీవమ్మా! యనన్యా పరా. ౬
శ్రీ కైవల్య పథంబు పట్టి చరియించే ధ్యేయమున్  శాంకరీ
సాకల్యమ్మును జేయుమీ యితర వాచాలత్వముల్ సోకకన్
యే కార్యంబయినన్ శివార్పణమటంచే జేతునే శ్రీ శివే!
నాకంబందెెద నీదు సేవలను నన్నట్లే తరింపించవే. ౭

తల్లీ!  నాదు మనో వచో విభవ మంతా నీ కృపాసారమే
తల్లీ! యక్షరకేళి నాది యదియంతా నీ దయా బిక్షయే
తల్లీ! నాహృది మందిరంబదియు నంతా నీదు ప్రాసాదమే
తల్లీ! శ్రీ లలితా! యనుగ్రహము సాంతంబంది నిన్ జేరనీ.౮

సంవర్తాగ్ని ప్రదీప్తనేత్రు దయితా! సాయుజ్య కైవల్యదా!
సంవిత్పద్మ సుఖాసనా! సునయనా! సాలంకృతోజ్వలా
త్వం వా కోఽపి సమర్థమంబ!  దయయా  త్రాతుం 
ముదా మీశ్వరీ!
కింవా సంస్థితిరేవ రక్షకమహో కేయూరహారోజ్వలా!౯



Tuesday, June 2, 2020


కం. ఆభాస మౌ జగతికి ర
సాభాసం బింపు గామి యాభాసమ కా
దే? భాసమాన! వలవక
పో భాసిల్లెదవె? సర్వము న్మనవశమే?౫౬
 
ఓకాంతిమతీ! అనేక భేదములతో ఉండే ఈ జగతికి రసాభాసము ప్రీతికరము కాదు. ప్రేమించకుండా నువ్వు ప్రకాశించ గలవా? అయినా ఈ లోకంలో అన్నీ మనకి అనుకూలంగా ఉంటాయా?
గీ.
కొంత సౌఖ్యంబు దక్కించుకొనగలేని
యతని కెమ్మెయి జొప్పుడు నంత సుఖము
తపము సెడ దిట్టు మనెడు క్రోధమునకేని
నకట లోబడు టెట్టు నీ యట్టివాడు? ౫౭
       కొంతవరకైనా సుఖం దక్కించుకోలేని అతనికి యీ విధంగా మనసుకి చొప్పించినా ఆ సుఖము తపమూ చెడునట్లు తిట్టుకొనే యితడు కోపానికి ఎలా లొంగెనో!
కం.
ఈ యఖిల మభావమ పో
కాయము కమనీయతయు సుఖంబు నిజములే?
ధ్యేయపర! గజము మిథ్య ప
లాయనము న్మిథ్య యనెడు లా గపథంబే?౫౮
      ఓ లక్ష్యగమనా! ఈ జగత్తంతా మిథ్య అయినచో ఈ మేను సౌందర్యము వానివలన సుఖము నిజములేనా?
ఏనుగు మాయ. దాని పరుగూ మాయయే అన్నచో దారేది?
మ.
ఇనతేజా!విను మాగమోక్త మగు ముంజేషీకదృష్టాంత సం
స్థ ననున్ గాయముఖాతిరిక్త మగు నస్మత్ప్రత్యయార్థమ్ముగా
గొని యైక్యాప్తి సుఖిపలే వయితి నీకున్ బ్రాతె యుత్కృష్ట మ
య్యినబింబాంతరవర్తి సర్వగమహాత్మైకత్వబోధంబహో!౫౯
         ఓ రవితేజా! అంతా మిథ్య అను వేదోక్తమైన మును చప్పిన ఉదాహరణ ముచే గాయపడిన మనస్సుతో నా అభీష్టమునకు అనువుగా నన్ను గొని నాతో ఐక్యవ్యాప్తి బొంది సుఖింపకుంటివి. నీకా పాతమాటే నచ్చినది కనుక ఆ రవి బింబ ప్రభావిత మహత్తరమైనదానితో నీ ఆత్మ ఐక్యమైనదే!
కం.
ధీయుత! శ్రుతియ కదే తల
పోయ "రసో వై స" యనుచు బొగడె "రసగ్ం హ్యే
వాయం లబ్ద్వానందీ"
త్యాయుతవాగ్యుక్తి రసమహత్త్వం బసదే?౬౦
        ఓ బుద్ధిశాలీ! మానవులు రసాన్ని పొంది ఆనంద భరితు లగుచున్నారు. ఆ రసాన్ని కోరుకుంటున్నాను అని అదే తలచుకుంటూ ఉండాలా? ఆ మాట చాలా నికృష్టమైనది.
తైత్తరీయ ఉపనిషత్ లో ఇది వివరంగా చెప్పబడింది. రసగ్ం హ్యేవాయం లబ్ధ్వానందీ అంటే మానవులు రసమును పొంది ఆనందసందోహమందు చున్నారుఅని మరి ఏమిటా రసం? రసో వై సః అంటే ఆ రసమే మీరు. అనగా ఆ రసమే పరమాత్మ. ఓ భగవంతుడా! మీరు ఆ రసం. మేము నీరసం.
ఇది ఒక విచిత్రమైన ఆత్మ పరమాత్మ ల అనుబంధం.
గీ.
అనుచు నా యాయి పలుకులు ననుచు కూర్మి
ననుచు వెంబడిబడి వచ్చు నన్నుమిన్న
ప్రౌఢి మెచ్చియు దవులని భావ మొప్ప
నత డరుగుచుండె రుషయు హేయ యని కొనుచు.౬౧
       నావి గాయపడ్డ మనసులో మాటలు, నీపై వ్యామోహంతో ఆడిన మాటలు అంటూ వెంటబడి వచ్చుచున్న ఆమె వాక్చాతుర్యాన్ని మెచ్చుకుంటూనే ఆమెకు లొంగక కోపం కూడా మంచిది కాదనుకుంటూ ఆయన వెళుచున్నాడు.
కం.
ఎడనెడ నెమ్మది నే మని
పొడమెడు నాలోచనముల బూబోడి యొడం
బడక యడగించి కైకొనె
నొడికం బవు నౌ పయికము నొక డిట్లనియెన్. ౬౨
     మనశ్శాంతి లేకుండా కమ్ముతున్న తలపులకు కట్టుబడక ఓ చిన్న ఉపాయం తట్టగా అతనికి అడ్డంగా నిలిచి చేయి పట్టుకుని ఇలా అంది.
సీ.
కామాంధ ననుకొంటి కాబోలు నిజముగా
               మునినాథ! యిట్లు కామిని నొడువునె?
సత్కులాచార ప్రశస్తి గాంచినదాన
               దైవవశంబున దారి దప్పి
కాంతారగత  నైతి గాదిలి చెలులతో
                నెడబాటు గలిగె నిం కేమన గల?
దీపరిసరముననే నా పురం బుండె
                 నెఱుగ పథంబు నే నేమి సేతు?
గీ.
ననఘ! యొంటిగ బోలేక నిను గొని చన
నెంచి నీ పాడి యెట్టిదో? యెఱుగ నంటి
గంటి లే దని కొంటి న న్గావుమయ్య!
నన్ను నా వారిలో జేర్ఛ టెన్ను మయ్య! ౬౩
   ఓ మునినాథా! కామాంధురాలిని అనుకున్నారు కాబోలు. కామిని అయిన వనిత ఇలాగే మాటాడుతుందా? ఏదో దైవ ఘటన వలన దారి తప్పి ఇలా అడవిలో పడ్డాను కాని మంచి కులాచారములను పాటించుదునని పేరొందిన దానను. నా ఇష్ట సఖులకు దూరమైతిని.ఇంకేమనగలను? మా ఊరు ఈ దగ్గరలోనే ఉంది. దారి తెలియదు. ఏంచేయగలను? ఒక్కతెనే పోలేక నిన్ను తోడుగా తీసుకుని పోదామనుకున్నా. నీ పద్ధతి నాకు తెలియదు. నిన్ను చూసి కూడా ఫరవాలేదు లే అనుకున్నా. ఎలాగైనా మా వారి వద్దకు నన్ను చేర్చుటకు జూడు.

కం.
దయగలవాడవు యోగివి
నయ మెఱుగుదు దిక్కులేని  నవలా నన్నున్
భయ మెడలిచి పురి జేర్చుట
యయమో? యన్యమ్మొ? యరయుమా సుకృతాత్మా!౬౪
    ఓ పుణ్యాత్ముడా! నీవు యోగివి. ఏది మంచో తెలిసిన వాడివి. ఏ దిక్కూలేని ఓ ఆడుదాని భయాన్ని పోగొట్టి మా ఊరు చేర్చుట మంచిదో కాదో నీవే తేల్చుకో.
 గీ.
నాకు నిడ నేమి కలదు? సన్నితియ దక్క
భూతదయ మీకు వలయునో? పున్నెము గొను
మనుచు నార్తి వచించు న య్యతివ నమ్మి
యూరు సేర్చెడు పని కాత డొప్పుకొనియె. ౬౫
      ఆ ముని నాకు మాత్రం ఇక్కడ ఏముంది? ధ్యానానుకూలత తప్ప. తాపసులకు కూడా భూతదయ ఉండాలి పుణ్యము కట్టుకోమని ఆర్తితో అనే ఆమె మాటలు నమ్మి ఆమెను తన ఊరు చేర్చుటకు ఒప్పుకొనెను.
కం.
తన యూరిలో దవిలిన వా
నిని గా నవ్వాని దలచి నెలతుక విశ్వ
స్తు నొనర్ప గొంత దూరము
చనిచని యా యా పలుకుల జన వేర్పడగన్.౬౬
    అతనికి నమ్మిక కుదురుట కోసం తన ఊరివాడే అన్నట్లు కొంత దూరం పయనించి మధ్యలో ఏవేవో కబురులాడుతూ జనువు ఏర్పరచుకున్నది.
సీ.
ములు గ్రుచ్చుకొనె బాదమున నని యిల బడి
            తీయించుకొనియె నిర్మాయుచేత
దేలు కుట్టిన దని నేల గూలుచు నేడ్చి
            తదుపచారాప్తి నిస్తంద్ర యయ్యె
నిక్కడ నెది యో చురుక్కనె నని వెక్కి
            తద్విష వైద్య సందర్భ మెనసె
నల్లన దయ్యిల యనుభవంబులు సెప్పి
            యత డిచ్చు బసుమ మంగాళి నలదె
నెడనెడ బరశ్శతమ్ముల నిట్టివ యవు
కై తవమ్ముల నమ్మౌని గలచియాడె
నొక్క విభ్రమము వహించి టక్కులాడి
యతని యవ్యాజ సౌహృదయ్రమునెఱింగి.౬౭
   ఆ మాయలాడి అరికాలిలో ముల్లుగుచ్చుకుంది యని మాయ తెలియని అతని చేత తీయించుకుంది.
తేలు కుట్టిందని ఏడ్చి సేవ చేయించుకుంది.
ఇక్కడ ఏదో చుఱుక్కుమంటోందని విషవైద్యం చేయించుకుంది.
దెయ్యాల అనుభవాలు చెప్పి అతనిచ్చిన భస్మము అద్దుకుంది.
అలా నూరు కంటే ఎక్కువ వంకలు పెట్టి నానా దొంగాటలు ఆడింది. కల్ల కపటం లేని ఆ ముని మంచి మనసు తెలిసినదై టక్కులాడి ఎన్నో వేషాలు వేసింది.
ఉ.
చెమ్మట గ్రమ్మె మేనున వశిప్రవరా! నను జూడు మొక్కమా
రమ్మెయి దూరమున్నడచు నమ్మెయి కంఘ్రులు నారపాచ లై
పొమ్మని త్రోచినం గదలబోవు మనమ్ము వశమ్ము గాదు గా
త్రమ్ములు విశ్లథమ్ము లవు దారి విదారిత ధైర్య నైతిబో.౬౮
       ఓ మునివరా! మేనంతా చెమట పట్టేసింది. అంత దూరం నడిచేసరికి పాదాలు సాగిపోయి అడుగు తీసి అడుగు వేయలేకున్నవి. నా మనస్సు నా వశంలో లేదు. గొంతు తడారిపోయింది. నా ధైర్యం బద్దలైపోయింది.
ఉ.
ఆకట నిల్వజాల బురమా? పరమా? యెటు గానరాదు నే
నో కలషాపహా! యిచట నుండెద నింకిట బొమ్ము నీవు నా
కా కమలోద్భవుండెటుల నాననమందు లిఖించె నట్టు లౌ
గాకులొ? గ్రద్దలో? మఱియొకండొ యికేమి వచింతు నక్కటా!౬౯
       ఓ పాప విదూరుడా! ఇక్కడ నిలబడి ఎటుచూసినా పురమూ లేదు పరమూ లేదు. నేనిక్కడ ఉంటాను. నా నుదుట ఆ బ్రహ్మ ఎలా రాసాడో అలా జరుగుతుంది. ఇంక నువ్వు వెళ్ళు. కాకులో గ్రద్దలో మరోటో నన్ను చూసుకుంటాయి.
కం.
అని క్రింద కూలబడి యె
త్తిన లేవనలేనియ ట్లొదిగి నవలా ప
న్నిన పన్నాగమునం బడి
ముని పుంగవు డిట్టు లనియె మునుకొను జాలిన్.౭౦
     అని అంటూ ఆమె నేల కూలబడింది. ఎంత లేవనెత్తినా లేవవడం లేదు. ఆమె వేసిన ఎత్తుగడ లో పడిన ముని ఇట్లనెను.
మ.
లలనా! నీ నునుమేని మెత్తనకు మేలా? యిట్టి యిక్కట్టు లో
కు లనం గాకు లటంచు జంకెదను నాకుం జిత్త మాయత్త మీ
లలి నాపన్నవు కాన డించి చన నేలా గొప్పు? ని న్నూరుముం
దలకుం జేర్చెద మోచియే నిజభుజా స్తంభం బధిష్ఠింపుమా. ౭౧
       ఓ లలనా! నీ అతి సుతిమెత్తని మేనుకు ఈ ఇబ్బందులు మంచివా? లోకులు కాకులంటారని జంకుచున్నాను. ఆపదలో ఉన్న నిన్ను వదలి వెళ్ళడం భావ్యమా? నా భుజం ఎక్కి కూర్చో ఊరు ముందర దించెదను.
కం.
అని డగ్గఱు మునితిలకుని
గని సంతస మెద దలిర్ప గాంతారత్నం
బినసన్నిభ! ముట్టగ వ
చ్చునె? పరపురుషులను నాకు సువ్రత కనినన్.౭౨
     ఓ రవితేజా! పరపురుషులను తాకవచ్చునా మంచి నియమంగల నాకు? లోలోన ఆతని సమీప్యమునకు సంతసించుచూ పైకి అట్లనెను.
ఉ.
అ య్యతిముఖ్యు డాత్మ బ్రమదాంబుధి ముంపగ మెచ్చి తొయ్యలీ
కొయ్యకు నాకు ఱాతికి నొకండు వికారము మాట వుట్టునే?
దయ్య మెఱుంగు జిత్తము కదా సునిమిత్తము బంధముక్తులం
దయ్యది సుస్థ మైన కలదా? దొసగించుకయే నటం చొగిన్.౭౩
   ఆ మాటలకు ఎంతో సంతసించినవాడై ఓ వనితా! నాకు కఱ్ఱకు ఱాతికి  మనో వికారాలు ఉంటాయా? దైవాన్ని తెలుసుకొనే బుద్ధి సుస్థిరమైన భవబంధ విముక్తులకు ఇది దోషమగునా?
గీ.
బుజము నెక్కించుకొని ననబోడి గొనుచు
వడివడిగ బోవ జొచ్చె  నా వశివరుండు
నెవ్వగ లొకింత వెనుబడ నేర్పు మెయిన
యల విలాసిని చేయు చేతలకు గాక. ౭౪
      ఆ ఇంద్రియ నిగ్రహుడు ఆమెను తన భుజాన ఆమె నెక్కించుకొని ఏ వగలూ తనకు అంటకుండా ఆమె చేసే చేష్ఠలకు గాక నేర్పుగా వేగంగా పోవుచుండెను.
గీ.
ఇను మనగవచ్చు మనసు గానీ మిష మిది
దివ్య దృష్టి నెఱుంగ నౌ తెలివి కలిగి
యలతలపు లేక జాలి ని య్యలజడి వడు
కారణంబు ప్రారబ్దంబ కా దికొండు.౭౫
       ప్రారబ్దం కాకపోతే మరేమిటి? మనసు ఇనుము వంటిదే అయినా ఈమె వంకలను దివ్యదృష్టితో తెలియగల ప్రజ్ఞ ఉండీ ఆ ఆలోచన లేక జాలిపడ్డాడే.
గీ.
స్విన్న రోమాంచవతియు గంపితయు నగుచు
శుచిరసంబున దోగు నా సుదతి గాంచి
శ్రమజనిత మంచు నెంచి యా సాధు వరుగ
నగపడెను భోగవతి దివి నగెడు నగరి.౭౬
       గగుర్పాటుతో కాస్త కంపించుతూ నవ్వుతూ ఏదో తన్మయత్వంలో ఉన్న  ఆమెను చూచి కష్టమైనా సరే ఆ సాధువు నడుస్తుంటే ఆమె చెప్పిన స్వర్గపురి కనిపించెను.
వ.
మఱియు నప్పురంబున సవతు లవు నచలయు సిరియు దమ తమ గొనంబు లొకొళ్ళొకళ్ళకు బరివర్తించుకొనిరి. శుబలక్ష్మీస్వయంవరస్థాన మ్మవు నాయూర బారులు తీర్చి కట్టిన  సౌధాగ్రంబులు వరణీయాశ్రయంబు లౌ మంచె లని యెంచెద. ఆ మేడల రత్నకాంతి పూరంబుల నెసకం బెనంగు నరులు నారాయణులు గాకుందురా? వారల మోసల నాసలు గొల్పు సుభద్రలు మాత్రము రుక్మిణు లని నొక్కి వక్కాణింపవచ్చును. సత్యభామాభాసురం బగు గాంగేయసంగతి గల యది భారతమేకదా? పంజర బందీకృతశకునిరాజం బగు నచ్చట దుర్ద్యూత ప్రకరణము మాత్రము లేదు. శత్నుఘ్నులవలన విశ్రుతకీర్తులు మెలంగుట, భరతపుత్రాకరంబగుట, సలక్షణులు నూర్మిళలు ననదగు సరసులచే  బ్రకాశించుట, సీతాఫలానుభవాభిరామం బగుట ననేక దశరథభాసురంబైన యా నెలవు నూతన రామాయణ మన జెల్లు. సుగ్రీవులు విభీషణులు హనుమంతులు నీలులు ద్వివిద లవు వార లంగదసంగతు లై యుండుట తత్ప్రబంధములోనిదియే. అచటి మార్గంబులు శ్రుతులు పదక్రమాచితంబులు. వైజయంతీ విలాసములు రతిరహస్యములు కలాపూర్ణోదయములు నచ్చటనే చదువవలయును. ఇట్టి చట్టములు గల పట్టణము సమీపించి య య్యంచితు డమ్మించుబోడి డించుటయు నయ్యరువురు జన జన.౭౭

    ఆ నగరంలో లక్ష్మీ పార్వతులు ఒకరి గుణాలు మరొకరికి మార్చుకొనిరి. ఆ ఊరిలోని లక్ష్మీనిలయములైన మేడల వరుసలు కోరుకోదగ్గ ఆవాసములౌ పందిళ్ళ వలె నున్నవి. అంతటి విలువైన లక్ష్మీ నివాసములలో నుండువారు నరులైననూ నారాయణులే. ఆ ఇళ్ళ మొగసాలనున్న సుభద్రలు నిజంగా రుక్మిణులే. సత్యభామ వలే మెఱిసిపోవుచున్న ఆ నగరం గోవిందుని మందిరమే. చెడు శాసనము గలది దుర్యోధన మార్గము పట్టును. ఆచార్యుల దయ వడసిన గంగా పరివారమున్నది భరతదేశమేకదా. పంజరంలో బంధింపబడినట్లు ఉన్ననూ అక్కడ పాచికలాట మాత్రం లేదు. శత్నుఘ్నులవలన మంచి పేరు పొందిన వారుండుట, భరతుని వంటి కుమారులకు నిలయమై  లక్ష్మణ ఊర్మిళాదుల వంటి సరసులచే వెలుగొందుతున్న సీతా ఫల అనుభవైక నిలయమై అనేక రథములచే నలరారుచున్న ఆ నేల మరొక రామాయణ భూమియే యనవచ్చును. అలాగే సుగ్రీవులు విభీషణులు హనుమంతులు అంగదుల వంటి వారుండుట ఆ కోవలోనిదే. అక్కడి మార్గములు వేదవిద్యా నిలయములు. వైజయంతీవిలాసములు రతిరహస్యములు కళాపూర్ణోదయములు అక్కడే చదవాలి. అటువంటి గొప్ప పట్టణము చేరి  ముని ఆ వనితను తన భుజమునుండి దించి ఆ ఇరువురూ అలా నడుస్తూ ఉండగా
సీ.
కల్పితశై లసకాశయాతాయాత
       చారూచ్చరచ్ఛుక శారికంబు
కేలీమహోద్యాన పాలికా కరతల
        పరిమళమిళితాళిపనితగీత
మంతతో మలయానిలాంచిత పరిసర
        ద్రాక్షానికుంజ సందానితంబు
సర్వతోభిత్తి ప్రశస్త శిల్పినిబద్ధ
         చిత్రవిరచనా విచిత్ర తరము
తే.గీ.
తత ఇతస్సంచరత్ప్రమదావిమర్ద
నిస్సరత్సౌమ సౌరభ నిచిత కలిత
చంద్ర
శాలాశాలావిశాలభాస్వర సురసవి
సరము గనిపించె నచట ప్రసాద మొకటి.౭౮
    ఆ మేడ
కృత్రిమ శిలా నిర్మితమై చిలుకలు గోరువంకలు యథేచ్ఛగా తిరుగునట్లు, విహార యోగ్యమైన ఉద్యాన వనంలా సుమ సౌరభములతో తుమ్మెదల ఝంకారంతో చల్లని గాలి వీచే ద్రాక్ష తీవెల పొదరింటిలా నిర్మితమై, శిల్ప చాతుర్యము ఉట్టిపడునట్లున్న గోడలు, వెడల్పైన అరుగులు పూ పరిమళములతో ముంగిలితోను విశాలమైన డాబా కలిగి ఉంది.
కం.
ఆ మేడలోనికిం జని
యా మహిలాతిలక మప్పు డామునిఘను రా
వేమయ్యా! యని నెయ్యము
తో మంచిగ బిలిచి చెలులతో సాదర యై. ౭౯
   ఆ మేడలోకి వెళ్ళి రావేమయ్యా అని చనువుగా మంచిగా ఆ మునిని పిలచి చెలికత్తెలతో సాదరంగా
గీ.
ఆసనమ్మున నునిచి పాద్య మ్మొసంగి
యర్ఘ్య మర్పించి యెంచి సంయమివరేణ్యు
బూలప్రోవుల బూజించె బూవుబోడి
భక్తి భూమిక నెద రతి పల్ల వింప.౮౦
   ఆ మునివరుని ఆసనం వేసి కూర్చుండబెట్టి అర్ఘ్యము పాద్యము ఇచ్చి పూల పోగులతో పూజించినది. ఆమె భక్తితో పరవశించినది.
ఉ.
అంతట నాత డో లలన! యచ్చపు బత్తిని బూజసేసి తీ
వింతయు మా మనంబునకు నెంతయు మె చ్చొనరించె నింక నీ
కాంతుని గూడి సంతతి సుఖంబుల జెందుము పోయివచ్చెదన్
జింతలపాలు గాక యిలు సేరితీ వింతియ చాలు నా కనన్. ౮౧
      ఆప్పుడాముని ఓ లలనా! ఎంతో భక్తితో పూజ చేసి మా మెప్పు పొందావు. ఇంక నీ పతితో గూడి సంతిన సుఖం పొందుము. ఏ చింతలు లేకుండా ఇల్లు చేరు కున్నావు. అదే నాకు చాలు. నే వెళ్ళివస్తా అనెను.
కం.
నీ దయ దలంగె దుఃఖము
లాదరమున నను మనిచితి వౌరా యనగా
నో దయితగుణా! తగదే
మాదిరి గొంతతఱి నిలిచి మన్నన వడయన్. ౮౨
     నీ దయవలన నా దుఃఖము తొలగినది.ఆదరంగా నన్ను బాగా చూసుకున్నావు. కొంచెము తడవు ఉండి మా భన్నన పొందుట తగదా?
కం.
ఆలుం బిడ్డలు గలరే?
పోలే దని యేడ్వ మించి పోవునె? యెదియేన్
మేలా దాసుల విన్నప
మాలింపమి యనిన వాడు నాదర మొప్పన్. ౮౩
    నీకేమైనా భార్యా బిడ్డలున్నారా? పోలేదని ఆలస్యమైపోతోందని ఏడువనేల? దాసుల విన్నపం కాదనడం మేలా? అనిన ఆమె మాటలకు అతడు ఆదరంగా
చం.
పిడికెడు భిక్ష వెట్టు మని  వీథుల వెంబడి పోయి యెవ్వ రే
మిడినను దృప్తి సెంది హృదయేశ్వరు విట్ఠలు భక్తీ గొల్చు చె
క్కడ నిలువం దలంపక జగంబుల ద్రిమ్మరుటే వ్రతంబు నే
గుడువగ రాద యొక్కయెడ గూరిమి గల్గిన యేని సుందరీ! ౮౪
    ఓ సుందరీ! పిడికెడు భిక్ష కోసం వీథులంట తిరిగి ఎవరేం పెట్టినా స్వీకరించి తనివి తీరి ఆ విట్ఠలుని భక్తితో కొలచుచు దేశ ద్రిమ్మరినై తిరిగే వ్రతం కల నేను మనసుపడి ఒకచోట ఉండవచ్చునా?
చం.
పనిచిన పోయి వచ్చెదను బద్మదలాయతలోచనా!యనన్
విని తన సద్వ్రతంబు సరవిం జని నెచ్చెలు లిండ్లయందు దె
చ్చినయది నే నొసంగెడు విశిష్టత పదార్థముతోడ నేడు భో
జన మొనరించి నిల్వదగు సర్వము నీ దయ మా యదృష్టమున్.౮౫
      ఓ పద్మములవంటి కన్నలున్నదానా! నువ్వు శలవిస్తే పోయి వస్తాను. అనగా విని తన సువ్రత క్రమంలో థన చెలికత్తెలు తమ ఈళ్ళనుంచి తెచ్చినవీ నేను ఇచ్ఛే విశేష పదార్థముతో భోంచేయవలెను. అంతా నీ దయ మా అదృష్టము అని ఆమె అనెను.
కం.
అని దీనత వేడెడు కొమ
గని మఱుమాటాడలేక ఘనమతి యటు ల
ప్పని దీర్చి పవలు గడ పెం
దనికె నినుడు పశ్చిమాంగనా తత్పరుడై. ౮౬
   దీనంగా ఆమె అన్న మాటలకు మారు మాటాడ లేక ఆ పని అలాగనే ముగించినాడు. కొంత సేపటికి సూర్యుడు పశ్చిమ కన్యా ఆతురుడై వెడలెను అనగా సూర్యాస్తమయ మయ్యెను.
కం.
ఆగమ లాలితు డిను డస
మాగ న్వరుణాశ దవిలె నన ద్విజరా జా
ప్రాగంగన దరి జేరం
గా గమకించెన్ బ్రపంచగతి యిదియ కదా.౮౭
       ఆగమ లాలితుడైన సూర్యుడు చనువుతో పశ్చిమ కన్యవైపు చనగా చంద్రుడు తూరుపు భామను చేరుటకు సిద్ధపడెను. లోకం తీరు ఇంతేకదా.
చం.
ఇను డగు గాక కర్మముల కెల్ల  నొకం డగుగాక సాక్షి భా
మనిధి సహస్రభానుడు ప్రమాదముచే నొక పశ్చిమాంగనన్
జెనకి ఘనత్వ మోజమును జేడ్పడ నిర్వసుడై వడిం జగం
బున మొగ మెత్త లేక చనబోయెడు చాటున కేమి సెప్పుదున్.౮౮
           ఆరన సూర్యుడే కావచ్చు. లోకంలో అన్ని కర్మలకూ సాక్షీభూతుడు కావచ్చు. ఆ దివ్యపురుషుడు ఏదో ఒక ప్రమాదముచే పశ్చిమ వధువును తాకి తన విశిష్టతకు మచ్ఛగాగ చేయునది లేక తలెత్తుకో లేక వడిగా చాటుగా పోవుటకు చూచుచున్నాడు. అతని గురించి ఏమని చెప్పుకోగలం?
వ.
ఇమ్మాదిరి జగచ్చక్షువు వోయె నని యుదయించి యుత్పథమ్మున వర్తింప నెంచు నించు విలుకాని మామ మై గ్రమ్మిన రజస్తమో వికారంబుల గాలంబ కాక తార లితరులు దుడువ నోపకునికి విదితంబ కదా? తనత్రోవన పోయెడువానికి నడుమ దటస్థించి యొక సరాగరాగ మాపాదించిన బాప మాతం డేమి సేయు? అట్టివారికి దిక్కు కాలమే. నడుమ వచ్చిన చెడుగు నశింప గలానిధులు పరిశుద్ధు లగుదురు. తాదృశుల దీప్తి యప్పటికి రోదసీ కుహరంబెల్ల నాక్రమింపకుండదు. పరమేశ్వరానుగ్రహం బింతకు గమకము.ఇంత యంతకు దెల్లం బయిన నింక జెప్పవలసిన దెద్ది? అయ్యెడ మీఱిన మారుని యారంభమునకు జేయరామి కన్పట్టదయ్యె. అయోగి జనుల మాదిరి వియోగిజనుల గూడ రాపాడ దొడగె. కుసుమంబులుం బోలె నారుల నారాచంబుల జేయుచుండె. చెడి బ్రతికినవారి చెయ్వుల కోర్వవచ్చునా? అప్పుడు వారితో గలసిన పవనుండ మందుండననయ్యె. ఈ మూకల బందెపోటు దొంగతనంబు వారింప రాకుంటయు నెల్ల వారు దమయంతఃకరణ ద్రవిణంబుల జాఱవదిలిరి. వారికి నూత మొసంగు నితంబినుల క య్యదనున సాధింపరానిది లేకుండె. అట్టియెడ

              ఈ విధంగా లోకానికి  చూపుకోసం ఉదయించి ఆకాశంలో పయనించ గోరు దక్షుని ఆవహించిన రజస్తమో వికారముల అచటి వారు నివారింప లేకపోవుటచే కదా ఇదియంత. తనదోవన తాను పోవు వానికి దారిలో ఎదురుపడి ఏదో ఒక అనురాగం మోపితే అతను ఏంచేయగలడు?  అలాంటి వారికి కాలమే దిక్కు.  మధ్యలో తగులుకున్న చెడు నశించిన తరువాత వారు పవిత్రులగుదురు. అటువంటి వారి కీర్తి అంతరిక్షం అంతా వ్యాపించకుండా ఉండదు. ఇంతకూ ఆ పరమేశ్వరుడు ఎలా అనుగ్రహిస్తే అలా జరుగును. ఇది అంతయు తెలిసినచో ఇంక చెప్పవలసినది ఏముంది? అక్కడ హద్దు మీఱిన మన్మథుని ఆరంభమునకు ఆటంకము లేదాయె.అయోగులవలె వియోగులు కూడా మధన పడుచున్నారు. పూలవంటి నారినీ బాణములను చేయుచున్నారు. చెడి బ్రతికినవారి చేష్టలకు ఓర్వగలమా? అప్పుడు వారితో కలసిన పవనుడు కూడా మన్మథుడయ్యెను.  ఇటువంటి వారి బందిపోటు దొంగతనాలను అడ్డుకోక పోవుటచే ప్రతివారూ తమ ఆత్మసాక్షి అనేదాన్ని జార వదులుకున్నారు. వారికి దన్నుగా వనితలకు కూడా ఆ సమయంలో సాధింపరానిది లేకున్నది. అలాంటప్పుడు
ఉ.
ఆ గజగామినీ మణి యొయారము మీఱగ జేరవచ్చి యా
యోగి కులావతంసు పదయుగ్మము సన్నిధి భక్తి యుక్తితో
సాగిలి మ్రొక్కి పల్కు వికసన్ముఖలోచన కంజపుంజయై
శ్రీ గురునాయకా! యని విశిష్ట మనోహరవృత్తి బిల్చుచున్.౯౦
        ఆ గజగామిని ఒయ్యారంగా నడుచుకుంటూ వచ్చి ఆ యోగి పుంగవుని పాదాల సాగిలపడి భక్తి యుక్తులతో నమస్కరించి వికసించిన పద్మములవంటి కన్నులతో ఓ గురునాయకా! ఎంతో గొప్పగా పిలచి
కం.
మన గృహ మొకపరి దిలకిం
పనెలేదు మనీషివర్య! పర్యాప్తముగా
ననుకంప వలదె? తగునే?
యనాదర మొకింత నేలయందు నధీశా! ౯౧
    ఓ మహానుభావా! మన ఇంటిని ఒకసారైనా చూడలేదు
యధేచ్ఛగా కాస్త కరుణ చూపక పోవడం తగునా? ఎందుకంత యనాదరము?
సీ.
పున్నాగ పాటలీ ముఖవృక్ష లతికావి
              తానమానితము లుద్యానవనము
లలిగుంజనానుకీరాలాప కలితపి
               కారవాఢ్యములు విహారభూము
లాదర్శమణివిచిత్రాలేఖ్య దర్శనీ
               యము లైన మేలి గర్భాలయములు
పండువెన్నెల నిండ బర్వి పండువు గూర్చు
                సమవిశాలము లైన చంద్రశాల
లజిత! నీపాదరాజీవరజము సోకి
పావితంబులు కా వలదే? వలచిన
గదలి యన్నపుడెల్ల రా గలవె? దేవ!
యవధరింపుము విన్నప మదియు గాక. ౯౨
        ఓ జయింపబడని వాడా! ఈ పున్నాగ పాటలీ మొదలైన వృక్ష లతాదుల పొదరిండ్లతో కూడుకున్న ఉద్యానవనములు, తుమ్మెదల ఝంకారానికి అనుకూలంగా వచించు చిలకల నర్తించు మయూరములతో కూడిన విహార భూములు, చిత్ర విచిత్రములైన చిత్తరువులతో కూడిన గర్భాలయాలు,
పండువెన్నెల నిండుగా పరచినట్లుండు సమతల విశాలమైన పైమేడలూ నుపద్మములవంటి పాదధూళి తాకి పవిత్రము కావద్దా? రావాలని యన్నపుడెల్ల రాగలవా? అయినా ఇది విన్నపముసుమా!
కం.
అంగజ జనకుడు రంగడ
నంగజయా! మాకు ద్రాత యవు నిలువే ల్పా
సంగతి నీ యెఱుగనిదే?
యంగీకారంబు సూపు మా విభు గాంచన్.౯౩
     ఓమన్మథుని జయించినవాడా! మన్మథుని జనకుడైన రంగస్వామి మము కాచే మా ఇలవేల్పు. ఆసంగతి నీకు తెలియనిదా? ఆయన దర్శనం చేసుకుందుకు ఒప్పకొనుము.
గీ.
రంగదేవర తీర్థంబు రాజిత మవు
దక్షిణివర్తశంఖసంధారితంబు
భవదభయదానచణ కరాబ్జప్రసంగ
పావితంబై తొలంచు నాపాపములను. ౯౪
      శ్రీ రంగస్వామి దేవళం దక్షిణావర్త శంఖమువలె ప్రకాశించునది.  నీ అభయ దాన నేర్పరి యైన హస్త పద్మములచే పునీతమై నా పాపములను తొలగించును.
కం.
దయసేయు మనఘ! యన న
న్నియయమహితుడు విట్ఠలు నీ
ప్రియ దైవమె? యెంతదానవే? కమలాక్షీ! ౯౫
     దయచేయండి స్వామీ అని ఆమె అనగానే ఆ నియమవర్తి చాలా సంతసించి ఓ పద్మమువంటి ముఖము కలదానా! విట్ఠలప్రభు నీ ఇష్టదైవమా? ఎంత గొప్పదానవు? నీవు అనెను.

కం.
నీ వినయము భక్తియు సం
భావన భావంబు నన్ను పరవశు జేసెన్
నీ వినిచినయవి యెల్లన్
భావిని! చర్చించి చూడవలయు జుమ్మీ.౯౬
      ఓ వనితా! నీ భక్తి వినయము ఆదరము నన్ను పరవశుడను చేసినవి. నీవు వినిపించిన విషయాలు చర్చించి చూడవలసినవే సుమీ.
గీ.
మొట్టమొదటి ప్రసంగంబు పోల్కి సూచి
నిన్ను నీరసించి పలికిన నేర మెన్న
బోకు మాత్మేశు డైన లోకైకనాథు
భక్తురాలవు నీ వని పడతి! యెఱుగ.౯౭
    ఓ పడతీ! నిన్ను ఈసడించి నే చేసిన తొలి ప్రసంగం తలచి నేరం ఎంచకు. లోకైకనాథుడైన రంగ విట్ఠలు భక్తురాలవని యెఱుగక అటులంటిని.
కం..
అని సమ్మతించి వెంటం
జనుదేరగ జాన వాని సరవిం దన చె
ప్పిన నెలవు లెల్ల ద్రిప్పుచు
నను నొప్పం జేర్చె దద్గృహాభ్యంతరమున్. ౯౮
       అట్లనిన ఆమె మాటలకు ఒప్పుకొని ఆమె వెనుక బయలుదేరగా వరుసగా తను చెప్పిన చోటులన్నీ చూపించుచూ అంతఃపురంలోనికి చేర్చెను.
ఉ.
అచ్చట పాండురంగవిభు నాకృతి జూచుచు సంతసించుచున్
మెచ్చుచు గొల్చుచున్ గలిమి మేల్మికి జొక్కుచు మాటిమాటికిన్
ద్వచ్చరితంబు లిట్టి వని తన్వి! యెఱుంగకపోయితింగదా?
యచ్చెరువయ్యె నీ మహిమ మంచు నతండు నుతించుచుండగన్.౯౯
         అక్కడ పాండురంగని విగ్రహం చూసి చాలా సంతోషించి చాలా చాలా బాగుందని మాటిమాటికీ మెచ్చుకుంటూ ఓ వనితా! నీ గుఱించి యెఱుగక పోయితిని. చాలా ఆశ్చర్యంగా ఉంది నీ ఉనికి యని పొగడు చుండగా.
ఉ.
నాతుల నీతుల న్నిధువనంబుల రీతుల బ్రీతులన్ దివా
భీతుల పక్షపాతముల వీతవిశంకరసప్రభాతపుం
భాతుల బత్ప్రహారముల వంకర కూతల వేగి యేగ నౌ
రాతిరి కొంగు వట్టికొని రాజు విదిర్ప బడెం 
గుభృత్తటిన్. ౧౦౦
        ఆడువారి నీతులు నచ్చిన వారిని కలిసే పద్ధతులు కలువ కొలనులో భయము పోయి రసోదయమయి పడిన గట్టి దెబ్బల వంకర కూతల నుండి వడిగా వెడలి యుండవచ్చు. రాత్రి కొంగు పట్టుకుని రాజు కొండ యంచున పడతోయ బడెను.
వ.
అనిన ననంతర కథాసంవిధానంబు నభ్యర్ధించుటయు.౧౦౧
   అట్లనిన తరువాత కథ ఏలాగున నడచెనో వివరించమనగా.
గీ.
చెన్న కేశవ దేవ! వాంఛితవితరణ
చణసమగ్రానుభావ! త్వచ్చరణకమల
మహి సమర్పిత యైన యామావిక కృతి
బ్రచిత మైనది యాదిమ ప్రకరణమిది. ౧౦౨
       కోరిన కోర్కెలు దీర్చే నేర్పరి వైన ఓ చెన్నకేశవ! నీ చరణ కమలములకు సమర్పించబడిన యామావిక అను వృద్ధిపొందిన కావ్యములో తొలి భాగము ఇది.
గీ.
తాడెపలి వేంకటప్ప సత్కవితనుజుడ
సన్నుతచరిత్ర హనుమాంబ కన్నతల్లి
నన్ను రాఘవ నారాయణ యని పిల్తు
రాలు శ్రీ దేవి నినుగొల్వ సమరితి మిటు. ౨౦౩.
     సుకవి తాడేపల్లి వేంకటప్పగారు ఘన చరిత్రి యైన హనుమాంబల కమారుడను. నన్ను రాఘవ నారాయణ యని పిలచెదరు. భార్య శ్రీ దేవి. నిను కొలిచేందుకు ఆమరితిమి ఇక్కడ.

Monday, June 1, 2020


శా.
కంసారాతి మహోపకారముగ మాకందించె గీతా శ్రుతిన్
సంసారాంబుధి నీదుచుంటిమిట తత్సారాంశ బద్ధంబుగా
సంసర్గాధిక ముత్తమోత్తమముగా సాగింపగా నా శుభా
హింసా ధర్మమె ముక్తినిచ్చు జగతిన్ హేరాళమై ఒప్పగన్.