Friday, January 28, 2022

 

శా.

ఊరూరన్ దిరుగాడినన్ ఫలిత మేముండున్ కవిత్వమ్మునన్

ఆరూఢంబగునే సభాస్థలిని నీ యాకాంక్ష లీడేరునే

కోరంగోరక విత్తమాలలను నీ కున్వైతురే గొప్పగా

నోరారం హరి కీర్తి నీవనక నిన్నోదార్చునే దైవమున్.

శా.

ఏ రీతిన్ నిను గొల్చినన్ గలుగు నే నేరీతి సేవించినన్

యారూఢంబగు నీ మదిన్ మును సుసంయమ్యోన్నతా మార్గమున్

ప్రేరేపించి విధించి నన్నడుపగా పేరాశ నాదందువా

వైరాగ్యమ్మొ పరాఙ్ముఖత్వమొ యనిర్వాచ్యమ్మొ చాలందువా?



Friday, January 21, 2022

దిక్కెవ్వరే మాకు

          దిక్కెవ్వరే మాకు

కొండ రాచూలి! నీయండ మా పాలి

కలుగకున్న  కలలుగన్న కలుగదన్న

ఈ నిర్భర నిస్సహాయ నిస్పృహల నడుమ

నిష్కృతి లేని జీవితాన ఏ పూట కాపూట

ఒక గండమగును యమగండమే యగును.

ఈ ప్రకట కంటక సంకట దుర్నీతి గనెడి

స్వార్థ విస్ఫురిత కపట లోకాన ఏ చోటు కా చోటు

రణరంగమగును దారుణరంగమగును

వడకులగుట్టపట్టి! పతితుల నట్టెపెట్టి

నీ మనసు కరుగకున్న నీ తలపు నిలువకున్న

దిక్కెవ్వరే మాకు? శరణ మింకేది మాకు?

వినతి వినవేల? మా వినుతి గనవేల?




Tuesday, January 18, 2022

ఈవే..

    ఈవే...

ధ్యేయము నీవై

ధ్యానము నీపై

సాధ్యము జేయవె

శాంకరీ కృపాసాగరీ.

జ్ఞేయము నీవై

జ్ఞానము నీదై

సాధ్యము జేయవె

శర్వాణీ దాక్షాయిణీ

సాధ్యము నీవై

సాధన నాదై

సాయుజ్య మీయవె

యోగీశ్వరీ పరమేశ్వరీ.

Monday, January 17, 2022

కొలువు నీకౌను

 నా గుండె గుడిలోన నన్నుద్ధరించ నీ

              శిల్పమేగద ప్రతిష్టించినాను

నా కంటి కోనేటి నడుమ నే విలపించి

            కన్నీరు మున్నీరు గార్చినాను

నా పంటి బిగువున నా క్రింద పెదవిని

            బిగగట్టి బాధలన్ వేగినాను

నా స్వప్న సామ్రాజ్ఞి నా పల్కు సిరులొల్కు

           నీవంచు వేవేల నిక్కినాను

మాట వరసకైనా యనుమాన మనక

కోటి యాశల బ్రతుకును గుల్లజేసి

నన్నొదిలిపెట్టి నువు పోయిన ప్రతిచోటు

  కొలువు నీకౌను వేరొక కోవె లగును.

సీ.

నా గుండెలో నీకు నాజూకుగా నొక

        గుడికట్టినాను నువ్ కుదురు కొనవె?

ఆ గుండె గుడిలోన యార్తితో భక్తితో

       నీ రూపు స్థాపించి నిన్ను గొల్చి

యపురూప రూపిగా సాదర మూర్తిగా

        నిన్నుపాసించి మన్నించమంటి

తలపు తలపున నిన్ తలచుకొనుచుంటి

       సంసార బంధాల సాగుచుంటి

తే.గీ.

ముక్తి కోరెడు నాకు విముక్తి నిమ్ము

మోక్షగామిని గాని విముఖడ గాను

నన్నొదిలి నీవు యేచోట నైన నున్న

కొలువు నీదౌను యదికూడ కోవెలగును.

           

    

Sunday, January 16, 2022

శ్రోతవ్యం

     శ్రోతవ్యం

శ.

చేతోమోదముగా యితోధికముగా చేసేటి నా పూజలన్

యాతాయాత మనోవ్యధల్ కలిమి నిత్యాభావమున్ నా మన

స్సెంతో వ్యాకులమంద జేయు కించిత్ శాంతి నా కీయవే

శ్రోతవ్యం మమ విన్నపం భగవతీ! శ్రుణ్వంతు కామేశ్వరీ.

శా.

చేతల్ వాక్కులు నా తలంపు లొకటిగా సేవించు భక్తుండనే

మాతా! దిక్కెవరే? పరా! యితరులా? మాపై యుదాసీనమా?

త్రేతాగ్నిద్యుతి స్వాభిమాన నిలయా! దేదీప్యమానోజ్వలా!

శ్రోతవ్యం మమ విన్నపం భగవతీ! శ్రుణ్వంతు కామేశ్వరీ.

శా.

రోతల్ పుట్టునె నాదు సోది విన? లేరో యీతిబాధా వ్యధల్

నీతో జెప్పుకు నేడ్చువారు యితరుల్ నిన్నే యుపాసించుచున్

గీతన్ దాటని నిష్ఠతో నియతితో కీర్తించు నీ భక్తుడన్

శ్రోతవ్యం మమ విన్నపం భగవతీ! శ్రుణ్వంతు కామేశ్వరీ.

శ.

ఊతమ్మీవె సుమీ సనాతనీ! యిడుము లందున్నాము కాత్యాయనీ

మా తప్పుల్ తెలిసొచ్చె కాదనక మమ్మన్నించవే నీకు యా

రాత్యాకాంక్ష యదేల వేగ  గనవే రావే దయాసాగరీ

శ్రోతవ్యం మమ విన్నపం భగవతీ! శ్రుణ్వంతు కామేశ్వరీ.

(ఆరాతి= దానం ఇచ్చుటకు వలసిన ధనం ఉన్నా దానం ఇవ్వకుండా ఉండేవాడు)

శా.

జోతల్ నీకు పదేపదే సకల సంజోకమ్ములన్ జేయుచో

శాతానందము వట్టిపోక మునుపే శాతోదరీ! సాకవే

పోతే పోని యనంచు నన్నొదలి నీవుంటన్ సమర్థించకే

శ్రోతవ్యం మమ విన్నపం భగవతీ! శ్రుణ్వంతు కామేశ్వరీ.

(సంజోకము= ప్రయత్నము, శాతానందము= వెట్టిచాకిరి వలన ఆనందము)




Friday, January 14, 2022

ప్రాంజలి

     ప్రాంజలి

శా.

ప్రాంచద్వాణి విలాసమో సహజ సంప్రాప్తమ్మొ గంభీరమై

చంచత్శూన్య మహా వేగమున శింజన్మ్రోగు టంకారమై

యంచిత్సాదర భావ ముప్పతిలు సంయత్నంపు వాగ్ధాటితో

వాంచాపూర్తిగ నిర్ఝరీ చలనమౌ వాక్ఝ ర్యమోఘంబుగా.


Thursday, January 13, 2022

ఒంటరి జంట

        ఒంటరి జంట

ఉ.

రెక్కల కష్టమున్ పొదివి రేఁబవ లొక్క విధంబుగా మహా

చక్కగ సాకి పెంచిన సుసంతు తలో దెస పొట్టకూటికై

యెక్కుడు దూర మేగ మన మెక్కడ వారి విహంగమై వడిన్

నిక్కము సాగలేక యిటనే మనయూరి శివారు నుంటిమే.

ఉ.

పండుగ పబ్బముల్ మృదుల భావ రసోచిత నేత్రపర్వముల్

నిండుగ పిల్లపాపలతొ నెల్లరు గొప్పగ సద్దు జేయుచో

మెండుగ నుండు రమ్మనుచు మేలు దలంచిన రాకపోయినన్

దండుగ పెద్ద పండుగ సుతారము నొంటరి జంట మెచ్చునే.

ఉ.

రిక్కల రేనికైన గ్రహరేనికి నైన కుటుంబ మంతయున్

ఒక్కెడ గూడినప్పుడె గృహోచిత పర్వము నయ్యెడున్ వినా

యెక్కడి వారలక్కడనె నెవ్విధి సంతస మందనోపు?నో

తక్కుడు నా విధీ! నినన తప్పని నా మన సూరడిల్లునే?


Saturday, January 8, 2022

సంక్రాంతి

       సంక్రాంతి

పట్నం పయనమౌతోంది

పల్లెబాట పట్టబోతోంది

కూలీనాలి కోసం పొట్టకూటి కోసం

కానగళ్ళ బ్రతుకు లాట కోసం

వెంపర్లాడి వలస పోయిన

మా జనం మహా ప్రభంజనం

పల్లెబాట పట్టి పండుగ చేసుకోబోతోంది.

సంక్రాంతి శోభ ఆరంభమైంది

అల్లుళ్ళంతా అత్తారింటికి

మంచు కురిసే వేళ మడిగట్లపై నడక

బిత్తరి చూపల కోడెగిత్తల లాగుడు పందాలు

ఊరవతల కోడిపందాల కోలాహలాలు

కోసల కోసం దేవులాటలు

ఇంట్లో బామ్మరదులతో పేకాటలు

పొద్దుగుంకే వేళ ఏవేవో తీర్థాలు 

అరిసెలు జంతికలు నానారకాలు

అడుగడుగునా ఆరగింపులు

అదో ఆనందాల హరివిల్లు

అందుకోవాలనీ ఆనందించాలనీ

అందుకే పట్నం పయనమౌతోంది.