Wednesday, February 26, 2020


చతుర్విధ కందం.

ఏలా *విరులను గోయుట
మేలా *దరహాసమేల మెరికలు ధరణిన్
*మీలో కరుణకు స్థానము
యేలా కొరవడి తునుముట యిటులను గురుడా.

విరులను గోయుట మేలా
దరహాసమేల మెరికలు ధరణిన్ మీలో
కరుణకు స్థానము యేలా
కొరవడి తునుముట యిటులను గురుడా యేలా.

మీలో కరుణకు స్థానము
యేలా కొరవడి దునుముట యిటులను గురుడా
యేలా విరులను గోయుట
మేలా దరహాసమేల మెరికలు ధరణిన్.

దరహాసమేల మెరికలు
ధరణిన్ మీలో కరుణకు స్థానము యేలా
కొరవడి దునుముట యిటులను
గురుడా విరులను గోయుట మేలా.



Monday, February 24, 2020

చతుర్విధ కందం.

నరుడా ఘనుడవు వనరుహ
వరుసన్ *వినుమా విరోధి వగుటయు గనుమా
*విరులన్ హితులుగ గనుమా
సరదా *మును మానుకోవ సంగడి వనగా.

వినుమా విరోధి వగుటయు
గనుమా విరులన్ హితులుగ గనుమా సరదా
మును మానుకోవ సంగడి
వనగా నరుడా ఘనుడవు వనరుహ వరుసన్

మును మానుకోవ సంగడి
వనగా నరుడా ఘనుడవు వనరుహ వరుసన్
వినుమా విరోధి వగుటయు
గనుమా విరులన్ హితులుగ గనుమా సరదా.

విరులన్ హితులుగ గనుమా
సరదా మును మానుకోవ సంగడి వనగా
నరుడా ఘనుడవు వనరుహ
వరుసన్ వినుమా విరోధి వగుటయు గనుమా.

మాతృ భాష
తే.గీ.
పలువరుస గనిపించగా పకపకమని
నవ్వవే యొకసారి యో నాగరీక
నవ్య లాస్య! వేరేల నీ నగవు చాలు
నా శరద్జ్యోత్స్న! కవితా సునయన! లలన.

కాల మెరుగక గడిపితి కడలి కడను
అలల మాటున సందేశ మందుకోను
యిసుక తిన్నెల వెన్నెల  లీని నపుడు
నా శరద్జ్యోత్స్న! కవితా సునయన! కొఱకు.

చిరు నగవు జాలు యెదలోన సిరులు విరియు
పలుకరింతయె నాకొక బహుమతౌను
పద్యమై హృద్య మై పల్కు బరువు లెత్తు
నా శరద్జ్యోత్స్న! కవితా సునయన! గనిన.

మోయ లేనోయి నేనింక మోసపోయి
యీ వ్యధాభరిత హృదయ మింతకన్న
కృష్ణ పక్షపు రేలు నికృష్ట మందు
నా శరద్జ్యోత్స్న! కవితా సునయన! రాక.

నిండు పున్నమి వెన్నెల నేల నేల
బఱచి నాకంటి కలలుగా పదిల బఱచి
పలుకు సరులతో యలరింప పాటుపడుదు
నా శరద్జ్యోత్స్న! కవితా సునయన! కొఱకు.

పశ్చిమానుయాయిలగుచు భ్రమసి జనత
ఆంగ్ల భాషకు దాసోహ మనుచు  మాతృ
భాషను మరచి వ్యవహరింప ప్రతిన బూని
నా శరద్జ్యోత్స్న కవితా సునయన గనరు.

నీ శరత్సమయమొక విజ్ఞేయ మగుచు
జగతి నుఱ్ఱూత లూగించె చాల నాళ్ళు
పూర్వ వైభవ మొంద యపూర్వమగును
నా శరద్జ్యోత్స్న కవితా సునయన కింక.

జయము మాతృభాషా నీకు జయము జయము
శుభము నీకౌను లేదు నిశుంభమింక
యమ్మ నుడియె యన్నుల మిన్న యాంగ్లమేల
నా శరద్జ్యోత్స్న కవితా సునయన యుండ.


Sunday, February 23, 2020


ఏది నిజం?

విశ్వమంతటికీ వెలుగులు వెదజల్లే సూర్యభ్రమణం భ్రమా? నిజమా?
ఆ ప్రత్యక్ష నారాయణ ఉదయాస్తమానాలు ఊహా? నిజమా?
ఇలాతలంపై  కురిసే వెన్నెలకాంతి నిజమా?  పరావర్తనమా ?
పుడమియే స్థిరమై పరిసరాలే పరిభ్రమిస్తున్నది నిజమా? అదీ ఓ భ్రమా?
సకల చరాచర జగత్తూ పరమాణు ప్రతిపాదితమా? పంచభూతాత్మకమా?
ప్రతి జీవికీ కదిలే కాలంతో ప్రాయః జృంభణమా ఆయుః క్షీణమా?
తను వేరు తనువు వేరని తెలిసీ పరితపించటమా? పరిహసించటమా?
సంబంధ బాంధవ్యాలు అనుబంధాలు కాల్పనికమా? యాదృచ్ఛికమా?
లౌకిక జీవనయానంలో అపజయాలకూ అవరోధాలకూ మరణమే శరణమా?
ఒత్తిడి చిత్తడిలో మెత్తబడి అవనత వదనంతో వేడుకొనే శరణమే మరణమా?
ఋతం సత్యం ధర్మం ఆచరించాలను కోవడమే నేరమా?
ఆచరిస్తే దూషించడమే న్యాయమా?
అవలోకించడమే నిజమా? అధిక్షేపపించడమే నిజమా?

Saturday, February 22, 2020

అక్షరాలు

తరగని తలపుల భావం తెలుపను ఓ భాష
తలపులు వెలుపల వెలువడ నొక జిగీష
మనసున్న ప్రతి జీవికీ ఉంటుంది ఆ ఏష
అందుకే రకరకాలుగా ప్రాంతానికో యాస
పశుపక్ష్యాదులకూ ఉంటుంది ఏదో భాష
ఆ భావాలకు శాశ్వత రూపం కల్పించేవే
అక్షరాలు నానా శబ్ద వదనజములు
 ఉచ్ఛారణా స్పష్టతే ప్రధానమైనది తెలుగు
ఏబదారు అక్షరాలున్నా ఇంకా కావాలి కొన్ని
ఇంత విస్తృత విస్పష్ట ఉచ్ఛారణ అనితర సాధ్యం
పశ్చిమానుకరణ మోజులో కొన్నింటిని మరిచేరు
ఉదాసీనతా భావంతో మరికొన్నింటిని విడిచేరు
శంకరు ఢమరుకధ్వానా జనితం ఈ అక్షరాలు
మరి మీరెవరు వాటిని పరిహసించడానికి
ఇంకా మీరెవరు వాటిని తొలగించడానికి?









Tuesday, February 18, 2020

నేను

                నేను
ఉ.
నేననుచున్ తనూ ద్యుతులె నిత్యమటంచు తలంచి నీల్గినన్
మేనది నేను కాదనుచు మేనును నేనును వేరువేరనన్
మేనును కాదనంగలమె మేలము లాడగ నొవ్వదే మదిన్
'నేను'ను కాంచ గల్గుదమె నేరుపు మీరగ మేనిలోపలన్.
ఉ.
చూపుల కందనట్టి తను జూడగ సాధకు లెందరెందరో
మాపులు రేపులున్ శ్రమల మాటున జిక్కిరి 'నేను' కోసమై
నీ పని కాదు పొమ్మనుచు నిందలు మోపిరి కొందరందులో
'నే'నొక భావనంచు మన నీయరు దుర్మద మిత్ర వర్గమున్.
ఉ.
నేనొక యూహగా దలుప నేనను భావమదెట్టులో మదిన్
తానొడ గూరుచుండ నట తాలిమితో నడిపించుచున్న దేమిటో?
మేను యుపాధి 'నేను'కు సమీపసుబంధ విచిత్ర మెంతయున్
కానని 'నేను' కోసమని కన్నులు కాయలుగాయు మేనికిన్.

Monday, February 17, 2020

వందల వందనాలు

మూడో యేటనే కృష్ణ శతకం
ఐదోయేట బాల రామాయణం
ఆపై అమరం  శబ్దమంజరి
పదేళ్ళప్పుడు గజేంద్రమోక్షం
పన్నేండేళ్ళకు ఆంధ్రప్రభ వారి
ఆంధ్ర సాహిత్య కళా విజ్ఞాన వేదిక
చదివించి చర్చించీ చవులూరించిన
మా పితరులే నా ఆక్షర విన్యాసానికి
ప్రచోదకులూ స్ఫూర్తి ప్రదాతలూ.
ఊహ తెలియని రోజుల్లో
ప్రతి రాత్రి అమ్మపాడే జోలపాట
వద్దురా పోవద్దురా రద్దులూ మనకొద్దురా
నా చెవులలో ఇంకా రింగుమంటోంది
భారతంలో అర్జనుడు రామాయణంలో సీత
నాకు దిశా నిర్దేశంగా చేసిన అమ్మ
అపశబ్దాలు ఉచ్ఛారణా దోషాలలో
నాతో పోటీ పడుతూ గెలుస్తూ ఓడుతూ
మాటల మూటలు పంచిన నాయనమ్మ
తెలుగులో నన్ను తీర్చిదిద్దిన మహనీయ త్రయం
పదిహేనేళ్ళకు కావ్యాలు చదివించి
ఔచిత్యాలు వివరించి కలం పట్టేలాగ
చేసిన ఘనత మా నాన్నగారిది.
కొంపెల్ల వేంకట శాస్త్రి గారు వ్యాకరణం
ఛందస్సు నేర్పిన గురుపుంగవులు
అందరికీ వందల వందనాలు.


Sunday, February 16, 2020

నా దేశంలో ప్రతిభ కన్నా కులమే ముఖ్యం
నా దేశంలో భాష కన్నా యాసే ముఖ్యం
నా దేశంలో నేరస్థులే పోటీలో ఉన్నా ఓటుకు నోటే ముఖ్యం
నా దేశంలో సమతుల్యత కన్నా
ప్రాంతీయతే ముఖ్యం
నా దేశంలో ఉరిశిక్షలకన్నా
మానవత్వమో అలసత్వమో ముఖ్యం
నా దేశంలో అన్యాయాలూ అత్యాచారాలూ కన్నా
వారికోసం కక్కుర్తి తో వాదించడమే ముఖ్యం
డబ్బుకోసం పదవి కోసం దిగజారడమే ముఖ్యం
ఇది నా దేశం. దీని ఔన్నత్యాన్ని
నిలబెట్టడం కన్నా
రాజకీయ దురహంకారమే ముఖ్యం.
ఇది నా దేశం. ఇదీ నాదేశం.

Saturday, February 15, 2020


మా కులం వ్యాకులం
మా మతం అసమ్మతం
మా తరం శ్రమించే నిరంతరం
మా వనం నిస్వన  కవనం
మా జనం అవనీతికి పట్టు నీరాజనం
మా జనం ఆదమరిస్తే ప్రభంజనం
మా లోకం వెఱ్ఱి మాలోకం

Monday, February 3, 2020


సీ.
ఇతడటే చెరసాల మొగసాల మోసాల
          చరితతో దయితతో చతికిల బడె
ఇతడటే వెకిలి నవ్వుల తోడ మకిలి చే
          తలతోడ యూరూరు తరలె నపుడు
ఇతడటే మాట తప్పని వాడు మడమ తి
          ప్పని వాడు పలుమార్లు భంగ పడెను
ఇతడటే నుదుట ముద్దుల వాడు వెనుక ర
           ద్దుల వాడు యెద్దు మొద్దులకు రేడు
తే.గీ.
తాయిలాల్ వెదజల్లుతూ తంతు గట్టు
అప్పు జేయుచు పప్పు కూడనుచు వెట్టు
చిప్ప చేతికి దయజేసి చేత లుడిగి
చంక నాక వెట్టును యాంధ్ర జాతి నంత.
సీ.
ఇతడటే మూడు ముక్కల యాట ముచ్చట్ల
             మూడూళ్ళ తిరుగుళ్ళు ముద్దు యనెను
ఇతడటే  పెద్దన్న లన్నన్న! వద్దన్న
             వంధి మాగతులంత వంత పాడె
ఇతడటే ' నీ బాంచ కాల్మొక్త' యని మోషాల
             కాళ్ళ బడుచు మన కశ్ళ బడెను
ఇతడటే కులగజ్జి మతపిచ్చి తలకెక్కి
             కక్షలన్ ద్వేషాల కరడు గట్టె
తే.గీ.
జన హితము మాని కొరగాని చేత లెల్ల
చేయు జగమొండి యనకొండ చేటు జేయ
ఎన్నుకున్నట్టి జనమంత యేడ్చు చుండ
మాన్యు డై మనలేడు తా మార లేడు.



              

Sunday, February 2, 2020


శా.
ఏ లీలన్ దయజూతువో జనని నీవే తప్ప దిక్కేరి నా
కేలా యీ యిడుముల్ సదా జనని నన్నేలా యుదాసీనతన్

  • చాలా కాలముగా కనున్  గొనవు చంచల్లతవే యో శివే

కాలాతీతము జేయకన్ వినతి నాకర్ణింపుమీ శాంకరీ.
శా.
బాలా రూప పిపాసినై బడిని కూర్పన్ నాదు దౌర్భాగ్యమా
మేలంబయ్యెను నా శ్రమల్ హత విథీ! మేల్మాటటుంచన్ శివే
యేలా యప్పుల యూబిలో కొలిమిలో  యెన్నాళ్ళు నేనుందున
మ్మా లేదా నను గాచు దారొకటి  అమ్మా! దుర్గ! నన్నాదుకో.

Saturday, February 1, 2020

   చావో రేవో తేలాలి
నివురు గప్పిన నిప్పులా నా మనసు కుతకుతలాడుతోంది
మబ్బు మాటున మార్తాండ మూర్తిలా పెనుగులాడుతోంది
సంక్షోభాల పరిష్వంగాల ఉక్కిరిబిక్కిరితో నిట్టూర్పు విడుస్తోంది
మానావమానల మూల్గులు నీల్గులు మౌనంగా భరిస్తోంది
ఏదో ఒకరోజున నా సహనం అదుపు తప్పి ఎదిరిస్తే బెదిరిస్తే
ఏదో ఓ సుముహూర్తాన పాలకులను ప్రశ్నిస్తే నిలదీస్తే
అరాచకాలూ పరాచికాలూ చాలించమని ఎలుగెత్తితే పలుగెత్తితే
జనం ప్రభంజనంగా మారి నయవంచకులను ముట్టడి చేస్తే కట్టడి చేస్తే
పాలకులకూ పాలితులకూ నడుమ అయోధ్యలా అగ్నిగుండంలా
ఓ పిచ్చివాని చేతిలో రాయికి కసాయి వాని కత్తికి బలి కావాలా
అజరామరమైన అమరావతిని ఆంధ్రుల కలల కాణాచిని
బలి పశువును కావాలా ఉరికంబం ఎక్కాలా కుక్క చావు చావాలా
నీ మూన్నాళ్ళ ముచ్చటకు ఇరుసు విరిగిన మృచ్ఛకటికం కావాలా
నా కన్నీళ్ళ ధారల ఉసురు తగిలి నువు పోవాలి చావో రేవో తేలాలి.