Thursday, December 16, 2021

నైరాశ్యం

     నైరాశ్యం

నైరాశ్యం నీకెందుకు

వైరాగ్యం ఊసెందుకు

అలుపెరగక శ్రమియించక

అనుకున్నది సాధించక

కంటిమీద కునుకే రాక

ఒంటిమీద తనుపే లేక

 ఓరిమితో నోరు మెదపలేక

 పదుగురితో కలిసి నడవలేక

ఇంకెన్నాళ్ళు ఇంకా ఎన్నేళ్ళుఆగాలి

 అల్లాటప్పాలతో వేగాలి?

అంతులేని ఆవేశం తరుముకొస్తున్నా

అణగారని ఆవేదన పెల్లుబుకుతున్నా

పుడమితల్లి నేర్పిన సహనంతో

బ్రతుకు వెలారుస్తున్నా

కలలుగన్న నవోదయం

ఆశయాల ఉషోదయం

చివురించక పోయేనా?

లక్ష్యాన్ని సాధించలేనా

ఆనందంగా ఆఖరిశ్వాసను

సంతృప్తిగా విడువలేనా?

సంబరపడుతూ విశ్రమించలేనా?

Saturday, December 11, 2021

 శా.

ప్రాప్యం బెయ్యది ప్రాప్తమెయ్యది విధిన్ బ్రహ్మేవిధిన్ వ్రాసెనో

జాప్యం బౌటయు జాలమౌటయును కెంజాయా ననంబౌటయున్

ఆప్యం బందక యాపసోపజనితా యావేశముల్ పోవునే

స్థాప్యం బియ్యది కార్యదీక్ష యనుచున్ సాధించ యత్నించుమీ. 

Wednesday, December 8, 2021

హేమంత సుందరి

 హేమంత సుందరి.


ఏమంత సోయగం నీది

హేమంత సుందరీ! అల్లది?

నీ శీత సమీరాలేవి?

సిత స్మిత నీహారిక లేవి?

ఉహుహూ అని వణికే జనులేరి?

అంతా గతవైభవ ప్రశంసలేనా?

 కవి పుంగవ అతిశయోక్తులేనా?

చేమంతుల పూబంతుల పలుకరింతలు

శ్రీ మంతుల గృహయింతుల పులకరింతలు

పల్లెపధంలో అడుగడుగునా చలిమంటలు

ఎటు పోయాయి అవియన్నీ?

గాలిమరల నాడిస్తూ నిద్రించాలా?

నెలగంట పెట్టాకైనా చలిగాలులు వీచేనా?

వరుస తుఫానులు ఎత్తుకు పోయాయా?

చల్లగాలి పిల్లగాలి విహారాలు పోయాయా?

ఏమో! ఏమైందో? ఎవరికెరుక?

హేమంత సుందరీ! ఏమంత నీకుందని?

తెంపరితనం తుంటరితనం నీకెందుకని?






Monday, December 6, 2021

కృంగిపోకు

 

కృంగిపోకు ఓడిపోయినందుకు

లొంగిపోకు దెబ్బ తగిలినందుకు

తప్పులు సరిదిద్దుకుంటూ

ముప్పును పసిగట్టుకుంటూ

గురి తప్పకుండా శ్రమపడితే

నవనవోన్మేష నవోదయమే

నీ ముంగిట మెరిసేనే.

కాలం ఖర్మం కలిసొచ్చే వరకూ

మౌనంగా సహించడమే కర్తవ్యం

ఎంతటి మహనీయునికైనా

విధి అవశ్య ప్రాప్యమే

కర్మక్షయ మౌతోందని అనుకోవడమే.

వృద్ధి క్షయాలు ఉత్థాన పతనాలు

చక్రంలా పరిభ్రమించేవే

అంతా ఆ ఈశ్వరేచ్ఛగా గ్రహించడమే

'నాహం కర్తా హరిః కర్తా' అనుకోవడమే

అదే జీవన గమనానికి ఆలంబన

పరమపద సోపానానికి చేరువున.