Sunday, October 27, 2019

            శరత్సమయ మింతేనా?
ఈ సిత శీత శరత్సమయ మింతేనా
ఉహుహూ యని వణుకుట కలయేనా
శీత సమీరార్థమై వడకుల గుట్టకు పోవలెనా
శీతల యంత్రమెదుట చతికిల పడవలెనా
కాల విలంబనతో చలిపులి కథ ముగిసేనా
కడలికి బడలిక కలిగే వరకూ వర్షాలేనా
మాంథ్యం మాటున శరద్యోష మనగలిగేనా
ఏమో ఏమౌనో ఎటులౌనో ఏరికైన ఎఱుకౌనా
మేఘాచ్ఛాదితమై తటిల్లతలతో నభోవీధి
నగారాల సరాగాల రణ నిన్నాదాలాగేనా
పగలంతా చండ ప్రచండం భానుని ప్రతాపం
నడి రేయికి  ధరణికి తుషార హారం బహుమానం
ఈ ధరణీ లలామకు సూర్యేందులతో కాపురం
ప్రాణి కోటికి మాత్రం ఇది బహు సంకటం.

Saturday, October 26, 2019


ఉ.
దివ్వెల పంక్తులన్ నిలిపి దివ్య మనోహర శోభనమ్ముగా
నవ్వదె హాయిగా జగతి నల్దెసలన్ గల సంతసమ్ముతో
దివ్వె వెలుంగులో మెరియదే ధరణీ హరిణీ లలామ యే
మివ్వగ తీరునో ఋణము యిచ్చెద నాలుగు దీప కాంతులన్.
ఉ.
మా వరకున్ 

Wednesday, October 23, 2019

(గత శేషం)
ఈ రోజు త్రివిధ భక్తి గురించి తెలుసుకుందాం.
1. బాహ్య భక్తి:  ఎవరైన తనకు నచ్చిన భగవద్రూపాన్ని ఎంచుకుని చక్కని ప్రదేశంలో ఆ మూర్తిని శక్త్యానుసారం అర్చించుకోవడం అన్నమాట. మన ఇళ్ళల్లో పూజ గదులు మన దేవాలయాలు ఈ బాహ్య భక్తి కేంద్రాలుగా భావించాలి. ఈ బాహ్య భక్తి లౌకిక సాంసారిక సామాజిక యిబ్బందులను అధిగమించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. భక్తి మార్గంలో ఇది తొలి మెట్టు.
ఇందులో ఉదయాస్తమాన పూజలు కైంకర్యాలు సుప్రభాతాలు ఏకాంత సేవలు వగైరా లన్నీ రకరకాలుగా భక్తునికి తదాత్మ్యతను తీసుకుని రావడానికి ఇష్ట కామ్య సిద్ధికి ఉపయుక్తంగా ఉంటాయి.
2. అనన్య భక్తి:
భగవద్గీత 9/22 వ శ్లోకం ఈ విషయాన్ని బాగా వివరిస్తుంది. అది
అనన్యాశ్చింతయంతో మాం
యే జనాః పర్యుపాసతే
తేషాభి యుక్తానాం
యోగ క్షేమం వహామ్యహం.
స్థూల దృష్టి తో కాకుండా సూక్ష్మ దృష్టి తో అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది.
ఎవరైతే త్రికరణ  శుద్ధి గా తనను నమ్మతారో వారి యోగక్షేమాలను నేను చూసుకుంటా అనే అభయం అది. అది ఒక భరోసా. అది ఒక భీమా పోలసీ.
దీనికి కొందరు కృష్ణుణ్ణి మాత్రమే నమ్ముకుంటేనే ఈ పోలసీ వర్తిస్తుంది. లేని వారికి కాదు అని అంటూంటారు. నిజానికి అది అసంబద్ధం. ఎలాగనంటే
'ఏకం సత్ విప్రా బహుదా వదంతి' అని శృతి ప్రమాణం.
భక్తుడు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలోనే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అందుకే పోతన గారు
నమ్మితి నా మనమ్మున సనాతనులైన యుమా మహేశులన్.... అని
నిన్ నమ్మిన వారి కెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. అని
...పురాణింపన్ దొరన్ కొంటి మేల్
పట్టున్ మానకుమమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ.
అని చెబుతూ గీతాచార్యుల భరోసానూ గుర్తు చేస్తారు.
...నీవే తప్ప యితః పరం బెరుగ మన్నింపన్ దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మకా.
అంచేత అనన్యాశ్చింతయంతో మాం అన్నదానికి త్రిశుద్ధిగా నమ్మడం అనే చెప్పుకోవాలి. అది ఒక శరణాగతి. శరణని వేడుకున్న ఏప్రాణినీ శత్రువైనా సరే హింసించ రాదు అనేది స్థావర జంగమాలన్నిటికీ వర్తిస్తుంది.
రెండు కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి అనుకుందాం. అందులో ఒక కుక్క తోకను కిందకు చాపి తలవంచి నిలబడితే సింహంలా పోరాడే రెండో శునకం అరుస్తూ ఆగిపోతుందే కాని హాని చేయదు. అది సృష్టి ధర్మం.
బాహ్యపూజలోని ఉపచారలన్నింటిలోను ప్రదక్షిణ చాలా విలువైనది. అదే శరణాగతి.
' అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో మహేశ్వరః/జనార్థనః.' అని మంత్రం.
మనం ఎవరికైనా గౌరవంగా ఏదైనా యిస్తే దాన్ని దక్షిణ అంటాం. అది కూడా చాలా గొప్పది కనుక ప్రదక్షిణ అయింది. ఆ ప్రదక్షిణలో మనం శరణాగతి వేడుకుంటాం.
శరణన్న వానిని కాపాడడం సృష్టి ధర్మం.
ఆ శరణాగతిలో ప్రస్ఫుటించేదే అనన్య భక్తి.
ఏకాంత భక్తి:
భక్తి యొక్క ఉన్మత్త స్థితి అని చెప్పు కోవచ్చు. సర్వకాల సర్వావస్థలలోనూ మనస్సు భగవంతుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో ఎవరితోటీ కలియాలనిగాని మాటాడాలనిగానీ అనిపించదు. దీనికి ఉదాహరణగా ప్రహ్లాదుడు జడభరతుడు లను చెప్పుకోవచ్చు.
నమ్రత, నిష్కపటత్వం, అహింస, క్షమ , సరళత , గురుసేవ , శౌచరాహిత్యం , స్థిర చిత్తం , ఆత్మ నిగ్రహం ,నిరహంకారం , నిరపేక్ష మరియు రాగ బంధాలకు అతీతంగా ఉండడం అనే లక్షణాలు క్రమేపీ అలవడి మనస్సు లక్ష్యం పైన మాత్రమే నిలపడం జరుగుతుంది. అవధూత లక్షణాలు ఇలాగే ఉంటాయి. బాహ్య ప్రపంచ విస్మృతితో సదా భగవత్సన్నధిలో మనసు లయం అవుతుంది. ఎంత మందిలో ఉన్నా ఏకాంతం వీడలేరు. అదే ఏకాంత భక్తిగా భావించాలి.
నవవిధ భక్తి రేపు చూద్దాం.    (సశేషం)

(నిన్నటి తరువాయి)
వాత్సల్యము నుండి అమాంస భక్షణము వరకు చెప్పుకున్నవి అష్టవిధ భక్తి విధానాలు.
మొదటగా ఐశ్వర్య భక్తి మాధుర్య భక్తి పరిశీలిద్దాం.
ఐశ్వర్య భక్తి:
భగవత్స్వరూపమే ఒక ఐశ్వర్యం. అంటే అదే సంపద. భగవద్దర్శనం కోసం పరితపించి ఆ అనుభూతిని పొందడమే మహదైశ్వర్యం. దీనికి ఉదాహరణగా త్యాగరాజు, రామదాసు వంటి వారిని పరికించ వచ్చు. వారు ఆ శ్రీ రామచంద్రుణ్ణి ధన కనక వస్తు వాహన ప్రాప్తి కోరుకో లేదు. అలాగే అర్జనుడు విశ్వరూప దర్శనం చేయడం. ఇందులో భగవంతుని నుంచి భిన్నంగా ఉంటూ ఆ పరమాత్మ పై గౌరవం కొంత భయము కలిగి ఉండటం కద్దు.
ఆ భగవంతుని నగుమోము గనలేని నాజాలి తెలిసి నను బ్రోవవేల అని ఆర్తితో వెంపర్లాడినది కేవలం ఆ దర్శనం కోసమే.
అలాగే విశ్వరూప దర్శనం జరిగాక యథాతద పూర్వ రూపమే కోరకుంటాడు కిరీటి. కారణం భగవంతునిపై ఉన్న గౌరవమూ భయమూ కూడా. రాజు పై ప్రజలకున్న భక్తి కూడా యీ కోవలోకే వస్తుంది.
మాధుర్య భక్తి:
భగవంతునితో ఒక అనుబంధం ఒక ఆత్మీయతా భావం ఏర్పరుచు కోవడం మాధుర్య భక్తి. వ్యక్తిగత జీవితంలో భగవంతునితో పెనవేసుకు పోవడం జరుగుతుంది. ఇందుకు ఉదాహరణగా యుద్ధానంతరం హనుమ కనబరచిన భక్తి.
యశోద కృష్ణుల అనుబంధం. కలయో వైష్ణవ మాయయో అని తలచేనాటికే యశోదకు ఈ చిన్ని కృష్ణుడు విష్ణ్వంశ సంభూతుడన్న ఎరుక ఉంది. అందుచేతనే ఒకప్రక్క కమారుడుగా తనని సాకినా మరో ప్రక్క భగవంతుడనే భావమూ యశోద మనస్సులో ఉండేది.
కృష్ణునితో  మీరాభాయి , రాధ ల అనుబంధం అలాంటిదే. ఇంక గోపికల రాసక్రీడలూ , అనసూయ త్రిమూర్తుల అనుబంధాలన్నీ ఒక మధురమైన వయక్తిక బంధాలే. ఇది అన్నిటికన్న ఉత్కృష్టమైన భక్తి అని చెప్పవచ్చు.
ఈ మధుర భక్తిలో దాస్యము, సఖ్యత, వాత్సల్యమూ అంతర్భాగలే.
రేపు త్రివిధ భక్తి పరిశీలించుదాం.   (సశేషం)

Monday, October 21, 2019


హృదయం కలుషం వచనం పరుషం
జీవన యానం పరపీడన పరాయణం
దురహంకారం దుర్మద దురిత విశేషం
నైకత్ శ్రేయం దుర్జన విత్తం చిత్తంచ త్యజతి.1

దురహంకారే దురిత విహారే సమరే
కథమపి నజయతి కథమపి న వసతి
కిమపి న లభతి కాయస్సుఖమపి
విరసి కురుతే తజ్జన మనో వికాసం.2

స్వార్థం రోషం పరాన్న భుజానందం
విషమయ చిత్తం వినిమయ మాత్సర్యం
నహి నహి రక్షతి ప్రాణే సర్వే లోకాన్.3

Friday, October 18, 2019


సీ.
 మధ్య వృత్తము వెన్క మరుగున జల తత్వ
      మున నున్న దశ దళముల కమలము
మణిపూరకమది సుమా సువర్లోకము
      గురువు నర్చించి త్రికోణ బిందు
శక్తి దలచి మనసార మేఘేశ్వర
      సౌదామినీ ధ్యేయ ల్స్మరణ జేసి
మణిపూర మందు శ్యామాంబుదపు సదా శి
      వ యుత తటిల్లతా వపుష గొలిచి
తే.గీ.
వేద వాక్కు 'యో2పాం పుష్ప' వివర మరసి
యిచట సాదాఖ్య కళలో విలీన మంద
నాకెరుక నీవె తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 30.

Tuesday, October 15, 2019


సీ.
సంద్రమా! నీవు, సుసంకల్ప మణగిపో
          నీవు యేమారి పోనీవు నన్ను
అచలమా! నీవు, యచంచల మనమిమ్ము
          నిరపేక్షతో జేయ నిమ్ము పనుల
క్షితిజమా! నీవు, సుస్థిర పర శ్రేయమే
          సాయుజ్య మననిమ్ము సాగ నిమ్ము
పవనమా! నీవు, స్వ పరభేదమే లేని
          సమవర్తనము నొందు సరళి నిమ్ము
తే.గీ.
ప్రకృతి యే నాకు నిజమైన ప్రధమ గురువు
అసలు ఆర్యా మహాదేవి యమ్మ నాకు
అవుననుచు పల్కవమ్మ యానంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 25
సీ.
కవన తంత్రము తోడుగా సవన తంత్రము
             సాధనా పటిమతో సాగనిమ్ము
కాద్యాది విద్యలున్ కడు పద్య సేద్యముల్
             పలుకు బంగరు తోట పండనిమ్ము
అష్టాంగ యోగమో హఠయోగ మార్గమో
             కడదేరి పోవగా కలుగ నిమ్ము
ఉచ్చ్వాశ నిశ్వాస ముభయమున్ షోడశీ
             మంత్రాన లీనమౌ మననమిమ్ము
తే.గీ.
పర సుఖానంద నాథుడై పరగ నిమ్ము
నీ యుపాసనా పథములో నిలువ నిమ్ము
నా మనవి వినవమ్మ ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 26
సీ.
మేలా? మనసులోన మేను నాదను భావ
        చంద్రికలతొ చిత్త చంచలము లేల
షడ్రసో పేత మృష్టాన్న పక్వముల కై
         పరుగేల జిహ్వ చాపల్య మేల
ఉభయ సంధ్యలయందు యుపచార పూజలన్
         పరమాత్మ సన్నిధిన్ పంతమేల
ఈ మేనొక యుపాధియే యాత్మ కని దాని
          సాధించు కోవేల శాస్వతముగ
తే.గీ.
ఒకపరి పరసుఖానంద మొద్ది కగును
తివిరి సాయుజ్యమె మది సాధించ మనును
నాకు తెరువేది తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.27
సీ.
అవనీ స్వభావ మూలాధార స్వర్ణ చ
           తుర్దళ కమలమందు గణపతిని
అర్చించి, ముద్గౌదనాశక్త చిత్తయౌ
          సాకినీ దేవతా శరణు బొంది
మేరు దండమునందు మేలి నాడుల గూడి
            త్రైలోక  మోహమ్ము తీయ నిమ్ము
వశషసాక్షరములు భద్రమై వెలుగొందు
             జ్ఞాన సిద్ధికినిది జన్మ స్థలము
తే.గీ.
పంచ వక్త్ర త్రినయన సాఫల్య మీయ
పృథ్వి తత్వము వీడు పృక్త మంద
నాకు తెరువిమ్ము తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.28
(పృక్తము =భాగ్యము)
సీ.
జననేంద్రియాగ్రాన షడ్దళ కమలము
     న బభమ యరలలు నారు జూచి
పరమేష్టి ప్రాపు తో వహ్ని తత్వము వీడి
     మేథో నిష్ట గలిగి మేలు కలిగి
పీత వర్ణాతి గర్విత దధ్యన్నాసక్త
      హృదయ నా ఢాకినీ రూపిణినట
వందినీ సంసేవ్య వరదను గొలువగన్
      స్వస్థాన మిదియని స్వగత మెరిగి
తే.గీ.
కామ గిరి పీఠమున విచ్చి కామితార్థ
బుద్ధి నధిగమించు కుశల బుద్ధి నొసగి
నాకు తెరువిమ్ము తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.29.

Sunday, October 13, 2019


నిరోష్ఠ్యం:
కం.
ఓ లలితాంగి! తలోదరి!
ఏలా కాంచన సరసిజ కేలాగైనన్
చాలా సిరి గలిగె, కాదే
నిన్, లచ్చి కిచ్చగ తానె నిలచెనెట్లో.


పుష్ప వికాసం కోసం మరో బాలెంత
కం.
చంపకమను నేను కుసుమ
సంపద విరి గానొ తేటి జాతి కనలు టే[ల]
సొంపొసగెడు  కాంచన రుచి
రంపు సముదయంబు కూడ రాదె యలతికా[మె].
ఈమెకు కవల పిల్లలు. అవి
తే.గీ.
చంపకమను నేను కుసుమ సంపద విరి
గానొ తేటి జాతి కనలు టేల సొంపొ
సగెడు కాంచన రుచిరంపు సముదయంబు
కూడ రాదె యలతి కామె (కోమలాంగి.).
ఆ.వె.
చంపక మను నేను కుసుమ సంపద విరి
గానొ తేటి జాతి కనలు టేల
సొంపొసగెడు కాంచన రుచిరంపు సముద
యంబు కూడ రాదె యలతి కామె.
( సంపంగి పూవు పై తుమ్మెద వాలదు. అందుకే ఆ చంపకం వ్యధాభరిత హృదయంతో హరి చరణాలకడకు చేరాలని ఆరాట పడుతుంది.)

Thursday, October 10, 2019

కం.
మేలా కుత్తుక గోయుట
మేలా రెన్నాళ్ళ జీవ మేలా త్రుంపన్
మేలాలేల లతాంగి! స
మేలా లొల్లరె వివాదమేల యశస్వీ.
(1వమేలా=మేలు+ఆ, 2. కోయుటము + ఏల ,3వ పాదంలో  మేలములు °+ఏల= పరిహాసములేల ,4 వపాదంలో సమేలములు+ఒల్లరె = ఐకమత్యము ఒప్పుకోరా)

కం.
లేమా సయోధ్య కనుగొన
లేమా హరి పద యుగళము లేలెద మనుకో
లేమా మగువల సిగ నే
లేమా సన్మార్గ పథము లెన్నగ లేమా.
కం.
రామా! నినుగన రామా
లేమా! శివ పూజకు విరులే  కాలేమా?
కోమా! యేమను కోమా?
చామా! ప్రశ్నించుచు నిను  శాసించామా?
(రామ, లేమ,కోమ,చామ=స్త్రీ)
మ.
ఇదిగో శ్రీ మతి మాటలాడ గలరో విఖ్యాత పూబాల లా
ర! దగా పడ్డ సుమమ్ములార! మధురారామమ్ము లారా! మదీ
య దిశా దర్శకులార! యో చెలిమి చేయంగోరు సంపంగె లార!దయార్ద్రా హృదయద్యుతీ విభవు లారా సద్వివేకంబుతో.

Tuesday, October 8, 2019



సీ. క్షణక్షణ పరహితాభిలాషా పరి
                 పుష్టితో నుండు మా బుద్ధి యెపుడు
    లోకోప కారార్థ మిదిసేయ నదిసేయ
                 వాన్గ్మనో కాయముల్ వ్యాహృతి సేయు
    మృదు మధుర వచో  విభవమౌ హృది పలుకు
                  లాకర్ణింప సరసు లాతుర పడు
శ్రీ లలితా మహా త్రిపుర సుందరి ధ్యాస
                  యుచ్ఛ్వాస నిశ్వాస ములుగ మిగులు
తే.గీ.
భ్రామరీ విద్య లో పరిభ్రమణ మొంద
మనసు తూగు టుయ్యాలలో మరులు గొనును
శ్రీ విద్యయు మహా విద్యలు శ్రీ గురోప
లబ్దములు మాకు యవియె శ్రీ లనగ బరగు.

Wednesday, October 2, 2019

ముగ్గురు మిత్రుల వ్యధ.
1.
తే.గీ.
అన్న వితరణ మెఱుగని యన్న పూర్ణ
స్వార్థ మెక్కుడు పూనిన స్వాంత చిత్త
జాలి గుండెతో నూసాడు చాల వరకు
నద్వితీయ నా కపురూప నా ద్వితీయ.
2వ వ్యక్తి.
కమ్మ లిచ్చెడి వారల కమ్మ కమ్మ
లేగ ప్రాయంపు మీరు బాలెంత లెంత
ఎనిమి దేండ్లకే పెనిమిటి

సీ.
ఏ రీతి నీ యీతి బాధల వ్యధలన్ని
యెదురీది బ్రతికేది యెవరు దిక్కు
మాయమ్మ ఓ పరధ్యాన యుదాసీన
వినిపించు కోదు వేవేగ మనల
మన యాత్మ తృప్తికై శరణంటు చరణాల
వ్రాలి రోదించినా వరద కనదు
కన్నీటి కడలిలో కష్టాల కాటిలో
కడదేరి పోవుటే కడకు మిగులు
ఎంత స్వార్థమో యింకెంత యీప్సితమ్మొ
యీ కుటుంబ సభ్యులకు నేనేమి జేతు
అభయమీయరు నన్నెవరాదుకోరు
ముగిసి పోవేల నింక ఓ మొండి బ్రతుక!