Tuesday, October 15, 2019


సీ.
సంద్రమా! నీవు, సుసంకల్ప మణగిపో
          నీవు యేమారి పోనీవు నన్ను
అచలమా! నీవు, యచంచల మనమిమ్ము
          నిరపేక్షతో జేయ నిమ్ము పనుల
క్షితిజమా! నీవు, సుస్థిర పర శ్రేయమే
          సాయుజ్య మననిమ్ము సాగ నిమ్ము
పవనమా! నీవు, స్వ పరభేదమే లేని
          సమవర్తనము నొందు సరళి నిమ్ము
తే.గీ.
ప్రకృతి యే నాకు నిజమైన ప్రధమ గురువు
అసలు ఆర్యా మహాదేవి యమ్మ నాకు
అవుననుచు పల్కవమ్మ యానంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 25
సీ.
కవన తంత్రము తోడుగా సవన తంత్రము
             సాధనా పటిమతో సాగనిమ్ము
కాద్యాది విద్యలున్ కడు పద్య సేద్యముల్
             పలుకు బంగరు తోట పండనిమ్ము
అష్టాంగ యోగమో హఠయోగ మార్గమో
             కడదేరి పోవగా కలుగ నిమ్ము
ఉచ్చ్వాశ నిశ్వాస ముభయమున్ షోడశీ
             మంత్రాన లీనమౌ మననమిమ్ము
తే.గీ.
పర సుఖానంద నాథుడై పరగ నిమ్ము
నీ యుపాసనా పథములో నిలువ నిమ్ము
నా మనవి వినవమ్మ ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 26
సీ.
మేలా? మనసులోన మేను నాదను భావ
        చంద్రికలతొ చిత్త చంచలము లేల
షడ్రసో పేత మృష్టాన్న పక్వముల కై
         పరుగేల జిహ్వ చాపల్య మేల
ఉభయ సంధ్యలయందు యుపచార పూజలన్
         పరమాత్మ సన్నిధిన్ పంతమేల
ఈ మేనొక యుపాధియే యాత్మ కని దాని
          సాధించు కోవేల శాస్వతముగ
తే.గీ.
ఒకపరి పరసుఖానంద మొద్ది కగును
తివిరి సాయుజ్యమె మది సాధించ మనును
నాకు తెరువేది తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.27
సీ.
అవనీ స్వభావ మూలాధార స్వర్ణ చ
           తుర్దళ కమలమందు గణపతిని
అర్చించి, ముద్గౌదనాశక్త చిత్తయౌ
          సాకినీ దేవతా శరణు బొంది
మేరు దండమునందు మేలి నాడుల గూడి
            త్రైలోక  మోహమ్ము తీయ నిమ్ము
వశషసాక్షరములు భద్రమై వెలుగొందు
             జ్ఞాన సిద్ధికినిది జన్మ స్థలము
తే.గీ.
పంచ వక్త్ర త్రినయన సాఫల్య మీయ
పృథ్వి తత్వము వీడు పృక్త మంద
నాకు తెరువిమ్ము తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.28
(పృక్తము =భాగ్యము)
సీ.
జననేంద్రియాగ్రాన షడ్దళ కమలము
     న బభమ యరలలు నారు జూచి
పరమేష్టి ప్రాపు తో వహ్ని తత్వము వీడి
     మేథో నిష్ట గలిగి మేలు కలిగి
పీత వర్ణాతి గర్విత దధ్యన్నాసక్త
      హృదయ నా ఢాకినీ రూపిణినట
వందినీ సంసేవ్య వరదను గొలువగన్
      స్వస్థాన మిదియని స్వగత మెరిగి
తే.గీ.
కామ గిరి పీఠమున విచ్చి కామితార్థ
బుద్ధి నధిగమించు కుశల బుద్ధి నొసగి
నాకు తెరువిమ్ము తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.29.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home