Friday, March 30, 2018

తెలుగు పద్యం

అమ్మ భాష

సీ.

   ఆత్రేయ పుర వర పూతరేకుల దొంతి
            పస నెరుంగ తెనుగు పద్యమన్న
   చవులూరు రసమూరు వాయస పుర కాజ
          పరికించి న తెలుగు పద్యమన్న
 ఆందరు కోరేటి ఆ బందరు మిఠాయి
             పరువంపు నగిషీల పద్యమన్న
తిరుమల వేంకటేశ్వర ప్రసా దపు లడ్డు
            ఫక్తు మన తెలుగు పద్యమన్న
తే.గీ. మూడు పంటలు పండెడి కోనసీమ
        పసిడి మడిచెక్క  తెలుగున పద్యమన్న
       తరతరాలుగా గెలుపొందె తొడను గొట్టి
       కదన  రంగమున తెలుగు పద్యమన్న.
       

సీ. పద్యమే ప్రణవ నాదము ఆంధ్ర భాషకు
               పద్యమే తెనుగుకు ప్రాణ నాడి
   పద్యమే నాగరికుల మనో విభవమ్ము
               పద్యమే హృద్యమై పలుక రించు
   పద్యమే కట్టుబాటు  వలదు నగుబాటు
                పద్యమే మనభాష పట్టుగొమ్మ
   పద్యమే నవరత్న ఖచిత కి రీటమ్ము
                పద్యమే యనువంశ యాస్తి మనకు
తే.గీ. పద్యమే ఆంధ్ర భాషా విహర్త యాశ
         పద్యమె తెనుగు నును లేత పరువపు జవ
         పద్యమే ఊపిరి అవధాన వి ధానమందు
         పద్యమే సరస్వతికి నైవేద్య మగును.

Thursday, March 29, 2018

పంచుకో పెంచుకో

అభిమానించే మనసంటూ ఒకటుంటే
అభివందనం మనసా పాదాభి వందనం
అనుసరించే మనసంటూ ఒకటుంటే
అనుస్మరణం అదొక  చిరస్మరణీయం
కళ్ళలోకి సూటిగా చూస్తే తలపు తెలిస్తే
ఆ అనుభూతికి మరో పేరు మమకారం
గుండె లోతుల్లోంచి ఉప్పొంగిన చిరునవ్వు
బండ రాతి గుండెను కరిగించే మొలకనవ్వు
ఆత్మీయతా భావానికి చిరునామా అవును
తల్లి కళ్ళలోకి బిడ్డ ఆర్తిగా ఎలా చూస్తుందో
భగవంతుని కళ్ళలోకి ఆశగా అలా చూస్తుంటే
అదో అనిర్వచనీయ అద్వితీయ వరప్రసాదం
ఆ సమయంలో విరబూసిన అసామాన్య మౌనం
బ్రతుకు వెలార్చడానికి కావలసినంత భరోసా
మనసు నిండా ఏదో మాటలకందని కులాసా
సజ్జనులతో నీ గురువుతో నీ తలిదండ్రులతో
అటువంటి అనుభూతులు పంచుకో పెంచుకో.

Wednesday, March 28, 2018

ప్రతిస్పందించనా పునరాలోచించనా

అవాకులూ చవాకులు పేలితే
మాటల తూటాలు పేల్చితే
కృతఘ్నుల శతఘ్నులు విసిరితే
ప్రతి స్పందించనా పునరాలోచించనా
విశ్వసించి వెన్నుతట్టడం 
చేతకానితనం అనుకొంటే
పంచ భక్ష్యాలు వడ్డించిన విస్తరిలో
అందరికన్నా ముందు నాకే అంటే
అగ్ర తాంబూలం నాదే అంటే
మనో గతం తెలుపనా మౌనంగా ఉండనా
పాలుపోసి పెంచిన బేపి విషం కక్కితే
తప్పులు చేసిన లుచ్ఛా నిప్పులు చెరిగితే
అందితే పిలక అందకుంటె కాళ్ళు అలవాటైతే
ఉదాసీనత చూపనా ఉరికంబం ఎక్కించనా
సవ్యంగా జరిగితే నా మహిమ
అపసవ్యం అయితే నీ ఖర్మ అంటే
పిక్క సత్తువ లేకున్నా పెత్తనం నాదే అంటే
ఎదురు గాలికి తలవొగ్గనా 
ఏటికి ఎదురీదనా
నిస్సందేహంగా నిష్కర్షగా
ప్రతిస్పందించనా పునరాలోచించనా?

Thursday, March 22, 2018

   కిం కరోమి

అయాచితంగా ఆపన్న హస్తం అందిస్తే
నిరపేక్షణీయంగా ఎదురేగి ఆదరిస్తే
అదొక అలుసుగా భావించడం పరిపాటి
కడుపు నిండిన వానికి పంచభక్ష్య పరమాన్నాలేల
ఆవురావురని చూసేవాడికి రుచులతో పని యేల
ఆయురన్నం ప్రయచ్ఛతి అని ధీమా ఒలకబోస్తే
అపాత్రతా దాన భీతి అనుక్షణం కలవర పరిస్తే
స్తవజాత శ్రమ తోయబిందు ప్రభా ముఖబింబమై
పరిహాసప్రోద్ధిత వ్యాకుల చిత్త చాంచల్యమై
కింకర్తవ్యతా విమూఢత్వ సాలోచనా నిర్వేదమై
ప్రత్యుత్తాభివందన గౌరవ సూచక విషయ రాహిత్యమై
కైంకర్యాభిలాషా విరక్తితో వెనుదిరిగి పోనా
నిష్కల్మష నిస్వార్థ సేవారతితో సాగిపోనా
అనసూయార్పణమస్తు గా కొనసాగించనా
రొప్పుతూ రోయనా తప్పుకుని పోవనా?

Saturday, March 17, 2018

   ఉగాది శుభాకాంక్షలు

సీ.
తెనుగు తల్లికి విలంబిత కంఠహారమై
                     వెలుగులీవె విళంబి వత్సరాది
తెలుగు భాషకు నవ యువ ఏష లిడి నూత్న
                     మర్యాద నొసగుమీ వత్సరాది
తెలుగు నేలకు కమలపు కంపు బాపి ఈ
                     తెలుగు దేశ జయమీ వే యుగాది
తెలుగు జాతికి నేర్పు నేర్పి ఎల్లెడల తా
                    రాణింప దీవించు మో యుగాది
తే.గీ.
ఆయు రారోగ్య ముల నిచ్చి సంప దిచ్చి
సకల విద్యల నగ్ర తాంబూల మిచ్చి
ఒజ్జ లేవిధి నేర్పిరొ ఒద్దిక గను
ఒడిసి పట్టెడి గుణమిమ్ము ఓ ఉగా
ఆంధ్ర భారతి నెన్నుదుట తిలకమిడి
ధరణి పచ్చని చేల పావడను గట్టి
లచ్చి యింటింట దిరుగాడి ఆదరించి
గౌరి సౌభాగ్య మిచ్చి దీ వించు గాక!

ఉ.
స్వాగతమో విళంబి నవ వత్సరమా స్వగతంబు శ్రావ్యమా
మా గతులీప్సతమ్ములను ఆ కమలాసను లోర్వలేక ఆం
ధ్రా  గతి బిచ్చ మెత్తుటని రక్కస దుర్మద రాజనీతి తో
రాగల వేమి నీయరట  రాక్షస రాజుకు బుద్ధి  చెప్పవే.
కాగల కార్య  మావలను ఎన్నికలందునె చూచుకొందుమే
ఈ గతి లేని వాని కమలాకరు పాలన కంత మెన్నడో
రాగల పాలనా విభులు ఆంధ్రులె కావలె కేంద్రమందునన్
ఏగతి తీర్చి దిద్దెదవొ ఏ విధి ధర్మము నుద్ధరింతువో.
జనతకు శాంతి సౌఖ్యములు జాతికి నీతియె జీవగఱ్ఱ మా
మనుగడ ఎంతొ కొంత యభి వృద్ధి సుమీ మును పిచ్చినట్టి మా
మనసున నాటినట్టి చిగు రాశల వే నెఱవేర్చి సంతసం
బునిడి  విలంబి నామ నవ వత్సరమా మమ్ము కావుమా.


Tuesday, March 13, 2018

      మిటారి

వల్లిమాలిన ప్రేమతో అల్లాడిపోనా
పనికిమాలిన వారి కై కడదేరి పోనా
కాలుగాలిన పిల్లిలా నే కనలిపోనా
ఆకు రాలిన మోడులా నిలచిపోనా
నిలువెత్తు సాదర నీరాజనాలిచ్చినా
తన ఎత్తు తులాభారాలనే ఇచ్చినా
కనక కంఠాభరణమే అర్పించినా
కఠిన కర్కశ హృదయం కరుగ బోదు
చిరునగవుల పలుకరింత దొరక బోదు
పడిగాపులు కాచినా ఊడిగాలు చేసినా
అది అంతా ప్రారబ్దం పురాకృత సుకృతం
కర్మ క్షయం కోసం సహనం సమాదరణం
కించిత్తు కూడా శ్రేయము కోరని పొగరు
క్వచిత్తుగా తొలకరి చినుకులా అలరు
ఎందుకా దుస్సహ దుర్బల దురహంకారం
ఏమిటా మిటారి మనో వైకల్ప్యం
ఏమిటా వికారి బుద్ధి కౌసల్యం

Saturday, March 3, 2018


సీ.
శ్రీ లలితా పరా భట్టారికా శివ
             పర్యంక శ్రీ విద్య పర్యుపాస్య
నిత్య సంధ్యోపాసనా ర్చనా జపతప
             నిష్ఠలే అనువంశ నిధులు మాకు
ఉపనిషద్వైదిక శాస్త్ర పురాణేతి
             హాసములవి ప్రతిహార్యములగు
మంత్రముల్ యంత్రములు సవన తంత్రముల్
            కరత లా మలకమగు కలిమి మాకు     
తే.గీ.
జాతక ముహూర్త గణనమ్ము జాను విద్య
తెనుగు నూనూగు యందాల తేనె లొలుకు
అల్లిక జిగిబిగి పల్కుమా కాట పట్టు
మువ్వురమ్మల యమ్మ మమ్ముద్ధరింప.
సీ.
జిహ్వ చాపల్యంబు జివురు వెట్టదు మాకు
          స్వగృహ భోజ్యముల్ వరము మాకు
ఇంద్రియ నిగ్రహంబు మనో నియతి మాకు
         ఈశ్వరేచ్ఛ బహు ఈప్సితము మాకు
జపములే ఉచ్ఛ్వాశ నిశ్వాస ములు మాకు
          తెనుగు పలుకులవ్వి తీపి మాకు
పరసుఖా నందమే పరమావధియు మాకు
         పరహిత మె హితమై పరగు మాకు
తే.గీ.
నిత్య నైమిత్తి కానుష్టా నేచ్ఛ తోడ
సర్వ కార్య నియతి కాగ నిరతి మాకు
గురువు లుపదేశ మిచ్చిన గురుతర విధి
శ్రీ, మహా విద్య లత్యంత శోభ మాకు.
     


            

ఏ సందర్భము నైన నేమి నిను నేనే పల్కరించాలి నా
కోసంబొక్క వి చారమున్ జరుప వీ కోపానలం బార నా
యాసంతా కను వేదురమ్మగునె సాయం సంధ్యవు కాకుమీ
నా సంస్కారము నౌదలన్ నిలిపి మౌనంబింక చాలించుమీ సుతా.


Friday, March 2, 2018

నేను

నేను ఒక ఊహ
ఈ మేను కాదు
నేను ఒక ఆశ
అపోహను కాదు
నేను ఒక ధ్యాస
ద్వేషంను కాదు
నేను ఒక వ్యవస్థ
ఏ దురవస్థను కాదు
నేనొక సిద్ధాంతం
ఏ రాద్ధాంతం లేదు
నేనొక అనురాగం
రాగ విపంచిని కాను
నేనొక లక్ష్యం
నిర్లక్ష్యం కాదు
నేనొక గభస్తి
తాపజ్వాలను కాదు
నేనొక ఆసరా
అవసరాన్ని కాదు
నేనొక దీపశిఖ
దగ్ధం నా ధర్మంకాదు
వెలుగు లీయడం నా విధి
పరోపకారం పరసుఖానందం
నా వృత్తి ప్రవృత్తి.