Thursday, January 26, 2017

ప్రేయసి 


బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ 
వగపే వలపుకు ఫలమనుకోవోయ్
విరహము కన్నా మించిన స్వర్గము
ఇలలో  లేనే లేదోయ్
మందేసుకున్న మత్తులో అంతా  నిజమేనోయ్
మత్తు దిగిపోతే బతుకే దుర్భర మోయ్.
చిత్తు కాగితంలా ఎందుకూ కొరగాదోయ్ .
ఊరించి ఊరించి ఊసాడి పోయేది
విసిగించి విసిగించి నిను వీడి పోయేది
అదే అదే, దాని పేరే ప్రేయసి
 కలల అంచుల నడిపించే ఊర్వశి .
ఆపెతో అనుభవం కన్నా
  ఆ అనుభూతే   మిన్న.

Wednesday, January 25, 2017

           

మరలి రావా మరులు గొని రావా 

ఏ శీత శరన్నిశాకర చంద్రికలకై చకోరినై 
ఏ సిత సుందర శ్రీ  కౌముదికై  కలువనై
ఏ శ్రావణ వినీల గగన శంపాలతనై విలసితనై 
త్రిప్పని చూడ్కుల రేబవలెదురు చూసానో
మనో నియతితో తీక్ష్ణ కాముకినై పరితపించానో 
అశ్రుధారా పరంపరల్ కనీనికలందు జాలువారాగా 
ముగ్ధ మనోహర స్వాప్ నికా భవిత తొందరగా 
నీ ముంగిట పరిచానో నీ చెంగట నిలిపానో 
ఒక్క క్షణం ఒకే ఒక్క లిప్త కాలం 
నిలిచి వాఙ్మనో నయనాలు తెరచి 
తేరిపారా జూసావో  కన్నులారా కాంచావో 
నీ మనసే వెన్నలా, కాదుకాదు మంచులా 
గ్రీష్మ తాపంలో హిమ శిఖరంలా 
కరిగిపోదూ, కరిగి కన్నీరై 
ఏరులై వాగులై వరదలై 
కన్నీటి మున్నీట, మిన్నేటి కన్నీట
మునిగి పోవా , మునిగి తేలిపోవా 
మరలి రావా మరులుగొని రావా 
పూవని కన్యా సోయగ సౌరభాలు 
కానని వేనా కానని వానికేనా 
ఎద  లోతుల చిరు కాముని
నులి అలజడి కనలేవా 
మలి అలికిడి వినలేవా 
మరలి రావా మరులు గొని రావా.  


   

Sunday, January 22, 2017

తప్పెవరిది

ఆదమరచి నిదరోయిన బాటసారిదా 
ఆపదను ఊహించుకోని చోదకునిదా
పోయిన అసువులు తిరిగి వచ్చే దారుందా 
నిజంగా ఉగ్రవాదుల దురాగతమే ఐతే
ఇంతమంది ని బలిగొంటే వారి ఆకలి తీరిందా 
అమాయకులను అభాగ్యులనూ 
సామాన్యులనూ బాటసారులనూ 
విగత జీవులను చేయమని
బలి పశువులు చేయమని
ఏ ధర్మం చెబుతోంది
ఏ న్యాయం పలుకుతోంది
దేవుడు భయం లేని కర్కసులకు 
ప్రకృతి సమతౌల్యం వీగి పోతే 
వేల రెట్ల ఎదురు దెబ్బ తగిలితే 
వారూ పదింతలు నష్టపోతే 
మనిషి పుట్టుకే ప్రశ్నార్థకం
మనిషి బ్రతుకే అవాంఛితం 
సిద్ధాంతాల వైషమ్యాలు 
రాద్ధాంతాల తారతమ్యాలు 
ఎన్నున్నా ఎట్లున్నా
సామరస్యంగా సాధించాలి 
సమాజ హితం సన్నిహితం 
కోరుకోవాలి చేరుకోవాలి.
(హీరాఖుడ్ రైలు ప్రమాదం మనసు ను
కలచి వేసింది).


Thursday, January 19, 2017

అమ్మా నాన్న
ఈ ప్రపంచానికి పరిచయం చేసి
నిన్నొక మనిషిగా తీర్చి దిద్దడంలో
అహర్నిశలూ పరిశ్రమించే నిండు గుండెలు
అమ్మా నాన్నలు.
ఉగ్గుపాలతో ఊసులాడిన
అమ్మే తొలి గురువు
బ్రహ్మోపదేశం చేసి విద్యకు
బీజంవేసిన నాన్న మలిగురువు
కలిమి, బలిమి నాన్న యిస్తే
చెలిమి, మిసిమి యిచ్చింది అమ్మ
వారిది దిక్కుమాలిన ప్రేమ కాదు
దిక్కులేలే అసలు సిసలు మమకారం
సప్తస్వర రాగాల కందని అనురాగం
అక్షరాలలో నిక్షిప్తం చేయలేని
అవ్యాజ ప్రేమానురాగం
అది వారికి మాత్రమే సొంతం
అనితర సాధ్యం
అమలిన సఖ్యం.

Wednesday, January 18, 2017

ఈవి రాశులివిగో


శరదిందు చంద్రికా
కనువిందు భద్రికా
జపమందు ముద్రికా నా
మనో గేహ పుత్రికా
శారద రాత్ర శీత మాలతీ లతికా
ముకుళితాధర దీర్ఘ చూడ్కుల దీపికా
ఓ శిత శీత చిరు దరహాస బాలికా
మరచి పోదామనుకున్నా  కానీ
మై మరచి పోతున్నా
చూసి పోదామనుకున్నా కానీ
చూడ లేక పోతున్నా
నీమ్రోల
వాలి పోవాలనుకున్నా  కానీ
వసివాడి పోతున్నా
ఈ వెన్నెల వాకిట
కవితల రంగవల్లులల్లా
భవితల బంగరిల్లు కట్టా
జ్యోత్స్నా పునీత కావ్య
రసరమ్య దుర్గ మన నవ్య
కవితా సుమమ్ములివిగో
పూతావుల నెత్తావుల
యీవి రాశులివిగో
భావి ఊసులవిగో
కనుమా కొనుమా గై కొనుమా.

Wednesday, January 11, 2017

              అమ్మ పలుకు

ఏడవడం తప్ప ఏమీ రాని వయసులో ఎలా నేర్పావమ్మా పలుకులన్నీ 
ఊ కొట్టడం ఊహూ అనడం తప్ప మరేదీ రానప్పుడెలా నీతో మాటాడానమ్మా
తప్ప టడుగుల నాడే తెలుగు మాటల మూటలు ఎలా కట్టించావమ్మా నాచే 
మూడేళ్ళకే తప్పులు లేకుండా మాటలాడడం ఎలా వచ్చిందమ్మా నాకు
తలచుకుంటే అంతా ఆశ్చర్యంగా ఉంది
నెమరుకు రావు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు
ఆరో ప్రాణం గా చూసుకున్న నా తెలుగును
కూటికి కొరగాదంటూ అలక్ష్యం చేస్తున్నా రీనాడు
ఎంగిలి భాష ఇంగ్లీషు మోజులో పడి కొందరు
తెలుగు వద్ద నే తెగులు సోకి ఉన్నరమ్మా
అమ్మ భాష అమ్రృతం అని వారి కేం తెలుసు
పిదప కాలం పిదప బుద్ధులు
అమ్మా వారు పోగొట్టు కుంటున్నదేంటో 
తెలిసాక లబోదిబో మంటారు
చేతులు కాలాక ఆకులు పట్టు కుంటారు.
అమ్మా
తెలుగే నా ఊపిరి తెలుగే నా సిరి
తెలుగే నా నుడి తెలుగు నానుడి
తెలుగు వాడి గా పుట్టా
తెలుగు వాడిగానే పోతా.