Thursday, November 30, 2017

అంతా భ్రాంతి యేనా?

వందల పిల్లల నడుమ ఏకాకి జీవితం నాది
అందరూ నావారే కాని అనాథ బ్రతుకే నాది
ఒకరు  అభిమాన పుత్రిక మరొకరు  ప్రియవాది
అయినా నా కుశలం అడిగే వారేరీ కోరే వారేరీ
ఉభయ సంధ్యలా అర్చించే అమ్మకైనా దయరాదా
ఉబయ తారకంగా మమ్ముల మనుమని అనలేదా
ఒంటరితనం నను వెంటాడు తూంది
ఇంటి వాతావరణం ఇంకా ఎప్పుడొస్తుంది
నా బాల మా నట్టింట కదలాడే దారే లేదా
అనునయంగా ఆప్యాయంగా పలికేదే లేదా
మా ఇంటి తనయగా మా కంటి  పాపగా
మాతో కలిసేనా అంతా భ్రాంతి యేనా

Wednesday, November 29, 2017



అమ్మ కు అమ్మలమ్మకు  సువాసిను లందరి కమ్మకున్ సదా
సొమ్ముల  యమ్మయున్ సరస సాక్షర భారతి సేవజేయు మా
యమ్మకు విశ్వ మాతకు దయాంబు నిధీ లలితాంబకున్ మదిన్

  1. కొమ్మని నాదు పూజలను కోరుచు నాత్మ తలంతు నెప్పుడున్.

Saturday, November 25, 2017

లక్ష్యం

నిండు నూరేళ్ళూ బ్రతుకాలని ఆశించుదాం
బ్రతికినన్నాళ్ళూ ఉన్నంతలో కొంత పంచుదాం
పరోపకారం మన ప్రవృత్తిగా మలచుకుందాం
మంచిని పెంచుకుందాం పంచుకుందాం
ఈశావాస్య మిదగం సర్వం అనే నమ్మికతో
కర్మణ్యేవాధికారస్తే అని కర్మల నాచరిద్దాం
నాతి చరామి మన మౌలిక నియమంగా
సంపదని సృష్టించుతూ పంచి ఇద్దాం
మన సహాయ సహకారంతో కొందరైనా
తమ జీవితాలను ఉన్నత స్థాయికి
చేర్చు కోవాలి ఆ పద్ధతి నేర్చుకోవాలి
అదే మన జీవన గమనం కావాలి
ఈ లక్ష్య సాధనలో ' నేను సైతం 'గా కదలాలి
నా దేశం అగ్రగామిగా నిలవాలి
మన దేశం ఎందరికో మార్గదర్శి కావాలి


శ్రేయో గామి

నా మానస వినీల గగనంలో
నీ వొక సిత శీతశరద్జ్యోత్స్నవు
నా గతుకుల బ్రతుకు ఎడారిలో
నీ వొక వక్రగమనాశక్త జాహ్నవివి
నా దొక నిరంతర భగీరథ యత్నం
నీ దొక వింత పోకడల మనస్తత్వం
బాలవై బేలవై అంబికవై చుంబికమై
నా జప తపస్సమాథిలో సుషిప్తిలో
కట్టెదుట కదలాడే భాగీరథివి నీవు
జాగ్రదవస్తలో ఏకాంతంలో మనోజాతవు
ఈ అనుబంధానికి విలువల జోడింపు
నా అనునిత్య ఆరాట పోరాట మేళవింపు
పర్యవశానం ప్రాప్తా ప్రాప్తం ప్రారబ్ద పూరకం
ఆశ నాది నిరాశక్త త నీది
లక్ష్యం నాది నిర్లక్ష్యం నీది
సంస్కృతి నాది సంపద నీది
యత్నం నాది ఫలితం నీది
నా చేతులతో నా చేతలతో
భవిత తీర్చి దిద్దాలి
బ్రతుకు బాగు కోరాలి.

Thursday, November 23, 2017

ఎవరు నీవు


రేయెండ దిగులులో బలే బలే మురిసావు
నీరెండ యెలుగులో నిగా నిగా మెరిసేవు
సోకులకే నీవు తలదిరిగే సోకులమ్మివే
కులుకులకే నీవు మతిపోయే కూనలమ్మవే
ఇంతకీ
అల్లసాని వారి పిల్ల వరూధినివా
విశ్వనాథ వారి ప్రౌఢ కిన్నెర సానివా
నండూరి వారి పాలకంకి ఎంకివా
మావూరి ఉరుకుల్ల పరుగుల్ల గోదారివా //   //

బమ్మెర వారి కోమల కావ్య కన్యవా
తిమ్మన గారి అలుకల సత్య భామవా
ముద్దు పళని ముద్దు గుమ్మ రాధికవా
కూచిపూడి భాగవతుల కూనలమ్మవా //   //



Tuesday, November 21, 2017


మ. ధ్వాంతారాతి పయోధి పై ఉదయ సంధ్యా వెల్గు లీనన్  జగ
ద్భ్రాంతిన్ వీడి తిథిప్రణీ కలిత రేరాణిన్ ప్రమోదంబుతో
శాంతిన్ బొంది సుషుప్తి కిన్ దగుల విశ్వాసంబు తో ప్రీతితో
అంతర్యామిని కొల్వగా వలదె నిర్ద్వంద్వంబుగన్ నిష్ఠతోన్.

Sunday, November 5, 2017

నేనొక అభిసారిక

నభో నవలామణీ నెన్నుదుట రక్త తిలకమై
ప్రాచీ నభస గర్భోదయ అరుణ బింబమై
తొలి పొద్దు వెలుగులో  ఎదురు చూసి చూసి
ప్రాచీ వీచికనై వీచీ బాలికనై బాలానందమై
ఎంత చూసినా తనివి తీరని ఆర్తి నాదై
ఆ మధుర క్షణాల కోసం ఎదురు చూసే
గడ్డి బరక పై మంచు బిందువు నేనై
హిందోళ రాగాలాపననై స్వర జతినై
జగతికి మేలుకొలపులు పలికే
కుక్కుటమై వాయసమై కేరింతల పుడమినై
కలలు కనడమే నా కిష్టం కానీ సంక్లిష్టం
ఆ కలలో నాకనులలో  ప్రకృతిలో
మనసారా పరవసించడమే నాకిష్టం.

Friday, November 3, 2017


శా. మాతా హైమవతీ సదా శుభకరీ మాతంగ కన్యాం ఉమామ్
ప్రాతఃమన్మనసా స్మరామి జననీమ్ ప్రాజ్ఞీమ్ భవానీమ్ శివే
శాంతాకార విలోచనీమ్ సతత మీశానీమ్ విశాలాక్షి త్వం
ధ్వాంతారాతి శశాంక నేత్రి తరుణీమ్ వందే శివానీమ్ సదా.