Tuesday, February 27, 2018

ఊడిగం
గుర్తింపు లేని ఊడిగం
గుదిబండ లాంటి పాతకం
ఎదురేగి ఎద పఱచి పిలిచినా
ఏమార్చి నిట్టూర్చి నిను వీడిపోతే
ఇంకా కాళ్ళు పట్టుకు వ్రేలాడటానికి
ఏమిటీ ప్రారబ్దం ఎందుకీ బానిసత్వం
గౌరవం మర్యాద భయం భక్తి విలువ
విశ్వాసం ప్రేమ అభిమానం మమకారం
ఏదీలేని కఠిన పాషాణ హృదయం
విధిలేక గతిలేక మతిలేక
చేసే ఉపాస్తి
లోకువ బ్రతుకుల తేకువ గాని
అస్థి నాస్తి విచికిత్సాలేమి లేమి కాదె
అహం త్వం న విలోచనా గరిమ గరిమ యౌనె
నిశ్శబ్ద సంగీత నివహపు నిశీధిలో
శూన్యచంద్రికా తిమిరచ్ఛ టా పరిష్వంగ
దుర్దశా దుర్నిరీక్ష్య దుర్విధి దుందుడుకులా
నామది నిండా ఏవేవో ప్రశ్నలు
నా ఎద నిండా వేనవేల సంశయాలు
నా కళ్ళరెంట అశృబిందువులు
నా కలల పంట కృష్ణార్పణం
నా గుండెనిండా వాయుగుండం
వాతావరణం చక్కబడేనా
అనుకూల పవనాలు వీచేనా
ప్రశాంతంగా సుషుప్తిలోకి జారేనా?
(ఉపాస్తి= సేవ, తేకువ=భయము, నివహము=గుమి)

Wednesday, February 21, 2018


ఎంత కాదనుకున్నా మనసంతా నీవే
ఎంత వలదనుకున్నా తలపులన్నీ నీవే
పలుకే బంగారమైనా ప్లాటినమైనా
నీవే నా కళ్ళకు ఓ బంగారం
నీవే నా మట్టుకు ఓ బాలానందం
ఎన్ని జన్మల ఋణానుబంధమో
నిన్ వదలి నే నుండ లేను
నన్ మఱచి నీ వుండ లేవు
అంతరాలు ఎన్ని ఉన్నా
ఆంతర్యాలు ఒకటే కన్నా
ఉలి దెబ్బలతో తీర్చి దిద్దాలి అపురూపంగా
కొలిమిలో కాల్చినా నిలవాలి సగర్వంగా
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
నా మనోజాతగా పేరు నిలపాలి
అహరహం పరిశ్రమించాలి
అనుక్షణం అనుకరించాలి
ప్రతి ఉదయం ఉపక్రమించాలి
ప్రతి రాత్రీ ప్రశాంతంగా నిదరోవాలి.


Saturday, February 17, 2018


గంగవై తరంగవై శివుని శిరమెక్కి ఉంటావా
గౌరివై అర్థాంగివై ఎడమ ప్రక్క నుంటావా
కల్మష నాశినివై దివిజ భాగీరథివై
ఉత్తుంగ తరంగమై శివుని శిరమందుందువా
సనాతనులై ఆది దంపతులై జగజ్జనకులై
విడరాని బంధమై అర్థ నారీశ్వరమై నీ వుండవా
పతిత పావని గంగ పరమ పావని గౌరీ
వక్ర గమనపు గంగ ఋజువర్తనపు గౌరి
గంగలో మునక జన్మజన్మల సుకృతం
గౌరీ పాద సేవ పరమ భాగవతుల స్వంతం

ఎందుకంత వ్యామోహం
నీ కెందుకంత మమకారం
ఏమిటా సమ్మోహనం
ఎందుకా అనురాగ రాగం
నీ మృదు లాలస గళ నిగళం
సప్తస్వర ఝరీ తరంగం
అవధులెరుగని అభిమానం
ఆ మంత్ర ముగ్ధ మనోహరం
నీ కెంతో అపురూప రూపం
బాలా త్రిపుర సుందరీ ప్రతిరూపం.



తదేక దీక్షతో ఏకాగ్రతతో సాధించేది లక్ష్యం
తపన సాధన సమిష్టి కృషి తో అది సుసాధ్యం
దురాశ దుర్నీతి వెన్నుపోటులే అవరోధం
ఒంటరిగా సాధించడం ఎవరికైనా అసాధ్యం
లక్ష్య సాధనకు త్యాగ నిరతులే సోపానం
పెట్టుబడి పెత్తనం జవాబుదారీతనం
అన్నీ కలసివుంటేనే యాజమాన్యం
లేకుంటే సొమ్మోకరిది సోకు ఇంకకరిదీ
ఓర్పు నేర్పు కలుపుగోలుతనం
భాగస్వామ్యానికి ఎంతో ఆవశ్యకం
ఋణమిచ్చే ప్రపంచ బాంకు కూడా
సవా లక్ష షరతులు విధిస్తుంది
ఇచ్చిన మాటకు కట్టుబడితే పరపతి
తుంగలో తొక్కితే బోడి గుండు తిరుపతి
అక్కసు ఉంటే చేసుకోవలసినది ఏకస్వామ్యం
కలసి నడవలేని వారికి ఎందుకు భాగస్వామ్యం?

Friday, February 16, 2018

       ఎవ్వరి కోసం

   ఎవ్వరి కోసమై తనిసి ఎగ్గులు సైచి మనో వికల్పమందినీ
   వెవ్వరి మేలుకై పరితపించితివో కలగంటివో శ్రమం
   బెవ్వరి కోసమై పడితి వెవ్వరి యున్నతి లక్ష్యమై సదా
   ఎవ్విధి ప్రాకులాడితివొ ఏ లవ లేశమైన జాలి చూపిరే
   నవ్విన వారు నవ్వు కొన నిమ్మని నీవొక యోగివై మనో
   క్రొవ్విరి పూత పూసినటు క్రొత్త విలాస విహారివై మనో
   సవ్వడి నేర్పి నట్టి మొగశాలను రంగుల రంగవల్లులన్
   ఎవ్విధి తీర్చి దిద్దితివి ఏరిట వారొక రేని తోడుగా
   ఎవ్వరి కైన జాలి గలదే ఎదలోన నొకింత ప్రేమ తో   ఎవ్వరి కంట? కంట నొక వేడి దయార్ద్ర పు బిందువేని నీ
   మువ్వపు కాంచనాబ్జముల ముద్దుల యమ్మలు కైన ని
   న్నెవ్వరు తల్తురీ దరిని ఎవ్వరు నిల్తురు నంత నీదరిన్
   దవ్వుల దూరదేశముల దారిన నీపయ నంబటంచు న
   న్నెవ్వరు ఈసడింప వల దేను నిజోత్పన్న జన్య భావనా
   గువ్వపు ప్రోది కోసరము గూఢముగా పరికించు చుండగా
ఇవ్వల నీ విరోధములు ఈర్ష్య నసూయలు మీకు ధర్మమే.
 
 
   
 
 
 

Thursday, February 8, 2018

ఎందుకంత అహం

రాగద్వేషాలూ ఈర్ష్యా అసూయలూ కోపాలు
చీమూ నెత్తురూ ఉన్న ప్రతి వారికి అనువంశికాలు
అనుబంధ బాంధవ్యాలు అవో రకం ఋణాలు
ఊపిరి ఉన్నంత వఱకే ఈ కుమ్ములాటలు
ఎగశ్వాసలో కొన ఊపిరిలో పశ్చాత్తాపాలు
ప్రాయశ్చిత్తాలు వ్యవధి  లేని మనో వికాసాలు
నలుగురితో కలసి మెలసి నడువలేని వారు
మందిలో మనలేరు అహంకు బందీలు వారు
అంతా నేనే అన్నీ నేనే అహం బ్రహ్మాస్మి అనుకోవాలన్నా
ఎంతో ఓర్మితో కూర్మితో సాధన చేయాలి కదరన్నా
నిలువునా నిలబడ్డానికి ఒంట్లో సత్తువ లేకున్నా
స్వర్గానికి ఎగిరేస్తానంటే ఒంటి చేత్తో పనిచేస్తానంటే
కాలమే తగు రీతిగా బదులిస్తుంది
మౌనమే మంత్రమై పని చేస్తుంది
విఱ్ఱవీగినా బిఱ్ఱ బిగిసినా కుఱ్ఱతనం కాబోదు
అవనత వదనం అనవరత విషాదం
శాశ్వత బహుమానాలుగా మిగిలి పోతాయి
సుస్థిర ప్రయాసలై కట్టెదుట నిలచి పోతాయి
సత్యం ధర్మం ఎప్పటికైనా గెలిచి తీరుతాయి
లోకం కళ్ళు అన్యాయం గా మూయ గలిగినా
చిత్ర గుప్తుని చిట్ఠా లెఖ్ఖ తప్పదు
సమవర్తి శిక్షకు గురికాక తప్పదు.