Sunday, August 29, 2021

తెలుగు పలుకు

 సీ.

లేలేత జవనమ్ము లింపారు సొబగుల

          తిరుగాడు తన్వంగి తెలుగు పలుకు

నునులేత జివురాకు నుడికార సొగసరి

         తేట తేనియలొల్కు తెలుగు పలుకు

వృత్తగర్భజ సుసంవృత యక్షర రుచిర

         త్రివిక్రమప్రియ తెలుగు పలుకు

దక్షిణ గంగాస్నాత పునీత సుచరిత

        త్రైలింగ దేశిక తెలుగు పలుకు

తే.గీ.

విశ్వమంతట వ్యాపించి వెలుగు తెలుగు

తీయతీయని సంగీత తేరు తెలుగు

విశ్రమించని విజ్ఞానవేది తెలుగు

తెలుగు వాడిగ గర్వింతు తెలుగుఁ బలుక.

Saturday, August 7, 2021

నన్ను మన్నించవే

 నన్ను మన్నించవే


మ.

ప్రణిధానాధ్వర చిత్త మిమ్మదియె సంప్రాప్యమ్ము నందించు నా

ప్రణిపాతమ్ముల నందుకో వలదె? సంప్రాప్తంబదే చాలులే

యణిమాద్యష్ఠ సుసిద్ధు లన్నడుగ నిత్యానిత్య సుజ్ఞాన మి

మ్మణు వంతైనను ముక్తి కాముకుడ నమ్మా నన్ను మన్నించవే. ౧

మ.

ఇహలోకస్పృహ వీడలేక తనువున్ యిబ్బంది కానీక నీ

సహకారంబున నీదుచుంటి భవసంసారాంబుధిన్ భార్గవీ!

దహరాకాశము నందునిల్పి నిను సందర్భానుసారంబుగా

రహి మించంగను కొల్చుచుంటిని యపర్ణా! నన్ను మన్నించవే. ౨

మ.

సమయాభావము కల్గినన్ మనసులో సాధింతు నెల్లప్పుడున్

కమనీయంబగు నీదు మంత్రముల సంసేవా రతిన్ సాగుచున్

విమలోత్తుంగ సుధా కుచేలమున సంవేద్యాభి చిత్తంబుతో

రమియింపన్ గల నేర్పు నిచ్చి మును యార్యా! నన్ను మన్నించవే. ౩

మ.

శరదేందుద్యుతి మించు నీ దయల నాశాజీవినై నిల్చితిన్

కరుణాసింధు పవిత్ర నీరముల మున్గం గల్గితిన్ యాద్యా!

దరి జేర్చంగను జూడుమీ భవమహోదధ్యంబు నీదంగ నా

తరమా? భార్గవి! భద్రకాళి! స్మరమాతా! నన్ను మన్నించవే.౪

Tuesday, August 3, 2021

స్ఫూర్తి

 

ప్రతి ఉదయం ఓ ఆశావహ దృక్పధం

ప్రతి నిమిషం లక్ష్యసాధనకై సాలోచనం

ఓడిన ప్రతిసారి సవివర ఆత్మావలోకనం

అవహేళనలు అపహాస్యాలు అవమానాలతో

నిప్పుల కొలిమిలో కాల్చి బాదిన సమ్మెట దెబ్బలతో

చురుకుదనం కరకుదనం నాలో పెరిగిన వైనం

నాలో నిశ్చలమై నిలచిన ఆత్మవిశ్వాసం

స్పర్ధయా వర్ధతే ప్రజ్ఞా అని నమ్మిన సిద్ధాంతం

అమీ తుమీ తేలాల్సిన అంతిమ పోరాటంలో

ఎంతకీ గెలుపెవరిదో ఇదమథ్థమని తేలకపోతే

శారీరక గాయంతో ప్రత్యర్థి తప్పుకోవలసి వస్తే

ఆ విజయం ఇరువురకూ చెరిసగం చేయమంటే

అంతకు మించిన క్రీడాస్ఫూర్తి ఇంకేముంటుంది?

ఆ నిస్స్వార్థ మహోన్నత మనస్తత్వం ఎందరికో స్ఫూర్తి.

(ముంతాజ్ ఎస్సా బార్షిమ్ కు అంకితం )