Saturday, June 29, 2013

 సీ.  బలశాలి బలహీను హింసించి బ్రతుకుటే
                    మానవత్వమ? నీకు మానవుండ
       చివురుటాకుల సందులందు మొగ్గ తొడిగి
                    పువ్వులై విరియ  పూర్తి గాక
      మునుపె మమ్ము తురిమి తురిమి   కొందురు హాయి
                    గా ఆడ వారు మీ యాడ వారు
      ముమ్మాటికిన్ యిది బ్రూణ హత్యయె యౌను
                    మీ మల్లె మా మల్లె మిగుల వలదె?

తే. గీ.   మా కడుపు పంట దోచెడు మానవుడన
           మా కడుపు మండు మా కభి  మాన మైన
           మధుపమును జూడు మన్నింతు మట్టి వారి
           నీదు మది నింపు నింపు మన్నింపు గాదు.   

తురిమి=త్రుంచి ; తురిమి =సిగలో పెట్టుకోనుట
ఆడవారు =అచ్చటివారు ; ఆడవారు = గృహిణులు
మీ మల్లె =మీ వలె ;మా మల్లె =మా మల్లె తీగవలె
మదిని+ఇంపు =మదినింపు ; నింపు = పూరించు
పై అర్ధ బేధాలను గమనిస్తే భావం సరిగ్గా వస్తుంది .  

Friday, June 28, 2013

నవనవ లాడుచున్ విరిసి  నవ్వుచు మిమ్ముల పల్కరించుచో
పవన కిశోరమంట తల పన్ తల లూపుచు నూగులాడుచో
అవనికి మేటి సౌరభము లందిడు సందడి చేయు చుండగా
యెవడవు నీవు ఆ యముడ వా మము తెంపున త్రుంచి వేయగన్.  

Thursday, June 27, 2013

మా నును  లేత సోయగము  మా కను విందొనరించు రూపముల్
ఈ  నర రూప రాక్షస కనీనిక లందున హాయి నింపవే
మా నవ! మానవా నిరతమా పర పీడన బుద్ది హీనతన్
మా నయగారమింత  కనుమా అటులే మము నుండనీయుమా.  

Wednesday, June 26, 2013

నోరును  వాయి లేని మము నోగిర ముందర నిల్చి నందుకా
ఊరును పేరు లేని మము నూరకనే సరదా యటంచు నో
రారగ నేడ్వలేని మము రాక్షస కర్కశ దుష్ట బుద్దులై
దారుణ మారణా క్రమము తప్పక జేసెడి మీరు మాన్యులే