Tuesday, August 28, 2018


నీకు కరుణించాలని లేకుంటే
నేను మరణించాలను కుంటా
ఉపేక్షయో ఉదాసీనమో నీదైతే
అపేక్షతో సదా దాసుడ నేనౌతా
అనాశక్తతో నిర్లిప్తతో నీ దైతే
పరాశక్తియే అంతశ్శక్తి గా నేనుంటా

Friday, August 24, 2018


ఏలా కాటుక కంట నీరు వడ రోదింపన్ అపత్యుల్ నినున్
ప్రేలాపంబుల తూలిరా కలిమి నాక్షేపించిరా యమ్మిరా?
నా లావంతయు యేబదారు చిరు వర్ణంబుల్ కదా దుర్మతుల్
చాలా పాతవటంచు కొన్నిటిని విచ్ఛేదించి రో మిత్రమా.



నన్ను నేనె వంచించు కొన్నాడ తుదకు
ఎదిరి నెదిరించు బిగువుతో యెగసి యెగసి
చవట పీనుగులను చంక జేర్చి కొంటి
రాతి గుండెల నాతి వ్రాసి పోయె
మరణ శాసన మొకటి మా ముఖాన
మంచి చేయగ నెంచ నమ్మించి ముంచి
రిపుడు నట్టేట నా గుండె వ్రయ్య లయ్యె
నా ముఖము జూప లేను నే చావ లేను
కూడబెట్టిన ధనమంత కరిగి పోయె
అప్పు చేకొన్న వారింక ఆదుకోరు
ఆలికిని చూలికిని పెట్టక చెడి పోతి
మరణమె శరణమని మది తలంతు
నా చితిని నేనె పెర్చు కొన్నాడ యిట్లు
నన్ను వంచించి ఇంతగా నేడి పించి
పిల్ల పాపల తోడ వారెట్లు మిగులు
నా యుసురు నాదు కన్నీరు శాపమగుచు
సర్వ నాశన మొందు నా కళ్ళ యెదుట
జాలి వలదమ్మ ఓ విశ్వ జనని తగిన
శిక్ష వేసి నన్నింక శాసించ వమ్మ
లేరు నా కొఱకు వగచు మిత్రు లెవరు
రగిలి నా గుండె కాష్ఠాన రేగు మంట
శస్త్రమై యది అస్త్రమై శతృ నాశ
నమొన రించు నా యాత్మకు శాంతి యపుడె.

Thursday, August 16, 2018


ఓడిపోతున్న సమయంలో
నేనున్నాననే భరోసా లేదు
గెలుస్తానన్న క్షణంలో
నన్ను మురిపించే కులాసా లేదు
ఏటికి ఎదురీదుతున్నా.. సుడి
గాలికి తల ఒగ్గుతున్నా
నడి సంద్రంలో
తలమునకలౌతున్నా
ఫలితం సమవర్తికే తెలుసు
ఇంతటి నైరాస్య వైరాగ్యంలో
ఓ చిరు గభస్తి
కల్మష నాశని పావన పునీత జాహ్నవి
శృతి సూక్త వివిక్త చింతాక్రాంత
నా హృదయాంతరంగ విజేత
నన్నంటి వెన్నంటి తానుంటె
మున్నుంటి నేనుంటి నని శృతియంటె
ఉత్తుత్తియే కాని ఉదధి నను ముంచలేదు
పత్తిత్తుయే కాని జగతి నను మించలేదు.


Monday, August 13, 2018


సీ.
అలములను తినుచు అడవిలో నుంటినా
       గృహమేథినై పల్కు ఋక్కు నాది
ఆలయార్చకుడినా అనునిత్య   పూజలన్
            మెప్పించి సేవించి మేలు పొంద
  ప్రవచన  కర్తనా పౌరాణికుండనా
            నినుగూర్చి తెలుపుతూ నిగ్గుదేర
వాగ్గేయ కారుడై  వ్రాస్తినా   సంగీత
            సంకీర్తనలు పాడ చనువు మీర
తే.గీ.
మూక శంకరు గోమాత   ముఖ్యముగను
అంబ! నీనామ మొక్కటే పలుకి రెపుడు
ఆదరించవె.  తల్లి!.        ఆనంద వల్లి
కంచి కామాక్షి !  కరుణించు కల్పవల్లి.8.
సీ.
ఈ అసూయాదులు ఇంకేల? మాయమ్మ
      అనసూయ, యసహాయ జన సహాయ
 ఆకు లలములేల యౌనౌను మాయమ్మ
             యా అపర్ణ, సుమతి అన్నపూర్ణ
 గెలుపు లోటమిలేల ? గిరిసుత మాయమ్మ
         తా నపరాజిత, తనె విజేత
 స్వపర బేధములేల? సహృదయ మాయమ్మ
          యె  స్వతః పరాపర, శక్తి ఠవర
తే.గీ.
నాకు భీతేల  మాయమ్మ యుండ గాను
మంద మతిని క్షమించవే మాతృమూర్తి
ఆదరించవె తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.7.
సీ.
కన్నీరు మున్నీరు గా యేడ్చితేగాని
           నీ మనసు కరుగునే? భవాని
గీపెట్టి అరచి గగ్గోలుపెట్టినగాని
           నీ కర్ణముల సోకునే శివాని
అలిగి పేరలుకతో నట నిరసించితే
           నీ కనులను తాకునే మృడాని
పద్యముల్  చెప్పినన్ పాటలే పాడినన్
           నీ యెద కదిలించునే శకాక్షి
తే.గీ.
ఓర్మితో ఆర్తితో నుంటి నోపలేక
నిను వినా ఎవరితొ మొర లిడుదు నమ్మ
ఆదరించవె తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.6.
సీ.
వరలు జొంపములతో  నలరారు తనరారు
                 లోగిళ్ళు వాకిళ్ళు లోటు మాకు
తనిసి క్రొంజివురు తో తమిదీరు లేలేత
                కిసలయ మ్మనగ కినుక మాకు
నెరసి మార్దవముగా నింపారు సొంపారు
                గాత్రాల గోత్రాలు  కఱవు మాకు
ఎరసి బేషజముగా ఎలుగెత్తి  కరమెత్తి
               వాదింప రోదింప  వగపు మాకు
తే.గీ.
కూడి యున్నంతలో నిన్ను కొలతు మమ్మ
మనసు ముఖ్యము గాని మనికి కాదు
ఆదరించవె  తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.5.

Wednesday, August 8, 2018

       అమీబా

గత స్మృతులను మరచి పోలేను
భవిత అస్పష్టతకు భయపడ లేను
ప్రస్తుత పరిస్థితులకు కృంగిపోలేను
కిం కర్తవ్యమ్మని సదా ఆలోచిస్తాను
ఈ మేను ఈ మనము ఈ తపన
ఏదో ఒక పనిలో లగ్నమై నిమగ్నమై
ఉంటేనే మనశ్శాంతి తాపశ్శాంతి.
కాని అవే మనో చాంచల్యానికి బీజాలు
నిర్వ్యాపకత్వం బహు దుష్కృతం
నిశ్చల సమాధి బహుదూరపు మరీచిక
విశ్రాంత జీవితం పనివారికి ఓ శాపం.
హంస ఎగిరి పోదు యావ చచ్చిపోదు
తపన నిలువనీదు తలపు కునుకునీదు
తీరా తలపడితే అన్నీ బొప్పెలే అన్నీ కన్నాలే
అమీబాల మాయవలలో అంతా కీటకాలే.



Tuesday, August 7, 2018

నీకు - నాకు

నిరసించుట నీకు
నినదించుట నాకు
అలవాటు, పరిపాటి
వినిపించుట నాకు
వినకుండుట నీకు
సామాన్యం, అసంకల్పితం
విదలించుట నీకు
వదిలించుట నాకు
సర్వ సాధారణం
పయనించుట నాకు
శయనించుట నీకు
ఆనవాయితీ, రాయితీ
శ్రమియించుట నీకు
శాసించుట నాకు
రివాజు , నవాజు
ఆదుకోవడం నాకు
అందుకోవడం నీకు
అచ్చొచ్చిన వైనం
నను తలవకుండ నీవు
నిను కలవకుండ నేను
ఊహించుకో లేము
ఊరుకోనూ లేము
ఏమిటో ఈ సంబంధం?
ఎందుకో ఈ అనుబంధం?



Tell me dear

Passive Iam looking at thee
massive Iam working for thee
Many the ups and downs seen in
Pursuing the goals and dreams.
Failures often knock at my door
Cheaters only lure my money ever
Critically cuts the pocket and belly
But the God fills the gap manifold
a new avenew  awaits me behold
Once again I work vigorously for thee
Once again I stand firmly in front of thee.
Ofcourse no realisation on your part
Resource me ramification at any cost
Difficult to count the falls ever I had
Sufficient to remember the wins I had
So tell me dear whether I live for thee.