Wednesday, April 29, 2020


కం.
శ్రీ లలితకు దండాలిడి
నాలుకపై పలుకులమ్మ నడయాడంగా
లోలకు జేజే పలకుచు
లోలముగా నుడివెదను తెలుగు కందములన్.1.
(లోల = లక్ష్మి ,లోలము = మిక్కిలి యాశ)
కం.
గడగడలాడించి జనత
నడి నెత్తిన నిప్పు జల్లె నలుదెస లంతన్
వెడగుపఱచిన కరోనా
చుడి మెలగవొ రాళ్ళపల్లి సుందర రామా

కం.
కనిపించని నలత యొకటి
కనిపించిన వారి నెల్ల కట్టడి జేయన్
పెను ముప్పు కరోన యన వ
చ్చును గదరా రాళ్ళపల్లి సుందర రామా.
కం.
ఆరా తీసే వారే
లేరా బాబూ 'కరోన' లేదంటే చా
ల్లేరా  చింతేలా బ
జ్జోరా రాళ్ళపల్లి సుందర రామా.2
కం.
ఎన్నాళ్ళీ గోలిట్లా
కన్నీళ్ళే కారకున్న కన్నా నీదీ
మూన్నాళ్ళైనా నీవొ
స్తున్నావా రాళ్ళపల్లి సుందర రామా.3.

Sunday, April 26, 2020

   తికమకలో బ్రతికేనా

మరణానికి భయపడి బ్రతుకుతున్నానా?
సాధించవలసింది చాలా ఉందని బ్రతికేనా?
మరణాన్ని ఆస్వాదించడం ఆహ్వానించడం
తెలియని తికమకలో బ్రతికేస్తున్నానా?ఏమో!
బ్రతకడంలో ధర్మం గాని మరణంలో మర్మం గాని
నా మెదడుకు అవగతం కాని చిదంబర రహస్యాలు
అందుకే ఏ లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా
గగనాన్నీ గగనచర గమనాన్నీ గమనిస్తూ
కాఱుమొయిలు కార్పణ్యాన్నీ చిరు జల్లుల సొబగునీ
చండ ప్రచండ భానుణ్ణీ శరద్జ్యోస్నా నిషధ్వరినీ
ప్రళయ భీకర సమీరాలను పిల్ల తెమ్మెరలను
జీవరూప రహిత రుజా రాక్షసాలను భిషగ్వరులనూ
చూస్తూ నిమిత్తానిచ పశ్యామి యని తలపోస్తూ
అనునిత్యం ఛస్తూ చావలేక బ్రతికేస్తూ
ఇదిగో యింకా మాటల తూటాలు పేలుస్తూ
నాకంటూ ఓ అస్తిత్వం నిలుపుకోవడం కోసం
ముగించడం రాని కథకుడిలా నిషాధుడిలా
చరిస్తున్నా వేదాలు వేదనలు నన్ను నడిపిస్తున్నా
మరణానికి భయపడి నే బ్రతుకు తున్నానా?
సాధించ వలసింది ఏమైనా ఉందని మిగిలేనా?

Wednesday, April 22, 2020


వలస కూలీ వందనం...
వలస జీవి అభివందనం  //   //
కన్నోరినీ కన్నూరినీ విడిచి
కన్నీటి మాటున కదిలేవుగా
మండుటెండలో చెమట బిందువై
నిండు గుండెతో శ్రమకు కందినై
నీ కండలు కొండల  కరిగించినై
నీ చేతులు నవలోకం సృష్టించినై //

చేతి నిండా పని కోసం
జేబు నిండే డబ్బు కోసం
దవ్వులన్నీ మరచేవు
గువ్వలాగ ఎగిరేవు
దినసరి కూలీకైనా
మేథో వలసలకైనా
ప్రతిరూపం నువ్వు//  //

ఈ కరోనా కష్టంలో
కాలి నడక పట్టేవు
తిరుగు ముఖం పట్టేవు
నీ అరికాలిలో గీతనై
నీ అరచేతిలో కాయనై
ఋణం తీర్చు కోవాలి
నీ వ్రణం మాన్పు కోవాలి //   //

నీతోనే ఉంది జగతికి ప్రగతి
నీలోనే ఉంది భవితకు సద్గతి
నువ్వు లేకుంటే మరలా రాకుంటే
కార్ఖానాలు భూగర్భాలు
భవనాలు భువనాలు
ఏమైపోవాలి ఎలా పని చేయాలి
నీ నుదుటి స్వేద బిందువులు
శ్రమైక రణ నిన్నాదాలు /
త్వరలోనే తిరిగి రావాలి
నీ తోనే ముందుకు సాగాలి/  //



Sunday, April 19, 2020


సీ.
కడగంటి చూపైన కడుపావ నమ్మంటి
       ముక్కంటి వాల్గంటి మ్రోల నంటి
కలకంఠి! కష్టాలు కనమంటి వినమంటి
     ఆమంత్రణమొకటె యడుగు చుంటి
నిన్నంటి నీ మంత్ర నియతితో శ్రీ యంత్ర
     మంటి నిల్చుంటి నోమంటి యుంటి
పూవింటి కరమంటి పొడగంటి  లేరంటి
             నీవంటి వేల్పు మన్నించ మంటి
తే.గీ.
మంచు కొండలపట్టి మమ్మంటిపట్టి
కామితార్థము లిచ్చి నన్ గావమంటి
నా మనవి వినమంటి  యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 35

సీ.
ప్రతిజీవికీ యుండు ప్రాణ భయమ్మంచు   
  బ్రతుకంగ వెరతురే ప్రజలు భువిని
ఊపిరాడు వఱకు యుండును నాదను
      వాదమే వేదమై వరలు చుండు
కోటి విద్యలు కూటికొఱకను యెఱుకచే
       కుక్షింభరిత్వాన కుములు చుండు
సంసార సాగర సాహసపు సరంగు
     తానగుచు నగుచు తవులు చుండు
తే.గీ.
ధ్యాస నింకేడ నీపైన తాల్చ గలడు
రూక పై ధ్యాసతో ప్రతీ రోజు గడువ
ఆ పయనమెట్లు సాగు నానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.37

సీ.
 మరణమే  శరణమా  మాతృమూర్తీ నీదు
      చరణ యు గళమేల శరణు నీదు
ధన మాన నష్టముల్ తప్పవా నీ యుపా
     సనలకు ఫలితమా సాధు హృదయ
యుపకార బుద్ధియే యుండిన చాలునే
     ధన మవసరము కా దందువా కా
మేశ్వరీ మందిలో మేముండ గల్గంగ
     విలువ నిమ్ము కొదువ వీడనిమ్ము
తే.గీ.
నందు కాత్యాయనీ! కరుణాంతరంగ!
కామితార్థము లిచ్చి నన్ గావుమమ్మ
నమ్ముకొంటినే నిన్ను యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 38
   




Saturday, April 18, 2020


సీ.
ఇంటిల్లి పాదినీ యింటికే కట్టడి
జేసిన జేజమ్మ చిరు కరోన
జగతి కంతకు నంటి జనత యందరి కంటి
కన్నీటి బిందువేగా కరోన
వలస బ్రతుకుల వెతల గతుకుల బాట
పట్టించి నట్టి జబ్బా కరోన
స్వ పర భేదము లేక సకల జనుల చుట్టి
ముట్టిన రోగమేమో కరోన
తే.గీ.
జగతి నంతను స్థంభించి చతికిల బడ
జేసిన రుజావతారమీ సిరి కరోన
మందు మాకులు లేనిదీ మాయదారి
రోగము కరోనా తెలియరో కరోన.

Thursday, April 16, 2020


     వలస కూలీ

కడుపు చేత పట్టుకొని
కానకళ్ళన బ్రతుకు తెరువు కోసం
దూరాభారాలను మరచి మైమరచి
చేతికి తగినంత పనికోసం
పనికి తగ్గ పైకం కోసం
 రొక్కం కోసం
గుడిసెల్లో బ్రతుకు వెలారుస్తూ
నాలుగు రూకలు పోగేస్తూ
పిల్లల కోసం అమ్మా నాన్నల కోసం
వలస కూలీనైనా.
ఇదిగో ఈ మాయదారి కరోనా
మా కడుపులు కొట్టింది
పనీ పాటా లేకుండా పడి ఉండమంది
పొద్దస్తమానం కాళ్ళు జాపుకు కూచ్చుంటే
పెళ్ళాం పిల్లలేే తనుపు కొస్తారు
ఒంటరిగా ఎక్కడో చచ్చేకన్నా
నా వారి మధ్యనే చావడం మేలన్నా
అందుకే వందలు వేల మైళ్ళ దూరమైనా
పదండి సొంతూరుకు నడిచే పోదాం
తిన్నా తినకున్నా అది మన వూరన్నా
బతికుంటే బలుసాకే తిందాం
కలో గంజో కుటుంబంతోనే పంచుకుందాం
మరణమైనా పుట్టి పెరిగిన నేల పైనే
బూడిదైనా నన్ను సాకిన మట్టిలోనే
కాదనకండి నా మాట వినండి
మమ్మల్ని ముందుకు సాగనివ్వండి
కాయం వల్లకాదంటున్నా
పయనం ముందుకే అన్నా
కావాలంటే మా వూరి పొలిమేరలో
ఆపేయండన్నా నిర్బంధించండన్నా
ఊపిరి పోయే లోగా ఊరు చేరి పోవాలె
కన్నోరి కన్నీటి వీడ్కోలు లో నే రాలి పోవాలె
వలస బతుకులు ఈ రీతిగా కడదేరి పోవాలె

Wednesday, April 15, 2020


సీ.
మేటిగా మముదీర్చి మెల్లగా నిలదీసి
                     మేలుగా మమ్మేల మేలమేల
మేలుకో వమ్మ మమ్మేలు కోమన్ననూ
                     మారదా  మనసేల మౌనమేల
రాతి గుండెల నాతి! రారాతి కూతురా
                    బిగిసి పోకె గిరిజ! బింకమేల
మంచు కొండల మించు మనసు కరుగబోదె
                   నించుకైన వలదె యీవి కావె
తే.గీ.
యిందు వదన! ఉదాసీన మెందు వలన
కతన మేమి కథన మేమి యాలమేమి
నా నుడి వినవే తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.31
సీ.
మందరమణి శక్తి మరు క్షితి యగ్నిఖండ
                    మనగ హ్రీంకార మగును తుదిని
రవి శశి స్మర హంస రాజను సంకేత
               ములు సౌర్య ఖండమౌ ముదముగాను
ఆ పరా మార హరాక్షరములు సౌమ్య
               ఖండ ము లవియె త్రిఖండములు మొ
దల రెంటి నడుమ రుద్రగ్రంధి మలి రెంటి
                    నడుమ విష్ణుగ్రంధి నా జివరను
తే.గీ.
నలువ గ్రంధుల స్థానముల్ నచట నుండ
భద్ర హ్రీంకార యుక్తమౌ పంచ దశివి
నా మతి గనవే తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 32.

సీ.
పండ్రెండు రేకుల పద్మము దిగువన
             జ్యోతిర్ తమిశ్రమను యుగళ ముండు
ఆజ్ఞా విశుద్ధిలందా రవి ద్యుతి స్పర్శ
               చే జ్యోత్స్న గనరాదు చీకటుండు
దశశత పద్మ మంతా చాంద్రి యే నట
                నిత్య కలా యుక్త నేత్ర యోని
పరమాకలను వసింపగ యాజ్ఞ వరకుండు
                 పంచదశ కళలు పావనముగ
తే.గీ.
చంద్ర సూర్యాగ్ని కళలె శ్రీ చక్ర మగును
యయిదు పది కళల్ పంచ దశాక్షరనెడి
నా యెరుక నీవె తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి. 33
సీ.
మధుకృత మధువృష మర్మ మెఱిగిన గాని
        వాంఛితార్థములను వడయ రనుచు
శ్రుతి సూక్తి గాన పరోక్షము నవ్వాని
         తేట తెల్లమగు నట్లు తెలియ నిమ్ము
తొలి మూడు చక్రాల నోజ చీకట్లుండు
            మిశ్రమ లోకమై మిగులు నెపుడు
విశుద్ధి చాంద్రమౌ  విమల  యాజ్ఞయె సుధా
             లోకమౌనని జెప్పు లోకరీతి
తే.గీ.
'క' 'ల' ల నడుమ వర్ణాలనే కళ లంచు
స క ల యక్షమాలాత్మికమ్ము సవివరముగ
నా కెఱుక నీవె తల్లి యానందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.34.

సీ.
పక్షాంత పర్యంత పంచ దశ నిశలు
        దర్శ ద్రష్టాదుల తత్వ మెఱిగి
పక్షాంత తదుపరి పంచ దశ నిశలు
     సుత సున్వతీ ప్రసూత్సర్వ మెఱిగి
సంజ్ఞాన విజ్ఞాన    చతురము లగునట్టి
    పదునైదు పేర్లతో పగలు వరలు
బహుళ పక్షమునందు ప్రష్టుతమాదిగా
    పదునైదు పేర్లతో పగలు వరలు
తే.గీ.
త్రిపుర సుందరీ కామేశ్వరీ మొదలగు
నిత్య లను సరఘలనుచు నెఱుక గలిగి
నా మనసు నేర్వ నీవె యానంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.36.




Thursday, April 9, 2020


కలకాలం ఒకేలా సాగనిదే కాలం/
రాజే కింకరుడగు కింకరుడే రాజగు/
అది కాలానుకూలం/
చేతలతో చేతులతో ఇచ్ఛాపూర్తికి మనిషి/
నింగిలో నీటిలో భూమిలో నేలపై/
ఉన్న వనరులన్నీ దోచేస్తుంటే  ఈ ప్రకృతి/
మౌనంగా అకృత్యాలు ఆగడాలు భరించింది/
ఆ మూగ రోదనలు ఆవేదనలు శాపనార్థాలు/
ఊరికే పోవు వాటికీ తమ వంతు వచ్చింది/
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని.../

చైనాలో తనంత తానే పుట్టిందో మరేదో ఏమైతేనేం/
ఓ మాయదారి మహమ్మారి అంటురోగం కరోనా/
ఇంతింతై అని చివరికి ఇందు గలడందు లేడని అన్నట్టు/
ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచాన్ని శాసిస్తోంది./
ప్రపంచానికి పెద్దన్న అమెరికా విలవిల లాడింది/
స్పెయిన్ ఇటలీ ఇలా ఒకటేమిటి నరజాతి సమస్తం/
గజగజలాడుతోంది గుండె దిటవు కోల్పోతోంది/
ఏ మందూ మాకూ దీని ముందు కొరగావు/
జనజీవనం పూర్తిగా స్తంభించింది/
ప్రతి కుటుంబం ఇంటికే పరిమితం అయ్యింది./

 పిల్లలతో అచ్చట్లు ముచ్చట్లు వ్యాపకమయ్యింది/
నిద్ర కన్నెరుగని ప్రతి రహదారి నిస్త్రాణంగా పడి వుంది/
గాలికి రోగం నయమైంది స్వచ్ఛత పెరిగింది/
బయట తిండి పోయింది. ఇంటి వంటే మిగిలింది/
రోగాలు రొచ్చులంటూ హైరానా తగ్గింది/
ఇన్నాళ్లూ పెత్తనం చెలాయించిన మానవుడికి/
మనుగడయే ప్రశ్నార్థకమయ్యింది/
రెక్కాడితేనే గాని డొక్కాడని మనిషికి/
గతిలేని బ్రతుకుతో కడుపు కాలింది/
ధనికులు అధికులు పతితులు తేడా లేదంది/

ఆర్థిక మాంధ్యం నేనున్నానంటూ ముస్తాబవుతోంది
ఒక్క కణం మూడో ప్రపంచ యుద్ధం ప్రకటించింది
ఇప్పుడు మనిషిని ప్రకృతి శాసిస్తోంది
ఎన్ని ఉపద్రవాలొచ్చినా మనిషి మారేది లేదు
గండం గట్టెక్కగానే దుడ్డు పెత్తనం మొదలౌతుంది
కుక్కతోక వంకర. కాదుకాదు. మనిషి బుద్ధి వంకర
మాయదారి కరోనా వరమా ఇదో శాపమా?

Wednesday, April 8, 2020


ఏ మందూ లేని ఓ కరోనా
ఏమందునే నిన్ను కోవిదా
నీ ముందు జగతి జడిసింది
నిన్ను తాకితే 'మైల' వస్తుంది
అందుకే
మడి పాటించమని బామ్మ చెప్పింది
కరచాలనం మాని దండం పెట్టమంది
మా జైనులు చూడు ఎప్పుడూ
ముహపట  కట్టుకుంటారే
అదే ఇప్పుడందరికీ వరమైంది
భారత దేశం భగవద్దేశం
ఇక్కడ నీ ఆగడాలు సాగవు
కాళ్ళు చేతులు నోరూ కడగందే
బయటనుంచి ఇంట్లోకి రాము
మా సంప్రదాయాలు అలవాట్లు
అవే నీ ముందరి కాళ్ళ బంధాలు
అన్నీ మూసుకుని కూర్చోవాలన్నా
అది భారతీయులకే సాధ్యం
మా ఆధ్యాత్మిక సాధనలో అదో భాగం
నువ్వెంత మహమ్మారి వైనా
మేమేమీ ఏమారి పోము
పొరుగు వాకిట నుంచి దొంగలా
వచ్చిన నీకు చావిక్కడే తెలుసుకో
మా సంస్కృతి సంప్రదాయాలే
మాకు ముమ్మాటికీ శ్రీ రామరక్ష.

Tuesday, April 7, 2020



కావాలనే మొహం చాటేసిన మొన్నట్నుంచీ
అనుక్షణం నీ ఊహల ఊసుల జ్ఞప్తి నుంచి
నా మనసు తప్పించుకోలేక వివసమౌతోంది
పుస్తకాలు తిరగేస్తున్నా మస్తిష్కంలో నీ మాటే అలుక్కుపోయిన అక్షరాల పై అదే సిరినగవు
ఒంటరిగా కూర్చుంటే తుంటరిది నీ చిరునగవు
అందరికన్నా ముందుకు నడిపే నీ వచో బిగువు
నా కోసం కాకున్నా నీ కోసం రేబవలు శ్రమిస్తా
అనుకున్నది సాధిస్తే అభ్యంతరాలు వదిలేస్తే
అనునయంగా ఆప్యాయంగా ఆదరిస్తే ఆదమరిస్తే
అదే జీవిత సాఫల్యం అదే నీ నా అంతిమ లక్ష్యం
మార్గదర్శివి నీవైతే మార్గానుగామిని నేనౌతా.