Thursday, April 9, 2020


కలకాలం ఒకేలా సాగనిదే కాలం/
రాజే కింకరుడగు కింకరుడే రాజగు/
అది కాలానుకూలం/
చేతలతో చేతులతో ఇచ్ఛాపూర్తికి మనిషి/
నింగిలో నీటిలో భూమిలో నేలపై/
ఉన్న వనరులన్నీ దోచేస్తుంటే  ఈ ప్రకృతి/
మౌనంగా అకృత్యాలు ఆగడాలు భరించింది/
ఆ మూగ రోదనలు ఆవేదనలు శాపనార్థాలు/
ఊరికే పోవు వాటికీ తమ వంతు వచ్చింది/
చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని.../

చైనాలో తనంత తానే పుట్టిందో మరేదో ఏమైతేనేం/
ఓ మాయదారి మహమ్మారి అంటురోగం కరోనా/
ఇంతింతై అని చివరికి ఇందు గలడందు లేడని అన్నట్టు/
ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచాన్ని శాసిస్తోంది./
ప్రపంచానికి పెద్దన్న అమెరికా విలవిల లాడింది/
స్పెయిన్ ఇటలీ ఇలా ఒకటేమిటి నరజాతి సమస్తం/
గజగజలాడుతోంది గుండె దిటవు కోల్పోతోంది/
ఏ మందూ మాకూ దీని ముందు కొరగావు/
జనజీవనం పూర్తిగా స్తంభించింది/
ప్రతి కుటుంబం ఇంటికే పరిమితం అయ్యింది./

 పిల్లలతో అచ్చట్లు ముచ్చట్లు వ్యాపకమయ్యింది/
నిద్ర కన్నెరుగని ప్రతి రహదారి నిస్త్రాణంగా పడి వుంది/
గాలికి రోగం నయమైంది స్వచ్ఛత పెరిగింది/
బయట తిండి పోయింది. ఇంటి వంటే మిగిలింది/
రోగాలు రొచ్చులంటూ హైరానా తగ్గింది/
ఇన్నాళ్లూ పెత్తనం చెలాయించిన మానవుడికి/
మనుగడయే ప్రశ్నార్థకమయ్యింది/
రెక్కాడితేనే గాని డొక్కాడని మనిషికి/
గతిలేని బ్రతుకుతో కడుపు కాలింది/
ధనికులు అధికులు పతితులు తేడా లేదంది/

ఆర్థిక మాంధ్యం నేనున్నానంటూ ముస్తాబవుతోంది
ఒక్క కణం మూడో ప్రపంచ యుద్ధం ప్రకటించింది
ఇప్పుడు మనిషిని ప్రకృతి శాసిస్తోంది
ఎన్ని ఉపద్రవాలొచ్చినా మనిషి మారేది లేదు
గండం గట్టెక్కగానే దుడ్డు పెత్తనం మొదలౌతుంది
కుక్కతోక వంకర. కాదుకాదు. మనిషి బుద్ధి వంకర
మాయదారి కరోనా వరమా ఇదో శాపమా?

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home