Thursday, December 31, 2015

                                  ఎదురుకోలు (సుస్వాగతం)cake)

సీ .  కుంఫిణీ  దొరలంట గట్టిన వేడుక/   ఆంగ్ల నూతన వత్సరాది  అదియె 
       విశ్వమంతయు విస్తరించిన ఘనతతో /  వర్ధిల్లు యీ హూణ వత్సరాది 
       జనత నంతను ఒక్క త్రాటను కట్టిన /  వసుధైక వేడ్క యీ వత్సరాది 
       కుల మత వర్గ విభేదముల్లేకుండ/ వన్నెకెక్కిన యీ వత్సరాది 
తే. గీ. ఎల్ల జనులను కావదే ఎదురు వచ్చి 
         స్వాగతం బిదె నీకు ఓ వత్సరాది 
         గుండె లోతుల పరికించి  గురుతు గాను 
         సర్వ జన సఖ్యతల నీవె సామ్య వాది. 
సీ.     నిశరాత్రి వేళలో నిగిడించి నినదించి /  ఎదురుకోలు పలుక లేను నేను 
        దీపాల నార్పుతూ కేకులన్ కోయను! / హిమ మధుర తరక (cake)లింపు గావు  
        చెన్నపురి లేను   తిరుపతి లడ్డు గ్రహింప / తి.తి.దే. వారిట  చేయరిట్టి పనులు
        రంగ వల్లుల నీకు స్వాగతా లింటింట /  తెలిపెదరు గద! మా తెలుగు నాట 
తే. గీ .  రావె చాన్నాళ్ళు గడిచె నీ రాక కిపుడు 
           రావే బాల సూర్య కిరణ రాశి వోలె 
           రావే శుభ సుఖ మాయ తలిరాకు బోలె 
          రావే మాయింటి మహాలక్ష్మి రావే! రావే!.   
 (హిమ మధుర తరగ=cake)
At TTD information centre, venkata narayana Road T.Nagar Chennai Tirumala Laddu will be sold)

Wednesday, December 30, 2015

                                      వీడ్కోలు 

ద్వి సహస్ర పంచ దశాబ్దమా 
కదలు బెట్టు మాని కదలు నీలుగులు మాని. 
ఎన్నెన్ని వ్యధలు, గుండె కోతలు 
పంచావు ఈ అవని పై అందరికీ 
చాలు చాలు నీ నిర్వాకాలు 
నీ కిదే మా వీడ్కోలు. 
వ్నక్కి తిరిగి చూడకు 
యీ వసుంధర ముఖాన  యింకా 
రక్తపు మరకలు చెరిగి పోలేదు 
ఉగ్రవాదులు, తీవ్రవాదులు, కామందులూ 
పెట్రేగి పోయారు నీ నీడలో 
నిర్భయంగా నిర్భాయను అతి క్రూరంగా చెరచిన 
ఆ సప్తదశ వయః కామపిశాచి 
యదేచ్చగా తిరుగుబోతులా 
తిరుగమని చెరసాలనుంచి వదిలేసావు. 
మరో ఖండంలో వలసల వెల్లువలో 
సాగర తీరానికి కొట్టుకొచ్చిన పసివాణ్ణి చూసి 
మానవ జాతి ముక్కున వేలేసుకుంది 
తుపాకీల ఫిరంగుల మోతలు ఒక మూల 
గగనతలంలో విహంగాల విధ్వంసాలు 
యిలా తలంలో భూ ప్రకంపనలు, తుఫానులూ 
జలధి తరంగాల పై విస్ఫోటాలు 
ఎన్నెన్ని మారణ హోమాలు చేయించావు 
ఎన్నెన్ని ఆయువులు పెరికించావు. 
మన నేలపై గాది కింద పంది కొక్కులు 
గాదెలు ఖాళీ చేసేసి కూడా 
లబోదిబో మని ఏడ్పులు 
అసహనం పెరిగి పోయిందంటూ 
'స్వ' భావాని అందరిపై రుద్దారు 
కంటి నీటి తుడుపుగా 
అమరావతిలో విజయ దశమి 
ఏడాది చివరలో 
లాహోర్లో విందు 
ఒక అయుత చండీ యాగం
అవే మాకు మిగిలిన తీపి గురుతులు 
చాలు చాలు నీ నిర్వాకాలు 
నీ కిదే మా వీడ్కోలు.   
 

Monday, December 28, 2015

సగటు మనిషిని నేను 


మరొకరి ఆనందాలకు నే పుట్టాను
వేరొకరి అవసరాలకు పనిచేసాను
ఇంకొకరి స్వార్ధానికి బలి అవుతున్నాను
నా జన్మకు అర్ధం నాకైతే తెలియదు
నా ఖర్మకు కారణం కూడా తెలియదు
దేనికీ కర్తను కాను నేను
పెద్ద వ్యవహర్తను కూడా కాను నేను
అయినా ఆగని ఆరాటం
ఏదో చేయాలని పోరాటం
మంచి పని చెయ్యాలని
పదిమందికి ఉపయోగ పడాలని
అనునిత్యం యత్నించే
సగటు మనిషిని నేను.