Sunday, September 18, 2016

కిమ్ కర్తవ్యమ్ 


కాకిలా కలకాలం బ్రతికే కన్నా
హంసలా కొంత కాలమే బ్రతకాలనుకున్నా
చావు పుట్టుకలు మన చేతుల్లో లేవని తెలియనప్పుడు
అవి మన చేతల్లోనే  కానీ చేతుల్లో లేవని తెలిసినప్పుడు
కిమ్ కర్తవ్యమ్ అని ఎంతో  చించి, ఆలోచించి
పరసుఖానందం కోసం ప్రయత్నించా
నిజంగా 'పర సుఖానంద నాధా' అనే దీక్షా నామం
అయాచితంగా వచ్చింది.

పరోపకారార్ధం ఏదైనా చెయ్యాలనిపించి
ఒక గుడి బాగు చేయిస్తున్నా
ఒక బడి నేనే నడిపిస్తున్నా
ఆ గుడికి ఆ బడికి నాకు
ఎనలేని అనుబంధం
విలువ కట్టలేని సంబంధం.

పదిమందిని పోగేసుకుని
పిచ్చ్చాపాటీ వాగేకన్నా
నాలుగు పద్యాలు వ్రాసుకున్నా
చదువుకున్నా మేలనిపించింది
ఇంకేముంది
కాగితాలు నింపేసా
దీర్ఘ నిశ్వాసం వదిలేసా 

కాల చక్రం ఒక ఆవృత్తి గడిచింది
అరవై వత్సరాలు గడిచాయి
రెండో తడవ లో ఇంకా
ఏవైనా చెయ్యాలని పిస్తుంది
చేతిలో దురద ఎక్కువయ్యింది.
  కిమ్ కర్తవ్యమ్ ? అదే ప్రశ్న
పునరపి జననం పునరపి మరణం. 

Saturday, September 17, 2016

నీవు నేర్పిన విద్య నీరజాక్షా 


అమ్మ నేర్పిన పలుకు
నా తీయ తేనెల తెలుగు పలుకు
నాన్న నేర్పిన ఓనమాలు
బడిలో గుడిలో నా వాచకాలు.

వడిగా వడివడిగా
తప్పటడుగులేస్తూ
పడిలేస్తూ నేర్చుకున్న
నా నడకా నడతా
తీర్చిదిద్దిన తల్లితండ్రుల
అభీష్టం మేరకు సాగినా
గురువులు నేర్పిన
గురు లఘువులు పద్యాలైనా
పాటలైనా పల్లె పదాలైనా
వారికే అంకితం

ఉన్నత పాఠశాలలో ఆంగ్లం నేర్పిన
ప్రధానోపాద్యాలుకు పదేపదే  వందనాలు
జీవితం పరమపద సోపానం గా మార్చిన
ఆధ్యాత్మిక గురువర్యులకు సాష్టాంగ ప్రణామాలు
ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా
నీకే అంకితం
నీవు నేర్పిన  విద్య నీరజాక్షా .