Sunday, October 29, 2017


తెలిమంచు తెరలలో
తొలి పొద్దు వెలుగులో
పచ్చిక బీడులో తళతళ
మెరిసే మంచు ముత్యమా
నా మనసును దోచిన నేస్తమా //   //
నా హృదయాకాసంలో ఉదయించే
అరుణారుణ యిన బింబమా
నా ఆవేశపు మంటలు చల్లార్చే
శీత శరదిందు బింబమా
నా ఆర్తిని కనుమా
నా మాటను వినుమా//   //
నా పలుకుల పల్లకిలో
ఊరేగే ఊహల రూపమా
నా తలపుల వల్లరి వై
ఊసాడే ప్రియతమ నేస్తమా
నా పిలిపును వినుమా
నా తలపులు కనుమా //    //

Thursday, October 26, 2017

  • సగటు మనిషి

ఎడారిలో
గుడారమై బిడారమై
నిరాశలో
 వికారినై బికారినై
నిశీధిలో
ఒంటరినై తుంటరినై
సంసార సాగరాన్ని
ఈదలేక వీడలేక
సాయుజ్య మార్గాన
సాగలేక ఆగలేక
ఎటూ పాలుపోక
ఎదీ వీలుకాక
వెన్నల మంటలలో
కన్నుల పంటలుగా
అలసి నేనున్నా
కలసి రావన్నా.
ఏకాంతంలో
సన్యాసినై బైరాగినై
ప్రశాంతంలో
సంసారినై సామాన్యుడై
జనాంతికంలో
యోగినై నియోగినై
ఈ జన సామాన్యంలో
బ్రతుక లేక వెతుక లేక
ప్రకృతి ఒడిలో
నిలువలేక మిగులలేక
నింగి వరకూ ఎగుర లేక
నేల పైనే ఉండ లేక
 అంతరిక్షమే అంతరంగమై
అవనీ తలమే మూలాధారమై
సాలోచనగా
సావధానంగా
పరికిస్తూ పరిశీలిస్తూ
కాలం గడిపే
కలలు కనే
సగటు మనిషిని నేను.

Sunday, October 22, 2017

తేట (తెలుగు) గీతి

   తేట (తెలుగు) గీతి

మధువొలకబోయు  నవలా సుమధుర చూడ్కు
నవనవోన్మేష దరహాస  నాట్య లతిక
మిసిమి మై చాయ పసిడి సమ్మిళిత తళుకు
తీయ తేనెల యేష నా తెనుగు భాష.

లలిత లలిత పద కవితల విర బూయు
హరికి ప్రీతిగా మిగిలిన  ఆంధ్ర భాష
సరిగమల లాహిరీ గమన సరస సరసి
తీయ తేనెల ఘోష నా తెనుగు భాష.

పలుకు ఆపాత మధురమై పరిఢ విల్లు
కులుకు కిన్నెర సాని సోకు విల సిల్లు
తళుకు తెమ్మెర వినసొంపు తనివి తీర
తేనె లొలుకు పాల్గారు నా తెనుగు పలుకు.

కలికి జూపుల నెఱజాణ కవన వీణ
 నిముర నునులేత జెక్కిళ్ళ నిత్య నూత్న
ఒనరు నెత్తావి గుమఘుమ లొల్కు పల్కు
తీయ తీయని మావి నా తెలుగు యీవి.

విశ్వ మంతట వినిపించు విపుల చరిత
దశ దిశల నినదించు యందాల క్వణిత
వినుత ఘనతర వైభవ విశ్వ విదిత
తేనె తొనలన దగును మా తెలుగు కవిత.
(ఏష = గమనము , క్వణిత = వీణానాద ధ్వని)

Saturday, October 21, 2017

  భ్రమర విలసనము

సీ. తీయ తేనెల  పూవు నెత్తావి త్రావి మ
                త్తెక్కి నెత్తెక్కి తై తక్కలాడు
     ఆరుగాలమెగరేటి తిరిగేటి మిసిమి
                మైచాయ కసుగంద మై మరచునొ
     భ్రమర నాదము కన్న ప్రణవ నాదము మిన్న
                 ద్వి చతుష్పదు లెన్న  తేటి మిన్న
       బ్రహ్మ విద్య వినా చదువు లందు భ్రామరీ
                  విద్య మిన్న యనండ్రు విజ్ఞు లెల్ల
తే.గీ. భ్రమర గీత ఆ గోపికా ప్రేమ గీత
         భ్రమర నాదము నెడద సంభ్రమము గొలుపు
         భ్రామరీ విద్య తొలగించు భ్రమల నెల్ల
         భ్రమరమే మార్గ దర్శి శుభ్ర గుణ వతుల.
                           

Thursday, October 19, 2017

సహనా వవతు

భూమి అంటే మట్టి
ఆ భూమి లోంచే మాణిక్యం పుడుతుంది
అనేక జీవరాశులకు ఆహారం ఇస్తుంది
నిరంతరం పరిభ్రమిస్తూ పరిశ్రమిస్తుంది
పరోపకారార్థం ఇదం శరీరం అని నమ్మతుంది.
ఆ భూమికి ఆధారం అడక్కు అవసరం లేదు
సూర్యుడు ఉదయించడు అస్తమించడు
అసలు కదలడు మెదలడు
అయినా భూమి ఆ గొప్పని వదులుకుంది
తన వలన ఈ జీవరాశి బ్రతుకుతోంది
అదే భూమాతకు మిగిలే తృప్తి స్వస్తి.
కాని అంత ఉన్నత స్థితికి ఎదగాలి కదా
రికామీగా కూర్చుంటే ఏమీ సాధించ లేవు
నీకో లక్ష్యం ఉండాలి సాధించాలనే  తపన ఉండాలి
నిన్ను నీవు మలచుకో లేవు కనుక గురువు కావాలి
గురువుపై శిష్యునుకి గురి
శిష్యునిపై గురువుకు వాత్సల్యం ఉండాలి
కొలిమిలో కాలి సమ్మెట దెబ్బలు తినకుండా
ఇనుప చువ్వ ఆయుధం కాలేదు
సుతిమెత్తని ఉలి దెబ్బలు పడకుంటే
ఏ ఏకశిల శిల్పం కాలేదు
తత్కాల ఆనందాలు సరదాలు
అతినిద్ర అతి విశ్వాసం బద్ధకం
నీ దారిలో ఎదురయ్యే అవరోధాలు
తప్పుకుంటూ తప్పించుకుంటూ
తదేక దృష్టితో నిర్దేశిత గమనంతో
నీ పని నువు చేసుకు పోవాలి
అపజయాలు ఎదురైనా అవరోధాలు అడ్డొచ్చినా
ఏదో ఒక రోజున విజయం నిన్ను వరిస్తుంది
అప్పుడు సమాజం తప్పకుండా నిన్ను గుర్తిస్తుంది
ఇప్పుడు ఏమంటావు? నువ్
శిల్పం కాగలనంటే శిల్పిని నేనౌతా
ఆయుధం కాగలనంటే కమ్మరి నేనౌతా
కలసి పరిశ్రమిద్దాం లక్ష్యం సాధిద్దాం
ఏమంటావ్ ? ఇంకా ఏమంటావ్ ?

Wednesday, October 18, 2017


Pranks may be pretty
plans may be plenty
but time is not aplenty
opportunity is slippery
it leads to adversity.
So
forgo all wishes petty
pack them up as
foolish desires
grab every chance
dedicate every moment
put your efforts vigorously
then pray God for help
sure its the way to SUCCESS.

Tuesday, October 17, 2017


చిరు నవ్వుల పలు వరుసల
  సిరి దివ్వెల తిల తైల దీపాల
సరి క్రొత్త వెలుగుల కొంగ్రొత్త ఆశల
వరద తుఫాను ల నరకాసుర సంహార
సంరంభం కోలాహలం దీపావళి
కోటి దీపాల కాంతుల వెలుగు
నా భరతావని నలుదెశల కలుగు
ఆనంద సందోహ దీపావళి
సకుటంబ దివ్య జ్యోతుల కేళి
ఆయురారోగ్య దాయిని యై
ఆ వత్సరం మిమ్ము బ్రోచు గాక.

Saturday, October 14, 2017

నాహం కర్తా

ఆశకు అంతేమిటి
అవకాశాలకు లోటేమిటి
దృష్టి పెడితే ధ్యాస కుదిరితే
ఆశయాలూ అంతిమ లక్ష్యాలూ
ఏదైనాఎంత దుష్కరమైనదైనా సాధ్యమే
ఎత్తు పల్లాలు అవాంతరాలు
ఎన్ని ఎదురైనా ఏటి కెదురీదినా
సంకల్ప బలం దైవ బలం తోడుంటే
మిన్ను నిన్ను కాదనదు
మన్ను నిన్ను వలదనదు
గమనం నీది గమనిక పై వానిది
సమరం నీది సమయం పై వానిది
కదలిక నీది అమరిక పై వానిది
సాధన నీది దీవెన పై వానిది
ఆచరణ నీది ఆదరణ పై వానిది
ప్రతి కదలిక ప్రతి మెదలిక
అంతా ఆ ఈశ్వరేచ్ఛ
అంతా ఆ విశ్వ విభు ఆజ్ఞ
అందుకే
'నాహం కర్తా హరిః కర్తా'.

Saturday, October 7, 2017


ఆమె
నా కోసం పరితపిస్తుంది
నన్నేమో పరిహసిస్తుంది
చిరునవ్వు తో పలుకరిస్తుంది
చిరుబురు మంటూ పరుగు తీస్తుంది
నా కోసం ఎదురుచూస్తుంది
ఎదురు పడితే మోహం చాటేస్తుంది
బ్రతిమ లాడించు కోవడం ఓ సరదా
ప్రతిమలా ముంగిలా ఉంటుంది సదా
తన కోసం వెంపర్లాడాలనీ
కాలుగాలిన పిల్లిలా తిరగాలనీ
ఆశ పడుతుంది ఆరాట పడుతుంది
నచ్చితే అచ్చట్లు ముచ్చట్లు
అంతలోనే అలుకలూ మూతి విరుపులు
నా తోటలో విరబూసిన గులాబీ
నా పాటలో అరవిరిసిన  సారసి
నా ఎద దోచిన దివిజ గంగా భవాని
తలపు తలపులో పరిభ్రమించే జాహ్నవి
'శివోహం' అనటమే కాని
నా జటాజూటమున బంధించ గలనా
నా వాజ్గ్మనో కర్మలచే నిర్దేశించ గలనా?

Monday, October 2, 2017



నీ ..ఎదలో సొదనై
నీ.. కథలో వ్యధనై
      మదిలో రొదనై...
తుమ్మెదనై..తూనీగనై
తారాడనా.. పోరాడనా //   //
నీ...కంటి కన్నీరునై
నీ... వంటి కనుదోయినై
. పంటి గాయమునై
వేదననై.. వాదననై
జాలువారనా నేలరాలనా//   //
నీ.. తలపు తెమ్మెరనై
నీ ...పిలుపు తిమ్మిరినై
       వలపు వెల్లువనై
విహంగమై.. కురంగమై
విహరించనా..వివరించనా.. //   //

ఉద్యమిస్తావా ? ఉదయిస్తావా ?


ఎండ ఎంత కాసినా అది వెన్నెల కాలేదు
వాన ఎంత కురిసినా జలపాతం కాలేదు
ఎదపరచి ఎదురేగి ఎంతగా స్వాగతించినా
మయి మరచి మది తెరచి నీవెంత సాకినా
నీ మనసెంత తల్లడిల్లినా ఎంత  అల్లాడినా
గమనించరు ,గమనించినా పరికించరు
వినిపించుకోరు వినిపించినా పట్టించుకోరు
అంతటి ప్రజ్ఞాన ఘనాపాఠీ ల కోసమా
అంతటి బృహత్ సుహృత్ జన హితమా
నీ కలల కాణాచి నీ ఆశల పిశాచి
ఎద ఎదలో రగిలే సొదలే వెతలే
మది మదిలో మెరిసే విరిసే ధ్యాసే
ఊపిరిగా ఒరవడిగా సవాలుగా
ఉద్యమిస్తావా
ఈనేలపైనే నీ నమ్మిన బాటలో
ఉదయిస్తావా
చిరు ఎడదల మమతల కోనలో
సుస్థిర మైత్రీ బంధం కోసం
ఆత్మీయ పితృస్థానం కోసం
పరితపిస్తూ పరిశ్రమిస్తూ
కర్మణ్యే వాధికారస్తే అని పని చేస్తావా
అంటీ ముట్టకుండా అందీ అందనంతగా
తామరాకు పై నీటి బొట్టులా నిలచేవా?



Sunday, October 1, 2017


వేదాలు వల్లించినా
ఉపనిషత్సుధ ఔపోసన పట్టినా
ఇతిహాసాలు మది విరబూసినా
అరిషడ్వర్గాలపై విజయం లేనిదే
ఆ చదువు నిరర్థకంబు
గమనించే వారుంటే
గజమైనా గర్జించాలా
ఈసడింపులూ అవహేళనలూ
బ్రహ్మ విద్యాధ్యాపనా నిర్దేశితాలా?
గ్రంథ చౌర్యాలూ వషట్కారాలూ
పాండితీ ప్రతీకలా
అధ్యాపన అధ్యయనాలలో
అనువు కన్న చనువే మిన్న
చీదరించ బడ్డ వాడే
అంతే వాసిగా దక్కితే
ధృతరాష్టృడు అవసాన దశలో
భీముని కొంపలో తల దాచు కన్నట్లే
అందుకే
ఆదరంగా పిలచి
ఆనందంగా వివరించి
వంటబట్టేలా చేయడం మేలు