Sunday, October 22, 2017

తేట (తెలుగు) గీతి

   తేట (తెలుగు) గీతి

మధువొలకబోయు  నవలా సుమధుర చూడ్కు
నవనవోన్మేష దరహాస  నాట్య లతిక
మిసిమి మై చాయ పసిడి సమ్మిళిత తళుకు
తీయ తేనెల యేష నా తెనుగు భాష.

లలిత లలిత పద కవితల విర బూయు
హరికి ప్రీతిగా మిగిలిన  ఆంధ్ర భాష
సరిగమల లాహిరీ గమన సరస సరసి
తీయ తేనెల ఘోష నా తెనుగు భాష.

పలుకు ఆపాత మధురమై పరిఢ విల్లు
కులుకు కిన్నెర సాని సోకు విల సిల్లు
తళుకు తెమ్మెర వినసొంపు తనివి తీర
తేనె లొలుకు పాల్గారు నా తెనుగు పలుకు.

కలికి జూపుల నెఱజాణ కవన వీణ
 నిముర నునులేత జెక్కిళ్ళ నిత్య నూత్న
ఒనరు నెత్తావి గుమఘుమ లొల్కు పల్కు
తీయ తీయని మావి నా తెలుగు యీవి.

విశ్వ మంతట వినిపించు విపుల చరిత
దశ దిశల నినదించు యందాల క్వణిత
వినుత ఘనతర వైభవ విశ్వ విదిత
తేనె తొనలన దగును మా తెలుగు కవిత.
(ఏష = గమనము , క్వణిత = వీణానాద ధ్వని)

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home