Friday, June 30, 2017

   ఊహల వల్లరి
'నేను నాది' అనే ఒంటరి తలపు మానుకుందాం
ఒకరి కొకరుగా 'మనం' అంటూ మనగలుగుదాం
ఇచ్చిపుచ్చుకుంటూ ఇరుగు పొరుగౌదాం
పంచుకుంటూ ఉన్నదాన్ని పెంచుకుందాం
ఈవి లో ఉన్న హాయి ఇంకెక్కడా లేదని
ఇప్పటికైనా తెలిసి మసలు కుందాం
పొరపొచ్చాలు లేని ప్రాణ స్నేహితులౌదాం
కలిసి మెలిసి కడదాకా సాగుదాం
కలల నయాగరాలను నిజం చేసి చూపుదాం
ఊరి వారి కళ్ళన్నీ ఉసురు పోసుకోవాలి
ఊరించిన ఊహలన్నీ కట్టెదుట కదలాలి
ఆత్మీయంగా మనసారా పలుకరించుకోవాలి
ఒకరికొకరు భరోసాగా పులకించి పోవాలి
నమ్మకమే పునాదిగా ఎత్తులు ఎదగాలి
నవ్విపోదురు గాక నాకేటి వెరపని నిలవాలి
నవ్విన నాప చేను పండిందని చూపాలి
పదిమందికీ ఇకపై కనువిప్పు కావాలి

దేవదేవుని క్రీగంటి చూపులో పునీతులం కావాలి.

Tuesday, June 27, 2017


బలిమి నీవై చేవ నిస్తావా
నిగ్గు తేలిన నిజము మనమై
నేర్వ నేర్చిన గురు శిష్యులై
జయ కేతనం ఎగురవేద్దాం
కలిమి నీవై కలిసి వస్తావా
కపటమెరుగని కటుంబమై
అధ్యాపనాధ్యయన వారమై
జ్ఞానవిపంచిని మీటుదాం
చెలిమి నీవై చెంత కొస్తావా
స్వార్థమే లేని సంగడికారమై
అలుపే లేని జ్ఞాన పిపాసులై
అహరహం పరిశ్రమిద్దాం
మేలిమి బంగారమై మెరిసి పోతావా
తాలిమి సింగారమై మురిసి పోతావా
కాలుని కౌగిలిలో కరిగి పోతావా
కాలూని బరిలో కడదేరి పోతావా.

Monday, June 26, 2017

బాలవై ఆటాాడ రావే

ఆశల ఆమనిలో నునులేత రెమ్మవై పొటమరించి రావే
ఊహల ఉయ్యాలలో చివురంత నవ్వువై పలుకరించి పోవే
ఊసుల ఊటబావిలో సుజలధారవై ఉప్పొంగి పోవే
చూపుల సోయగాలలో అలుకల చూలివై అలరించి రావే
విరహపు వేసవిలో శిశిర తాపమై ఆకురాలి పోవే
కనలిన వేదనలో మనోభారమై అల్లాడి పోవే
పంతాల పర్వతాన బింకాల పట్టుగొమ్మవై పోరాడ రావే
బాలవై బేలవై నట్టింట నడయాడి నా ఎదుట ఆటాడ రావే
చూలివై అనుకూలివై మాయింట మసలి మాలోన కలిసి పోవే
శంకర జటాజూట వశంకరీ జాహ్నవీ మా మొగసాల శారద జ్యోత్స్నవై నిలచి పోవే
అమ్మలూ అని నోరార ఆరార నిను పిలువ నీవే
ఊకొడుతు ఉబలాట పడుతు నా మాట వినవే.

Friday, June 16, 2017

తెలుగుకు తల్లి ఎవరు

తీయ తీయని తెలుగుకు తల్లి ఎవరు

తీయ తేనెల తెలుగు బాసకు
సుందర మందార మకరంద
మాధుర్యంపు మాటల మాతృక ఏమి?
సంస్కృతంబని అనేకులనిరి
కాదు పొమ్మని ఇంకొంద రనిరి
ఎవరి వాదన వారిదైనా 
నిజము నిక్కచ్ఛిగా ఏమిటో!
సంస్కృతంబు కాదన్న సరసులు
కాసింత నా శంక తీర్ప గలరు
సంధులు, సమాసములు, అలంకారములు,
ఛంధస్సు లెన్నియో గీర్వాణ భాషలో వలె
కనిపించు వినిపించు ఇవి ఎరువు నగలె?
అక్క చెల్లెండ్రయిన ద్రవిడ బాసలిచ్చిన నగలె?
మనము వదరేటి బాసలో తెలుగు నూర్వంశమెంత?
లేమి యిక్కట్లచే ఎరువు తెచ్చిన మాటలెన్ని
అనాగరికమని విసిరి పారేసి నవి ఎన్ని
బల్మిచే దీవర కత్తి యై చొర బడిన వెన్ని
ఈనాటి గుండ్రపు అక్షరములు లేవు తొలుత
పీకి పారేతుమా ఇపుడున్న రూపమును
తొలి నాళ్ళ లిపి వెంట పరుగు లిడుచు?
బాస అన్నది పారేటి నది వంటిది
కొత్త వాగులు వచ్చి కలియ గలవు
పంట కాల్వలు వీడి పోగలవు.
జన్మ నిచ్చిన జననియే కలమితో నుండ
గుడ్డ కట్టెడి నేరుపెరుగదా ఆయమ్మ
పలుకు తీరుల నియమాల కేల ఆవంక చూపు
ఇరుగమ్మ పొరుగమ్మ ఎరువు నగ లేల
బాల సారె నుండి పాడి ఎక్కెడి వరకు
అమ్మ కాని సంస్కృత మేల ఖర్మ మయ్యె?
మరి
తీయ తేనెల తెలుగుకు తల్లి ఎవరు?

Thursday, June 15, 2017


సీ. వక్ర గమనమె గాని ఋజువర్తనమది
           ఎఱుగనే ఎఱుగదు జాహ్ణవెపుడు
     వృద్ధి క్షీణతలె గాని తిరము గా నుండదీ
            చోద్యంపు బాల మా జ్యోత్స్న వినరె
     మూతి విరుపులె గాని నగుమోము కనము
            లబ్ది పొందుటె గాని లబ్ద మిడదు
     నొచ్చు కోవుటె గాని మెచ్చు కోలెరుగదేలొ
            తెంపరి గాని వి వేకి గాదు
తే.గీ. ఇచ్చ వచ్చిన రీతి జీవించ గలరె
         మంచి తనమును వంచింప మాట పడరె
         ఓర్మి కైనను ఎంతెంత ఓర్మి మిగులు
         ఎపుడె రిగద వమ్మలూ వివేకి వగుచు.
         



Tuesday, June 13, 2017


నీ కంటి చారికనై
నీ పంటి గాయమునై
నీ మానస సారసినై
నీ తలపుల మూలమునై
నేనుండిపోనా
నీ గుండెనిండా//   //
నచ్చుకున్నా నొచ్చుకున్నా
నేనుంటా నీ వెంట
నామాటే నీ మాట
నీ పాటే నా పాట
ఓ బాలా నీవే బాల //   //
కసుగంది పోయినా
వసివాడి పోయినా
నే అల్లాడి పోనా
నే కల్లోల పడనా //   //
విజయ బావుటా ఎగరేసినా
ఉన్నత శిఖరాలు ఎక్కేసినా
వినూత్న ఆలోచనలు చేసినా
అడుగడుగునా నీతో నేనుంటా //   //

నిరీక్షణ


నీ కమనీయ కనుకొలకులలో
ఒక వేడి కన్నీటి బిందువై చారికనై
నేలరాలి పోతా ఈ మట్టిలో కలిసి పోతా
నీ యోషా నాసా పుటాలనుండి
ఒక దీర్ఘ నిట్టూర్పునై నిగిడి
నీ గుండెలు తాకుతా గాలిలో కలిసి పోతా
కింకర్తవ్యతా విమూఢత్వంతో
నీ కుడికాలి బొటన వ్రేలితో 
నేలపై గీసే అరసున్న నేనౌతా కడదేరి పోతా
నీ ఎడమ చేతి చూపుడు వేలికి
యిథమిథ్థమంచెరుక లేక
చుట్టుకొనే చీరకొంగు నౌతా వసివాడి పోతా
ఊహల కందని దూరాల పై 
అయోమయంగా చూసే చూపునై
అశృనయనాలుగా మిగిలిపోతా కనలి పోతా
మునిపంటితో నొక్కిన అధరాధర క్షతమునై
ఎరుపెక్కిన వాతెరనై అల్లాడిపోతా
ఒకరికి ఒకరుగా మనసారా
మాటాడుకునే సందర్భం కోసం
ఎన్నాళ్ళైనా నిరీక్షిస్తా పరీక్షిస్తా.

Monday, June 12, 2017


సీ. నిన్న నవ్వించావు నన్ను కవ్వించావు
     నేడేల ఓ బాల ఏవగింపు
    నిన్న వాదించావు నన్ను వారించావు
    ఇపుడేల ఓ బాల ఈసడింపు
    నిన్న కాదన్నావు నన్ను పొమ్మన్నావు
    ఈ వేళ ఓ బాల ఈశ్వ రేచ్ఛ
    నిన్న మాటాడావు నన్ను ఊరించావు
    ఇంతలో ఓ బాల ఎంత మార్పు
తే.గీ. బాల వై మది నుండ సంబరము గాదె
        ఎన్ని చేసినా నీమది గెలువ లేను
        దూర మయ్యాక గాని నా ఊహ కనవు
        చేర దీసిన వారె నీ మేలు కోరు.

సీ. నేను చూపిన బాటలో చని దీర్ఘ
        లోచని ఉన్నంత లోన ఎదిగి
     నే గిరి గీసి చూపించితే లక్ష్యాన్ని
         గురిచూసి నువు కొట్ట గలవు బాల!
     నానీడలోన నా తోడుగా సాగితే
         ఎత్తులూ అందలా లెక్క గలవు
     నినుగన్న నీతల్లి తానెంత మురియునో
         పొంగి తానుప్పొంగి పోవునప్డు
తే.గీ. జనని నయనాల పంటగా చరిత కెక్కి
        గురుని నియమాల పూబాల గా తరించి
         గురుని శిగలోన శశిరేఖ గురుతు గాను
         వరలి వర్థిల్లు జ్యోత్స్నా సు వాసి ననగ.
   

Saturday, June 10, 2017

మొక్కలు నాటుదాం

దినకరుని ఆగ్రహానికి అల్లాడినా
వరుణకరుణకు భువి ఆనందించినా
అది ఆ దివ్య శక్తులకు మనపైన ఉన్న
అవ్యాజాను రాగాల దయార్ద్రతల కన్న
ఒకరిది హెచ్చరిక మరొకరిది కనికరం
వెరసి మృగశిర కన్నా ముందే వాన చినుకులు
ఉష్ణ తాపం నుంచి ఉపసమనం
ఉక్క పోతల నుంచి విముక్తి
ఎంత చెప్పినా ఎంత చేసినా
బుద్ధి రాదు యీ మనుషులకు
విజయవాడ బెంజ్ వలయం లో
ఈడొచ్చిన మొక్కలన్నీ నఱికేసారట
అసలే అది మరో అగ్నిగోళం
శ్వాస ఆడక పోయినా ఫరవాలేదేమో
తరలింపులూ మరలా నాటింపులూ
ఊసేలేదు అటు పాలకులకు ఇటు పాలితులకూ
ప్రతి వారికీ పెంపుడు జంతువులాగ
ఒక పెంపుడు మొక్క పెంచుకోవాలి
పశుపక్ష్యాదులకు మేత మనకు శ్వాస
భూదేవికి ఆకు పచ్చని పట్టు చీర
తక్కువలో తక్కువగా మహాటవి కాకున్నా
పది మొక్కలు ప్రతి ఒక్కరూ నాటుదాం
ఉన్నంతలో దినకరుని అనుగ్రహం పొందుదాం.

Friday, June 9, 2017

అసలు సిసలు నేస్తం

ఒకందుకు పోస్తే మరొకందకు తాగడం కాదు
ఎందుకు పోస్తే అందుకే తాగడం గొప్ప పని
విందుకు పిలిస్తే ఎందుకు పిలిచావన కూడదు
నిందలు వందలైనా మనం నీతి తప్ప కూడదు
మనో నిబ్బరం కుటుంబ నేపథ్యం మరువకూడదు
కడలి కెఱటంలా అలుపెరుగని పని చేయాలి
ఊర పందులూ అడ్డ గాడిదలూ ఏమనుకోనీ
అడుగడుగునా మంచి కోరే వారే అసలైన నేస్తం
ఆపదలో భరోసా నింపేవారిదే ఆపన్న హస్తం
మనసులోని ఆలోచన లెవరితో పంచుకోగలమో
ఎవరి మాటలతో మనసు కుదుట పడుతుందో
ఆమనషే అసలు సిసలు నేస్తం
అతని ప్రతి చర్యా ప్రతిచర్యా మన మంచికే
అనుమాన పడకు అవమాన మనుకోకు
అతడే దిక్సూచి అతడే మార్గ నిర్ణేత
అలాంటి వ్యక్తి లభించడం దుర్లభం
లభించినా అవివేకంతో వదులు కోవడం దురదృష్టం.

Thursday, June 8, 2017

ఆరాటాలు-పోరాటాలు

చెప్పినట్లు వినుకోవడమా
స్వతంత్రించి నడచు కోవడమా
పదహారేళ్ళ వయసులో
అప్పుడే విచ్చిన అరవిరిసిన కుసుమాలు
వస్తూ వస్తున్న నూనూగు మీసాల సోయగాలు
వచ్చీ రాని స్వతంత్రం
తెలిసీ తెలియని ప్రపంచం
భవిత అగమ్య గోచరం
కర్తవ్యం అయోమయం
అనుకున్నది జరగలేదని అక్కసు
అడ్డు చెప్పిన అమ్మానాన్నల పై కాదు
అవగాహన కల్పించిన గురువుల పైన
అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు
ప్రాప్త కాలజ్ఞత  ఓ ప్రారబ్ద వైశేష్యం
దైవానుగ్రహం అంటే సకాలంలో
ఆలోచన కల్పించి ఆచరింపించటమే
కాలం ఫలితాన్ని చేరవేసే మాధ్యమం
ఆవేశం చల్లారాక అక్కసు సద్దుకున్నాక
గురువుకు మనసులోనే ప్రణతులు
ఓటమిని బాహాటంగా అంగీకరించలేక
పదిమందిలో గురువుకు నమస్కరించ లేక
వయసు మనసు పరువు పరువం
అవి పెట్టే గిలిగింతల ఉక్కిరి బిక్కిరులే
ఆశల ఆరాటాలూ మౌన పోరాటాలు.

Monday, June 5, 2017


బ్రతుకు అంకణా 

నీతి మాలిన ఊర పందికి
గోతి బురదలో కూరుకు పోవడం ఇష్టం
నూతిలో కప్పలా మిగలి పోవడం ఖాయం
చేతిలో దురదతో బురద పులముకోవడమే
కాలేవరకు చేతులు నిప్పని గ్రహించలేవు
జారేవరకు కాలు కట్టుబాట్లు సమ్మతించదు
తూష్ణీభావాలూ తైతక్కలాటలూ ఎన్నాళ్ళు
పొలిమేర దాటాక గాని ఆప్యాయత తెలీదు
వలస పోతే గాని బ్రతుకు విలువ తెలీదు
అభిమానించి ఆదరించే వారు కరువై
విమర్శించి విడమరిచే వారికి దూరమై
దిగుడు బావుల అడుగుల అంచున
ఎంతపైకి చూచినా కూపస్థ మండుకమే
బ్రతుకని ఎఱుక కలిగిన దరిమిలా
అంతా శూన్యం అంతా మాయ అంతా భ్రమ
ఆ జ్ఞనోదయం తప్పొప్పుల అంకణా నిస్తుంది
అప్పటికే వయసు పై బడిపోతుంది.

Saturday, June 3, 2017

గోదారి

గోదారి

అఖండ గోదావరి
పైరు పచ్చల సిరి
లంకల వాగుల వంకల
గంభీర నిస్వన ఝరి
కాటన్ దొర ఊహల వల్లరి
తెలుగు నేల వేనవేల
ఆశల దొంతరల విహారి
ఆ నీటిని పుక్కిలిస్తే
లలిత కళలు ఆవులిస్తాయ్
చెళ్ళపిళ్ళ వారి కడియం
తెలుగు పద్యానికి గండ పెండేరం
కందుకూరి హితజన సమాజం
గౌతమీ గ్రంథాలయం
కోటిలింగాల రేవులో మునగందే
లింగాల జంగాల కైనా ముక్తి లేదాయె
గౌతమీ పవిత్ర సలిలం
సకల పాప హరం
అందుకే ఓ గోదారి
నా దారి ఏనాటికైనా. నీ దరి.

Friday, June 2, 2017

నిలుచోడానికి చోటిస్తే

నిలుచోడానికి చోటిస్తే
పక్క మీద పడుకుంటా అన్నట్లు
అభిమానించి ఆదరించి చేరదీస్తే
పాలిగాడు కూడా పెత్తందారునేనే అన్నట్లు
చేరదీసిన వాడిని చెడదీసే వారు కోకొల్లలు
పక్కవాడి ముడ్డిగిల్లే నంగనాచి లింకొందరు
ఇంగింతం లేని సన్నాసి కూతలు
వినిపించు కోడం మహా తప్పు
బయట పడలేని పిఱికి సన్నాసికి
మనసంతా అపోహలే బతుకంతా అసూయలే