Monday, July 31, 2017

కాదన్నవాడు కుళ్ళుబోతు

కుంటెనకాడినా నేను పూజారినా
ఆర్చేవానిని తీర్చేవానినీ కలపడానికి
పుసుకుడినా నేను పుర పాలకుడనా
కక్కుర్తి మనసుతో వ్యవహారం చేయడానికి
అయ్యవారినా నేను ఆచార్యుడనా
ప్రజా శ్రేయమే ధ్యేయమై బ్రతకడానికి
అనాధనా నేను ఆడపిల్లనా
నోరుమూసుకు పడి ఉండడానికి
పసివాడినా నేను అమయకుడనా
పరేంగితం తెలుసుకోలేక పోవడానికి
రసికుడనా నేను యువకుడనా
చిలిపి పనులు చేయడానికి
నా కళ్ళకు ఆడపిల్లంటే బాలా త్రిపురసుందరి
నాకైతే అబ్బాయి అంటే బాల మురళీ కృష్ణ
వారి శ్రేయంకోసం ఎంత పనైనా చేస్తా

కాదన్నవాడు ఓర్వలేని కుళ్ళుబోతు.

నచ్పక పోతే నూతిలో దూకమను.

Tuesday, July 25, 2017

ఉయ్యాల లూగింది మన తెలుగు

ఉయ్యాల లూగింది మన తెలుగు

కాకతీయుల తోరణ గుమ్మం మీద వెలుగు మన తెలుగు
ఓరుగల్లు కోట బురుజు పై జయకేతనం మన తెలుగు
బమ్మెర వారి బాలరసాల శాల నవపల్లవ కోమలి మన తెలుగు
జానపదుల వేలవెతల నూసాడే గద్దర్ పాట మన తెలుగు
కాళోజీ సినారె దాశరథుల ముద్దు పలుకు మన తెలుగు
తంజపురి సరస్వతీ మహలులో సుఖాశీన మన తెలుగు
తిరువారూరు లో త్యాగయ్య తుంబుర మీటింది మన తెలుగు
కన్నడ నాట ప్రతినోట భువన విజయం రుచి చూపింది మన తెలుగు
ఆసేతు హిమాచలం ఉయ్యాలలూగింది మన తెలుగు
మలేసియాలో వీచే మలయమారుతం మన తెలుగు
సింగపూరు శ్రీ లంక బంగ్లాదేశ్ ఒకటేమిటి
ఎల్లెడలా వెల్లివిరిసిన మరు మల్లి మన తెలుగు
ఆపాత మధురం ఆస్వాద భరితం మన సుందర తెలుగు
ప్రాంతాలుదాటి దేశానికి ఆవల కూడా మోజున్న మన తెలుగు
తెలుగు వద్దనకండి
తెలుగు రాదనకండి
తెలుగు లో మాటాడండి
తెలుగు పలుకులకు ఊతమివ్వండి
తెలుగు వారమని సగర్వంగా నిలవండి.

Monday, July 24, 2017

గెలుపు నీ పెదవులపై చిరుదరహాసం కావాలి


ప్రసవ వేదనల కావల పండంటి బిడ్డ జననం
ఆమ్మతనం కమ్మదనం ఆపై తన సొంతం
కారు  మబ్బుల చీకట్లు తొలగితేనే దర్శనం
చిరు జల్లుల తెరపై ఏడురంగుల హరివిల్లు
మొక్క నాటి పాడి చేసి నీరు పోసి పెంచితేనే
ఒక  వృక్షమై ఎదిగి మంచి ఫలాలనిస్తుంది
నిప్పులు కురిసే ఎండ తాకితేనే మావి పిందె
అతిరస మధుర రసాలమై నోరూరిస్తుంది
ప్రతి   అద్భుత ఆవిష్కరణ  వెనుకా ఎంతో
ఓర్పూ నేర్పూ శ్రమా ముప్పేట దీక్ష ఉంటుంది
ప్రతి ఓటమిలో ఒక మహత్తర  గుణ పాఠం
ప్రతి సమస్యలోనూ ఒక అద్భుత అవకాశం
ప్రతి అవమానం లోను ఒక వినూత్న ఆలోచన
పుట్టుకు రావాలి అది మనల్ని తీర్చి దిద్దాలి
అన్నీ బాగుంటే బెల్లం చుట్టూ ఈగల్లా చీమల్లా
వందిమాగధులూ గోముఖ వ్యాఘ్రాలు చేరి
ఈతిబాధలూ లేమి యిక్కట్లు వస్తే దూరం జరిగి
పెట్టుబడికి ముందుకు పెత్తనానికి వెనక్కు తోసే
పబ్బం గడుపుకునే చెదపురుగులను వెనక్కు తోసి
నవనవలాడే నవోదయం మరో అరుణోదయం
ఆవిష్కరించాలి సత్తాచాటాలి వినమ్రంగా నిలవాలి
అతి సాధారణంగా అందరికీ కనిపించినా
మేరువులా కొందరికైనా అండగా ఉండాలి
మరో నూరేళ్ళు మంచిగా నిన్ను తలచుకోవాలి
నీ చేరువలో నీ చేతులలో ఎందరో బాగు పడాలి
ఈసడింపులూ వెక్కిరింతలూ శాశ్వతంకాదు
ఆడిపోసుకున్న వారే ఏనాటికైనా ఓడిపోవాలి
గెలపు నీ పెదవులపై చిరుదరహాసం కావాలి.


Friday, July 21, 2017

తెలుగు వద్దనకండి

తెలుగు వద్దనకండి

అజంత మజరామరము మన తెలుగు
సుస్వరాల సప్త పదుల బంధం మన తెలుగు
గోదారి గలగలలు కోకిలల కిలకిలలు మన తెలుగు
కృష్ణమ్మ పరవళ్ళు తుంగభద్ర చప్పుళ్ళు మన తెలుగు
కూచిపూడి కులుకుల నడక
కిన్నెరసాని తళుకుల హొయలు మన తెలుగు
బందరు  పీచు మిఠాయి రుచి మన తెలుగు
కాకినాడ కాజాలో తీపి రసం మన తెలుగు
ఆత్రేయపురం పూతరేకుల దొంతి మన తెలుగు
మాడుగుల హల్వా ఘుమఘుమలు మన తెలుగు
బెజవాడ వేడి పుణుకుల వాడి మన తెలుగు
తిరుమల వేంకటేశ ప్రసాద లడ్డూ మన తెలుగు
అన్నవర సత్యనారాయణ వర ప్రసాదం మన తెలుగు
తెలుగు వద్దనకండి
తెలుగు రాదనకండి
తెలుగు వారమనండి
తెలుగులో మాటాడండి
తెలుగు వెలుగులు దశదిశల చాటండి
తెలుగు పలుకులకు ఊపిరి లూదండి
తెలుగు వానిగా ఎల్లెడలా మనగలగండి.


Decimation is democratic art
domination is a political part
Nomination is a portrait show
normalisation is a remedy to grow.

Let my friends and enemy understand
let my students but dependants withstand
the agony of suppression to depression
like many, need compromise on emotion
 money plays the critical role for elevation.

Let my energy and ideology stand together
let my admirers and advisers realise ever
my heart beats for educating the girl child
to bring equal opportunity for the girl as well
 one or two boys may be there in benevolent cell

Let my dream of a civil servant from my hands
let my aim of a rural physician from my shoulders
many more pioneering in virtual pious nature
moulded sharpened and trained wings fly here
soiled watered and cared saplings grow from my heart.


Wednesday, July 19, 2017

వెక్కిరింతురు గాక వెరపేటి నాకు

నింగిలోని నిరంతర బాటసారి
అదే నింగిలో ఎటూ కదలని ధృవతార
ఒకింత స్వార్థం బోలెడంత పరోపకారం
పరమావధిగా ఫలాల నిస్తూ ఊపిరులూదే చెట్లు
ఛీత్కారాలు అవమానాలు మౌనంగా భరించే భువి
మహోన్నత లక్ష్య సాధనలో స్ఫూర్తి ప్రదాతలు
నా బలం నా నిబ్బరం వాటినుంచి నేర్చినవే
వెక్కిరింతురు గాక వెంగళాయిలు వెరపేటి నాకు
ఒప్పు లెరుగని వారు తప్పన్నా ఒప్పు తప్పౌనా
ఓనమాలు రాని ఓగిలితో నాకేటి పని
నా ఆత్మ విమర్శతో ప్రతిదీ నిగ్గు తేల్చుకుంటా
రాజమార్గంలో గజ గమనం నాది
బేపిలెలా మొరిగితే నాకేమి
కూనలెలా ఊసాడితే నాకేమి
నిజం నిప్పులాంటిది ముట్టుకుంటే కాల్తుంది
గజం నిజం లాంటిది నిబ్బరంగా నడుస్తుంది.

ఉ.
నౌమి సదా మదీయ జననీ లలితా అపరా పరా శివే
నౌమి తవాంఘ్రి యుగ్మ కమలౌరనిశం పరమేశ్వరీ ఉమా
నౌమి శతం భవాని కరుణార్ద్ర సుశోభిని హే! దయామయీ
నౌమి తమోపహారణి సనాతని కామదుఘే మహేశ్వరీ.

Tuesday, July 18, 2017

శా.
వందే శారద విష్ణుపత్ని పరి సేవా శోభితాం శాంభవీం
వందే పన్నగ భూషణాత్మ లలితాం వామాంగ సంశోభితాం
వందే  హే జగ దంబ! విశ్వ వపుషా వేదత్రయీ పార్వతీం
వందే బాల శశాంక శేఖరసతీ వందే ఉమా శాంకరీమ్.

Friday, July 14, 2017

న+ఏను= నేను

మనిషి కెందుకింత స్వార్థం
ఏం చూసి ఆ అహంకారం
'నేను నాది' అనే భావన పోదా
మనం అనే కలుపుగోలుతనం రాదా
నేను అన్న మాట విడదీసి చూడండి
న+ఏను అని,నేను నేను కాదని అర్థం
ప్రతి క్షణం స్వార్థపు టాలోచనలేనా
పొరుగు వారి కోసం లేని వారి కోసం
ఉన్నంతలో కాసింత అందించలేమా
నారాయణ సేవ అంటే దరిద్ర నారాయణ సేవే
జ్ఞానం నీ తరగని ఆస్తి, అది పంచలేమా
ఆనందం ఊటపాయ లాంటిది అదీయ లేమా
మనసు విప్పి నిష్కల్మషంగా మాటాడలేమా
ఎదుటి వారి బాగు కోసం ఆలోచించలేమా
నిబద్ధతతో అబద్ధాలు మానుకోలేమా
విజ్ఞతతో వ్యవహరించి విశ్రాంతి పొందలేమా
నేను నేను కాదంటే మరెవరని తర్కించలేమా
ఆత్మలో పరమాత్మ ,ప్రతి జీవిలో పరమాత్మ
అందుకోలేమా అందుకొని ఆనందించ లేమా?

Thursday, July 13, 2017


ఆ చి‌రు నవ్వుల కోసమే నేను పరితపించి పోతున్నా
నీ పలుకరింత కోసమే రేబవలు ఎదురు చూస్తున్నా
ఓ శరజ్జ్యోత్స్నా నా మనవి వినుమా
ఓ బన్సుతా  నా వినుతి వినుమా
చిరు గాలి రాకతో తల ఊపదా పూబాల
తొలకరి చిరు జల్లుతో మిన్నంటదా మన్ను//    //
నా ఆశల మానస తనయ
నా ఊహల  ప్రియ సహృదయ
ఎదపరచి విడమరచి తరచితరచి
హాయిగా తీయగా మాటాడదా
సూటిగా దీటుగా బదులీయదా //   //
ఆ ఆమని ఈవిని నీవీవా
ఈ రాముని తనయవు కాలేవా
బాలవై నట్టింట నడయాడ రావా
బేలవై  నాకూడు కుడువలేవా //   //


మారాకు తొడగాలి నిస్వార్ధ బుధ్ది 

సహనం అసమర్ధతకు చిహ్న0 కాదు 
ఉదాసీనత ఆశక్తతకు  ఆద్యo కాదు 
అవమానాలూ అవహేళనలు కలిసి 
కసిగా విరుచుకు పడే సమయం వస్తే 
కోపం కట్టలు తెంచుకుని  పెల్లుబికితే 
నిర్ద్వ0దంగా  నిశ్శo సయంగా నిలదీస్తే
అప్పటికి కాని సరిగ్గా తెలిసిరాదు
ప్రతిదానిలో వేలు పెట్ట రాదని
తేలు కుట్టే ప్రమాదం పొంచి ఉంటుందని
పరేంగితం తెలియకుండటం అనాగరికం
పదిమందితో కలిసి మెలిసి బ్రతకడం కోసం
హద్దులూ సరి హద్దులూ మనమే గీసుకోవాలి
అవధులూ పరిధులూ నిర్దేశించుకోవాలి
ఆత్మన్యూనతలు కాదు ఆత్మావ లోకనం కావాలి
ఆత్మీయ ఆధ్యాత్మిక సజ్జన సహవాసం చేయాలి
నిస్వార్ధ బుద్ధి మారాకు తొడిగి వికసిస్తుంది
అవాకులూ చెవాకులూ మాని జిహ్వ నారాయణ
శబ్దాన్ని మాటి మాటికీ ఉఛ్చరిస్తూ తరిస్తుంది
జీవితానికి ఒక అర్ధమూ పరమార్థమూ కలుగుతుంది.



   బృహత్ భరతఖండం

ఆశావాదిని నేను, బహుశః
అత్యాశావాదిని నేను
నా కలల భారత ఉపఖండం
ఎవరెస్టు శిఖరం నుండి
హిందూ మహా సముద్రం వరకూ
శ్రీ లంక, నేపాల్, టిబెట్, బర్మా,
పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్నీ కలసిన
బృహత్ భరతఖండం
ఏనాటికైనా సాకారమైతే
ప్రపంచానికే అది తలమానికం
అసూయలూ విద్వేషాలు ఉగ్రవాదాలు
వదిలేసి చేయి చేయి కలిపి నడిస్తే
అభివృద్ధి ఆత్మ శాంతి ఆనందం
ప్రజలకూ దేశానికీ వరప్రసాద మౌతాయి
ఎంత కాదన్నా
దాయాదులం అన్నదమ్ములం 
ఒకప్పుడు కలసి బ్రతికిన చరిత్ర మనది
కలసికట్టుగా నిలిస్తే ప్రపంచాన్నే
శాసించే స్థాయి భరత భూమిది
దేవ దేవా విశ్వ శ్రేయం కోసం
ఇదే ఇవ్వాల్సిన తొలి వరం
ప్రతి వ్యక్తి శాంతి కాముకులై
మనగలిగే మహదవకాశం
ప్రసాదించవా దేవ దేవా
వ్యష్ఠి సమాజంగా మారాక
కొందరి ప్రగతి కుంటుపడింది
మరి కొందరి ప్రగతి లఘువులేసింది
సమవృద్ధి సమృద్ధి కోసం
శాంతి సామరస్యాల కోసం
ఓ ప్రభూ సమిష్ఠి గా నిలిపి
అఖండ భరత ఖండాన్ని
ఆవిష్కరించవా? ఆలోచించవా?

Tuesday, July 11, 2017

నా ప్రయత్నం

నాదొక భగీరథ ప్రయత్నం
ఇదంతా ఒక శివ సంకల్పం
పవిత్ర ఆశయం ఉన్న భగీరథుణ్ణి
సుజాతా పులకిత జాహ్నవి నీవు
నీ గతి గమనం నా వెంట నడిపిస్తూ
నిన్ను సుదూర గమ్యాలకు చేర్చుతూ
ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడం నా విధి
లక్ష్య సాధన వరకూ సంయమనం నా అస్త్రం
నచ్చుకున్నా నొచ్చుకున్నా నా వెంటే నీ గమనం
నీ భాగ్యమో నా భాగ్యమో బాలగా కనిపించడం
అందుకే అనిర్వచనీయ మైన అవ్యాజానురాగం
ఇంతకు మించి నిస్స్వార్థ హితైషు లెవరుంటారు
నా మదిలో ఆలోచనలన్నీ నీతో పంచుకుంటా
నీలో సామాజిక చైతన్యం రగులుకొల్పుతా
లక్ష్యాలపై రక్కసి కసి కలిగిస్తా నిలదీస్తా
ఫలితం హస్తగతం అయ్యాక వెనుతిరిగి చూద్దాం
సంతృప్తిగా ఆనంద భాష్పాలతో గతశ్రముల మౌదాం.

Monday, July 10, 2017

  ధర్మం దారి తప్పింది

చలాకీ కుఱ్ఱాణ్ణి అమాయకపు అమ్మాయికి కట్టబెట్టారు
పెద్దలంతా కలసి అరవై శరత్పూర్ణిమల ముందు
అరవై ఏళ్ళలో గడుగ్గాయి చేతిలో రాటుదేలింది
నవ నాగరికం వంట పట్టించుకుని ఆ ఆమాయకపు పిల్ల
కన్నుకుట్టుకున్న కాలువ కుంటోడు పచ్చని కాపురంలో నిప్పు రాజేసాడు
గడుగ్గాయి కాసులన్నీ అత్తారింట ఒలకబోసాడు
అయిన వాళ్ళూ కానివాళ్ళూ కళ్ళు కుట్టుకున్నారు
చాడీలు కైతికాలూ ఆమె చెవిలో గర్జింపించారు
బిఱ్ఱ బిగుసకు పోయింది ఆ అక్కు పక్షి
పాలకులు విడిపొమ్మన్నారు నిర్దయగా ఆ జోడీని
అంతిస్తాం ఇంతిస్తాం అన్నారు అడిగిన వన్నీ ఇస్తామన్నారు
అధికార ప్రతిపక్షాలు రెండూ కుమ్మక్కై విడగొట్టారు
అత్తారింట ఒలకబోసినదంతా అమాయకంగా నటిస్తూ ఎగరేసుకు పోయింది ఆ కొంటె పిల్ల
ఇస్తానన్న హామీలకు అతీ గతీ లేదు
హోదాలమాట పరదా వెనక్కి దాటేసారు నమోజీ
పిల్లిగెడ్డం గోక్కోవడం తప్ప ఏమీ చేయలేని మా బాబు
దిల్లీలో ప్రతిదానికీ బాబ్బాబు అంటూ బతిమాలుకుంటాడు
ముప్పైఏళ్ళు నేనే ఉంటా ఆ పదవిలో అంటాడు పులి విందుల కూన
పెద్దలు వాగ్దానాలను తుంగలో తొక్కారు
కమ్మ కాపు వెలమ దళిత నాయకులు ఎవరైనా ఒరిగేదేంటి పోయేదేంటి
తిరుమల కొండమీద శిలువ రాకుంటే చాలు
గోదావరి గట్టుమీద  నీటి పాయ కనబడితే చాలు
కృష్ణమ్మ ముక్కుమీద నీటిచుక్క ముత్తెంలా మెరిస్తే చాలు
తుంగభద్రలో వేసవిలో కూడా నీరుంటే చాలు
కనుచూపు మేరలో మందు కొట్ట కనబడకుంటే చాలు
ఆకాసం శాంతించి దయదలచి దీవిస్తే చాలు
కాయకష్ఠం చేసుకుంటూ నిశ్చింతగా నిదురోతే చాలు
పిల్లలు గుంభనంగా నిమ్మళంగా పై చదువుల కెళితే చాలు
ఆరుగాలం కష్ట పడతాం అవాంతరలను అధిగమిస్తాం
పోటీ పరీక్ష లన్నిటిలో మేమే ముందు వరుసలో నిలుస్తాం
పదేళ్ళు గడిచాక మీరంతా చతికల బడతారు
మేమైతే వందేళ్ళు హాయిగా ఠీవిగా బ్రతికేస్తాం.


Sunday, July 9, 2017

Oh! My mind

Indifferent silence for every agony
Bit difficult may be for a while
Intemperate response for courtesy
Upsets the mindset for ever
short sojourn and train association
rather shelters or shatters effortlessly
forgets and/or forgives so quickly
lifetime associations assert ramifications,
ruthless rude rehearsels ruin relations
help the needy not the greedy
serve the innocent not the intolerant
advise the confidential not the controversial
applause the noble not the needle
O my mind! cool down your emotion
O my God!  quite the scene often
Let me do and go as you wish
in the righteous truthful path
leaving selfish giants far behind.

సహజీవన సూత్రాలు

తనదాకా వస్తేగాని మనసు గాయం ఎలా ఉంటుందో
కడదాకా నడిస్తేగాని కపట హృదయం ఎలా వికటిస్తుందో
తెలుసుకోలేరు
 తప్పులెన్నువారు తమ తప్పు లెపుడు
ఉదాసీనమో పరధ్యానమో గంభీర మౌనమో
పాటించితే
పైచేయి తానే సాధించానని మురిసి పోయే కుహనా...లు
తెలుసుకుని తీరాల్సిన  కొన్ని నిజాలు
పెత్తనం పదవి అధికారం ధిక్కారం అంటురోగాల వంటివి
అంటీ ముట్టకుండా తామర ఆకుపై నీటిబొట్టులా ఉండాలి
బలిపీఠం ఎక్కించడంకాదు బలి పశువును చేయడం కాదు
నలుగురిలో ఒక్కరుగా మనగలగాలి అంటే
మన పరిధి అవధి మనమే నిర్ణయించుకోవాలి
ఉన్నత లక్ష్యాల సాధనలో ఉలిపిరి కాయలు విసిగించ వచ్చు
నింగికి ఎగరాలనుకుని మబ్బలడ్డు వస్తే వెనుదిరుగుతామా
పరేంగితం పరస్పర విశ్వాసం కలిసి సాగడానికి సోపానాలు
సహకారం సంయమనం సముదీర్ణత్వం
సహజీవన సూత్రాలు.

Wednesday, July 5, 2017

చెలిమికి బలిమి

హృదయాంతరంగ ప్రస్ఫుటచ్చిరు దరహాస మొక్కటి చాలు
సంశయ రహితానంద భరిత విస్ఫురిత చూడ్కది యొక్కటి చాలు
కల్మషరహిత స్వభావ పరిపూర్ణ విషయ వివరణ
మొక్కటి చాలు
పరిపూర్ణ విశ్వాస భరిత త్వరితానుగమన స్వేష్టి
తానొకటి చాలు
శాశ్వతాదర్శవంత చెలిమికి బలిమి కలిగి మనగలుగు
నిత్య నూతన మహా తేజోభరిత రసార్ణవమై ఆ చెలిమి మిగులు
యశోవిభవ భావసారూప్య సహజ సౌందర్యమై ఆ
కలిమి మిగులు
ప్రకృతి వరప్రసాదమై జగన్మాతానుగ్రహ కారణమై ఆ దివ్వె వెలుగు

Tuesday, July 4, 2017


గారాల పట్టిగా మురిపాల బాలగా
   దర్శన మిచ్చి సంతసము నిచ్చి
మూతి బిగించినా మౌనమే చూపినా
అలిగినా అరచినా  ఆదరిస్తి
నీ కెంత ద్వేషమో నాకంత అభిమాన
   మని చాటి ఋజువుగా మసలినాను
నీవేది కోరినా నీవేది జేసినా
 వలదని కాదని వాగలేదు
నీదు నయనాల పంటగా నీవు కోరు
నాదు గుండె చీల్చినీ ఎదుట పరచి
నిబ్బరముగ చూపింతు నా నా ఇష్టి ఏమొ
పరసుఖానంద నాథుడ భాగవతుడ.   

Sunday, July 2, 2017



గలగలా గోదారి లా నవ్వుతూ
కి‌లకిలా చిలుకలా పలుకుతూ
మనసారా పిలచి పలుకరించవా
తనివితీరా కలసి మాటాడవా
కపటంలేని అనురాగం మనదై
స్వార్థం లేని స్నేహం మనదై
కలకాలం
చేదోడు వాదోడుగా సాగలేమా
శ్రేయోభిలాషులై మనలేమా
పర సుఖానంద మందలేమా
 కంటికి ఱెప్పలా ఉండలేమా
అనుబంధాలకు అనురాగాలకూ
అతీతంగా ఆదరంగా బ్రతుకలేమా
గురువు నేనై లఘువు నీవై
ఇద్దరమూ ఒద్దికగా పయనించలేమా
ముద్దుగా బుద్ధిగా కొనసాగలేమా.


మా దేశం
శర వేగంతో ఎదుగుతోంది
శీఘ్ర గమనంతో పయనిస్తోంది
బానిసత్వ వారసత్వనుంచి
ఊడిగాల పడిగాపుల నుంచి
నవత యువత భవిత త్రికరణములై
మా దేశం
లఘువులేస్తూ దూసుకు పోతోంది
గురువు తానై యోగమిస్తోంది
నిస్త్రాణ నైరాశ్యాల అగాథాల నుంచి
విదేశీ వ్యామోహ స్వదేశీ నిర్మోహాల నుంచి
వడివడిగా జడివానలా
నిస్సవ్వడిగా జవ్వనిలా
మా దేశం
ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది
ప్రతి దేశాన్ని చెలిమికి పిలుస్తోంది
మా దేశం మారుతోంది
మార్పు మా రక్తంలో ఉంది
నేర్పు మా మస్తిష్కంలో ఉంది
ఓర్పు మా నరనరాలలో ఉంది
చేర్పులూ కూర్పులూ మామూలే
మీ...మీ....
తీర్పులూ మామూలే
ఔత్సాహికులు వేగంగాను
బద్ధకస్తులు నిమ్మళంగానూ
నిరుపేదలు నిరాక్షేపణీయంగాను
ధనికులు అహంకారం తోనూ
చిరునవ్వులు చిందిస్తూ
మా దేశం మారుతోంది.