గెలుపు నీ పెదవులపై చిరుదరహాసం కావాలి
ప్రసవ వేదనల కావల పండంటి బిడ్డ జననం
ఆమ్మతనం కమ్మదనం ఆపై తన సొంతం
కారు మబ్బుల చీకట్లు తొలగితేనే దర్శనం
చిరు జల్లుల తెరపై ఏడురంగుల హరివిల్లు
మొక్క నాటి పాడి చేసి నీరు పోసి పెంచితేనే
ఒక వృక్షమై ఎదిగి మంచి ఫలాలనిస్తుంది
నిప్పులు కురిసే ఎండ తాకితేనే మావి పిందె
అతిరస మధుర రసాలమై నోరూరిస్తుంది
ప్రతి అద్భుత ఆవిష్కరణ వెనుకా ఎంతో
ఓర్పూ నేర్పూ శ్రమా ముప్పేట దీక్ష ఉంటుంది
ప్రతి ఓటమిలో ఒక మహత్తర గుణ పాఠం
ప్రతి సమస్యలోనూ ఒక అద్భుత అవకాశం
ప్రతి అవమానం లోను ఒక వినూత్న ఆలోచన
పుట్టుకు రావాలి అది మనల్ని తీర్చి దిద్దాలి
అన్నీ బాగుంటే బెల్లం చుట్టూ ఈగల్లా చీమల్లా
వందిమాగధులూ గోముఖ వ్యాఘ్రాలు చేరి
ఈతిబాధలూ లేమి యిక్కట్లు వస్తే దూరం జరిగి
పెట్టుబడికి ముందుకు పెత్తనానికి వెనక్కు తోసే
పబ్బం గడుపుకునే చెదపురుగులను వెనక్కు తోసి
నవనవలాడే నవోదయం మరో అరుణోదయం
ఆవిష్కరించాలి సత్తాచాటాలి వినమ్రంగా నిలవాలి
అతి సాధారణంగా అందరికీ కనిపించినా
మేరువులా కొందరికైనా అండగా ఉండాలి
మరో నూరేళ్ళు మంచిగా నిన్ను తలచుకోవాలి
నీ చేరువలో నీ చేతులలో ఎందరో బాగు పడాలి
ఈసడింపులూ వెక్కిరింతలూ శాశ్వతంకాదు
ఆడిపోసుకున్న వారే ఏనాటికైనా ఓడిపోవాలి
గెలపు నీ పెదవులపై చిరుదరహాసం కావాలి.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home