Saturday, April 30, 2016

చెవిటి గోల 

శ్రవణ సౌకుమార్య0 కాని
శ్రవణాభిలాష కాని లేనప్పుడు
హితం కోరేవాడు ఊరుకోలేడు
తనను వినిపించుకోనప్పుడు
తప్పకుండా ఎవరికీ చెవి ఒగ్గుతారో
వారికి చెప్పక తప్పదు.
నన్ను విమర్శించే వాడే
అసలు శిసలు హితైషి.
భలే భలే అంటూ భజన చేసేవాడు
పబ్బ0 గడుపుకునే స్వార్ధ జీవి.
Read more »

Friday, April 29, 2016

సంతానం  సంతోషం

బిడ్డ పుడితే ఆనందించని తలిదండ్రులు ఉంటారా?
బిడ్డ పెరిగి పెద్దయి వంశానికి కీర్తి తేవాలని కోరుకొరా?
అరటి చెట్టు లా, వెదురు బోదెలా కన్నవారు బలి కావాలా?
మారాం చేస్తే అమ్మ కాదనలేక పోవచ్చు 
మంచి మర్యాద వమ్ము చేస్తే నాన్న కాదనవచ్చు 
ఇంగితం లేకుండా అన్నీ నాకే తెలుసు అనుకుంటే 
మంకు పట్టు పట్టి మొండికేస్తే 
తండ్రికి అంతకు మించిన శిక్ష లేనే లేదు 
దానికన్నా మరణమే మేలు.   

Thursday, April 21, 2016

 నీ కోసం తల్లడిల్లిన వేళ 


నీ కోసం తల్లడిల్లిన వేళ
గుండెలవిసేలా వెక్కి వెక్కి ఏడ్వలేదు
కన్నీరు మున్నీరుగా రోదించలేదు
నీవే  నన్ను ధిక్కరించిన వేళ
కిం కర్తవ్య0 అని దిగులు పడలేదు
కాని....  కానీ
నా కుల మత  విశ్వాసాలను
అవహేళన చేస్తే నా మెడ మీద కత్తి  పెట్టి
కుళ్ళు కాల్వ 'కూవ0' లో దూకేయ మంటే
అంతకన్న త్రివేణి సంగమం మంచిదనుకున్నా
కాకుంటే  లేకుంటే
పాపి కొండల నడుమ
గోదారి నాదారి అనుకున్నా
కాని ఒక మాట నిజం
'పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ'
వేలాడిన వాడి వేరు తెగిపోతుంది
వెంపర్లాడిన మనసు వెక్కిరింతలు పోతుంది
అందుకే
నీ కోసం తల్లడిల్లిన వేళ
ఆకాశం భరోసా ఇచ్చింది
అవని తల్లి తల నిమిరింది
జాబిలి  కూన జాలి పడింది
పిల్ల గాలి ఫరవా లేదంది
మరలా కొత్త ఆశ చిగురించింది. 
 
      

Wednesday, April 20, 2016

CBN


ఆయన नारा లగాయించమనడు
ఆయన లబోదిబో మనడు
'పతితులార  .........
ఏడవకండేడవకండీ' అంటూ
శ్రీశ్రీ లా పిచ్చిగా పచ్చిగా
భరోసా ఇవ్వడు
ప్రతీ అపకారం లోను ఉపకారం
ప్రతీ ఓటమిలోనూ
మరో క్రొత్త అవకాసం
వెతుకాడే మొనగాడు.
ఆలోచనలే మూలధనంగా
ముందు చూపే అనుభవంగా
మన్ను నుండి మిన్నుకు
దూసుకుపోయే ఆత్మస్థైర్య0
ఓడిన చోటే గెలవాలనే పట్టుదల
అంకిత భావం అచంచల విశ్వాసం
ఆయన నైజం
ఆంధ్రాకు ఆయనే  వర ప్రసాదం
ఆంధ్రుడికి ఆయనో అండ
ఆంధ్రప్రదేశానికి చిరునామా
ముఖ్యమంత్రి గానే
ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న
అగణిత క్రియాశీలి
ఆయనే మన నాయడు బాబు
ఆయనకు 'శతమానం భవతు'
జన్మ దిన శుభాకాంక్షలు.

ఆమని 

అది ఈమని వారి వాడ
ఆమని ఈమని వారి బిడ్డ
ఏమని అడక్కు
కమ్మని నునులేత సోయగం
అతి సుతి మెత్తని లావణ్యo
చూడ చక్కని సౌందర్య0
వెరసి అపురూప రూపం
చూడని వారిది పాపం
చూసిన వారికి తాపం
ఇదంతా నా చిన్నప్పటి మాట
ఇప్పుడో
తాళలేని భాను ప్రతాపం
సోష గొట్టుకు పోయె వడ గాడ్పు
పొద్దుపోయే దాకా గుమ్మ0 దాటలేం
వాతావరణం ఎందుకు మారింది?
సరిదిద్దే మార్గం లేదా?
మొక్కలు నాటండి
చక్కటి గాలి శ్వాసించండి
ఏమో వచ్చే మధుమాసానికి
మీ చెట్టు కొమ్మ మీద కూర్చుని
కోయిల సరాగాలు పోయేనేమొ
కుహు కుహు రాగల సుప్రభాతం మీదేనేమో. 

Monday, April 18, 2016

మరణం 

మరణం ప్రాణానికి ఆభరణం
ఆభరణం దేహానికి అలంకారం
అలకారం భావానికి ఉత్ప్రేరకం.
మరణం నిన్నంటిపెట్టుకు
నీతో వచ్చే అసలైన తోడు
ఆ తోడు నీడలోనే నీకు విశ్రాంతి
ఆ తోడు జాడ తోనే  నీకు విభ్రాంతి.
ఆ పేరు చెపితేనే నీకు భయం
ఆ పేరు వినీ వినగానే కంపరం
జననం ఎంత సత్యమో
మరణం కుడా అంతే  సత్యO
జనన మరణాల నడుమ మాత్రమే
నవరస మంజుల జీవన నాటకం
పాత్రధారివేకాని సూత్రధారివి కాలేవు
అందుకే
నరుని  బ్రతుకు నటన
ఈశ్వరుని  తలపు ఘటన  
ఆ రెంటిలో దేనికీ నువ్వు కర్తవు కావు
'నాహం కర్తా, హరిః కర్తా'
కై మోడ్పులు శరణాగతులు
నీకు మిగిలిన ఉపకరణాలు

Sunday, April 10, 2016

నివ్వెర పోవటమే నీ వంతు 


గుడ్డొచ్చి పిల్లని  వెక్కిరిస్తే
పిల్లొచ్చి  తల్లిని నిలదీస్తే
తల్లీ పిల్లా అతలాకుతలం
మనసూ మమతా అంతా  శూన్యం
నివ్వెరపోవటమే నీ వంతు
మువ్వగోపాలుడే నీ సంతు.

మొగ్గొచ్చ్చి పువ్వును వెక్కిరిస్తే
పువ్వోచ్చి పిందెను  నిలదీస్తే
మొగ్గా, పువ్వూ ఏది శాశ్వతం?
ఇంకెక్కడ పరిణామ సిద్ధాంతం?
నివ్వెర పోవటమే నీ వంతు
మువ్వ గోపాలుడే నీ సంతు.

 నీదనుకున్నది నీది కాదు
లేదనుకున్నది లేకపోదు
కావాలనుకున్నది కలసి రాదు
అంతా ఆ  ఈశ్వరేచ్చ 
అందుకే ముక్కున వేలేసుకుని
నివ్వెర పోవటమే నీవంతు
మువ్వగోపాలుడే నీ సంతు. 

Saturday, April 9, 2016

అసహనం 

అసహనం హద్దులుమీరితే 
అహంకారం నెత్తికెక్కితే 
సర్వజ్ఞత్వం నాకు మాత్రమే ఉంది అనుకుంటే 
విమర్శను సాదరంగా ఆహ్వానించలేకుంటే 
నేనెందుకు వినాలి అనుకుంటే 
ఎవరి అభిప్రాయాలు, ఏ వ్యాఖ్యానాలు 
పంచుకోనక్ఖర్లేదు, పట్టించుకోనూ అక్ఖర్లేదు 
జుట్టు పీక్కుంటూ, కాగితాలు చించుకుంటూ 
పోస్టింగులు చెరుపుకుంటూ 
ఒంటరిగా,తుంటరిగా 
వెఱ్ఱి ఆనందం అనుభవించ వచ్చు. 

Friday, April 8, 2016

ఆకర్షణ 

ఆనందగా ఆదరించే మనసుకన్న అందం ఏముంది?
ఆత్మీయంగా పలుకరించే పెదవులు కన్న పదనిస ఏముంది?
ఆప్యాయంగా చేతిని అందించే హృదయం కన్న కోవెల ఏముంది?
 వసి వాడిపోయి ఇల రాలిపోయే రూపం
శాశ్వతంగా కాలేదు అది అపురూపం
అందుకే ఆకర్షణకు మరో పార్శ్వం వికర్షణ
రెండింటినీ ఎరిగిన మనిషి
 మనసును గెలిచిన మనీషి.    

Thursday, April 7, 2016

ఉగాది శుభాకాంక్షలు 

ఉ.  దుర్ముఖు లందరిన్ దునిమి దుర్మతు లెంతటి వారలైన యున్ 
     మర్మ మెరింగి వాతలిడి మంచి ప్రభుత్వము తో జనాళికిన్ 
    ధర్మ పధమ్ము నిచ్చి బహుధా శుభదాయివి గా నిల్చి మమున్ 
    కర్మ నిబద్దులన్ గరపి కావవె దుర్ముఖి వత్సరమ్మహో.  

Tuesday, April 5, 2016

నా కేమని పిస్తుందంటే 

గుడి..టి చలం 'మైదానం' చదివితే లేచిపోవాలనిపిస్తుంది  
శ్రీశ్రీ 'మహా ప్రస్థానం' చదివితే కట్టుబాట్లు తెంచుకుని
విశృంఖలంగా విరుచుకు పడదామనిపిస్తుంది
దేవులపల్లి 'కృష్ణపక్షం' చదివితే
అమావాస్య నిశి రాతిరి ఎడవాలనిపిస్తుంది.
భాగవతుల శంకర శాస్త్రిని ఆర్కే బీచ్ లో చూడాలనిపిస్తుంది
విశ్వనాధ 'కల్పవృక్షం' ''వేయిపడగలు చదివితే
పంచ కట్టుకుని ఠీవిగా నడవాలనిపిస్తుంది
బాల గంగాధరుని 'అమృతం కురిసిన రాత్రి'
చదివితే పున్నమి వెన్నెలలో
మనసారా నోరారా పాడుకోవాలనిపిస్తుంది.