Tuesday, August 27, 2019

            ఆశ
విహంగమై గగనంలో తిరగాలని ఉంది
తరంగమై సాగర తీరం చేరాలని ఉంది
పతంగమై నభోవీధిలో నడయాడాలని ఉంది
మృదంగమై సుస్వర జతులను పలకాలని ఉంది
సమీరమై జీవకోటి ఊపిరులూదాలని ఉంది
కాశ్మీరమై శృతివధూ సీమంత వీధుల మెరవాలని ఉంది
యామీర శారదాకౌముదినై పులకించాలని ఉంది
భ్రమరఝంకారమై ఓంకారమై షోడశీ మంత్రమై
భ్రామరీ విద్యాంతరంగమై తురీయాతీతమై
మ్రోవిపై శబ్దపల్లవములై నిరర్గళ నిగళమవ్వాలని ఉంది.
అత్యాశ అనమాకు అడియాస కానీకు
సాయుజ్య సోపాన మధిరోహణకు బలమివ్వు
బహిరంతర్యాగ యజనములో సాగు అవకాశమివ్వు.

Thursday, August 22, 2019

 అనుభవించు రాజా!

'మీరు మీ ధర్మాన్ని పాటిస్తే
నేను నా ధర్మాన్ని పాటిస్తా'
అది దేవుని భరోసాలో ఓ షరతు
మరి మన జనం మనో గతం..?
అక్రమాలు దౌర్జన్యాలు చేస్తే అందలం
మస్తకన్యస్తహస్త లాఘవానికి ముద్దులకూ
ముచ్చట పడిన మగువలనేమనాలి
151లెఖ్ఖ ISI గుర్తింపుగా మిగిలిపోవాలా?
కక్షసాధింపులూ   కూల్చివేతలూ తిరోగమనమే
అన్నింటా అదే లక్ష్యం ఎవరేమన్నా అలక్ష్యం
నెత్తిమీద పెట్టుకుని ఇప్పుడు లబోదిబో ఏల
అనుభవించు రాజా అనుభవించు
ఎంత మేసినా కుమ్మేసినా కిమ్మనకుండా
కళ్ళప్పగించి చూడాల్సిందే.

Wednesday, August 14, 2019


శా.
శ్రీ విద్యావిభవంబు నిచ్చితివి శ్రీ శ్రీ సేవితా శాంకరీ
ధీ విద్యాలయమందుపాస్య వగుచున్ మద్ధీ వికాసంబు నీ
వే వాత్సల్యమునన్  సనాతని శివే వేవేల ప్రార్థించుచున్
త్వావత్త్వమ్మని నమ్ముకొంటి జననీ దాక్షాయణీ శాంకరీ.
(శ్రీ=లక్ష్మీ , శ్రీ=సరస్వతి , త్వావత్= అంతా , త్వం= నీవే)

శ్రీ చక్రోపరి సంస్థితాసన మహా శ్రేయోభిలాషీ భవా
నీ! చిచ్ఛక్తి సుధా ప్రసాదమునకై నీ భక్తులంతా జిగీ
షా చారిత్రులమై యథావిథి కువాచాలత్వమున్ మాన సుం
తన్ చాపల్యములేదు మాకు జననీ దాక్షాయణీ శాంకరీ.

Tuesday, August 13, 2019

  •      మా ఊరి ఎంకి
ఏరు వరదలా పొంగి ముంచెత్తి యుండ
ఏటి వొడ్డున కడవతో ఎంతసేపు
నిలచి నీవుందువే యట్లు నీల వేణి
ఎంత ఒయ్యారమే నీకు యెంకిపిల్ల.
చలమలన్నియు పోయెనే చపలచిత్త
ఇండుగను వెట్టి యీనీట నింక గొనుము
సుడులు తిరిగెడు నీరు నీ చూపులల్లె
ఎంత ఒయ్యారమే నీకు యెంకిపిల్ల.
భోగలింగేశ్వరుడు నీకు భోగమిచ్చె
సర్వమంగళ నీకు సంసారమిడదె
చంక కడవెత్తు కోవేల చక్రవదన
ఎంత ఒయ్యారమే నీకు యెంకిపిల్ల.
తాండవ నదితో పయనంపు తమకమేల
యేటి ఒడ్డున యేకాంతమేల? మేల?
కదలు మిటమాని దురుసు బింకాలు మాని
ఎంత ఒయ్యారమే నీకు యెంకిపిల్ల.
సరస సల్లాపములతో నీ సంగడి గుమి
మిగుల చతురోక్తులలొ మీకు మీరె సాటి
 గరువమెక్కువ నీకు ఓ గవర పిల్ల
ఎంత ఒయ్యారమే నీకు యెంకిపిల్ల.
సోగ కన్నుల సొగసరీ సోకు చాలు
బెట్టు చేయకు మింక యెబ్బెట్టు గాను
తనివి తీరునే కన్నుల తమకముడుగ
ఎంత ఒయ్యారమే నీకు యెంకిపిల్ల.
ఇచట నీలాటి రేవులో యింత తడవు
ఒంటిగా నీలాటి వారుంట ఒప్పదెపుడు
తోడుగా రానటే ప్రమోదోపహారి
ఎంత ఒయ్యారమే నీకు యెంకిపిల్ల.
చదువు సంధ్యలలో కలిసాము మనము
చనువుతో చెలిమితొ చెప్ప సాహసింప
యన్యథా యనుకోకు కయ్యాల మారి
ఎంత ఒయ్యారమే నీకు యెంకిపిల్ల.

Sunday, August 11, 2019

 తన్మే మనః శివ సంకల్పమస్తు

కాలం కలసి వచ్చినప్పుడు ఏ సమైక్యత నిచ్చావో
కాలం నిలదీసినప్పుడూ అదే సమైక్యతను నాకీయవా
సర్వకాల సర్వావస్థలలోనూ యీ మనస్సున
సర్వజన హితముగా శివసంకల్పమగు గాత.
ఏ శుభ సంకల్పంతో కార్యోన్ముఖులయ్యామో
ఆ కర్తవ్యదీక్షలో ఒడిదుడుకులను దాటించి
ప్రాప్తవ్య తీరానికి పడవను నడిపించే
ఆత్మస్థైర్యము నా మనస్సున శివసంకల్పమగు గాత.
మొక్కనాటిన మూన్నాళ్ళకే ఫలాలకోసం అఱ్ఱులు సాచే
అయోమయ దయనీయ మహనీయుల మదిలో
వెనుకడుగు లేని స్థిర చిత్తం శివసంకల్పమగు గాత.
ఉథ్థాన పతనాలకతీతంగా పయనం సాగేలా
స్వార్థపూరిత కుతంత్రాలను తక్షణమే  చిదిమేస్తూ
సంఘటిత శక్తి ప్రజ్వరిల్లగా శివసంకల్పమగు గాత

Saturday, August 3, 2019


మనసు మనసుతో ముచ్చటించుకుంటే
అదో అద్వితీయ అనిర్వచనీయానుభూతి
ఆనందాలు ఘనవిజయాలు పంచుకుంటే
అదో తృప్తి అదో కీర్తి అదో అనురక్తి శక్తి
దాని పేరే మధురమైన మైత్రీ బంధం
కష్టాలు కన్నీళ్ళు ఒత్తిళ్ళు ఉథ్థాన పతనాలలో
ఎదసొదలూ మది ఆక్రోసాలూ పంచుకునే
ఓ బృందావనం మైత్రీ బంధం
కొన్ని పరిచయాలు చిరస్మరణీయాలు
మరికొన్ని అనుబంధాలు శాశ్వతాలు
నా ఊహలవల్లరికి ఊపిరులూదిన
మిత్రులందరికీ మైత్రీదిన శుభాకాంక్షలు.


ఉ.
అమ్మవు నీవు నీదు చరణాంబుజముల్ శరణంచు వేడి నిన్
నమ్మిన వారి కెన్నటకి నాశము లేదను యార్య వాక్కులన్
నమ్మిన నీ యుపాసకుడ నా మదికిన్ తగినంత శక్తియున్
నెమ్మది నీయుమో జనని నేరములెంచకుమమ్మ షోడశీ.
శా.
అమ్మా! శాంకరి! సర్వమంగళ! సదా యాత్మోన్నతిన్ స్థైర్యమున్
యిమ్మా యీ యిడుముల్ కడున్గడు మమున్ యిబ్బంది వెట్టన్ నువే
సుమ్మీ యండగ నిల్చు వేలుపువు నీ చూడ్కుల్ యిటున్ ద్రిప్పవే
కొమ్మా మా వినతుల్ సదార్ద్ర హృదయా దాక్షాయణీ షోడశీ.