Sunday, June 30, 2019


సీ.
 యిచ్ఛాశక్తియె జీవి కీశ్వరేచ్ఛగ నిల్పు
       కామేశ్వరీ యీవె కామితముల
మనసులన్ రంజించి శశి జ్ఞాన శక్తి నీ
       యంగ వజ్రేశ్వరీ యానతీయ
దేవగురు దయన్ క్రియాశక్తి నిప్పింతు
       వే భగమాలినీ విశ్వమునకు
శక్తి త్రయాత్మకముల పరాశక్తివై
       ప్రకృతివై యవ్యక్త! పరిఢవిల్లు
తే.గీ.
మూడు శక్తులొకటనగ ముచ్చటగుచు
మువురు తల్లుల తల్లి! యమ్మోరు వీవు
ఆలకించవె తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.

Tuesday, June 25, 2019


సీ.
ఎదనిండ మదినిండ యెపుడుండి మున్నుండి
            నడిపించవే యమ్మ నన్ను మున్ను
 బాస లన్నిటిలోన పలుకు లన్నిటిలోన
            దోబూచులాడవే దురిత దూర
తలపులన్నిటిలోన తనుపు‌ లన్నిటిలోన
            నీ నామ స్మరణపై నిరతి నిమ్ము
కొంగుబంగారమై క్రొత్త సింగారమై
            నీవుపాస్యవగుచు నిలువుమమ్మ
తే.గీ.
నీకు నచ్చిన రీతి నన్నేలుకొమ్ము
నీదుపాసనా గరిమచే నిలువనిమ్ము
నన్ను మన్నించవే ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.20.
సీ.
ఈ దురహంకార ఇల ఝంకార
        దుర్నీతి పరులను దునిమి దరిమి
ఎవరి ధర్మము వారెరుగగ జేసి యీ
        వాదోపవాదముల్  వమ్ము జేసి
ఈ పురుషాధిక్య మెంతైన కాసార
        మందద్భుత సమతా మరులు విరియ
ధార్మిక నవభారత సుజనజీవన
        సంవిధానమునిమ్మ, సంతతమిడి
తే.గీ.
హెచ్చు తగ్గులు మరచి సంహితము నెఱిగి
సతిపతులు కలసిమెలసి సాగు నటుల
ఆదరించవె తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.19.
సీ.
తవిలి హృదయమందు ద్వాదశ దళ పద్మ
         మందుండి రాకిణీ మంత్రమగుము
జిఁహ్వాగ్ర మందుండి శితకంఠమున నిండి
         నానోట నీ మాట నాన నిమ్ము
నాసాగ్ర మందుండి నా యాజ్ఞలను నిండి
        సత్కార్య నిరతిలో సాగనిమ్ము
దశశతదళమందు దృశ్యమౌ యాకినీ 
        రూపవై యా యపురూపమిమ్ము
తే.గీ.
దేహ దేవళమందు మా దేవివగుము
మేని శ్రీ చక్రమందుండు మేటివగుము
ఆదరించవె తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.21.

సీ.
శాంభవీ ముద్రలో జీవన్మనో ద్వయ
          బాహ్య విస్మృతి నొందు భాగ్యమిమ్ము
షణ్ముఖీ ముద్రలో కనులు జెవులు మూసి
           నాద వినోదము నందనిమ్ము
ఖేచరీ ముద్రలోన సుషుమ్నా పథమందు
           ప్రాణవాయువు నింపు ప్రజ్ఞ నిమ్ము
ఉన్మనీ ముద్రలో నాసాగ్రమున దృష్టి
            నిలిపెడు యింద్రియ నిగ్రహ మిడి
తే.గీ.
 యోని ముద్రతో ప్రణమిల్లు యోగమిమ్ము
  తవిలి శ్రీ చక్ర పూజలో తనియ నిమ్ము
  ఆదరించవె తల్లి ఆనంద వల్లి
  కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.22


        

Monday, June 24, 2019

   
        మేలుకొలుపు

మేలుకోవే అమ్మ మా మేలు కోరే అమ్మ
మమ్మేలుకోవమ్మ మేలిమి.. నీవమ్మ
మేలుకొలుపులు నీకు మమ్మేలు కొలువులు... నీకు
మేలు మరువని మేము మమ్మేలుకోవమ్మ//   //
పొద్దు పొడిచే వేళ ముద్దులొలికేవేళ
రంగురంగుల ముగ్గుల్లు ముంగిళ్ళ నిలిపే వేళ
మమ్మేలు తలపుతో మా మేలు తలచుతూ
మా గడపకొక తూరి రావమ్మ
మా పూజలందుకోవమ్మ //   //
నీ తలపుతో లేచి నీ తలపుతో కుడిచి
నీ తలపుతో పన్జేసి నీ తలపుతో నిదరోవు
చెండు మల్లెల యీవి
నిండు మనసులు మావి
ఆలసించక లేచి ఆలకించగ చూచి
ఆదుకోవే అమ్మ అందాల మాయమ్మ //  //

Saturday, June 22, 2019


సీ.
చెవిలోన జోరీగలా పోరితేగాని
    వినిపించదా నీకు విశ్వ జనని
ఇరుసంధ్య పూజలున్ ఉపవాస దీక్షలున్
    కనిపించవా నీకు కమలనయన
నీపాద సేవలున్ నీనామ స్మరణలున్
    నీవందు కోవ నన్నేలు కోవ
నిన్ను నమ్మినవారి నీ యుపాసకులపై
      తగునటే మౌనమ్ము తల్లి నీకు
తే.గీ.
ఈతి బాధలు తొలగించి యీవి గూర్చి
శాంతి నొసగి సంతసమవిశ్రాంతమిడుచు
ఆదరించవె తల్లి ఆనందవల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.18.
సీ.
అంత పాపిష్ఠినా నేనంత నష్టినా
      నికృష్ట జీవినా  నిజముగాను
సంచిత పాపమా సంకుచిత మనమా
      సంప్రాప్త్య లేశమా సంశయమ్మ?
నా యభాగ్యమ్మింతయా  విధి వ్రాతయా
      దుర్దశా శేషమా దుస్సహ మిది
నా మొఱాలింపవా నా యార్తి దునుమవా
      కరుణాంత రంగ సంకటము కృంగ
తే.గీ.
శరణు శరణని కొలువంగ చరణయుగము
అభయమీయరె యర్థుల యాశ దీర
ఆదరి..................
.....................కల్పవల్లి.17.
సీ.
ఇంత యుపేక్షకు కారణ మ్మేమొ నీ
      వింత పోకడలకు విషయమేమొ?
ఇంత ఉదాసీనమా ఉపాసకులపై
       ఔదల దాల్చక మౌనమేల?
ఇంత విచక్షణమ్మేల మమ్మేల* నీ
       మోహన చరణాల మ్రోల వ్రాల
ఇంత యనాశక్తతేల శాక్తేయుడ
       గానె సనాతని కళ్యాణి గట్టు పట్టి
తే.గీ.
పర సుఖానంద నాథుడ పరుల! పరుల
సుఖమదెటు ప్రోది జేయనౌ సుధ్యుపాస్య!
ఆదరించవె......16.
(మమ్మేల= మమ్ము ఏలుకొనగ,
సుధ్యుపాస్య = పార్వతి)
 సీ.
కడగంటి చూపైన కడుపావనమ్మంచు
       కోటి యాశల తోడ కాంతునమ్మ
అరకొఱగా నవ్వినా యది నా భాగ్య
      మంచు నేనానంద మంద గలను
ఏ చిన్న పని జెప్పినా నే నెగిరి గెంతు
      లేయుచు జేసెద లెఖ్ఖ గాను
సన్న జేసినచాలు సన్నిధి సేవలో
      తలమునక లగుచు తనిసి పోదు
తే.గీ.
తలపు పలుకులు క్రియలంకితములు నీకు
తనువు రాలక మున్నె సంతసము నిచ్చి
ఆదరించవె తల్లి ఆనంద వల్లి
కంచి కామాక్షి కరుణించు కల్పవల్లి.15.

Thursday, June 20, 2019

  నీవు--- నేను
కర్కశ నిరంకుసత్వం నీది
న్యాయానికి నిలదీసే తత్వం నాది
పురుషాధిక్య దురహంకారం నీది
స్త్రీ పురుష సమానత్వం నాది
బాధ్యతా రాహిత్యం నీది
సంయమనంతో సాధించే రీతి నాది
ఒంటెద్దు పోకడల సోంబేరితనం నీది
జంటగా చకచకా పనిచేసే తత్వం నాది
ఉత్సవ విగ్రహం నీకు ఆదర్శం
మూలవిరాట్ స్వరూపం నా దైవం
స్వార్థానికి పరాకాష్ట అనువంశికం నీకు
నిస్వార్థ సేవ, పరోపకారం అనువంశికం నాకు
ఈ సంసార రథయాత్ర సక్రమంగా సాగేనా
నాతిచరామి అన్న హామీ అమలుకు నోచేనా?
ప్రథమ హితైషి భార్యే అనే ఎఱుక కలిగేనా?
పరమేష్టి ఆశించిన ప్రయోజనం ఒనగూరేనా?
భరతావనిలో స్త్రీ సమున్నతంగా నిలచేనా?

Friday, June 14, 2019


సంశయమేలా?

అనన్యాశ్చింతయంతోమామ్
యేజనాః పర్యుపాసతే
తేషాభి యుక్తానం
యోగక్షేమం వహమ్యహం.
అని గీతాచార్యుడు మనందరికీ ఒక  under writing లేదా  ఒక insurance risk coverage ఇచ్చేసాడు.
కానీ ఆ కృష్ణుడు పక్కా కమర్షియల్ లాగ షరతులు పెట్టాడేమిటీ?
ఆయనను తప్పించి వేరెవ్వరిని చింతించని వారికే
ఆయనను మామూలుగా ఉపాసన చేస్తే సరిపోదు. గొప్పగా ఉపాసించాలి.
ఈ రెండు షరతులకు లోబడి
వారి యోగ క్షేమాలు నేనే చూసుకుంటా. అన్నారు.
బాగుంది.
ప్రయత్నం పురుష లక్షణం అనీ  అంటే ఆడవారు ప్రయత్నించ నక్కరలేదని కాదండోయ్. పురుష లక్షణం అంటే మానవ లక్షణం అని మన పారిభాషక పదకోసం నెమరేసు కోండి.
మానవ ప్రయత్నం చేస్తే భగవదనుగ్రహం వస్తుంది అంటారు.
ఏమిటో అటు ఆ భరోసాకీ ఇటు పెద్దల మాటలకూ పొంతన లేదులా ఉంది.
సరే.
మనస్సులో నిశ్శంసయంగా సంపూర్ణ విశ్వాసంతో ఎవరైతే ఆయన కాళ్ళమీద పడతారో వారి బాధ్యత ఆయనదే అనే అనుకుందాం.
మరి ఆ గజేంద్రుడు
కలడందురు దీనుల యెడ
కలడందురు భక్తకోటి గణముల పాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడి వాడు కలడో లేడో?
సర్వాంతర్యామి సర్వవ్యాపి అయిన ఆ పరమేశ్వరుడు అసలు ఉన్నాడో లేక లేనే లేడో?
అని సంశయం వెలి బుచ్చాడే. మరి ఆ గజేంద్రునికి ఈ ఇన్స్యూరెన్స్ పోలసీ క్రింద ఎలా రక్షించాడో
సరే.
ఏదో మనంబున ఈశ్వర సన్నిధానంబు కల్పించుకుని
నీవే తప్ప ఇతఃపరంబెరుగ
అన్నాడు కనుక
కవరేజ్ క్రింద ఆదుకున్నాడే అనుకుందాం.
మరి రుక్మిణీ దేవి అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణ్ణి కృష్ణునికి తన సందేశం చెప్పమని పంపింది. అతను తిరుగు ముఖం పట్టలేదు. మనస్సులో ఆందోళన సమయాభావం కింకర్తవ్యతా విమూఢత్వం. ఈ దశలో
ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతు డై చిక్కెనో
విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో యీశ్వరుం
డనుకూలింప దలంచునో తలుపడో యార్యామహాదేవియున్
నను రక్షింప నెఱుంగునో యెఱుగదో నా భాగ్య మెట్లున్నదో?
అంటూ శంసయాస్పదయై వేచిచూస్తుంది.
అయినా విచ్చేసాడు. పని కానిచ్చేసాడు.
మరి అనన్యాశ్చింతయంతోమామ్ అన్న షరతులకు అతీతంగా రుక్మణీ మనో వాంఛితాన్ని ఎలా ఈడేర్చాడంటారు?
ఏంటో. అయినవారికైతే షరతుల సడలింపు,
పెరవారికైతే షరతుల విధింపు అనాదిగా తరతరాలుగా వస్తున్నదే.
మరి చిన్ననాటి సంగడికాడు సుదాముడు కడు దీనావస్థలో ఉంటూ తనని చూడ్డానికి వస్తే మాట వరసకైనా ఏ రకంగా నీకు సహాయ పడగలను అని ఆడగఖ్ఖర్లా? అసలే కుచేలుడు. మొహమాటం ఓ పక్క తన స్థాయికీ మిత్రుని స్థాయికీ తేడా చూసి మరింత భయపడే సన్నివేశం. తెచ్చిన కాటికి ఆ పిడికెడు అటుకులూ లాక్కుని ఏదో భోజనం పెట్టి పంపేసాడే గాని వేళ్ళేఅప్పుడైనా అన్నీ ఏర్పాటు చేసా ఆని ఓ మాట చెప్పొద్దూ. దారి పొడవునా కుచేలుడి మనసులో ఏదో భీతి. తనభార్య గంపెడాశతో పంపించింది. ఇతగాడు కబుర్లాడాడే గాని కాసులిచ్చాడా హామీ ఇచ్చాడా.
ఏదో ఆ రుక్మిణీ దేవి సాటి ఆడదాని మనస్సుని అర్థం చేసుకుని అమాంతం ఇచ్చింది కాని లేకుంటే ఏమౌను?
ఏంటో ఎంతవారలైనా కాంతా దాసులే. ఇంట్లో ఆయనకు చెల్లుబాటు అంతేనేమో. పోనీలెండి మన మగాళ్ళందరికీ ఓ మార్గదర్శి దొరికాడనుకుందాం.

Thursday, June 13, 2019

 India is ranked 95th in gender equality indices and 5th in index for dangerous countries for wonen. My reaction/expression to that great news.
సమానత్వపు సూచీలో

వీథిగుమ్మం మీద ఎన్నెన్నో ధర్మ పన్నాలు
సామాజిక మాధ్యమాలలో సమానత్వాలు
ఉపన్యాసాలు ఉద్వేగాలు ఉచిత సలహాలు
నట్టింట్లో మాత్రం ఆడదంటే 
వెట్టి చాకిరీ చేసే ఓ పనిమనిషి 
తెలివి ఎక్కువ అయిన లోగిళ్ళలో
ఆమె కూడా ఉన్నతంగా సంపాదించాలి
ఇంటికొచ్చాక మగమహరాజును సేవించుకోవాలి
అయ్యగారు సోంబేరి బాపతైనా 
నీ బాంచను కాల్మొక్తా అనాలి
మగాళ్ళకు అరలీటరు లోటాతో కాఫీలు
ఆడాళ్ళకు నాలుగు చుక్కలు చాలు
భోజనాలలో శాకపాకాలేవైనా సరే
మిగిలిపోయినవే అత్తా కోడళ్ళకు
అల్లుడుంగారు అమ్మాయిని ఔదల దాల్చాలి
కొడుకు మాత్రం కోడలితో మాటాడరాదు
ఇది భారతీయ నూతిలో కప్పల గొప్పదనం
రాతియుగం మనుషులు వీళ్ళు పాత రాతి చిప్పలు
అందుకే స్త్రీ పురుష సమానత్వపు సూచీలో
 మనదేశం తొంభై అయిదవ స్థానంలో ఉంది
బయటికివెళితే ఆరేళ్ళ పిల్లకూ భరోసా లేదు
ఆపదలో అరచినా భర్త పలుకుతాడనేది లేదు
అందుకే ఆడవారికి ప్రమాదకర దేశాల సూచీలో
అయిదవ స్థానం మనదే మన భరతావనదే.
ఇప్పుడు చెప్పండి ఈ ధర్మక్షేత్రంలో
ఇంటింటా కురుక్షేత్రాలకు మూలాలెక్కడ
హుందాగా గౌరవంగా ఆమెకూడా బ్రతికేదెక్కడ
ఈ మృగాడి మనసు మారకుంటే
దేశానికి అథోగతి. భవితకు చరమగీతం
ఇదేనా మీరు శ్వాసించే ఆశించే మరో భారతం.

Tuesday, June 11, 2019

 పదిలం బిడ్డా!

మడమ తిప్పరాదు
ఎడమ పెట్టరాదు
బొబ్బిలి బెబ్బులిలా
తొడగొట్టి నిలవాలి
మీసం మెలేసి నిలవాలి
ఆంధ్రా పౌరుషానికి
మాయని మచ్చ తేరాదు
హంసలా బ్రతకాలి
జగజ్జేగీయమాన గతవైభవం
పునరావృతం కావాలి
ప్రశ్నించే ప్రతిపక్షం లేకుంటే
తప్పొప్పులు చెప్పేదెవరు
గోతులు త్రవ్వడం మొదలైతే
ప్రగతి రథానికి ఒడిదుడుకులే
ప్రజలకి పప్పుబెల్లాలూ నానీలు
తాత్కాలిక ఉపసమనాలే
పరిశ్రమలూ పెట్టుబడులే
జనజీవనానికి ఉపకరణాలు
అభివృద్ధికి సోపానాలు
ఆవురావురనే గద్దలుంటాయి
తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!

Monday, June 10, 2019

      ఒక్కడినే
ఆక్రోశ ఉక్రోషాలతో రగిలి రగిలి
అశక్తతతో అస్వస్థతతో నలిగి నలిగి
ఉద్విగ్నభరిత మైన మనస్సుకు
మౌనం ఒక వరమై స్వరమై
మానసవీణియపై గీతా సందేశమై
స్వస్వభావ ఉదాసీనతా సందోహమై
యుక్తాయుక్త వివేచనా సందేహమై
నన్ను నేను నిభాయించుకునే ఉపకరణమై
ఈ సంయమనం యీ మౌనం
అవిశ్వాస అగడ్తలను పూడ్చేసి
అనుబంధాల రేయెండ పరిచేసి
నిశ్శంసయ నిశ్చల నవనవోన్మేష
మేదినీ మనోహర మైదానంలో
అబలలందరినీ ఆ బాలగా అమ్మగా
భావించే జనసందోహం లో ఒకడిగా
అవధులు దాటని సామాజిక ఒరవడిలో
ఒకడిగా మురిసిపోయే క్షణం ఇక రాదా?
దుర్మార్గ దురహంకార దుర్నిరీతికి దూరంగా
ఒక్కడినే మనగలిగేలా నా మౌనం చేయలేదా?

Thursday, June 6, 2019

  భంగ (బెంగ) పడకు!
కథ కంచికి.. మనమింటికి...
ఇదేనా ప్రతీ కథకు ముగింపు. ఆలోచనలో పడ్డాడు ఆచారి. సాలోచనగా దూరంగా ఎటో చూస్తూ.
దూరంగా కనిపిస్తోందే నీలి రంగులో ఓ కొండ. దానిపేరు పెనుగొండ.సుమారు 24కి.మీ. పొడవు రెండువేల అడుగుల ఎత్తు. మధ్యలో ఒకచోట దట్టంగా పచ్చగా ఉన్నది ఒక లోయ. ఆలోయలో ఒక  శివాలయం. అక్కడే ఒక జలపాతం. ఇరవై అడుగుల ఎత్తుగా గోడ కట్టినట్టు దక్షిణ పశ్చిమాలకు. ఆ నైరుతి మూలగా గలగలల నిస్వనం.
ఆ ధార ఎడతెరిపి లేకుండా ఎన్నాళ్ళ నుంచో ఎన్నేళ్ళ నుంచో అలా పడుతూనే ఉంది. స్నానానికి ఎంతో అనువుగా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఆచారికి ఆ ధార ఆ శివాలయం చాలా యిష్టం.
ఎప్పుడో చిన్నప్పుడు మూడు నాలుగు సంవత్సరాల వయసులో చూసాడు. ఇంచుమించుగా ఆరు దశాబ్దాల తరువాత మరలా చూసాడు. ఒక అనిర్వచనీయమైన ఆనందం.
ఎవరికోసమని ఎందుకోసమని ఏ అమృత ధార ఈ సలిలఝరి ఇలా నిరంతరం ఈ లోయను పునీతం చేస్తోంది. ఒక వంద మీటర్ల దిగువన మల్లికార్జనుడు, భ్రమరాంబ ల బాలాలయాలు. శతాధిక వర్ష రసాల వృక్షాలు. ఆ మామిళ్ళ నీడన కూర్చుంటే ఏ ముని ఆశ్రమానికి తక్కువ కాదు ఇది అనిపిస్తుంది.
ఈ అడవిలో ఎవరిని ఉద్ధరించడానికని ఈ ఆది దంపతులు స్వయంభువులై వెలసారో ఆ సాంబపరమేశ్వరుల కే ఎఱుక. ఆ అదృష్ట వంతుడు తనే అయితే ఎంత గమ్మత్తుగా ఉంటుంది?
ఆచారికి నిస్వార్థ సేవ చేయాలని లోలోన ఎంతో ఆశ.

ఏమండీ రిటైరయ్యాక కాస్త వంటింట్లో సాయం చెయ్యొచ్చుగా? అర్థాంగి ప్రశ్న
చేయొచ్చు. మెడలో జంధ్యం పోగు తీసేస్తే ఇంకా చాలా చేయొచ్చు.
అంటే సన్యాసుల్లో కలిసి పోదామనా? మరో ప్రశ్న.
అలాగని అన్నానా?
ఆ( ఆపరేషన్ ధియేటర్లో నర్సులు జంధ్యం తీసేయమంటే ఏమని చెప్పావ్. తీసేస్తే సన్యాసమే.మరి. మా ఆవిడని అడగండి అన్నావుగా. అది తియ్యకుండానే ఆపరేషన్ చేయించా నీ బుఱ్ఱకి.
అబ్బో.
ఆశ్రయమిచ్చే ఆశ్రమం దొరికిందిలే. అందుకని.
ఇదిగో పెళ్ళిలో ఏమని ప్రమాణం చేసారో గుర్తులేదా?
మా నాన్న ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యం అని అడిగితే తలూపుకుంటూ నాతిచరామి అని మూడు సార్లు ప్రమాణం చేయలా?
మరి. ఈ ఆలోచనలేంటి? నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు జరగనివ్వను. అంది కాంతం
సౌందరనందంలో సుందరీ నందులు ఇరువురికీ సన్యాసం ఇచ్చినట్టు మన ఇద్దరికీ అడుగుదాంలే.
'మనమా వద్దిక నాదుమాట వినుమా మర్యాద కాపాడుమా' అంటూ లబోదిబో మంటావ్.
సరేలే అంటూ ఆ ఆలయాన్ని కాస్త మరమ్మత్తులు చేయించి సిమెంటు అరుగులూ వేయించి నాలుగు పక్కలా స్లేబులు వేసి విశాలం చేసి కటకటాలు ఏర్పాట్లు అన్నీ చేసాడు ఈమధ్య కాలంలో.
ఇప్పుడు రోజూ ఓ పదిమందైనా ఆ గుడికి వస్తున్నారు.
శేష జీవితం అక్కడే గడపాలని ఆచారి. సింగపూరో బెంగుళూరో కూతురి వద్దకు పోదామని కాంతం.
అది కార్తీక మాసం. గుడివరకూ రోడ్డు వేయించారు. కార్లు ఆటోలు వెళతాయి కనుక యీ నెలంతా సందడిగానే ఉంటుంది. ఆచారి అప్పుడప్పుడు వస్తూంటాడు గుడికి. అలాగే ఓ ఆదివారం వచ్చాడు. అప్పటికే చాలామంది బడిపిల్లలు పిక్ నిక్ కని వచ్చారు.
ఆచారి అభిషేకం అర్చనా పూర్తి చేసుకున్నాక హారతికి పిల్లలు పొలోమని వచ్చారు.
ఇంకా ఆ గుడికి శాస్త్రోక్తమైన పూజారి లేడు. ఆ పక్క జీడితోట ఆసామీయే వచ్చిన వారికి బొట్టుపెట్టి దక్షిణ తీసుకుంటాడు.
ఆ పిల్లలు ఆచారిని ఆటల్లోకి లాగారు. ఆచారి కూడా రకరకాల క్విజ్ పోటీలతో వారిని అలరించాడు. చాకుల్లాంటి పిల్లలు కొందరున్నారు. వాళ్ళకి సరియైన తర్ఫీదు ఇస్తే వృద్ధి లోకి రాగలరు అనుకున్నాడు.
మరో సంవత్సరం గడిచింది. పిల్లలతో అనుబంధం పెరిగింది. ఫోన్లో తరచూ మాట్లాడుతూంటారు. అందులో కొందరికి బాగా చదువుకోవడం కోసం ఆర్ధికంగా అండగా ఉండడంతో పిల్లలందరికీ ఆయనంటే ప్రాణం.
కాలచక్రం గిఱ్ఱున రెండేళ్ళు తిరిగింది. గౌతమి అనే అమ్మాయికి ఐ.ఐ.టీ జీ ఎడ్వాన్స్ డ్ లో రేంక్ వచ్చిందని వాళ్ళచెల్లి కావ్య ఫోన్ చేసి చెప్పింది.
ఆచారికి కన్నీటి పర్యంతం అయింది.
బాగా చదివే ఆ గౌతమికి  ఇంటర్ చదువుకు రెండులక్షల వరకూ పెట్టుబడి పెట్టాడు. విశాఖ పట్నంలో మంచి కోచింగ్ సెంటర్ లో చేర్పించి ఎప్పుడు ఏది కావాలన్నా చూసేవాడు.
ఆ అమ్మాయి కాని వాళ్ళ నాన్న కాని చెబుతారేమో అని ఎంతో ఎదురు చూసాడు. కావ్య  గౌతమికి చిన్నాన్న కూతురు. తనకీ సహాయం చేసాడు. ఆమె ఎంసెట్ కు మాత్రమే ప్రిపేర్ అయింది.
ఆచారి రెండో రోజూ గౌతమి ఫోన్ కోసం ఎదురు చూసాడు. స్వంత కూతురులా చూసుకున్నందున ఆమె నిర్లక్ష్యానికి ఉస్సురని లోలోనే బాధ పడ్డాడు. వాట్సప్ లో కావ్య పంపిన పేపర్ క్లిప్పింగ్ చూస్తూ మరలా కన్నీటి పర్యంతమయ్యాడు. ఆమె విజయానికి తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఆమె పట్టుదలే దోహదం చేసాయి అని తను చెప్పినట్లుగా ఆ పేపరులో వేశారు.
 నాలుగు రోజుల తరువాత ఎస్.ఎమ్మెస్ వచ్చింది గౌతమి దగ్గర నుంచి.
కౌన్సలింగ్ కు ఖరగ్ పూర్ ఐ.ఐ.టీ కి వెళ్ళాలి . నువ్వు తీసుకు వెళతావా? లేకపోతే మా నాన్నకీ నాకూ టిక్కట్లు తీసి పంపగలవా? అని.
ఆచారి ఆ ధార దగ్గర గుడికి వెళ్ళి అభిషేకం చేసుకుని
నమేద్వేష రాగౌ నమే లోభ మోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
నధర్మో నచార్థో నకామో నమోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం.
అనుకుంటూ విశాఖపట్నం వెనుదిరిగాడు.
మనసులో అనేక ప్రశ్నల పరంపరలు.
ఇప్పుడు మరో ఇద్దరికీ ఇలాగే చేయాలని అనుకున్నాడే.
మరోసారి ఇలా భంగ పడితే?
మరో ఇద్దరి భవిత కోసం బెంగ పడితే?




Sunday, June 2, 2019

 నేను...నా దేశం
నా ఛాతి ఉప్పొంగి పోతూంది
నా జాతి ఉఱ్ఱూతలూగుతూంది
పేల్చిన మాటల తూటాలకు
పిట్టల్లా రాలిపోయిన ప్రత్యర్థులు
ఆ మాటల మాయా'జాలా'నికి
చేపల్లా చిక్కుకు పోయిన ఓట్లెన్నో
ఏ మీట నొక్కినా ఒకవైపే ఒరిగినవెన్నో
నా ఛాతి ఉప్పొంగి పోతోంది
నా జాతి ఎబ్బంగి పోతోంది?
'సూదిమొన మోపెడు నేల' ను వదలని
దుర్యోధన దురహంకారపు రాజరికం
ఆసేతు హిమాచలం మార్మోగుతోంది
నాకిదీ..నీకిదీ.. అంటూ పేట్రేగి పోతోంది
చిన్న చిన్న రాజ్యాలూ చిల్లర సంస్థానాలూ
ఆంగ్లేయుల దమనకాండకు ఆహుతి అయినట్లే
ఇప్పుడు ఒక్కొక్కటీ పడిపోవడం ఖాయం
అస్మదీయులూ అహ్మదాబాదీలూ సర్దుకోవడమే
మేలిముసుగు మంచుతెరల యీ పయనంలో
ఎటుపోతోందో నా దేశం
ఏమైపోతోందో నా దేశం
ప్రశ్నించే ప్రతిపక్షమే లేకుంటే
ప్రజాస్వామ్యం ముసుగులో
విఱ్ఱవీగే ఏకస్వామ్యమే
వ్యవస్థలు అమ్ములపొదిగా ఒదిగిన
మూకస్వామ్యానికి నూకలు చెల్లాలి
విమర్శలను వినమ్రంగా స్వీకరించని
నియంతలను దిగంతాలలో దింపాలి
బెదిరిపోయి నిదురరాని సామాన్యుడు
విసిగిపోయి ఎదురించే అసామాన్యుడు
ప్రతిమనిషీ తన బ్రతుకు తను బ్రతికే రోజు
ఎప్పటికైనా వస్తుందన్న ఆశతో
నా ఛాతి ఉప్పొంగి పోతోంది
నా జాతి మత్తులో తూగుతోంది.