Monday, September 23, 2019

 కరుణించు కల్పవల్లి
ఒక పిలుపులో పిలిచితే పలికుతావని
ప్రతి అడుగులో తోడుగా కదలుతావని
ఎందరో అన్నారు, నేను కూడా నమ్మాను
ఆర్తి ముఖ్యము కాని ఆడంబరం కాదనీ
స్ఫూర్తి ముఖ్యము కాని స్తుతులు కాదనీ
నిన్ నమ్మిన వారికెన్నటికి నాశము లేదనీ
త్రికరణ శుద్ధిగా నమ్మిన బంటును నేననీ
గృహమేథి యగుటచే ధన పశు పుత్ర మిత్ర
బాంధవ విత్త సముపార్జనా చిత్తమంతియే కాని
నానా సంవేదనాతప్త చిత్తమై కుందుటకు గాదు
నీ సేవా పరంపరాచిత్తమున వైకల్ప్యమే లేదు
శ్రోతవ్యం మమ విన్నపంబని ఆలకించినా
కర్తవ్యం మమ భక్తోద్ధారణమ్మని ఆదరించినా
యోగక్షేమం వహామ్యహమ్మని నిరూపించినా
కడగంటి చూపైన కడుపావనమ్మంటు మురిసిపోనా
ఆదరించవె తల్లి ఆనందవల్లి కరుణించు కల్పవల్లి.

Thursday, September 19, 2019

మ.
తలపుల్ తామర తంపరై హృదయమంతా భారమై రేపు యే
మలుపుల్ నా వ్యధ లంతలై తిరుగునో మాహేశ్వరీ నినున్
కొలచే భాగ్యము నిచ్చి నావు అదియే కోట్లాస్థి నాకున్ శివే
కలవే యంతటి భోగభాగ్యములు శంకా సదృశంబేలనో.
మ.
మనసంతా యపరాజితా కొలువె సామ్యంబేల  కామేశ్వరీ
తనువంతా నగజా నవావరణమే తంత్రోద్భవమ్మే హృదిన్
చనువంతా ప్రకటింపనోప జననీ శాకంబరీ షోడశీ
కనుమంతా శుభయోగమౌ నటుల నాకాశాంతమున్ శాంకరీ.
శా.
బాలా పంచదశీ హృదంతరమునన్ పారాయణంబౌ నిటన్
కాలక్షేపము నాకు షోడశియె వాగ్రాశీ విశేషంబుగా
మేలంబేల సరస్వతీ దయలు మమ్మేలే భవానీ కృపా
జాలంబంకురమై ప్రసూనమగు సత్సాంగత్య మిప్పించదే.
మ.
సరఘల్ నాతలపుల్ సదా మదిని వేసారించుచో యేదియో
స్ఫురణం బౌనది మంత్రమో మననమో స్ఫూర్తిప్రదాయంబగున్
త్వరగా పద్యమొ పాటయో గెలికినన్ తశ్శాంతి చేకూరెడిన్
వరదా శారద తీర్చిదిద్దునొక భావంబక్షరాలంకృతీన్.
(సరఘలు = తేనెటీగలు)

మ.
వరివస్యామతి నిచ్చి నీవు పరసేవన్ తుంగలో ద్రొక్కితే
పర సౌభాగ్యము కూర్చుటెట్టులొ ధనాభావంబు లేకుండగా
సిరి మా యింటను  నప్పుడె క
దరహాసోజ్వల భవ్య! విశ్వ వపుషా! దాక్షాయణీ! శివే.
(వరివస్యము = ఉపాసన)



Saturday, September 14, 2019

         అభయం
ఆరుపదుల వత్సరాల జీవన యానంలో
ఎన్నెన్ని ఉత్థాన పతనాలో గెలుపోటములో
మరణం తలుపు తట్టి వెనుదిరిగిన మజిలీలో
నైరాశ్యం వైరాగ్యం ముసిరిన చీకటి సమయంలో
నాలో నేనే ఒంటరిగా రోదించిన ఘడియలలో
నిలదీసి చేరదీసి నన్ను ఓదార్చిన కడలి కెరటాలు
పర్వతాలు పాదపములు మూగజీవులు జడభరతుడు
నాలో ఊపిరులూదిన భిషగ్వరులు నవ వైతాళికులు
జనజీవన స్రవంతిలో కలిసిపోతూ మురిసిపోతూ
సాగిపోతూ ఆగిపోతే అదే ఓ మహద్భాగ్యం కాదా
కదిలే కాళ్ళూ పలికే నోరూ కైమోడ్చే చేతులూ
బాగున్నప్పుడే మనస్కరించాలి ఆఖరి మజిలీ
సాధించిన విజయాలు అసాధారణాలు కనరావు
సాధించని లక్ష్యాలు అసామాన్యాలు అసలే లేవు
విరించి వరించి యిరికించిన వాక్పూదోటలో
అపరాపరా స్మృతిలో అన్యథా విస్మృతిలో ఆగిపోతే
ఖేచరీ ముద్రలో నుండగా అంతర్గత హంస ఎగిరిపోతే
అదే పదివేలు అదే యీ జీవిత సాఫల్యానికి మరోపేరు
అను నిత్యం నిను కొలచినందుకైనా మరేమైనా
ఇంతకు మించిన అభయం ఏదైనా నాకెందుకు.

Thursday, September 5, 2019


 ఆమె ఐ.ఏ.ఎస్.
(2/3సెప్టెంబర్ న ఒక వార్త చదివా. ఆడపిల్లలు ఐ.ఏ.ఎస్.అయితే  వారికి సంబంధాలు దొరకడం లేదని. అదే ఈ కథకు ఆధారం.)
"ఏవండీ అమ్మాయి ఐ.ఏ.ఎస్సో ఐ.పీ.ఎస్సో అయితే సమ్మంధాలు దొరకడం కష్టమైపోతుందేమో!" ఆలోచించండి మరోసారి.
"భేషుగ్గా మన అమ్మడు ఐ.ఏ.ఎస్సో ఐ.పి.ఎస్సో అవతానంటే కాదనుకుంటావేంటే? నీ బెంగ పాడుగాను."
"అమ్మా , ఏం ఎందుకు కాకూడదు? నేను అదే సాధిస్తా" అంది దృఢంగా స్వాతి .
శంకరం మేష్టారికి చాలా ఆనందం వేసింది అమ్మాయి నిర్ణయానికి. సరే కానిమ్మన్నారు.
సావిత్రమ్మగారు మీ యిష్టం. నా బెంగ నాది అని అర్ధాంగీకారం తెలిపారు.
స్వాతి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. నెలకు రెండు లకారాల జీతం. వయసు ఇంకా ఇరవైరెండే. అందుకే ఉద్యోగం మానేసి సివిల్స్ కి కోచింగ్ తీసుకుంటుందట.
శంకరం మేష్టారు భాగ్యనగరానికి మకాం మార్చారు. ఒక్కగానొక్క కూతురుకు అండగా నిలవాలని.
రెండేళ్ళు ఇట్టే గడిచి పోయాయ. స్వాతి రేయింబవళ్ళు శ్రమించింది. పరీక్షలూ మౌఖికాలూ అయ్యాయి.
అనుకున్నట్టే ఐ.ఏ.ఎస్. గా ఎంపిక అయింది.
వారి ఆనందానికి అవధుల్లేవు.
వచ్చేనెలలో డెహ్రాడూన్ ప్రయాణం. ఒక సంవత్సరం ట్రైనింగ్ కోసం.
"ఇప్పటి నుంచే సమ్మంధాల కోసం ప్రయత్నం చేద్దాం"
 సావిత్రమ్మగారి అంతరంగం.
"సరే అమ్మా. కాదనన్లే." స్వాతి
శంకరం మేష్టారు తెలిసున్న వారందరి చెవిన ఓమాట వేసారు.
ఏదో మేట్రిమోనీ వాళ్ళకూ డబ్బు కట్టారు. ఆరు నెలల్లో ఒక్కటి కూడా మేటి సంబంధం జాడ లేదు. మేట్రిమోనీ సైట్లో వీరు ఇంట్రెస్ట్ పెట్టినా స్పందన అంతగా రావడం లేదు. ఒకరిద్దరి తలిదండ్రులకు శంకరం మేష్టారే ఫోన్ చేసారు.
అమ్మాయి ఐ.ఏ.ఎస్సా అంటూ సాగదీసి పెదవి విరచే వారే కాని గొప్పగా భావించిన వారేలేరు.
లేకలేక ఓ సంబంధం కాస్త దగ్గరగా వచ్చినా పెళ్ళయ్యాక అవుసరమైతే ఉద్యోగం మానేయాలట.24/7 డ్యూటీ ఉద్యోగంలో ఉన్న అమ్మాయి తో సుఖపడేది ఎలాగ అనే వాడే ప్రతీ వాడూను.
ఎంత   కాలం మారిందని మనం అనుకున్నా ఇది పురుషాధిక్య సమాజం. మగాడి బుద్ధికి సమానత్వం నప్పదు. ఒప్పదు.
శంకరం మేష్టారికి అనుకోని సమస్యగా మారింది స్వాతి వివాహం.
ఎవరైనా మరో ఐ.ఏ.ఎస్ అయితే తేలికగా ఉంటుంది అర్థం చేసుకోగలరని భావించి ఆ కోవలో వెదుకులాట మొదలు పెట్టారు.
ఎలాగో ఓ ఐ.పీ.ఎస్. సంబంధం కుదిరింది. సుందరం
మంచివాడే. స్వాతికన్నా ఆరేళ్ళు పెద్ద.
ఇద్దరికీ హైదరాబాద్ పోస్టింగ్ దొరికింది.
పెళ్ళి హడావుడి అన్నీ పూర్తయ్యాయి. ఓ సంవత్సరం గడిచింది.
సుందరం చెల్లెలికి నాగేశ్వర్ తో పెళ్ళి కుదిరింది. నాగేశ్వర్ వాళ్ళు బాగా స్థిమితపరులు. ఈ ఇద్దరూ సాఫ్ట వేరే.
సుందరం తండ్రిది బందరు. ఆడపిల్ల పెళ్ళిపేరుతో హైదరాబాద్ కి మకాం మార్చేసారు.
సుందరం స్వాతిల ఇంటినిండా ఎవరో ఒకరు జనం వస్తూ పోతూ ఉంటారు.
స్వాతి అత్తమామలు బాగా చదువుకున్న వారే కాని శుభ్రాల్లేవు. స్వాతికి ఇల్లంతా నీట్ గా నాజూకుగా ఉంచుకోవడం అలవాటు.
ఒకటి రెండు సార్లు అత్తగారికి చెప్పి చూసింది. ఫలితం శూన్యం. ఆడపడుచు పెళ్ళైపోయి ఆర్నెల్లయింది.
స్వాతి అత్తమామలు స్థిరంగా కొడుకింట ఉండడానికి నిర్ణయించుకుని వచ్చేసారు.
ఇంతలో ఓరోజు
"స్వాతీ! నీ ఉద్యోగమూ పద్ధతీ నాకేం నచ్చ లేదు. ఎంతసేపూ ఆఫీసు పనులే కాని కట్టుకున్న వాడికి కావలసినవీ అత్తమామల బాగోగులు చూసుకోవద్దా.
ఉదయం 9 గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరవకుండా ఇంటికి వచ్చేయ్. లేకుంటే బోడి ఉద్యోగం మానేయ్." ఓ హుకుం జారీ చేసారు. మావగారు.
" నా కెరీర్ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి" కాస్త కటువుగానే జవాబు చెప్పింది.
"వాళ్ళతో ఎందుకు వాదిస్తావ్. అలాగే అంటే పోలా?"సుందరం రుసరుస.
"మేమూ పెద్దవాళ్ళం ఐపోయాం. ఇంక మీరే మాకు సేవ చెయ్యాలి కాని మేమే మీకు సేవ చేయడం కుదిరే పనికాదు." సుందరం తల్లి.
"ఇంట్లోనే ఉండి అందరి ఆలనా పాలనా చూసుకునే ఓ పల్లెటూరి అమ్మాయినో ఏ ఇంటరో చదివి ఉద్యోగం వద్దనుకునే అమ్మాయినో చేసుకోవలసింది. పెళ్ళికి ముందే నేను ఐ.ఏ.ఎస్. ఓ పక్క హోదాలు పెద్ద పెద్ద జీతాలు కావాలి. ఇంకో పక్క ఇంట్లో పనిమనిషిలా పనిచేయాలనుకోవడం దురాశ. నా వల్ల కాదు." తెగేసి చెప్పేసింది స్వాతి.
సుందరం మాటామంతీ బంద్ చేసేసాడు. వేరే గదిలో పడుకోవడం మొదలు పెట్టాడు.
మొత్తానికి మనస్పర్థలు అపోహలూ పెరిగాయ్. ఆర్నెల్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది.
అనుకోకుండా స్వాతిని ఖమ్మం బదిలీ చేసేసారు.
ఇదేసందు అని దాటేసింది.
సుందరం పూర్తిగా వాళ్ళ నాన్న చేతిలో కీలు బొమ్మలా మారిపోయాడు.
తను చేసేది తప్పని తెలిసినా తనను మారనివ్వడు వాళ్ళ నాన్న.
"కలిసి బతకాలని ఉంటే నువ్వూ ఖమ్మం వచ్చేయ్. మీ అమ్మా నాన్నని ఆ ఇంట్లో ఉంచు. లేదంటే విడిపోవడమే. నా మీద పెత్తనం చేస్తానంటే ఒప్పుకోను. ఏదో ఒకటి పెందలాడే తేల్చుకుని చెప్పు." స్వాతి అల్టిమేటం.
సుందరానికి బుఱ్ఱ గిఱ్ఱున తిరుగుతోంది. కిం కర్తవ్యం బోధ పడటం లేదు. ఎవరికీ చెప్పుకోలేడు. ఎటూ తేల్చుకోలేడు.
అవునంటే అత్తకి కోపం కాదంటే కోడలికి కోపం అన్న సందిగ్ధం.
"అమ్మాయి ఎంత చదివినా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఆనందించలేక వారి స్వార్థం కోసం కాపురాలు చెడగొట్టే చీడపురుగులున్న ఈ సమాజంలో ఓ వనితా సమానత్వం అనేది అందుబాటులో లేదని తెలుసుకో" అంటోంది స్వాతి.
రోజులు గడుస్తున్నా రాజీ కుదరడం లేదు. కాలం ఇలాంటి గాయాలను ఎలా మాన్చగలదో వేచి చూడాల్సిందే.
"ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్." అన్నారు చిలకమర్తి. కాని ఏంలాభం?
మగమహరాజులం అనుకొనే సోంబేరులను తయారు చేసిన వారికీ ఆడదంటే పగలంతా పనిమనిషీగా రాత్రికి సుఖదాయినిగా భావించే పురుష చెదపురుగులకూ కోటి దండాలు పెట్టి శంకరం మేష్టారు డీలా పడిపోయారు.
ఇందులో తన తప్పేమిటో తెలియక సంసార యోగం దూరమై స్వాతి , ఏ ఉద్యోగం చేయని అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే ఏ ఇబ్బందీ ఉండేది కాదని సుందరం,
కొడుక్కి పెద్ద ఉద్యోగం పెళ్ళి చేస్తే సుఖ పడొచ్ఛు అనుకుని ఖంగు తిన్నాం అనుకుంటూ సుందరం తల్లిదండ్రులు ఇలా అందరూ చింతాక్రాంతులే. తప్పెవరిది?