Monday, September 28, 2020

ఓటమి

       ఓటమి

నే నోడిపోయాను

నేలతల్లి ఒడలిపై ప్రాకుతూ

కేరింతలతో ప్రాకులాడుతూ

ఉండలేక జీవితం అదే అనుకోలేక

ఓడిపోయాను.

 ఓడిపోయి మరెప్పుడూ ఆ జోలికి పోలేదు,

ఉయ్యాలలో పడుక్కుని

ఆ మూరెడు యెడంలో ఉన్నదే విశ్వం అనుకుని

అలా పడుండలేక ఓడిపోయాను

మరెప్పుడూ దాని జోలికి పోలేదు.

అమ్మా నాన్నల మధ్య

తప్పటడుగులతో తడబడుతూ

తకిటతధిమి తకిటతధిమి తంధాన అనుకోలేక

నరుని బ్రతుకు నటన అని తెలుసుకోలేక

ఓడిపోయాను. తప్పెటగుళ్ళు తప్పటడుగులు వదిలేసా.

పితరులు చెప్పిన కృష్ణశతకం

అమ్మ పాడే కృష్ణుని పాటలూ 

శ్రుతపాండిత్యంగా ఒడిసి పట్టినా

అందులో ఎందుకో ఓడిపోయాను.

చదవడం వ్రాయడం నేర్వాలనుకున్నాను.

బాలరామాయణంతో ఆరంభించినా

చేతులారంగ శివుని పూజింపడేని అనిపించింది.

మరోసారి ఓడిపోయాను.

పెద్ల బాలశిక్షతో  తెలుగు బాట పట్టాను.

నవనవలాడే నవవర్షప్రాయంలో

ఇదే జీవితం కాదనుకున్నా

ఓడిపోయి మరోచోటకి పారిపోయా

ఆంగ్లం మోజు తలపుల బూజులు దులిపింది

ఆరేళ్ళు యధాలాపంగా సాగిపోయింది.

కళాశాలలు పట్టభద్రత ఆకర్షించాయి

అందుకే ఇంట ఓడిపోయి ఆవంక చేరిపోయా.

నూనూగు మీసాలతో నిరుద్యోగం పోటీ పడింది

ఉత్తమం స్వార్జితం విత్తం అనిపించింది

అందుకే ఓడిపోయి ఒంటరి పయనం ఆరంభించా

భూమి గుండ్రంగా ఉందని తెలిసింది

తెలుగు పలుకు తియ్యదనం రారమ్మంది

పద్యాలు పాటలే బ్రతుకనుకున్నా.

అక్కడా ఓడిపోయా.

ఉద్యోగం పురుషలక్షణం అనగా విన్నా

రాజధాని నగరం చేరుకున్నా, అన్నీ బాగానే ఉన్నా

ఒంటరి బ్రతుకు చేతిలో ఓడిపోయా.

జంటగా మరో అంకం ఆరంభించా

సంసార రంగులరాట్నంలో గిఱ్ఱున తిరిగా

అధికారం అంచులపై ఓడిపోయా

ఆరుపదులవయసుకు విశ్రాంతి అవసరమన్నారు.

చేతులారంగ శివుని పూజింపడేని అనుకున్నా

ఎంతో ఓపిగ్గా దేవులాడుతున్నా

పరమాత్మ చేతిలో ఓడిపోవాలనుకున్నా

ఆ ఆఖరి ఓటమి కోసం ఎదురుచూస్తున్నా.


Sunday, September 27, 2020

 శా.

ఎన్నాళ్ళీ ధన లేమితో వెతలు నే నే పాపముల్ జేసి తిం

కెన్నాళ్ళీ దురవస్థలన్ కనలుటల్ నే నోర్మితో నుండుటల్

కన్నీటన్ యభిషేకమున్ గొనుము వాగ్వాదంబులేలా పరా!

నిన్నున్ నమ్మిన పున్నెమో యితరమో నేనిట్లు దుఃఖించుటల్.

Friday, September 25, 2020

 

సీ.

బంగారు కామాక్షి పదసన్నిధిని భక్తి

        సప్తస్వర విహారి శ్యామశాస్త్రి

కమలాంబికను గొల్చి కమనీయ కృతులల్లి

        ముద్దుపళనియయ్యె ముత్తుస్వామి

రామతారక నామ రవళితో శ్రీరామ

        దర్శనమందిన త్యాగరాజు

సంగీత సామ్రాజ్య సామగాన విదులు

 పలువుర చట గూడి పాడుచుండ

తే.గీ.

గాన మాధుర్య సంగీత గమకములతొ

పరిఢవిల్లగ వైకుంఠ భర్గసభలు

లలిత సంగీత కచ్చేరి లహరి గూర్ప

 నింద్ర సభల బాలు డరిగె నింద్రపురికి.

      

Wednesday, September 23, 2020

 సీ.

చిరుత కూకటి శోభ చిలిపి పల్కులు తోప

    నతులు సన్నుతులతో నన్ను మలచి

సూక్తిముక్తావళీ సుప్రభాతపఠన

     మొక్కింత నలవర్చి ముచ్చటిల్లి

భాగవతగత శోభాయమానంపు ప

      ద్యములు పఠింపించి ధన్యత నిడి

భక్తి మార్గమునందు పయనింప గా జేసి

       స్వావలంబన తోడ సాగునట్లు

తే.గీ.

నన్ను తీర్చిదిద్దినయట్టి నా పితరుల

కేను ఋణపడి యుందు నా కింత హెచ్చు

 జేసిరనుచును న న్నింత జేసి జూచి

రనుచు యెట్లైన ఋణము తీరదని యనుచు.

సీ.

తల్లి గర్భములోన తలకిందులగుచు నే

            జేసిన మొరాలించి జీరెనేమొ

ఉగ్గుపాల్ద్రావుచున్ ఊకొట్ట రానప్డు

            జనని యమృతవృష్టి చలువ కేమొ

మైజారు యంచులు మాటిమాటికి పట్టి

           కృష్ణు కథలాలించు కృషికి నేమొ

లాలి పాటల జోల లల్లారు ముద్దుగా

         కంఠగతమై జెప్ప కనికరమ్మొ

తే.గీ.

బాల కృష్ణుని యాగిడీ పనుల కమ్మ

వద్దురా యంచు వారించు వాక్యములకొ

తెలుగు నుడికార మింపయ్యె తెలియ నపుడు

అట్టి తల్లిదండ్రుల నెప్డు నాత్మ దలతు.



Friday, September 18, 2020

ప్రణతి

     ప్రణతి

అన్యంబొల్లదు నామనంబకట! యాశాసాంతమట్లుంటచే

యన్యాక్రాంత విరోధమై చనును నా యాశా పరాధీనతన్

తాన్యాధృచ్ఛికమై వచో విభవమై ధర్మార్థమై తోచగా

ధన్యంబంచు తలంతు నాపుటక దాక్షాయణీ! భార్గవీ!

నిన్నున్నమ్మిన నామనంబితరమున్ నిర్లక్ష్యమున్ జేయగా

మున్నా భాగ్యమదెంతయో దవిలి సమ్మోహంబుగా మారగా

కన్నా నెన్నియొ మంత్రలబ్ద ఫలముల్ కాఠిన్యముల్ భోగముల్

నన్నేలా మున్నలా పరసుఖానందాఖ్యుడన్ జేసితో?

సంధ్యోపాసన నేర్చినట్టినను సత్సాంగత్య యోగంబుగా

జంధ్యాల్పూర్ణిమ నాటికిన్ తొలుత సుజ్ఞానావ కాసంబుగా

బంధ్యాసక్తులు మాని నీ కొలువు సంప్రాప్యమ్ము నా కబ్బ నే

వింధ్యా దృక్పధమింతలేక నిను సేవింపం దొరంకొంటినే. 

నీ పై నమ్మకమే మహాబలిమిగా నే నిన్నికష్టంబులన్ 

తాపీగా విధివత్తుగా సమధి కోత్సాహంబుతో సాగుచో

నా పై నా కొక సంశయంబు కలుగున్ నాకంత సామర్ధ్యమున్

ఏపాటైనను యున్నదా? బడి గుడిన్ యెట్లోర్తునో శాంకరీ.

మ.


నిను సేవింపగ నాపదల్ తొలగునో నిత్యోత్సవంబబ్బునో

మును నే జేసిన పాపసంచయము యామూలాగ్రమున్ బోవునో

కనులన్ గాంచెడి భాగ్యమే కలుగునో కన్నార నీరూపమున్

యనుకూలంబగు కాలమే యెదర సాధ్యంబౌచు తానున్నదో


నిను సేవింపగ కల్గు నెమ్మదికి నేనెంతో ముదంబందెదన్.



Monday, September 14, 2020

ఆశాజీవిని

       ఆశా జీవిని

 శరద్జ్యోస్నా మయూఖపుంజ విభ్రాజిత యమునాతటీ 

సితసైకత శ్రేణీ విలాసములలో విహారములలో 

తమి దీరని రాధికను నేనొక విరహాలంకృత అభిసారికను

దీర్ఘనిశా హేమంత పరవశ పరిష్వంగ దభంగ తరంగ గంగా

నిర్ఝర ఝరీ ప్రచలిత ప్రవాహములలో ప్రలోభములలో కరుగని  నీలశిలాఖండమును నేనొక మృత్పిండమును

ఘర్మజ్వర శ్రమాధ్వరజనిత స్వేదబిందు ధారా పరిపూర్ణ

వక్త్రోజ్వలాంతర్గత భావాంబర వీధీవిహార విహాయస

విశృంఖల విశ్వాసిని నేనొక పరపీడన నిశ్వాసిని

మధురాక్షర మృదులాక్కర పద్య గేయ కవితా

భ్రమితాక్షర విన్యాస సన్యాస క్రీడలతో ప్రోడలతో

సతమతమౌతూ ధృతమతినౌతూ సాగిపోయే

స్వేచ్ఛాజీవిని నేనొక నిరంతర ఆశాజీవిని.