Thursday, February 28, 2019

       అభినందన్


అభినందనా నీకు
అభినందన శత సహస్రాలు
భరత మాత వీర పుత్రునికి
యావజ్జాతి నీరాజనాలు
చావంటే భయం కాదు భక్తి
యావంటే విద్రోహ విముక్తి
శత్రువుల చేతిలో చిక్కినా
చెక్కు చెదరని నీ నిబ్బరం
శత్రువులు కూ అబ్బురం
తన కన్నా తనువు కన్నా
దేశ భద్రతే ముఖ్యమన్న నీ యుక్తి
స్వార్థపూరిత సంకుచిత
పాలక పాలితులకు మంచి సూక్తి
పదవి కోసం డబ్బు కోసం
వెంపర్లాడే వారికి ఓ చెంప పెట్టు
బ్రతికితే దేశం కోసమే బ్రతకాలి
మరణిస్తే దేశం కోసమే మరణించాలి
ఈ మట్టీ ఈ గాలి ఈ నీరు ఆకాశం
అన్నిటికీ కీర్తి తెచ్చిన ఘనత నీది
నీ స్ఫూర్తిగా ఈ దేశ యువత  జనత
నిస్స్వార్థంగా దేశ సమైక్యత కోసం
పనిచేస్తానని ప్రతిన పూనాలి
ఎంతో మందికి కర్తవ్య బోధ చేసిన
అప్రమేయ క్రియా శీలుడా
నీకివే మా హార్ధిక అభినందనలు



Tuesday, February 26, 2019

     మరులు గొను యెద


కనుల నెందేని యిసుమంత కాంక్ష యున్న
పోయి జూడరె నోర జూపుల మిఠారి
ఉత్త సింగారి నడక మయూరి యువ చ
కోరి మా యూరి నొయ్యారి నొక్క సారి.

        మధుర ప్రణయం

గ్రామీణ వాతావరణంలో సహజ సుందర దృశ్యాలను చూడగలగడం ఒక భాగ్యం. ఓ సోగ కళ్ళ పల్లె పిల్ల‌ ఆకళ్ళను వేటాడే మరో కొంటె కోణంగి కళ్ళు. ఆ కళ్ళ ఆకళ్ళు( ఆకలి లు) వారి పోకడలు దగ్గరగా చూడడానికి పూజారి వారి కోడలు
తా జారగ బిందె జారి దబ్బున పడియెన్
మైజారు కొంగు తడియగ
బాజారే తిరిగి జూచి ఫక్కున నవ్వెన్. అని ఏ శ్రీ నాథుడో 
ఆ ఒరవడిలో ఆ వరి మడిలో వంగి వంగి 
కలుపు తీయు కాపు కన్నె సొగసులు
చూడటానికి దేవులపల్లి కృష్ణ శాస్త్రో కా నక్కర లేదు.
అందుకే పదండి చూద్దాం.
(ఇది 1978-79 ప్రాంతంలో వ్రాసినది. కొన్ని యువజంటలను దగ్గరగా చూసినదీ పద్యాలు వ్రాయడం మొదలుపెట్టిన నవనవోత్సాహం 23/24 సంవత్సరాల వయసులో ఇలా వ్రాసాను. స్వానుభవం మాత్రం కాదు.)
కనుల నెందేని యిసుమంత కాంక్ష యున్న
పోయి జూడరె నోరజూపుల మిఠారి
ఉత్త సింగారి నడక మయూరి యువ చ
కోరి మా యూరి నొయ్యారి నొక్క సారి.1
అలరు శరము లేయుచు పలు వరుస మెరియ
తరుణి నవ్విన సిరుల దొంతరలు విరియు
కాంక్షతో తను తలయూచి కన్ను గలుప
తాళ లేనంతగా మరు తాప మెగయు.2
కారు మబ్బులు దట్టమై కన్నె కొప్పు
గా నమర తల మీద నో కడవ గుండె
లోపల మరుల జలరాశి లోతు లెంచ
పచ్చ ముక్కెర మెరయ సంబరము గాను
కాలి యందెలు లయతోడ ఘల్లు రనుచు
తకథిమిత తథిగిణిత తాళ మేయ
నడచి వచ్చెడు నొయ్యారి నాట్య హంస
మనసు పరదాల నర్తిలు మర్త్య హంస.3
దోచె నా యనన్యాక్రాంత దోష రహిత
హృదయ మంత కనలి పోవ హృత్కమలము
మరులు గొల్పుచు పలుమారు మనసు నిండ
కలల కిన్నెర యచ్చర కావ్య కన్య
నా స్వర మధుర కిసలయ నా రస హృద
య నవ ప్రణయ భావ నిలయ యతి సహాయ.4
అపుడు యిరు జూపు లొండొరుల హృదయాల
పువ్వు బాణాల నేయ నింపు గొని యొక్క
క్షణ మటులె నూసు లాడుచు నిలచితిమి
ఎడద నిశ్శబ్ద సడులవి ఎఱుక పడగ.5
ప్రేమ పులకలు మొలకలై యెగసె నేమొ
వలపు వాకిట వెన్నెల వంత పాడ
కన్ను‌లార నావైపు తా గాంచి కాంచి
కోర్కె మీరిన కండ్లతో కొంగు సాచె.6

ఒంటిగా నెదురైనచో నొక్క సారి
దూరదూరాల నుండియే తూపులేయు
చేతులూచి పైట సరి చేసి కొనుచు
మెల్లగా మెల మెల్లగా మెదలు కొనుచు
కనులు గలుపుచు తన నడక తడ బడుచు
నా వరకు వచ్చి సూటిగా నన్ను జూచి
వేగ వేవేగ మేఘమై వెడలి పోవు.7
కర్కశ హృదయ మంతయు గసరు నంత
మధురమౌ పులకింత నా మనసు నంత
ఓపలేనంత సరికొత్త ఊపు కొంత
కోరుచుండును మనసాపె కొలువు నపుడు.8
మనసు నందలి భావాలు మాటలల్లె
కనులు రెపరెపలాడించి కబురులంపు
గండు తుమ్మెద లా రెండు కండ్లు నాదు
మనసు మందార మందె భ్రమణము లాడు.
ఒక్క సారి గాకున్న వేరొక్క సారి
పడుచు మనసామె వెంబడి పరుగు లెత్తు
బీడు వారిన గుండెలో ప్రేమ వాన
గురిసి మొలకెత్తె వలపాంకురము లపుడు..10
వలపు నూనూగు మీసాల వయసులోన
సర్వ సాధారణమ్మేను సాధు కైన
గతుల తప్పొ మా మతులదే కాదొ తప్పు
వలపు నాకేల తలపుల వక్రమేల.11
పశుల కాల్ధూళిలో పవల్ పవ్వళించు
వంటకని వనితలు సిద్ధ పడుచు నుండ
ఆకలంచును బుడుతలు అరచు చుండ
మసక జీకటి నొక మునిమాపు వేళ.12
ఒంటిగా వీథి గడప పై నొకడనే సు
దీర్ఘ చింతా నిమగ్నుడై దేలు చుండ
రామ కోవెల జేగంట రవళి వేళ
నాసమయ్యెను సంపంగి నాదు మ్రోల.13
చేతి గాజులు గలగలా చేయ సద్దు
గొంతు సవరించి సకిలించి గోడ వెన్క
నక్కి క్రీనీడ లో నిల్చి నన్ను పిలువ
సిగ్గు దొంతరలతొ నాదు చేయి త్రాకె. 14
వేయి జలపాతముల హోరు వెల్లి విరియ
ప్రేమ విద్యుల్లతల కాంతి వేయి రెట్ల
సూటిగా నెద త్రాకగా సుడులు బోయె
వలపు పులకలు మేనంత వరదలల్లె. 15
మనసు మెచ్చిన వలపు తమకములోన
సూటిగా వేయి ప్రశ్నల జూపు చూడ
వంకరలు పోయి తలవంచి వన్నెలాడి. 16
పెదవి దాటని పలుకుల పట్టి పట్టి
మాఘ పున్నమి తానాలు మనువు గలుపు
జనమ జనమలకును ప్రతి జంట యందు
రావె పోదారి యెటులైన రాతిరపుడు
పోవు చున్నారు మనయూరి పున్నెమతులు
యనుచు మదిలోని తనగోర్కె నప్పజెప్పె. 17
జాలిగా జూచు నాకంటి జంట వైపు
ఎగసి యుప్పొంగు యురమందు యెందుకో భ
యమొకింత  మదిన్ సంశయమ్ము కొంత
వేయి గొంతుల ప్రేమార్తి వెల్లి విరియ. 18
గుండె లోపల నెందుకో గుబులు రేగె
కళ్ళ నిండుగ కన్నీళ్ళు క్రమ్మ జొచ్చె
నొసటి వ్రాతను తప్పించు నొరులు గలరె
విధి విధానము తప్పింప వీలు గలదె. 19
మదికి వలపంటు రోగమై మాట లేక
పట్టి పీడించు ప్రేమ పిపాసి కల్లె
వయసు ముందుకు వెనుకకు వద్దు వద్ద
నుచు మనసు పలు రీతుల నూగు లాడ
ఔను కాదనలేక  నే మౌనముంటి. 20
అశ్రు పూరిత నయనాల నామె జూచి
కండ్ల కద్దుకు చుంబించి కరము లపుడు
ప్రేయసీ! నీవె యత్యంత ప్రియము నాకు
భాగ్య లక్ష్మివి నాదు సౌభాగ్య వతివి. 21
తిరుగ బోయిన దుందుడ్కు తీరు లగును
వడిగ పదిమంది నోళ్ళలో పడుట వలదు
ముందు నాళ్ళకు తొందర్లు ముప్పులగును
యంచు మదిలోని సందిగ్ధ మంత తెలుప. 22
ఎంచితిన్నాళ్ళు నిన్నేదొ యింద్రుడంచు
గుండె లోపల నీకొక గుడిని కట్టి
కొలచు చుంటిని నిను సంకోచ పడక
మనసు గెలిచిన నా మరు మరుడ వీవు
వలదనక రమ్ము వేవేగ బయలు దేరి
యనుచు వివసయై చనునంత యా లతాంగి.23
కరము వట్టి నే కౌగిట కద్దు కొనుచు
జగతి నెదిరించి యైనను జంట నగుదు
కలవరమ్మేల కలికి వైకల్ప్య మేల
వేయి వేల్పులైన మనల వేరు జేయ
గలరె నను నమ్ము నీ జోడు గానె యుందు
నమ్మ బలికి సందిట నుంచి నచ్చ జెప్తి
నాటి మైరెంట నడుమగా నలుసు కూడ
ఉండ లేదంట యిరు మేను లొక్కటంట
అదియె వలపంట ఆ జంట అందమంట.24.
* * * * * * * *





Monday, February 25, 2019

   పిపాసి
ప్రేమ పక్షుల నే క్షోబ పెట్టినానొ
జంట గువ్వల నొకదాని జంపి నానొ
జోడు గుఱ్ఱాల విడదీసి చొక్కి నానొ
తృప్తిగా లేత మ్రొగ్గలే ద్రుంచి నానొ!
తెలియకఘములే జేసితో తెలిసి తెలిసి
మాలినై తుంటరిగ హతమార్చి నానొ
ఏ విరుల గువ్వ జంటల యే నవ నయ
లాస్య యువకుల శాపము లందినానో!
ఎఱుగ నెవ్విధి దాపురించె విరహాన
లాబ్ది వివశనై మునిగి తేలాడు ఘటన
తేటి యెరుగని తుంటరి తీపి తపన
పెంటి మరువని మమతల ప్రేమ సరసి.
తోటలో ప్రతి పువ్వు నే రీతి కోరు
నటులె హృదయ మందార ము న్నంకిత మిడ
మరగి సేవించి తొక మరుమరుని ప్రియుని.
నా ప్రియుడు నాకు వే నయనాల పంట
రాజతడు నేనతని రస రాజ్ఞి నంట
ముందుగా యిరువుర జూడ ముచ్చటంట
కదలు మావెంట యందరి కన్నులంట.
యెత్తు కొని పోయి వసివాడ యే వనిత
హత్తుకొని పోయెనో రేయి హద్దు మీరి
పాల నునులేత చెక్కిళ్ళ వాని వలచి
జార నాయెద చోరుని జాలి మాని.
మరచి యెటులుండ గలడె నా మరుడు ప్రియుడు
ఒక్క సారి గాకున్న వేరొక్క సారి
యైన రతియాడు కోనప్పు డైన మోవి
రుచుల నింపార గ్రోలుతరుణమునైన
తలుపడే నన్ను మనసార తనివి దీర
యనుభ వించిన ఘనుడు నయ వినయుండు.
ఉవిద జేసిన యే పూర్వ పుణ్య ఫలమొ
వేల్పు లెవ్వరి మెప్పించి వేడ్క నొందె
ఒడిలోని నా మది లోని వరుని సొగసు
బంధనాల బంధించెనో పాడు పడతి.
మనసు మెచ్చని మనువు తో మ్రగ్గి పోయి
మగని కాని వానికి నాదు మనసు నిచ్చి
మగనికి తనువొక్కటె యిచ్చి మసల గలనె
వంచితను నేను జీవచ్చవంబు నగుచు.
సోయగమ్మంత యరజేత చొక్కి చొక్కి
పాడు చేతుల నలిగి నే బలి పశువుగ
రాలిపోవలయునొ లేక రాటు దేలి
ఘడియ యొక యుగ ముగ నిక గడుప వలెనొ.
మల్లె పువ్వంటి మెత్తని మనసు గలదు
తనివి దీర్చెడి యందాల తనువు గలదు
నళినములవంటి వగు నయనాలు గలవు
ఎంచ జాలని పూ పొదరిల్లు గలదు.
ఇంతి సొగసుల నయగార మెంతొ గలదు
తనకు నచ్చిన రీతిగా దగులు గలదు
విభవ మొప్పెడి వీనుల విందు గలదు
లేని దొక్కటే తన పొందు లేదదేల?
చన్గవల మోవి నానించి చక్కిలిగిలి
వెట్టు శృంగార పురుషుని విడచు టెట్లు
పట్టి బిగి కౌగిలి ని పట్టుబట్టి యుంచు
మగని మరుకీల లెగదోయ మరచు టెట్లు?
ప్రేమ కంతిమ తీరమ్ము ప్రియ విరహమె
గనుక త్యాగ నిరతి తోడ కదలి పోనె
ఒంటిగా గత స్మృతులలో నోలలాడ
ధాత లిఖియించె నొ విధిని తలుప లేను.
పూవు నై విరిసియు ప్రాప్తి పొందకున్న
మ్రొగ్గనై రాలి పోవను మోజు పడుదు
నిర్జన గృహాంతర స్థలిని ఘట దీప
జనిత జ్యోతి కే తృప్తియో జ్వలన మందు?
పండు వెెన్నెల వాకిట పరువమంత
నే పిపాసినై పిసినారినై బికారి
నగచు నగుచు నా యెదపైన నాగరీక
పయ్యెదను కప్పు టెట్లు నే బ్రతుకు టెట్లు?
* * * * *


Friday, February 22, 2019

  వీడ్కోలు


ఉదయాన్నె నీలాటి రేవులో ని‌లచినపుడు
హృదయాన్ని నీలాటి వారికర్పించినపుడు
అరుణ బింబము జూచి
తరుణ గంగను జూచి
మునిపంట పెదవి నదిమి
కడకంట మనసు నిలిపి
అందుకో లేనంచు నే
పొందగా లేనంచు
వేవేల నిస్పృహలు
వెంటాడు నపుడు
నేనేల నీ స్మృతుల
మింటిలో నుంటి
రేయెండ వెలుగులో వారాశి తీరాన
నీయండ తొలగునో పేరాశ తీరునో
అలల కన్నియ జూచి
కలల  వన్నియ జూచి
మూతి బిగియించి శ్వాస నిగిడించి
వేడివేడి నిట్టూర్పులే విడచి నపుడు
ఎద గదించి రోదించి నపుడు
మది మదించి వాదించి నపుడు
తలపు తలపున నిన్ను
వలపు గడపన మున్ను
నిలుపుటే తప్పు
తలచుటే ముప్పు
నిమ్మళించుకు మదిని
చెమ్మళించుకు కనులు
కదలి పోలేదటే
నిను వీడి ఇసుక పఱ్ఱ!
నీ వింకనూ చాల కుఱ్ఱ.

Thursday, February 21, 2019


మరులు గొనుచుండె నీవేళ మనస దేలొ
మమతల సిరి బాల నా మనసు గెలిచె
మంచి తనయగ నామెను మలచ దలచి
యిచట నొకచోట చదువుకు జేర్చినాను.
జగతి నెరిగించి జగజెట్టి జేయనెంచి
ఇచట మేలెంచు మెలకువల్ నేర్ప దలచి
తనను శంకించి హింసించి తప్ప టడుగు
లు పడ కుండ భద్రముగ కేలూత నొసగి
నడచి నడిపించి యెక్కించ నందలముల
నులి పట్టి చెక్కెడి శిల్పి నూత్న రూప
ముల మలచునట్లు శ్రమియింతు మోసపోక.
చనువుగా నన్నడుగు చుండు చంద్రవంక
ఈప్సితములు నవుసరముల్ తీర్చమంచు
జేబు నిండుగ నున్నచో చేయు చుందు
కన్న కూతురు వలె సహకారమిత్తు.

Wednesday, February 20, 2019


1965లో విడుదలైన శివాజీ గణేశన్ నటించిన తిరువిలై యాడల్ అనే తమిళ చిత్రంలో ఒక అద్భుతమైన పాట ఉంది. మన జగదేక వీరుని కథలో శివశంకరీ లాంటి పాట. అది పాట్టుమ్ నానే భావముమ్ నానే
పాడమ్ ఉన్నై నాన్ పాడవెయిత్తేనే...... అని
అంటే
పాటను నేనే భావమూ నేనే
నిన్ను పాడేలా నేను చేసానే
ఈ పాట ప్రేరణతో సరస్వతీ దేవికి ప్రణమిల్లుతూ ఒక పాట.
అవధరించండి.

పలుకువు నీవే.. తలపువు నీవే
కవితా వధూటి నుదుటి తిలకము నీవే. // పలుకువు //
స్వరమూ నీవే నిస్వనమూ నీవే
వరణము (వర్ణము) నీవే.. వ్యాకరణము నీవే
గీతము నీవే సంగీతము.. నీవే
నాదము నీవే. అనువాదము నీవే  //పలుకువు//
పదమూ నీవే  భావము నీవే
కవితవు నీవే కావ్యము నీవే
పొత్తము నీవే నా చిత్తము నీవే
అవధానము సంవిధానమూ నీవే // పలుకువు //
భారతి నీవే భగవతి నీవే
వాణివి వీణాపాణివి నీవే
నీ  సరస సాహిత్య సంగీత సభలకు
సృష్టి సమస్తమూ ఉపకరణములే
జగతికి శరణాగతి నీ చరణములే // పలుకువు//

Tuesday, February 19, 2019

      చూడాలని ఉంది

చూడాలని నీతో మాటాడాలనీ
పదేపదే నా మనసు కోరుతున్నదీ
కలవాలని నీతో నడవాలనీ
ఎదో ఎదో నామనసు కోరుతున్నదీ  //చూడా//
ఎద పరచాలనీ విడమరచాలనీ
మది నిలవాలనీ హృది తెరవాలనీ
కల తెలుపాలనీ నిను గెలవాలనీ
మరీమరీ నామనసు కోరుతున్నదీ// చూడా//
పలుకుల  మధురిమతో
తలపుల మధువులతో
పెదవులపై సరిగమలై
నిన్నే నిన్నే నా మనసు పిలచు చున్నదీ// చూడా//
పలుకుల పూబోణీ  నా
కవితల అలివేణీ
కనికరించవా విరించి రాణీ
అవతరించవా అక్షర రూపిణీ
నీ దయ అక్షరమై
నా మది లయ క్షరమై
ఈ కవితా పూదోటలో
నిన్నే నిన్నే వేడుకోవలని ఉంది //చూడా//





Monday, February 18, 2019

మనసా నా మనసా....

తెలిసియుంటే హరి నామ స్మరణ
తెలియకుంటే హరి నామ స్ఫురణ
తెలిసీ తెలియకుంటే ఆ హరి కరుణ
చేయవే ఓ మనసా  కోరవే  నా మనసా //తెలిసి//
ఆరాట మెందుకే భోగ లాలసనలకై
హరి పాదాక్రాంత మొందవే ముక్తికై
శివార్పణం అంటూ పని జేయవే
శివోహం అంటూ పంచు కోవే  //తెలిసి//
సృష్టి అంతటా సాంబశివుడే సరి జూడవే
నీ గుండె లోపల ఆ మాధవుడే కను గొనవే
నేను అంటే ఏను కాదని తెలుసుకోవే
(న+ఏను=నేను)
నేనులోనున్న పరమాత్మను అందు కోవే//తెలిసి//
కైవల్య మనుకో కైలాస మదిగో
సాయుజ్య సిద్ధికై సంకల్ప శుద్ధితో
ఎరుకలో నున్నా నిదుర లో నున్నా
తపియించవే పరికించవే మనసా //తెలిసి//



Friday, February 15, 2019

మరెందుకు ఆలస్యం

దేశం అవనత వదనం
కాశ్మీరం అతలాకుతలం
భారతీయ హృదయం
రగులుతున్న అగ్ని హోత్రం
ప్రతిచర్యకూ ప్రతీకార చర్య నిస్సందేహం
ఆక్రమిత కాశ్మీరాన్ని పాక్ హస్తాల నుంచి
సైనిక చర్యతో తప్పించడానికి ఇదే అదను
ఈ తరుణంలో ప్రతీకార చర్యకు
విశ్వ వ్యాప్త ఆమోదం తథ్యం
మరెందుకు ఆలస్యం అని పని జరిపితే
కాషాయానికి ఈ దేశ జనత
శిరసు ఒంచి నమస్కరించగలదు
కిమ్మనకుండా ఓటేసి గెలిపించ గలదు.

Saturday, February 9, 2019


విరించి వరించీ హరించీ భరించీ స్మరించీ తరించీ గురించి చరించీ ధరించీ

Thursday, February 7, 2019

   నీ కోసం నవోదయం

ఏ నిసర్గ సహజ ఉదాసీన వైఖరీ విశేషమో
ఏ నిస్పృహావేశ పరాధీన భావ పరిహాసమో
నిర్లిప్తతో నిస్సంగత్వమో నిర్మోహత్వమో
మౌనమో పరాజయ భారమో పరాభవమో
నీ కనుసన్నల యెద తిన్నెల ముప్పిరిగొన్న
ఏదో అనిర్వచనీయ బాధామయ భావన
పలుకుల పెదవి దాటనీయక కట్టడి చేసి
తలపుల నెడద దాటనీయక ముట్టడిచేసి
ఉవ్వెత్తున ఎగసిపడే ఉగ్ర కోపానలాన్ని
ముని పంటిని అదిమి పట్టి బిక్క మొగం పెట్టి
ఏలా బాలా ఆ అయోమయ అసందిగ్ధావస్థ
ఏలా బాలా నీ అసహాయ మ్లాన దురవస్థ
ఇదమిత్థమంచెరుక పడక ఎదురు పడక
మది కాసింత స్తిమిత పడగ చేయూత నడుగ
మోమాటమో యిరకాటమో అడ్డు పడగ
కై మోడ్చి యిలవేల్పు నార్తితో పిలచి
వేదనలు ఆవేదనలు  మౌనముగ వినిపించి
ఆరడి దూరాడి ఊరడి నొందలేవా
కలకాలమీ కష్టాలు మనగలవా
చిరుదరహాస నవోదయం నీ కోసం
త్వరలోనే నీ ముంగిట విరిసేనే.


Tuesday, February 5, 2019

పాదారవింద శతకం


పాదారవింద శతకం 1వ శ్లోకం.
శిఖరిణి.
మహిమ్నా పంథానం మదన పరిపంథి ప్రణయనీ
ప్రభుః నిర్ణేతుమ్ తే భవతి యతమానోపి కతమః
తథాపి శ్రీ కాంచీ విహృతి రసికే కోపి మనసో
విపాక స్త్వత్పాద స్తుతి విదిషు జల్పాకయతి మామ్.
తెలుగ సేత.
శిఖరిణి.
మరుధ్వంసీ యర్థాంగి మహిమల సన్మార్గముల నె
వ్వరైనన్ తెల్వంగా గలరె ప్రభువా వాముడు వినా
మరే పుణ్యంబో నామది పరిణతో మక్కువ పడెన్
పరా శ్రీ కామాక్షీ నుతులనువదింపన్నరయుమీ.  1.

శిఖరిణి.
మరాళీనాం యానాభ్యసన కలనా మూల గురువే
దరిద్రాణాం త్రాణవ్యతికర  సురోద్యాన తరవే
తమస్కాండ ప్రౌఢి ప్రకటన తిరస్కార పటవే
జనోయం కామాక్ష్యాశ్చరణ నలినాయ స్పృహయతే.
తెలుగు సేత.
శిఖరిణి.
మరాళీయానాధ్యాపన తొలి గురున్ మా యచలజన్
దరిద్రానేకంబుల్ దునిమి కలిమిన్ తార్చు తరువున్
స్ఫురత్సమ్మోహాంధచ్ఛటల చెలగే పొంకమునకున్
మరుత్కామాక్షీ పాద సుమముల నీమమ్ము( గొలతున్.3.
2.
ధరధ్వంసోద్యానస్థిత జివురు జొత్తా ప్రభలతో
కరద్యోతా కెంజాయల తొలి గురోత్కర్షణ మనన్
నిరాతంకంబై మంకెన విరులతోనే తలపడెన్
పరా శ్రీ కామాక్షీ పద కిరణ శోభా యరుణిమన్. 2.

4.
ద్యులోకస్త్రీ సీమంత తెరువుల సిందూర భరమున్
సులాలిత్యోత్కృష్టుండగు కవి రవీ స్యూనముల యా
వెలుంగున్ వేదస్త్రీ యరుణ పయిటన్ వెల్గులవియున్
కలాధారీధారీ పద బిసరుహా కాంతులవియే.4.
5.
నమస్కారార్థంబై మరుల తగువౌనంచొరగగా
ఉమాభర్తృశ్శిఖా విభవ తొగరాయుండరుణిమన్
సమీచీ కామాక్షీ పదనళిన భాస్వత్ప్రభలచే
మమాంతర్చిత్తంబయ్యరుణిమ నసామాన్య సిరనున్. 5
6.
ఇవేగా త్రైవిష్ణ్వాదుల ముకుటముల్ పీఠములుగా
అవేగా మా వాగ్రీతులు మొనయు వాగాలయములై
అవేగా యా బ్రహ్మాది విబుధుల దాసాధికులుగా
అవాప్తంబౌ కామాక్షి పద దరి సంచారి నగుదున్. 6
7.
ఘటిల్లే సందేహాస్సరసిజ రుచిర్ క్షాంతి దిశలన్
ఘటించున్ కెంజాయల్ నఖకిరణ కోకారి సగమున్
మిటారించే దిగ్దంత కవి హృదయామేయ కలువల్
పటిష్టత్కామాక్షీ చరణ రుచి రేపాడి వరలున్. 7
8.
దరస్మేరానమ్రానన నభవు పాదాందియలదౌ
విరావమ్మేదో సాంత్వన వచన సంవేది యగుచున్
స్ఫురించెన్ కామాక్షీ చరణ యుగళస్ఫోరక సఖీ
కురంగాక్షిన్ తత్పాదములలరె నుత్కృష్టములుగన్. 8.
9.
సుర స్త్రీ లాలాటంబున భ్రమరముల్ చొక్కటముగా
స్ఫురల్లాక్షారాగాత్తరుణ తరణిజ్యోతి యెరుపున్
తరించెన్ కాంత్యంబో వికసిత బృహత్పద్మములుగా
స్ఫురించెన్ కామాక్షీ పదయుగళమున్ స్ఫూర్తి ప్రదమై.9.
౧౦.
రజస్సంబంధంబున్నను యరజసోరమ్ముల యెడన్
త్యజించే వైరక్త్యాదులకు ననురక్త్యమ్ముల ఫల
మ్మజస్రమ్మందాధ్యాయనమె యొనరన్ మందు గలదే
నిజంబా కామాక్షీ పదయుగళముల్ నివ్వెర మిడున్. ౧౦.
౧౧
జగద్రక్షాదక్షో నియతి గలవై చారు పదముల్
జగన్మాతా కామాక్షీ విరచిత తపశ్చర్య మొనరిం
చు గాదే మంజీరస్ఫురదరుణిమన్ చుంచులమరన్
సుగంగా నీరంబా నఖరుచిఝరీ సుస్థిత మనన్.

Monday, February 4, 2019


తే.గీ.
ఎన్ని సేవలు జేసినా ఏమి ఫలము
మిన్న కుండెడి మీనాక్షి మిడిసి పడగ
వన్నె చిన్నెల వగలాడి వాలకమ్ము
రాతి గుండెల నాతివే రామ చిలుక.
వానకారు కోయిల వౌచు వదర బోవు
కుఱ్ఱకారు చపల బుద్ధి కుదహ రింతు
నిన్ను యక్కున జేర్చు కొని నదె తప్పు
రాలు పూతల సుమమీవు రాలుగాయి.
అద్దె నగవుల కొద్దిగా నద్ది నావు
కమ్మని తలపు కరవైన కంది రీగ
వాడి విసిరి పారేయుటే  వాసి నీకు
రాదటే నా యవుసరమ్ము రస విహీన.

సార్థకత


ఆరు పదుల జీవన గమనంలో
ఎత్తు పల్లాలు కలిమి లేములు
ఎన్నో ఎన్నెన్నో ఆధిగమించాను
ఎత్తు మూటల నాటి మురిపాలు
తప్పటడుగుల నాటి బోసి నవ్వులు
జ్ఞప్తి లేకున్నా గుర్తు రాకున్నా
చిరుత కూకటి నాటి చిలిపితనాలు
కురుచ నిక్కరు నాటి ఆటపాటలు
గురుతున్నాయ్ గురుతున్నాయ్.
పొరుగూరి చదువులో పోటీలు
ఇస్కూలు చదువులో స్నేహాలు
కాలేజీ ముంగిట కుఱ్ఱకారు కలేజాలు
పుస్తకమే సమస్తం గా గడిపిన రాత్రులు
మరచిపోలేదింకా మరపు రావింక
నిరుద్యోగ పర్వంలో నిగర్వంగా
వలస బ్రతుకులో సగర్వంగా
గుండె గుప్పెట పట్టి మనసు కట్టిపెట్ఞి
తప్పటడుగులు పడకుండా
ఎవరికీ గుదిబండ కాకుండా
ఆకర్షణలకు దూరంగా చన్నీటి జలకాలు
ఎలా మరువ గలను? ఏలా మరువ గలను?
విధి వంచితమో హృది సంచితమో
కొన్ని పోగొట్టుకున్నా కొన్ని సాధించుకున్నా.
అదేమి చిత్రమో విధి వైపరీత్యమో
ఒక చేత ప్రభుతలో పనికి నియామక లేఖ
మరొక చేత మనసు దోచిన మనిషి శుభలేఖ
కా‌లచక్రం గిఱ్ఱున తిరిగి పోయింది
వలస కూలీగా వెనకేసుకున్న రూకలు నాలుగు
విశ్రాంత జీవనానికి ముట్టిన మాడలు మరో నాలుగు
ఇల్లు ఇల్లాలు చూలు అనందాలు
  అంత‌లోనె  మహా రోగాలు శస్త్రచికిత్సలు
ఏదైనా చేద్దామంటూ కొందరి సంప్రదింపులు
తీరా దిగాక వేదనలూ ఆవేదనలూ
అనుభవం నేర్పిన పాఠం ఒకటే
నీ సొమ్ములే కావాలి కాని నీవు కాదు
దాని కోసమే అంగలార్చినా చొంగ కార్చినా
డబ్బుకు లోకం దాసోహం అదే ముదావహం
నీతి నిజాయితీ నిన్నటి మాట
కులమూ మతమూ కంపుల మూట
అదే నిజమైతే కాలుడి ముంగిట
తల వంచుకు నిలచేరా ఉరికంబం ఎక్కేరా
మనిషిగా సాధించిన దేముంది
ఈ బ్రతుకుకు సార్థకత ఇంకేముంది?


Saturday, February 2, 2019


మాటలలో తియ్యదనం
మనసేమొ కఠినతరం
పెదవులపై దరహాసం
హృదయంలో పరిహాసం
ఇదేమిటో ఇదేమిటో
జవరాలి ఆంతర్యం ఏమిటో
మాటలేమొ మృదుమధురం
మనసేమొ హిమశిఖరం
మనిషేమొ బుద్ధస్వరూపం
మనువేమొ ఆమడ దూరం
అదేమిటో అదేమిటో
యువరక్తం ఉడుకేమిటో //  //
ఆమని రాకకు  వేళొకటుంది
రాముని సీతకు ఎదురేముంది
పున్నమి వెన్నెల తోడుంటుంది
అన్నుల మిన్నగ బ్రతుకుంటుంది
ఎదురు చూపులు వేదన కాదా
ఎదల మాటున  వేదన లేదా 
కన్నుల కలలూ పండక పోవు
నిన్నటి ఆశలు తీరక పోవు //  //