Monday, February 25, 2019

   పిపాసి
ప్రేమ పక్షుల నే క్షోబ పెట్టినానొ
జంట గువ్వల నొకదాని జంపి నానొ
జోడు గుఱ్ఱాల విడదీసి చొక్కి నానొ
తృప్తిగా లేత మ్రొగ్గలే ద్రుంచి నానొ!
తెలియకఘములే జేసితో తెలిసి తెలిసి
మాలినై తుంటరిగ హతమార్చి నానొ
ఏ విరుల గువ్వ జంటల యే నవ నయ
లాస్య యువకుల శాపము లందినానో!
ఎఱుగ నెవ్విధి దాపురించె విరహాన
లాబ్ది వివశనై మునిగి తేలాడు ఘటన
తేటి యెరుగని తుంటరి తీపి తపన
పెంటి మరువని మమతల ప్రేమ సరసి.
తోటలో ప్రతి పువ్వు నే రీతి కోరు
నటులె హృదయ మందార ము న్నంకిత మిడ
మరగి సేవించి తొక మరుమరుని ప్రియుని.
నా ప్రియుడు నాకు వే నయనాల పంట
రాజతడు నేనతని రస రాజ్ఞి నంట
ముందుగా యిరువుర జూడ ముచ్చటంట
కదలు మావెంట యందరి కన్నులంట.
యెత్తు కొని పోయి వసివాడ యే వనిత
హత్తుకొని పోయెనో రేయి హద్దు మీరి
పాల నునులేత చెక్కిళ్ళ వాని వలచి
జార నాయెద చోరుని జాలి మాని.
మరచి యెటులుండ గలడె నా మరుడు ప్రియుడు
ఒక్క సారి గాకున్న వేరొక్క సారి
యైన రతియాడు కోనప్పు డైన మోవి
రుచుల నింపార గ్రోలుతరుణమునైన
తలుపడే నన్ను మనసార తనివి దీర
యనుభ వించిన ఘనుడు నయ వినయుండు.
ఉవిద జేసిన యే పూర్వ పుణ్య ఫలమొ
వేల్పు లెవ్వరి మెప్పించి వేడ్క నొందె
ఒడిలోని నా మది లోని వరుని సొగసు
బంధనాల బంధించెనో పాడు పడతి.
మనసు మెచ్చని మనువు తో మ్రగ్గి పోయి
మగని కాని వానికి నాదు మనసు నిచ్చి
మగనికి తనువొక్కటె యిచ్చి మసల గలనె
వంచితను నేను జీవచ్చవంబు నగుచు.
సోయగమ్మంత యరజేత చొక్కి చొక్కి
పాడు చేతుల నలిగి నే బలి పశువుగ
రాలిపోవలయునొ లేక రాటు దేలి
ఘడియ యొక యుగ ముగ నిక గడుప వలెనొ.
మల్లె పువ్వంటి మెత్తని మనసు గలదు
తనివి దీర్చెడి యందాల తనువు గలదు
నళినములవంటి వగు నయనాలు గలవు
ఎంచ జాలని పూ పొదరిల్లు గలదు.
ఇంతి సొగసుల నయగార మెంతొ గలదు
తనకు నచ్చిన రీతిగా దగులు గలదు
విభవ మొప్పెడి వీనుల విందు గలదు
లేని దొక్కటే తన పొందు లేదదేల?
చన్గవల మోవి నానించి చక్కిలిగిలి
వెట్టు శృంగార పురుషుని విడచు టెట్లు
పట్టి బిగి కౌగిలి ని పట్టుబట్టి యుంచు
మగని మరుకీల లెగదోయ మరచు టెట్లు?
ప్రేమ కంతిమ తీరమ్ము ప్రియ విరహమె
గనుక త్యాగ నిరతి తోడ కదలి పోనె
ఒంటిగా గత స్మృతులలో నోలలాడ
ధాత లిఖియించె నొ విధిని తలుప లేను.
పూవు నై విరిసియు ప్రాప్తి పొందకున్న
మ్రొగ్గనై రాలి పోవను మోజు పడుదు
నిర్జన గృహాంతర స్థలిని ఘట దీప
జనిత జ్యోతి కే తృప్తియో జ్వలన మందు?
పండు వెెన్నెల వాకిట పరువమంత
నే పిపాసినై పిసినారినై బికారి
నగచు నగుచు నా యెదపైన నాగరీక
పయ్యెదను కప్పు టెట్లు నే బ్రతుకు టెట్లు?
* * * * *


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home