Tuesday, February 26, 2019

        మధుర ప్రణయం

గ్రామీణ వాతావరణంలో సహజ సుందర దృశ్యాలను చూడగలగడం ఒక భాగ్యం. ఓ సోగ కళ్ళ పల్లె పిల్ల‌ ఆకళ్ళను వేటాడే మరో కొంటె కోణంగి కళ్ళు. ఆ కళ్ళ ఆకళ్ళు( ఆకలి లు) వారి పోకడలు దగ్గరగా చూడడానికి పూజారి వారి కోడలు
తా జారగ బిందె జారి దబ్బున పడియెన్
మైజారు కొంగు తడియగ
బాజారే తిరిగి జూచి ఫక్కున నవ్వెన్. అని ఏ శ్రీ నాథుడో 
ఆ ఒరవడిలో ఆ వరి మడిలో వంగి వంగి 
కలుపు తీయు కాపు కన్నె సొగసులు
చూడటానికి దేవులపల్లి కృష్ణ శాస్త్రో కా నక్కర లేదు.
అందుకే పదండి చూద్దాం.
(ఇది 1978-79 ప్రాంతంలో వ్రాసినది. కొన్ని యువజంటలను దగ్గరగా చూసినదీ పద్యాలు వ్రాయడం మొదలుపెట్టిన నవనవోత్సాహం 23/24 సంవత్సరాల వయసులో ఇలా వ్రాసాను. స్వానుభవం మాత్రం కాదు.)
కనుల నెందేని యిసుమంత కాంక్ష యున్న
పోయి జూడరె నోరజూపుల మిఠారి
ఉత్త సింగారి నడక మయూరి యువ చ
కోరి మా యూరి నొయ్యారి నొక్క సారి.1
అలరు శరము లేయుచు పలు వరుస మెరియ
తరుణి నవ్విన సిరుల దొంతరలు విరియు
కాంక్షతో తను తలయూచి కన్ను గలుప
తాళ లేనంతగా మరు తాప మెగయు.2
కారు మబ్బులు దట్టమై కన్నె కొప్పు
గా నమర తల మీద నో కడవ గుండె
లోపల మరుల జలరాశి లోతు లెంచ
పచ్చ ముక్కెర మెరయ సంబరము గాను
కాలి యందెలు లయతోడ ఘల్లు రనుచు
తకథిమిత తథిగిణిత తాళ మేయ
నడచి వచ్చెడు నొయ్యారి నాట్య హంస
మనసు పరదాల నర్తిలు మర్త్య హంస.3
దోచె నా యనన్యాక్రాంత దోష రహిత
హృదయ మంత కనలి పోవ హృత్కమలము
మరులు గొల్పుచు పలుమారు మనసు నిండ
కలల కిన్నెర యచ్చర కావ్య కన్య
నా స్వర మధుర కిసలయ నా రస హృద
య నవ ప్రణయ భావ నిలయ యతి సహాయ.4
అపుడు యిరు జూపు లొండొరుల హృదయాల
పువ్వు బాణాల నేయ నింపు గొని యొక్క
క్షణ మటులె నూసు లాడుచు నిలచితిమి
ఎడద నిశ్శబ్ద సడులవి ఎఱుక పడగ.5
ప్రేమ పులకలు మొలకలై యెగసె నేమొ
వలపు వాకిట వెన్నెల వంత పాడ
కన్ను‌లార నావైపు తా గాంచి కాంచి
కోర్కె మీరిన కండ్లతో కొంగు సాచె.6

ఒంటిగా నెదురైనచో నొక్క సారి
దూరదూరాల నుండియే తూపులేయు
చేతులూచి పైట సరి చేసి కొనుచు
మెల్లగా మెల మెల్లగా మెదలు కొనుచు
కనులు గలుపుచు తన నడక తడ బడుచు
నా వరకు వచ్చి సూటిగా నన్ను జూచి
వేగ వేవేగ మేఘమై వెడలి పోవు.7
కర్కశ హృదయ మంతయు గసరు నంత
మధురమౌ పులకింత నా మనసు నంత
ఓపలేనంత సరికొత్త ఊపు కొంత
కోరుచుండును మనసాపె కొలువు నపుడు.8
మనసు నందలి భావాలు మాటలల్లె
కనులు రెపరెపలాడించి కబురులంపు
గండు తుమ్మెద లా రెండు కండ్లు నాదు
మనసు మందార మందె భ్రమణము లాడు.
ఒక్క సారి గాకున్న వేరొక్క సారి
పడుచు మనసామె వెంబడి పరుగు లెత్తు
బీడు వారిన గుండెలో ప్రేమ వాన
గురిసి మొలకెత్తె వలపాంకురము లపుడు..10
వలపు నూనూగు మీసాల వయసులోన
సర్వ సాధారణమ్మేను సాధు కైన
గతుల తప్పొ మా మతులదే కాదొ తప్పు
వలపు నాకేల తలపుల వక్రమేల.11
పశుల కాల్ధూళిలో పవల్ పవ్వళించు
వంటకని వనితలు సిద్ధ పడుచు నుండ
ఆకలంచును బుడుతలు అరచు చుండ
మసక జీకటి నొక మునిమాపు వేళ.12
ఒంటిగా వీథి గడప పై నొకడనే సు
దీర్ఘ చింతా నిమగ్నుడై దేలు చుండ
రామ కోవెల జేగంట రవళి వేళ
నాసమయ్యెను సంపంగి నాదు మ్రోల.13
చేతి గాజులు గలగలా చేయ సద్దు
గొంతు సవరించి సకిలించి గోడ వెన్క
నక్కి క్రీనీడ లో నిల్చి నన్ను పిలువ
సిగ్గు దొంతరలతొ నాదు చేయి త్రాకె. 14
వేయి జలపాతముల హోరు వెల్లి విరియ
ప్రేమ విద్యుల్లతల కాంతి వేయి రెట్ల
సూటిగా నెద త్రాకగా సుడులు బోయె
వలపు పులకలు మేనంత వరదలల్లె. 15
మనసు మెచ్చిన వలపు తమకములోన
సూటిగా వేయి ప్రశ్నల జూపు చూడ
వంకరలు పోయి తలవంచి వన్నెలాడి. 16
పెదవి దాటని పలుకుల పట్టి పట్టి
మాఘ పున్నమి తానాలు మనువు గలుపు
జనమ జనమలకును ప్రతి జంట యందు
రావె పోదారి యెటులైన రాతిరపుడు
పోవు చున్నారు మనయూరి పున్నెమతులు
యనుచు మదిలోని తనగోర్కె నప్పజెప్పె. 17
జాలిగా జూచు నాకంటి జంట వైపు
ఎగసి యుప్పొంగు యురమందు యెందుకో భ
యమొకింత  మదిన్ సంశయమ్ము కొంత
వేయి గొంతుల ప్రేమార్తి వెల్లి విరియ. 18
గుండె లోపల నెందుకో గుబులు రేగె
కళ్ళ నిండుగ కన్నీళ్ళు క్రమ్మ జొచ్చె
నొసటి వ్రాతను తప్పించు నొరులు గలరె
విధి విధానము తప్పింప వీలు గలదె. 19
మదికి వలపంటు రోగమై మాట లేక
పట్టి పీడించు ప్రేమ పిపాసి కల్లె
వయసు ముందుకు వెనుకకు వద్దు వద్ద
నుచు మనసు పలు రీతుల నూగు లాడ
ఔను కాదనలేక  నే మౌనముంటి. 20
అశ్రు పూరిత నయనాల నామె జూచి
కండ్ల కద్దుకు చుంబించి కరము లపుడు
ప్రేయసీ! నీవె యత్యంత ప్రియము నాకు
భాగ్య లక్ష్మివి నాదు సౌభాగ్య వతివి. 21
తిరుగ బోయిన దుందుడ్కు తీరు లగును
వడిగ పదిమంది నోళ్ళలో పడుట వలదు
ముందు నాళ్ళకు తొందర్లు ముప్పులగును
యంచు మదిలోని సందిగ్ధ మంత తెలుప. 22
ఎంచితిన్నాళ్ళు నిన్నేదొ యింద్రుడంచు
గుండె లోపల నీకొక గుడిని కట్టి
కొలచు చుంటిని నిను సంకోచ పడక
మనసు గెలిచిన నా మరు మరుడ వీవు
వలదనక రమ్ము వేవేగ బయలు దేరి
యనుచు వివసయై చనునంత యా లతాంగి.23
కరము వట్టి నే కౌగిట కద్దు కొనుచు
జగతి నెదిరించి యైనను జంట నగుదు
కలవరమ్మేల కలికి వైకల్ప్య మేల
వేయి వేల్పులైన మనల వేరు జేయ
గలరె నను నమ్ము నీ జోడు గానె యుందు
నమ్మ బలికి సందిట నుంచి నచ్చ జెప్తి
నాటి మైరెంట నడుమగా నలుసు కూడ
ఉండ లేదంట యిరు మేను లొక్కటంట
అదియె వలపంట ఆ జంట అందమంట.24.
* * * * * * * *





0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home