Saturday, September 30, 2017

ఏ వంచన చేసేనో

తాడే పామై కరిస్తే
నీడే దెయ్యమై వెంబడిస్తే
దాన్ని సర్ప రజ్జు భ్రాంతి అనుకోవాలా
ఖర్మ కాలి మట్టిలో కలిసిందనుకోవాలా
వాడే వాడై(వాడ అయి)కూస్తే
వీడే వీడై (వీడు=సమూహము) అరిస్తే
దాన్ని ప్రారబ్ద మనుకోవాలా
దొమ్మర దేశం అనుకోవాలా?
'నాతి పండితః నాతి పండితః'
నేనే సర్వజ్ఞుడ నంటే
ఇంగితం లేని ఎంగిలి మెతుకను కోవాలా
సంగతే తెలియని చచ్చు దద్దమ్మనుకోవాలా
కంచరగాడిద కంచె గాడి పంచ పీకితే
ఏ పంచన చేరేనో
 ఏ వంచన చేసేనో
ముదనష్టపు పీనుగ పీడ వదిలేనా
భువి కిష్టపు కిష్టుడు మము బ్రోచేనా ?

Wednesday, September 20, 2017

విరబూయవా 

గగనమంతాఎంత వెతకినా
నాగుండెలో గుడి కనిపించునా
భువనమంతా ఎంత గాలించినా
నా మమతల కోవెల కనిపించునా
మనసులో అభిమానం
పిలుపులో ఆదరం
పలుకులో మార్దవం
వెరసి నీ వంటే  ఇష్టం
మా ఇంటి బాలవై బేలవై
మా మనసు గెలుచు కోవా
మా కూన వై మిగిలి పోవా//   //
ఎదురు పడితే ఏమనవు
ఎవరు ఎవరికి ఏమగునో
మనసు తెలిసిన మరుమల్లె
పరిమళ వితరణ అరుదల్లె
విరబూయవా కరవు తీరా
సువాసనలతో మనసుతీరా//   //


Tuesday, September 19, 2017

మన విధి

ఊహల కందని చేతల చిక్కని విధి
అపోహల పరదాల కావల నిలచే నిధి
తలచినది తలచినటులే జరుగదు
తలువనిది తటాలున జరుగుతుంది
మనం ఒకటి తలిస్తే దైవం మరోటి తలుస్తుంది
అందుకే రేపటి కోసం నేడే మంచి చేయాలి
ప్రతి జీవికి ఒక నిర్దేశిత ప్రయోజనం ఉంటుంది
ప్రతి కదలిక ప్రతి చేతన శివాజ్ఞతో కదిలేది
ఆశ పడటం ఆరాట పడటం మన అలవాటు
అత్యాశకూ పేరాశకూ ఫలితం ప్రమాదకరం
అందుకే సహజత్వానికి దగ్గరగా ఉండాలి
సమాజానికి మనం అందుబాటులో ఉండాలి
మన కర్తవ్యం మనసా వాచా చేయాలి
ఫలితం భగవదధీనం ప్రారబ్ద పూరకం
కలసి పనిచేయడం ఫలితం విశ్లేషించడం
చేయగలిగినంత కృషి చేయడం మన విధి

Saturday, September 16, 2017

No space for Ego

Unrealistic baseless ambition
Where does it lead you in competition?
Why the heart is pushed to combustion?
What loss does it bring to your wallet?
Do you guess the irrecoverable loss of time?
Can you get back the wind to your side?
Is your Ego more valuable?

Expectations and Ambitions be realistic
To not to remain far behind on the sprint
Let the soul keeps off burning
As every activity impacts wallet
Not money but Time is more valuable
The wind flow is influenced by so many factors
True sense of Economics leaves no space for Ego

సేసలు వేనవేలు

'దవీయాంశం స్నపయ కృపయా
మామపి శివే'
అన్న ఆర్తి యుక్త ఆవేదన
అమ్మ చెవిన పడకుండునా
'శ్రోతవ్యం మమ విన్నపం'
అన్న నివేదన స్వీకరించేనా
లేకుంటే
కంట కన్నీరు వరలు
మింట మిన్నేరు కదలు
నా గుండె చెరువగును
ఈ నేల  పంకిలమ్మౌను
ఈతి బాధల మోత
నీతి మాలిన చేత
నా నెత్తి పై నేల
కన్నెత్తి చూడవేల
గుండె దిటవు జేసి
మనసు బలిమి గూర్చి
తలపు కలిమి నొసగి
ఏటి కెదురేగనీ నన్ను
తోడుండి కావదా మిన్ను
కడగంట చూడవా మున్ను
వినిపించు కోవా నన్ను
మంచి చేయు మనసిచ్చి
ఆ మంచి జనతకు నచ్చి
సాగింపవే నీ దయలు
నీ సేసలే వేనవేలు.

Thursday, September 14, 2017


నీ చిరు నవ్వులే మనసు కింపుగ దోచు మరీచికల్ కదే
నీ చిరు పల్కరింపు అవనీ తల మంతయు చెంత నిల్పదే
నీ చిరు యత్నమే సఫల మిచ్చు పరీక్ష ల యందు
నమ్మవే
నా చిర కాల వాంఛనను నాన్నని పిల్చిన చాలు అందరున్.

Monday, September 11, 2017

అధరాధర క్షతం

జీవమున్న ప్రతి ప్రాణికి కష్టాలొస్తాయి. పంటితో క్రింద పెదవిని నొక్కి పట్టి
ఊపిరి బిగబట్టి నిదానంగా ఆలోచించితే గుండె నిబ్బరం వస్తుంది.
కంట నీరు కంటే పంటి గాటే కావలసిన తెగువ బిగువు ఇస్తుంది.
స్పందన మనసుకు సహజ గుణం. కష్టాలొస్తే కంట నీరు దాని నైజం.
ఆవేశంలో ఆలోచన రాదు
మౌనం భగవంతుడు నీ కిచ్చిన వరం
ఆ మౌనం నీకో వజ్రాయుధం
ప్రతీ పరాజయాన్ని విశ్లేషించి
పొరపాట్లను ఉదాసీనతలు గ్రహించి
మలి ప్రయత్నంలో గెలవాలి
ప్రతి ఓటమితో రాటుదేలి పోవాలి
సరి కొత్త అవకాశాలు వెతకాలి
అడ్డంకులూ అవరోధాలు
సరికొత్త మార్గాలను వెదికే అవకాశాలు
క్రింద పెదవిపై గాటు
నాలో కసి రగిలించే ఉష్ణ వాహకం
అందుకే అరవలేను ఆలోచిస్తా గాని

తిరుపతి వేంకట కవులు


సీ. పద్యపు పల్కుకున్ పట్టము గట్టి అం
       బారి ఎక్కించి సంబరపడితిరి
     అవధాన విద్యకు ఆయువు లూది ఊ
        రూర ఆశుకవితకు ఊపు తెచ్చి
     ఉద్యోగ విజయము నుఱ్ఱూత లూగించి
         ఆణి ముత్యమనగ అలరు నటుల
    పశుల కాపరి కూడ పాడునా పద్యాలు
         మూడు కాళ్ళ ముసలి మురిసి పోవు
తే.గీ.  నటుల తెలుగు అందెలు ఘల్లు ఘల్లు మనగ
జంట కవులను ఒరవడి జాతి కిచ్చి
దనిసె కవితా వధూటి పద పథమున
 కదలి తిరుపతి వేంకట కవులు మిగిలె.

        

Sunday, September 10, 2017

పంచ భూతములు కాదంటే

పుడమి తల్లి కసరింది
నింగి వంగి రానంది
నిప్పు తప్పు నీదంది
గాలి మాట వినకుంది
నీరు కళ్ళు తడిపింది
పంచ భూతములు కాదంటే
పాంచభౌతికమైన మేను ఏమౌతుంది?
పంట పొలాలలో పచ్చని చేలలో
ఆడుతు పాడుతు తిరగాలి
పైరగాలితో తువ్వాయి కూనతో
సువ్వాయి తిరుగుడు తిరగాలి
ఆరు బయట వెన్నలలో
అంతరిక్ష అందాలను చూడాలి
సంక్రాంతికి చలిమంటలు కాయాలి
జలపాతంలో స్నానం చేయాలి
ప్రకృతితో విడివడని బంధమై
మనసు పరవశించి పోవాలి.
ఉదయారుణ ఇన బింబం
పడమటి సంధ్యారాగం
ఎంత చూచినా తనివి తీరని వైనం
ఆకుపచ్చని చీరలో తూనీగల బుటాలతో
వసుంధర రూపం ముగ్ధ మనోహరం
ప్రకృతి కాంత ఆత్మీయ అనురాగం
సెలయేటి నీటి గలగలలు
చిరుగాలి కిలకిలలు
వెన్నెల వెలుగులో 
అందమైన వినీల ఆకాసం
పలుకుతాయి నాకోసం స్వాగతం
ఓ నిమిషం నెమరేసుకో గతం
అంటూ మందలిస్తాయి ముందుకొస్తాయి.

ప్రకృతి వినా నా కెవరు దిక్కు

ఒక ఘడియ ఉష్ణ తాపం
మరో ఘడియ మేఘాడంబరం
ఇంతలో గాలి దుమ్ము చినుకులు
కారు మబ్బులు తేరు లెక్కి పరుగులు
విద్యుత్ప్రవాహ నిలిపివేత
ఆపై ఒకటే ఉక్కబోత
వాతావరణం పర్యావరణం
పరస్పర ఆధార ప్రకృతులు
అమ్మలు మనసు లాంటివి
ఏ క్షణంలో ఎలా మారిపోవునో
వూహించలేము యాచించలేము
చినుకు పడితే తడిసి ముద్దౌతా
కనుకు పడితే కలగంటూ నిదరోతా
ఎండ మండితే ఒళ్ళు మండుతుంది
ఒళ్ళు మండితే చిరాకు మొదలౌతుంది
ఆ చిరాకుతో ఓ కవిత ఆవిష్కృతం
మనస్సులో కోపం అప్పుడు మాయం
సహనం అసహనం నా చేతిలో లేవు
ప్రకృతి వినా నాకెవరు దిక్కు

Thursday, September 7, 2017

           అమ్మలు

తలపు వసివాడి అలసిపోదు మనసూర
కే విసివి పోదు వేగలే దెందు వలనొ
ఆమె యన్నచో అభిమాన మంత యింత
యని నుడువ లేను యిసుమంత యామె కనదు.
 నాతలపు తెమ్మెర వలపు నెమ్మది మది
దోచి నట్టి నా కిసలయ కోమలాంగి
నా ప్రణయ భావ నిలయ వినా మన లేను
వదరు బోవని కసుగందు వలచి నాడ
నా మనో పల్కు చేతల నామె నాకు
మానస కుమార్తె నామానస సరసిజయు
ఆమె కొఱకే దైన నేనాచరింతు
నా వలపు తండ్రి కూతురి చనువు కాని
దంపతుల కాంక్ష ల వలపు తలపు కాదు
నన్ను బ్రతిమాల జేసి నా మనసు గెలుచు
పిలచి మాటాడు టేగాని పలుక బోదు
పిలువ కున్న కట్టెదుట కన్పించు చుండు
ఏమిటో మా నడుమ యింత చెలిమి బలిమి
ఎందుకో మా నడుమ చెప్ప లేని బంధ
మే వెనుక జన్మల ఋణమో ఎరుగ లేము.
కసరు కొన్నాడ నన్ను నే కనలి నపుడు
విసివి కన్నీటి కడలినై వివసు డైతి
పసిడి ఛాయల పరువము పరవసింప
మిసిమి ఛాయల చెలువము మిట్టి పడిన
ఇంతలో వింతగా చెల్లి కా సింత నాకు
చేరు వగుటచే తను కూడ చేరు వయ్యె
పొగరు బోతు గుణమెపుడు పొటమరించొ
ఆదరాభిమానము లెప్డు అవతరించొ
చిరునగవుల పలుకరింత చివురు తొడుగు
టెపుడొ చిఱ్ఱు బుఱ్ఱనుట లెపుడొ తెలియ
లేము తనుగాని నేగాని లెఖ్ఖ లేసి
ఎన్ని జన్మల బంధమో ఎవరి కెరుక

మా ఋణానుబం ధమదంత మహిమ గలది.

Saturday, September 2, 2017

గమిస్తా రమిస్తా విశ్రమిస్తా

సంధ్య వెలుగుల నవోదయానికి వందనం
ఆర్ష భారతి మొగసాల హార్థిక సుస్వాగతం
నా బాలా త్రిపుర సుందరీ చిరు దరహాసం
నిద్రాణమైన అంతశ్శక్తిని తట్టి లేపే నూతనోత్తేజం
నవనవోన్మేష కార్యోన్ముఖ ప్రగతి శీల నా బాల
శిరీష కుసుమ పేశల సుధా మధూ మమతల
శ్రావ్య హరి ప్రణయ చందూ గీతాలాపములు
నను నిలబెట్టే నిలదీసే  ఆత్మీయ మరీచికలు
నా అంతరంగానికి అద్దం పట్టే నిదర్శనాలు
ఆ చెలిమి ఆ సాంగత్యం అరమరికలు లేని వైనం
అవే నా బలిమి అవే నా కలిమి అవే నా మిసిమి
ప్రతి నిత్యం వాటి మేలిమి కోసం పునరంకితం
శ్రేయో గామినై గమిస్తా రమిస్తా విశ్రమిస్తా.