Wednesday, January 28, 2015

                 నేను నా మనసు 

నేను ఒంటరిగా కూర్చుంటే 
మనసు ఊహ లోకాల్లో విహరిస్తుంది 
అవకాసం లేని ఆకాశం వెనకాల 
తిరుగాడుతుంది, వేదుకాడుతుంది
ఎగురలేని ఎత్తులు దిగలేని లోతులూ 
అన్నీ కలియతిరుగుతుంది. 
నేను మందితో కలిసుంటే 
(ప్ర) వచనాలు చర్చలు తెలుగు వెలుగులు. 
నేను పక్కమీదకు  జారుకుంటే
కంటి నిండా కలలు 
కనుల  నిండా ఆర్తి, తపన 
ఏదో చెయ్యాలని నిస్వార్ధంగా 
ఏదో చెప్పాలని నిర్ద్వంద్వంగా 
అన్నిటికి అడ్డంకులే 
అందరికి అపోహలే 
ఆశయాలు ఆశలగానే ఉండిపోవాలా 
అవకాశాలు ఆమడ దూరాన ఆగిపోవాలా
'నా' నుండి 'మన' గా మనలేనా 
'మన'లను ఆ 'తన' వైపు మళ్ళించ లేనా 
తలపులన్నీ గెలువ లేనా 
తలుపలన్నీ తెరువలేనా   

   

Tuesday, January 27, 2015

                         అనుబంధాలు 

మనుషులకైనా పశువులకైనా పక్షులకైనా 
అనుబంధాలు ఆప్యాయతలూ అనురాగాలూ 
ఒకలాగే ఉంటాయి  కొంచెం పరిమాణంలోనే బేధాలు
'జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట' అన్నా 
జోడెద్దులలో ఒక  దానికోసం మరొకటి చూసినా 
ఆకుచాటు పిందెకైనా పూవు ప్రక్కన మొగ్గకైనా 
అభిమానము అనురాగము ఒకలాగే ఉంటాయి. 
స్వార్ధంతో త్రుంచేద్దామన్నా 
కోపంతో  తరిమేద్దామన్నా 
చెరిగిపోనివి ఆ బంధాలు 
మరువలేనివి ఆ జ్ఞాపకాలు 
ఏదో ఒకరోజున జ్ఞానోదయం అయ్యాక 
వగచినా ఫలితం శూన్యం. 
ప్రక్రుతి పరంగానో కుటుంబ పరంగానో 
అనుసమ్క్రమణంగా వచ్చే 
నిబంధనలు నిర్బంధాలు 
తలవంచుకుని పాటిస్తే 
ఎవరికీ హాని ఉండదు 
అందరికీ ఒకటే ఆనందం 
అందుకే అన్నింటా 
స్వతంత్రించ లేము 
ఎగిరే గువ్వా విరిసే పువ్వు 
మురిసే నవ్వు కురిసే చినుకూ
పలికే చిలుక మొలిచే మొలక 
వీచే గాలి పాడే  లాలి
చూసి ఆనదించలేమా 
కర్కశంగా 
నులిమి, చిదిమి,చంపి 
ఆనందించాలా 
ఆత్మావలోకనం వద్దా 
అనుబంధాలు కలకాలం మిగలొద్దా 
ఆలోచించు మనిషీ 
ఆదరించు అన్నిటినీ ఓ మనిషీ 
   
 
 

Wednesday, January 14, 2015

                                                 పెద్ద పండగ

కనీసం  ఈ మూన్నాళ్ళ పండగ కైనా
పల్లెకు పోలేని వారిదే అభాగ్యం
పండగ కళ  అక్కడే
ఊరిలో అందరి తాలూకు పిల్లలూ వస్తారు
 చిన్న నాటి నేస్తాలు మరోసారి
మెరుగు పడతాయి
ఏ వయసుకు ఆ వయసు వారితో
అచ్చట్లు ముచ్చట్లు ఆటలు
పందాలు ఒకటేమిటి
రేయి పగలూ
అలుపెరుగని
ఆనందాల మేలి కలయికలు
ఆ జ్ఞాపకాలే ఆ వత్సరం
నెమరుకు వచ్చే రస గుళికలు.
పిల్లకాయలది ఒకరకం సరదా అయితే
యువకులది మరో రకం
మిగిలినవారిది మమేకం
భలే తమాషా భోగి మంటలు
అందరూ సంప్రదాయ   కట్టు బొట్లూ
హరిదాసులు గంగిరెద్దులూ
భోగిపళ్లు పొత్తర్లూ
నగర జీవనంలో
దానికి చోటేలేదు
ఆ వెలితికి లోటే లేదు
లాభం లేదు కనీసం ఒక గెస్టు హౌసైనా
త్వరలోనే కట్టేయాలి  మా ఊర్లో
ప్రతి పండగని అక్కడే
చేసుకో వచ్చు
అందరికీ
శుభా కాంక్షలు 
  

Sunday, January 11, 2015

                   స్వ బోధ 

ఉ.  ఆశకు ఔషధీ గుణము అవ్యయ మై కలదండ్రు గాదె ఆ
     ఆశయె అన్ని గాయముల మాన్పును కాలపు బల్మి తోడు గన్
     ఆశ చిరాయువై మసలు  గాన తదాశ్రయ మంది సాగవే
     నీ శివుడో శివానియొ పునీతులొ కాతర దూరు జేసెడిన్

ఉ. ఊరడి పొంది నంత మది  ఉక్కిరి బిక్కిరిగాక యుండు క
    న్నీరుకరంగి పోవు  ఎద నించుక నెమ్మది కల్గి చాల శా
    రీరక డస్సి పోవు పొదరిళ్ళను గూడులు కట్టి నీవ్యధల్
    తీరిక గాకనీనికల తీయని చారగ జాలు వారెడున్.

Saturday, January 10, 2015

                                    సాంత్వన 

ఈ దేహంలో గాలిమర ఎన్నాళ్ళు ఆడుతుందో 
అన్నాళ్ళూ ఈ మట్టి బొమ్మ 
ఆడుతుంది ,పాడుతుంది 
గాలిమర ఆగిపోతే కుళ్లిపోతుంది 
ఆపై మట్టిలో కలిసిపోవాలి 
అదే జీవితం  అదే ఈ ప్రపంచం
ఇక 
ఏడ్పు లెందుకు  ఒదార్పులేందుకు 
భజగోవిందం చదవుకున్నాంగా 
పునరపి జననం పునరపి మరణం 
తరుణోపాయం భక్తిమార్గం  
పరోపకారం  స్వధర్మ ఆచరణం 
ఈ మూడే తాపత్రయమైతే 
జన్మ సార్ధకము , చరితార్ధము కూడా 
అది విస్మరించరాదు 
బ్రహ్మ యజ్ఞం పితృతర్పణం 
ఆచరించాలి యికపై 
  1. సాధిస్తా గుర్వాజ్ఞగా     

Friday, January 9, 2015

                        ఆ చూపులో మరో కోణం 

బాధలన్నీ తామర తంపరై  నిన్నొదలకుంటే 
వాటికి ఆశ్రయమిస్తున్నా ననుకో
కలలు కల్లలై పోతుంటే
వాటికి నూకలు చెల్లాయనుకో 
మనసుమూగదై  పోతుంటే
తపస్సమాధిలో మునిగింధనుకో 
కనుగవ నీ కన్నుగప్పితే
కునుకు కాదు కినుకనుకో 
కాలం కలసి రాకపోయినా 
కలం కసిగా వ్రాసుకుపో 
జనం, ధనం, బలం నీ వెంట రాకున్నా 
గుండె నిబ్బరం నీకుందనుకో 
మనసు సంబరం చేసిందనుకో 
ఆనందం నీదే  ఏదో ఒకనాడైనా 
గెలుపూ నీదే ఏనాటికైనా
గురి తప్పకు  వెరవకు 
గెలిచేవరకూ దరి చేరే వరకు