Monday, January 27, 2020

ఆంధ్ర భాషా వధూటి

  ఆంధ్ర. భాషా వధూటి
ముగ్ధ మనోహర రూప సౌష్టవ కన్నియ
హావ భావ విస్ఫురిత కమనీయ కావ్య కన్య
స్వర సుర ఝరీ తరంగాంతరంగ భవ్య
నవ్య నవనీత సమస్ఫురిత మా యాంధ్ర కన్య.
హరిప్రియాటోప సంగీత ప్రియావతంస
దశ దిశల మార్మ్రోగు  నుడికారంపు సడి
తీయ తేనెల తేట తెలుగు పలుకు కులుకు
వేయి వీణలు మీటు ఆనంద సంద్రాన మంద్రాన
ఆపాత మధురమై శ్రవఃపేయమై సుస్వరమై
సప్తస్వర వినీల గగనంలో సుస్థిరమై
ఆచంద్ర తారార్క యశోవిభూతితో నలరారు
మా ఆంధ్రభాషా వధూటి నవనవోన్మేష పీయూషి.

Saturday, January 18, 2020

బలి పశువు
అబలనో సబలనో దేవుడెరుగు
సజల నయనాలతో నిలబెట్టిన
నిస్సహాయ జీవిగా మలచిన
ఈ అసభ్య సమాజంలో లోకంలో
వనితకు స్థాయీ ఓ బలి పశువే
ఎక్కడ చూసినా ఆవురావురుమంటూ
ఆకలి చూపులు వెకిలి నవ్వులు శ్లేషలు
కక్కుర్తి మనసు ఆగుతుందమోనన్న ఆశతో
ప్రతివాడినీ అన్నా అన్న పిలుపుతో
కట్టడి చేయాల్సిన దయనీయ దుస్థితి
అందం అందరికీ అనుభవైకవేద్యమా
జననేంద్రియాలు ప్రతివారికీ నైవేద్యమా
పరమేష్టి కూడా పక్కదారి పట్టాడమ్మా
మగాడికెందుకా తెంపరి తనం ఈ
గ్రామ సూకర శ్రేణికింటింటా నీరాజనం
విశృంఖలత్వం ఓతప్పు
తత్కాల శిక్షా రాహిత్యం మరో తప్పు
ఆ రెండూ మారనంత వరకూ
వద్దమ్మా ఈ ఆడ జన్మ
నా కొద్దమ్మా బలి పశువు జన్మ.


Friday, January 17, 2020


'ఏవండీ ఒక సారి ఇటు వస్తారా?'
'మిమ్మల్నే ఉలకరూ పలకరూ, పాడు ఫోను ఒదల్రు.'
'ఓ చెవిటి మా లోకం! వినిపిస్తోందా?'
'అంత ఒళ్ళు మైమరిచి పోతే ఎలా?' గద్దించింది రమణి.
'ఆ. ఏంటో చెప్పు.' వేంకటేశం కళ్ళజోడు సర్దుకుంటూ రమణి ని అడిగాడు.
'చెట్టంత మగవాడు చెంతనే ఉన్నాడు'
'బెల్లం కొట్టిన రాయిలా ఉలకనంటాడు పలకనంటాడు' రమణి ఎద్దేవా.
'నేనేమన్నా విష్ణుమూర్తినా? ఒక పిలుపులో పిలిచితే పలుకుతానని భరోసా ఇవ్వడానికి?' వేంకటేశం సమాధానం.
'అలా ఆ ఫోనుతో ఏడవక పోతే వాషింగ్ మెషీన్ లో బట్టలు తీసి ఆరేయొచ్చుకదా' రమణి సణుగుడు.
'అవును కదా. కాసేపు ఆగొచ్చు కదా. దూరనియంత్రిణి (రిమోట్ కంట్రోల్) తో ఆడే బొమ్మనా?'
'పిలచినా బిగువటరా?' రమణి
నువ్వేమైనా మల్లీశ్వరివా? అయినా ఆ పిలుపు వేరులే. అందులో బిగువూ లేదు తగువూ లేదు' వేంకటేశం.
'ముందు బట్టలు ఆరేయ్. ఆ తరువాత నాకు సీరియల్ టైం అవుతోంది. ములక్కాడల పిండికూర నువ్వే వండు.' రమణి ఆర్డరు.
'ఇదిగో. నా పంచెకు ఏదో రంగు అంటించేసావు. ఎప్పుడూ అంతే.' వేంకటేశం.
' గు ఏ కదా. కు అయితే యిబ్బందిగాని.' రమణి
'ఆ సీరియల్ అయ్యేవరకూ నన్ను పిలవొద్దు. అర్థం అయిందా?'
వేంకటేశం బాల్కనీలో కూర్చున్నాడు.
'ఏమోయ్ రాణీ ఇది చూసావా?'
'ఆ. చూసా.'
ఏంటి?
అదే.
ఓ సారి ఇట్రా.
'పిలువకురా.. అలుగకురా..'
ఓ సుగుణ సుందరీ.. ఇటు రావే ఒక్క సారీ
'చెప్పానుగా. అరగంట పోయాక పిలిస్తే వస్తా.'
వేంకటేశం వంటింట్లో కూర వండేసి మరలా పేపరు పట్టుకుని బాల్కనీలో కూచున్నాడు.
'ఎందుకో రమన్నావ్. ఏంటట?' మరో చైర్లో ఎండానీడా మధ్య కూర్చుంది రమణి.
'నీరెండ ఎలుగులో నిగానిగా మంటుంటే'
'ఆగడాల కుఱ్ఱాడేనా సోగ్గాడూ
ఆగమంటే ఆగేనమ్మా కుఱ్ఱోడూ'
అరవై దాటినా రంజుతీరలేదా? రమణి.
'తనివి తీర లేదే. నామనసు నిండ లేదే.' వేంకటేశం.
వేంకటేశం రమణి భార్యాభర్తలు. వేంకటేశం మొన్న ఈమధ్యనే రిటైరయ్యాడు. రమణి ఇంకా పని చేస్తోంది. వారికి పిల్లలు లేరు. సౌందరనందంలో సుందరీ నందుల్లా ప్రేమించుకున్న జంట.



Thursday, January 16, 2020

ఒంటరి తుంటరి బ్రతుకు

వసుధైక కుటుంబం మనది
ఒంటరి తుంటరి బ్రతుకే నాది
సమిష్టిగా మనమంతా మానవులం
వ్యష్టిగా ఏకాంతంగా విహారం నా స్వంతం
కుటుంబాల లోగిలిలో సంసారాల పరిష్వంగంలో
నాలో నేనే రమిస్తూ శ్రమిస్తూ పరిశ్రమిస్తూ
సూర్యేందు ప్రభలతో గమిస్తూ సంగమిస్తూ  ప్రసంగమిస్తూ
సాగుతున్నా కొనసాగుతున్నా
వసుధైక కుటుంబం మనది
ఒంటరి తుంటరి బ్రతుకే నాది
కంటక గులాబీ బాటలో
హిమసైకత ఎడారిలో
తెలుగు కవిత వెన్నెలలో
తెనుగు కవిత కన్నెలతో
అక్షర విన్యాసం చేస్తున్నా
వర్ణమాలా పరిష్వంగం చేస్తున్నా
నాలో నేనే నాకోసం మనకోసం మన అందరి కోసం
జనం మాట నాదై ప్రభంజనం బాట పునాదై
తెలుగుతో తెలుగు వెలుగుతో
తెలుగు వెలుగుల జిలుగుతో
రమిస్తూ భ్రమిస్తూ పరిభ్రమిస్తూ
నమ్ముకున్న మాటల్ని అమ్ముకో లేక
అమ్మకున్న మూటల్ని వదులుకో లేక
కవితనై భవితనై కథనై వ్యధనై
 పద్యమై హృద్యమై గీతమై సంగీతమై
విలీనమై అంతర్లీనమై హసిస్తూ పరిహసిస్తూ ప్రవహిస్తూ
విశ్రమించనా పరిభ్రమించనా పరిశ్రమించనా?
వసుధైక కుటుంబం మనది
ఒంటరి తుంటరి బ్రతుకే నాది.





Wednesday, January 15, 2020

ఉద్యమం ౼ హృద్యమం

ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమ కెరటం
నీ ఉక్కు పాదానికి వెఱచి ఆగిపోయేనా
కౄర మృగాల హింసా పాలనలో
అబలకు బలమేది? అమరావతికి బదులేది?
చూలింతను కడుపులో తన్నించిన పాపానికి
మహిళలను జుత్తు పట్టి ఈడ్పించిన నేరానికి
ఆలయాల తలుపులు మూయించిన ఘోరానికి
చిప్ప కూడు తప్పదులే ఏడూసలు లెక్కిద్దువులే
ఐదేళ్ళకు భరోసాలేదు నీ సింహాసనానికి
ఎక్కడానికి ఎనిమిదేళ్ళైనా దిగడానికి ఎనిమిది నెల్లే
మా అందరి వేదనలే రోదనలే పగబట్టిన పాములై
వెంటాడి వేటాడి నిను తుదముట్టించునులే
అరాచకాలూ దౌర్జన్యాలూ అంతా నీ వల్లే
తలవంచుకు బ్రతికేకన్నా ఉద్యమంలో మరణిస్తా రన్నా
ఇది రణ నిన్నాదం నీకు మరణ మృదంగ విన్యాసం
చావురాళ్ళ గుట్టకు పంపేస్తాం
ముడుపుల పాయలో పాతేస్తాం.

Monday, January 13, 2020

ఆంధ్ర జాతికి క్రాంతి, సంక్రాంతి యపుడె.
సీ.
 చట్ట సభలయందు రంకెలాడు నతడు
           రచ్చ బండల పైన రంకులాడు
కోడి కత్తెలు గట్టి కట్టు కథలు గట్టి
     మూడు ముక్కల ఆట ముచ్చటాడి
ముందుకురుకగ లేక వెనుకడుగు లేక
       గొంతు కురి బిగించు కున్న రేడు
నేల విడిచి సాము గరడీల తూగుచున్
                  వేవేల శాపాలు వెంట పడగ
తే.గీ.
మకర సంక్రాంతి శుభవేళ మకర మగుచు
మమ్ము పట్టి పీడించెడి మంద మతికి
శ్రీ హరీ! నీవు మతి సరి జేసినపుడె
 ఆంధ్ర జాతికి క్రాంతి, సంక్రాంతి యగును.
సీ.
మరల మీటల మాయ మరల మాటల మాయ
          మడమ తిప్పని మాయ మా జమోరె
నుదుట ముద్దుల మాయ యెదుట గుద్దుల మోయ
          అమరావతికంట యేరాళ్ళ మాయ
తాయిలాలొక మాయ తనయిల్లు నొక మాయ
           శుక్రవారపు మాయ చూపు మాయ
మాయలన్నిటి కన్న మిన్నదౌ నీ మాయ
           కర్నూలు, వైజాగు కలలు మాయ
తే.గీ.
ప్రగతి యంతయు పోయి వీరంగ మాయె
బొక్కసము నిండుకొని యుండె బొంకమాయె
విసివి సంక్రాంతి పురుషుడే వీని బంప
 ఆంధ్ర జాతికి క్రాంతి సంక్రాంతి యపుడె.
(మరల మీటలమాయ =E.V.M ల మాయ,
మరల మాటల మాయ = మాట మార్చం అని చెప్పి అమరావతి విషయంలో మాట మార్చడం
ఏరాలు = సవతి)

అమరావతిని నేను

వాదించ లేను
స్వానుకూల స్వార్థ వాదాల వారితో
సాధించ లేను
ఆరాడి పోరాడి గుండు బుఱ్ఱల తోడి
రోదించ లేను
నా మాాట వినకున్న, నన్ను కాదన్న
ఆమోదించ లేను
అప్రాచ్య మూడు కాపురాల బాట
విభేదించ లేను
ధర్మ కర్మాచరణాశక్తుల ఎత్తుగడలతో
ఎదిరించ లేను
కండ బలములు జూపు కొండలను
తలవంచ లేను
అడ్డుపడే ప్రతి అడ్డగాడిదకు
నినదించ లేను
నిన్ను దించగలిగేలా  నిన్ను ముంచ గలిగేలా
ఎదిరించ లేను
అందలం ఎక్కించిన పాపానికి
అసహాయతా నిస్సహాయతల నడుమ
నా మనసు కొట్టుమిట్టాడుతోంది
నీ ఉనికి నా ఉసురు పోసుకుంటోంది
దురాగతాలూ దాష్టీకాలు ఎన్నాళ్ళో సాగవు
విఱ్ఱవీగిన చక్రవర్తులే మట్టిలో కలిసిపోయారు
నీవెంత నీ సమయమెంత
అజరామరమైన అపురూపమైన
అమరావతిని నేను
నీ పాలిట యమపాశాన్ని నేను
అమరావతిని నేను
నీ కుత్తుకకు ఉరిత్రాడు నేను.

Sunday, January 12, 2020


సీ.
అమరావతిని రచ్చకెక్కించిన ప్రభుత
      భోగి మంటలలోన బూది కాగ
చూలాలి కడుపుపై తన్నిన రక్షక
      భటులు శలభములై భస్మ మొంద
పిడి గుద్దుల సమాదరంపు దమన కాండ
     భోగి పిడకలై విబూది కాగ
రాజధానికి పట్టినట్టి పీడ విరుగుడై
      భోగి మంటలను సంభోగమంద
తే.గీ.
దేశ దేశాలలో ఖ్యాతి తెచ్చినట్టి
తెలుగు వారికి యమరావతి నవ నగరి
భోగ భాగ్యాల తులతూగ భోగి! నీవు
రాజధానిగ మాకీవె  రాజసముతొ.

  
  మేలుకో.
ఓ మేధావి మౌనం
సమాజానికి శాపం
ఏలికల మౌనం
పాలితులకు శాపం
ఓ హితైషి మౌనం
శ్రేయో గమనానికి శాపం
ఓ గురుతుల్యుని మౌనం
అసహనానికి ప్రతిరూపం
ఓ మాతృమూర్తి మౌనం
నిస్సహాయతకు నిదర్శనం
ఉదాసీన జన మౌనం
భరోసాలేని భవితకు దర్పణం
సువిశాల సాగర తరంగాల మౌనం
పెను తుఫానుకు సంకేతం
మేలుకో ఏలికా లేకుంటే
చివరకు మిగిలేది శాశ్వత మౌనం.

Friday, January 3, 2020

        ఎందుకు
కలమా  ఏమాత్రం కదం తొక్కకు
వికలమా నీ మనసని అడక్కు
కాలమా కలసి రావెందుకు
అకాలమా నన్నొదలి పోవెందుకు
గతమా నన్ను తరుముతా వెందుకు
స్వగతమా నువ్  ఉరుముతా వెందుకు
మనమా అపహాస్యం పొందకు
గమనమా సాఫీగా సాగిపో వెందుకు
ఉదయమా నవనవోన్మేషమై రావెందుకు
హృదయమా రసఝరీ ప్లావితమౌతావెందుకు
వనమా నీ నీడలో మననీయవెందుకు
కవనమా నా మది కసుగందనీకు
గ్రామమా పరస్పరానందము కావెందుకు
సంగ్రామమా పరిస్థితులతో నాకెందుకు.