Friday, January 17, 2020


'ఏవండీ ఒక సారి ఇటు వస్తారా?'
'మిమ్మల్నే ఉలకరూ పలకరూ, పాడు ఫోను ఒదల్రు.'
'ఓ చెవిటి మా లోకం! వినిపిస్తోందా?'
'అంత ఒళ్ళు మైమరిచి పోతే ఎలా?' గద్దించింది రమణి.
'ఆ. ఏంటో చెప్పు.' వేంకటేశం కళ్ళజోడు సర్దుకుంటూ రమణి ని అడిగాడు.
'చెట్టంత మగవాడు చెంతనే ఉన్నాడు'
'బెల్లం కొట్టిన రాయిలా ఉలకనంటాడు పలకనంటాడు' రమణి ఎద్దేవా.
'నేనేమన్నా విష్ణుమూర్తినా? ఒక పిలుపులో పిలిచితే పలుకుతానని భరోసా ఇవ్వడానికి?' వేంకటేశం సమాధానం.
'అలా ఆ ఫోనుతో ఏడవక పోతే వాషింగ్ మెషీన్ లో బట్టలు తీసి ఆరేయొచ్చుకదా' రమణి సణుగుడు.
'అవును కదా. కాసేపు ఆగొచ్చు కదా. దూరనియంత్రిణి (రిమోట్ కంట్రోల్) తో ఆడే బొమ్మనా?'
'పిలచినా బిగువటరా?' రమణి
నువ్వేమైనా మల్లీశ్వరివా? అయినా ఆ పిలుపు వేరులే. అందులో బిగువూ లేదు తగువూ లేదు' వేంకటేశం.
'ముందు బట్టలు ఆరేయ్. ఆ తరువాత నాకు సీరియల్ టైం అవుతోంది. ములక్కాడల పిండికూర నువ్వే వండు.' రమణి ఆర్డరు.
'ఇదిగో. నా పంచెకు ఏదో రంగు అంటించేసావు. ఎప్పుడూ అంతే.' వేంకటేశం.
' గు ఏ కదా. కు అయితే యిబ్బందిగాని.' రమణి
'ఆ సీరియల్ అయ్యేవరకూ నన్ను పిలవొద్దు. అర్థం అయిందా?'
వేంకటేశం బాల్కనీలో కూర్చున్నాడు.
'ఏమోయ్ రాణీ ఇది చూసావా?'
'ఆ. చూసా.'
ఏంటి?
అదే.
ఓ సారి ఇట్రా.
'పిలువకురా.. అలుగకురా..'
ఓ సుగుణ సుందరీ.. ఇటు రావే ఒక్క సారీ
'చెప్పానుగా. అరగంట పోయాక పిలిస్తే వస్తా.'
వేంకటేశం వంటింట్లో కూర వండేసి మరలా పేపరు పట్టుకుని బాల్కనీలో కూచున్నాడు.
'ఎందుకో రమన్నావ్. ఏంటట?' మరో చైర్లో ఎండానీడా మధ్య కూర్చుంది రమణి.
'నీరెండ ఎలుగులో నిగానిగా మంటుంటే'
'ఆగడాల కుఱ్ఱాడేనా సోగ్గాడూ
ఆగమంటే ఆగేనమ్మా కుఱ్ఱోడూ'
అరవై దాటినా రంజుతీరలేదా? రమణి.
'తనివి తీర లేదే. నామనసు నిండ లేదే.' వేంకటేశం.
వేంకటేశం రమణి భార్యాభర్తలు. వేంకటేశం మొన్న ఈమధ్యనే రిటైరయ్యాడు. రమణి ఇంకా పని చేస్తోంది. వారికి పిల్లలు లేరు. సౌందరనందంలో సుందరీ నందుల్లా ప్రేమించుకున్న జంట.



0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home