Thursday, January 16, 2020

ఒంటరి తుంటరి బ్రతుకు

వసుధైక కుటుంబం మనది
ఒంటరి తుంటరి బ్రతుకే నాది
సమిష్టిగా మనమంతా మానవులం
వ్యష్టిగా ఏకాంతంగా విహారం నా స్వంతం
కుటుంబాల లోగిలిలో సంసారాల పరిష్వంగంలో
నాలో నేనే రమిస్తూ శ్రమిస్తూ పరిశ్రమిస్తూ
సూర్యేందు ప్రభలతో గమిస్తూ సంగమిస్తూ  ప్రసంగమిస్తూ
సాగుతున్నా కొనసాగుతున్నా
వసుధైక కుటుంబం మనది
ఒంటరి తుంటరి బ్రతుకే నాది
కంటక గులాబీ బాటలో
హిమసైకత ఎడారిలో
తెలుగు కవిత వెన్నెలలో
తెనుగు కవిత కన్నెలతో
అక్షర విన్యాసం చేస్తున్నా
వర్ణమాలా పరిష్వంగం చేస్తున్నా
నాలో నేనే నాకోసం మనకోసం మన అందరి కోసం
జనం మాట నాదై ప్రభంజనం బాట పునాదై
తెలుగుతో తెలుగు వెలుగుతో
తెలుగు వెలుగుల జిలుగుతో
రమిస్తూ భ్రమిస్తూ పరిభ్రమిస్తూ
నమ్ముకున్న మాటల్ని అమ్ముకో లేక
అమ్మకున్న మూటల్ని వదులుకో లేక
కవితనై భవితనై కథనై వ్యధనై
 పద్యమై హృద్యమై గీతమై సంగీతమై
విలీనమై అంతర్లీనమై హసిస్తూ పరిహసిస్తూ ప్రవహిస్తూ
విశ్రమించనా పరిభ్రమించనా పరిశ్రమించనా?
వసుధైక కుటుంబం మనది
ఒంటరి తుంటరి బ్రతుకే నాది.





0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home