Saturday, March 30, 2019

    Practice before you preach.
అది విశాఖ పట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నెంబర్ యైట్.
ఉదయం ఆరుంబావు కావస్తోంది. జన్మభూమి ఎక్స్ ప్రెస్ బయలుదేరింది.
చూడ్డానికి పదహారు పదిహేడేళ్ళ వయసు కుఱ్ఱాడు పరిగెత్తుకుంటూ రైలెక్కాడు. బయటనుండి పరుగు పరుగున వచ్చి నట్టున్నాడు. కొంచెంసేపు అలుపు తీర్చుకుని లోనికి వచ్చాడు సీటు దొరుకుతుందేమో అని.సీటు దొరకలేదు. సరే కారిడార్ లో నిలబడ్డాడు. కాని ఏదో భయంభయంగా చూస్తున్నాడు. బహుశః తునిలో ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా జాయిన్ అయి ఉంటాడు. ఇంకా ఫ్రెండ్స్ కుదిరినట్టు లేదు.
ఇంతలో టి.టి.ఇ. వచ్చారు. మొట్ట మొదటే ఆ అబ్బాయినే పిలచి టిక్కెట్ చూపమన్నారు. ఆ అబ్బాయి బిక్కమొగం పెట్టుకుని అంకుల్ నిన్ననే కాలేజీలో చేరాను. ఇంకా పాస్ కొనుక్కోలేదు. స్టేషన్ కి వచ్చేసరికి బండి కదిలి పోతోంది. టిక్కెట్ కొనుక్కునే వ్యవధి లేదు. పరుగెత్తుకుంటూ వచ్చి బండి ఎక్కేసాను. ఐ యామ్ సారీ. అన్నాడు.
నాకైతే అతను అబద్ధం చెబుతున్నట్టుగా అనిపించ లేదు.
టి.టి.ఇ. అతని కాలర్ పట్టుకుని కారిడార్ లోకి లాక్కెళ్లాడు. ఫైన్ తో సహా డబ్బు కట్టమన్నాడు. అతను నా దగ్గర ఈ వంద రూపాయలే ఉన్నాయి అని బతిమాలుతుంటే టి.టి.ఇ. ఆ కుఱ్ఱాడి చెంప ఛెళ్ళుమనిపించి అక్కడే నిలబడి దువ్వాడ స్టేషన్ రాగానే కిందకు గెంటేసాడు.
పాపం కుఱ్ఱాడికి కొత్త లా ఉంది. వీడిచేతిలో దెబ్బలు తిన్నాడు. కాలేజీకి వెళ్ళలేక పోయాడు. చూస్తూ ఏమి చేయలేక పోయానే అనే బాధ నన్ను కలవర పెట్టింది. ఇంతలో నా వరకూ వచ్చాడు టిక్కెట్లు వెరిఫై చేసుకుంటూ టి.టి.ఇ. నన్నూ టిక్కెట్ అడిగాడు.
"మీ ఐ.డీ. చూపించండి. ఆ తరువాత నన్ను అడగండి." అన్నా.
తిట్టుకుంటూ చేతిలో బేగ్ తీసి వెతకడం మొదలు పెట్టాడు.
మీ ఐ.డీ. మీ మెడలో వేసుకోవాలని కూడా మీకు తెలవదా? మేము అడిగితే పైకి తీస్తారా? వాటీజ్ దిస్? అని అడిగా. ఇంకా వెతుకుతూనే ఉన్నాడు. ఫైనల్ గా ఉందా లేదా అని అడిగా.
"టైమైపోతోందనే కంగారులో మరిచి పోయాను." అన్నాడు."నేను కాదు ఎవరూ నీకు టికెట్ చూపించం" ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాను.
మరి నీకు ఏం ఫైన్ వెయ్యాలి. ఆ కుఱ్ఱాణ్ణి నిర్దాక్షిణ్యంగా దింపేసావే. నీకు అదే తోవ దిగిపో అన్నా. ఇంతలో మిగిలిన వారూ తోడయ్యారు. తోక ముడుచుకొని టి.టి.ఇ. అక్కడనుంచి వెళ్ళిపోయాడు. పక్క బోగీల్లో కూడా చెకింగ్ చెయ్యలేదు.
పాకిస్థాన్ మీద యుద్ధం గెలిచినంత ఆనందం
అందరూ బాగా బుద్ధి చెప్పారని మెచ్చుకున్నారు.
అయినా ఆ కుఱ్ఱాణ్ణి ఆదుకో లేకపోయామే అనే బాధ.
అందుకే ఎదుటి వారి హావభావలని గమనించి తప్పొప్పులు శిక్షలూ నిర్ణయించి అమలు చేయాలి. ఎలాంటి వారికైనా పొరపాటు జరగవచ్చు.
ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్.

Thursday, March 28, 2019

( ఎన్నికల ప్రచారాలూ సభల కోసం జన సమీకరణ ముమ్మరంగా జరుగుతూంటే ఓ తల్లి తన ఇరవై ఏళ్ళ కొడుకును ఉద్దేశించి చెప్పే సందర్భంలో)
పదిలం కొడుకో
జర
పదిలం కొడుకో
మంది గాళ్ళు మందుపోసి
తమ యెనకే రమ్మంటూ
ఊరూరు తిప్పుతారు
ఓటు పండగైనాక
అరె
ఓటు పండుగైనాక
నీ కేసి చూడమన్న చూడరు
 అందుకే
పదిలం కొడుకో
జర
పదిలం కొడుకో
మండుటెండ అనకండా
జండాలు మోసుకుంటు
ఊరూరు తిరిగితే
ఉడుకెక్కువై సొమ్మసిల్లి పోతావు
అందుకే
పదిలం కొడుకో
జర
పదిలం కొడుకో
కూలి నాలి మానుకోని
తగువుల్లో పడమాకు
ఒళ్ళు గుల్ల చేసుకోకు
మూన్నాళ్ళ ముచ్చట కోసం
ఎవుడెవుడో గెలుపు కోసం
అందుకే
పదిలం కొడుకో
జర
పదిలం కొడుకో.

Tuesday, March 26, 2019


"ఒరేయ్ శంకరం, రిటైరయ్యాక ఎక్కడ ఉంటావో తేల్చుకున్నావా?" అడిగాడు పెద్దన్న.
"బహుశా మన ఊర్లో"
"వద్దురా.  మునుపటి మనుషులు కాదు. నిజాయితీ తగ్గిపోయింది. ఇబ్బంది పడగలవు. మరోసారి ఆలోచించుకో" పెద్దన్న హెచ్చరిక.
అయినా అటే నడిచి చతికిల పడ్డ శంకరం.
ఆకాశం బున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబు నందుండి య
స్తోకాంబోధి పయోధి నుండి పవనాంధో లోకమున్ జేరె గం
గా కూలంకుష పెక్కు భంగుల వివేక భ్రష్ట సంపాతముల్.
వాలు కుర్చీలో శంకరం ఈమధ్య తరచుగా పాడుకుంటున్న పద్యం.
"ఏవండీ ఎందుకు అలా డీలా పడిపోతారు?"
"జననీ జన్మ భూమిశ్చ.. అని జన్మభూమి ఋణం తీర్చు కోవాలను కున్నారు. మీ ఆశయం గొప్పది. భగవంతుడు మీకు సహకరిస్తాడు" అంది శారద.
శంకరం ఒక ప్రభుత్వ సంస్థలో ఉన్నతమైన ఉద్యోగం చేసి రిటైరై ఐదేళ్లు కావస్తోంది.
శంకరం పుట్టిపెరిగింది విశాఖ జిల్లాలో ఓ కుగ్రామం.
ఆ తరువాత స్వయం కృషితో సి.ఏ. చదువుకుని నేరుగా ఓ మంచి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు. అతనికి వాళ్ళ ఊరంటే చాలా ఇష్టం.
అతను ఢిల్లీలో పనిచేసే నాటికి వాళ్ళ కుటుంబం తుని తరలిపోయారు. స్థిరాస్థులేమీ లేవక్కడ.
తను ఇంటికి తుని వస్తే ఒకసారి పల్లె కు వెళ్ళి అందరినీ చూసి వచ్చేవాడు.
వారికి ఒక అబ్బాయి ఓ అమ్మాయి. పెళ్ళిళ్ళు ఐపోయాయి. అంతా బాగానే ఉన్నారు.
రిటైర్ అవగానే పల్లె కు మకాం మార్చేసాడు శంకరం.
తన ప్రజలకి మంచి చేయాలి అనే తపన.
రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరో ఒకరు వచ్చి పోతూండేవారు.
" బాబూ! శంకరం బాబూ నువ్వే ఎలాగన్నా కాపాడాలి. చిన్నప్పుడు ఎత్తుకు మోసాను. కాబూలీ వాడి దగ్గర అప్పు తీసుకుని వాయిదా కట్ట లేదని గొడవ. నీకు పున్నెముంటాది. ఓ పదివేలు అప్పిస్తే ఆడి మోహాన కొడతా బాబ్బాబు" అంటూ మూలయ్య కాళ్ళా వేళ్ళా పడ్డాడు.
నిజమే ఎత్తుకుని తిప్పేవాడు చిన్నప్పుడు అని పదివేలు ఇచ్చాడు.
అలాగే మరొకరు మరొకరు. ఎవరినీ కాదనలేని మొహమాటం.
ప్రెసిడెంట్ నాగేష్ ఓ మూడు లక్షలు చేబదులుగా పచ్చుకుని మూడేళ్ళయింది.
ఎవ్వరూ వెనక్కి ఇవ్వరు. గట్టిగా అడగ లేడు.
ఓ పదెకరాల భూమి తనఖాకి తీసుకుని ఆర్గానిక్ వ్యవసాయం డెయిరీ మొదలు పెట్టాడు.
మొదట్లో అన్నీ బాగానే నడిచేవి. క్రమేపీ పనివాళ్ళ దురాలోచనలు ఎక్కువై డెయిరీ నష్టాల్లో నడవడం మొదలైంది.
మిగిలిన వ్యవసాయం కిట్టబాటు కావడం లేదు.
ఇంతలో ఓ ప్రైవేటు స్కూల్ పెట్టాడు. మంచి భవనం అన్ని సదుపాయాలు కల్పించాడు. ఓ ఇరవై మందికి ఉపాధి ఇచ్చాడు.
అక్కడా ఫీజులు ఎవరూ సక్రమంగా కట్టరు. గట్టిగా అడగలేడు. జీతాలు ఇచ్చుకోవాలి.
ఊరిలో పదిమందికి గేదెలు కొని ఇచ్చాడు పాలమీద వచ్చిన డబ్బులో సగం చొప్పున  మూడు సంవత్సరాలు కడితే బాకీ తీరి పోతుంది.
మధ్యలోనే గేదెలు అమ్మేసుకుని తొంటి చెయ్యి చూపించారు.
కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది అతని పరిస్థితి.
శారద ఏమీ అనకున్నా ముప్పైఅయిదు సంవత్సరాల సర్వీసులో ఎప్పుడూ ఓటమి ఎరుగరు. కూడబెట్టిన డబ్బు అంతా ఇలా ఇరుక్కు పోయింది. గుడ్డిలో మెల్ల పిల్లల పెళ్ళిళ్ళు ఐపోయి సుఖంగా ఉన్నారు.
శంకరం కొడుకు గిరీశం చాలా మంచివాడు. "నాన్నా పోతేపోయిన డబ్బు వచ్చేయండి నాన్నా ముంబై. ఇక్కడే హాయిగా ఉండొచ్చు."
కాని శంకరానికి మనసు ఒప్పలేదు.
అలాగని ముందుకు సాగలేడు. వెనక్కి తగ్గలేడు.
హత విధీ! ఎంత అవివేకం. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
ఆహా త్రేతాయుగంలో ధర్మం మూడు కాళ్ళమీద ఉన్నప్పుడు నిజమేనేమో.
శ్రీరామచంద్రుడికి అలా అనిపించిందీ అంటే మానవతా విలువల పైన జీవనం సాగేది. మరి ఇప్పుడు మాత్రం ఆ మాట సత్యదూరమే.
ప్రతిదీ ఉచితానికి అలవాటు పడ్డ జనంలో నిజాయితీ మాయమైంది. స్వార్థం ఎక్కువైంది. బుద్ధి చెప్పేవారు లేరు.
శంకరం శారదల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
జగన్మాతా పితరులైన పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించడం వినా మార్గాంతరం లేదు.
శంకరంకి ఇప్పుడు బాగా  అర్థమైంది పల్లెటూర్లు ఎందుకు అభివృద్ధి సాధించలేక పోతున్నాయో. అలాగే అన్నదాతకు అప్పు కూడా ఎందుకు పుట్టదో బాగా తెలిసొచ్చింది.
కానీ అతని పరిస్థితి ని చక్కదిద్దడం ఎలా?
కోరి తెచ్చుకున్న కష్టాలు. పెద్దన్న మాటను కాదని వెళ్ళి బోర్లా పడ్డాడు శంకరం.
అపిస్వర్గమయీం లంకా
నమే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ.
దీనికి భాష్యం .యాంటీ క్లైమాక్స్ లోనా?
ఊహలకందని ఫక్తు నిజం. జయహో నా గ్రామసీమ.

  పగటికల

దినకరుడే కరుణిస్తే
జలధరమే అడ్డొస్తే
మండే ఎండలు మటుమాయం
ఎండే గొంతుల కుపశమనం
చెమటోడ్చే శ్రమజీవుల కానందం
ఉడుకుల దుడుకులకో విరామం
ఇంతలో
వరుణుడు కరుణిస్తే
తొలకరి చివురిస్తే
వాన జల్లు కురిపిస్తే
మనసు జిల్లు మంటుంది
కాని
శిశిరంలోనే గ్రీష్మం చొరబడితే
శిబిరంలోనే ప్రచారం స్థిరబడితే
ఎన్నిక లెట్లా సాగేను
ఏలిక లెట్లా గెలిచేను
ఓటు పండుగ అంతా
ఓటి మాటగ అయిపోదా
మరేంచేద్దాం
దిల్లీ పెద్దని అడిగొద్దాం
పగలే చంద్రుని రప్పిద్దాం
వెలిగే సూర్యుని మూసేద్దాం
భూమినే ఆ పక్కకు నెట్టేయమందాం
శీతానుకూలమై
వాతానుకూలమై
చూడ ముచ్చటగ
కలువలు పూయిద్దాం
కమలం పోతే పోనిద్దాం.

Wednesday, March 20, 2019


है क्या यह दुनिया
जीने को क्यों फर्माया
आने से पहला अन्जान्
जाने के बाद तो  महान्
जीने मे मरते रहने की फर्ज
मरने मे जीने कि कर्ज
जिंदगी उसीकी है  जिसे
न फर्माने से ही सब मिले
न चाहते ही किस्मत खुले
है क्या यह जिंदगी
करें काम् दिन् रात
बुरी पेट कि  बरबात
हर कमीने भोंकते रहे
हर गुजारे फिसलते रहे
ये बेवफा अनाडीयों से
ये बे फिक्र खिलाड़ियों से
बच के रहना हट के जीना
यही है क्या यह जिंदगी?

Saturday, March 16, 2019


ఎంత విచిత్రమీ జగతి యెవ్వరి స్వార్థము వారిదే కదా
యెంత పునీతమీ పుడమి యెల్లర నొక్క విధంబుగా కనున్
యెంత సుశీలయో జలధి యిచ్చిన దేమియు స్వీకరింపదే
యెంత వినమ్రమో నభము ఏ నిమిసంబును విశ్రమింపదే.
ఇంత విశేష ప్రాకృతిక విశ్వము జూచుచు మానహీనుడా
సుంత మనో వికల్పమును శూన్య ప్రయోజనము లేల నమ్మగా
కొంత స్వలాభమో పరుల కోసమొ నీమనసూగులాడగా
వింత మనోరథంబు నిను వీడక వాడక యెగ్గు చేయ ర
వ్వంత వివేకమో హృదయ వాంఛయొ యే యితరమ్మొ నీమమో
క్రాంతి పథమ్మొ నీ మదిని క్రమ్మరి క్రుమ్మరుచుండగా మన
శ్శాంతి యొకింత కట్టెదుట సాంత్వన పల్కుల స్వాగతింప వి
శ్రాంత వయో విలాసముగ  శ్రామిక నైజము విస్ఫురించగన్.
చెంతకు జేరి నిన్ను పిలచేనొక లేసిరి బాల


Tuesday, March 12, 2019

     సీస మంజరి.
1.
తన యభివృద్ధికై నేబడ్డ నానాగ
        చాట్లిట గంగలో చంక నాకె
ఉరవని పిడుగులా తలువని తలపుగా
        తెగులొచ్చి పడ్డదీ దిక్కుమాలి
నాలోన పెనగొన్న యాశాలతలు నేటితో
         యర్థాంత రమ్ముగా ఆగిపోయె
హృదయ సరసిని ప్రణయ ప్రసూనము లింక
          విరియ వనుచు విసివి పోయి
పాల పొంగంత చల్లారి పాలి పోవ
పరువ మింక నేను పరుల పాలు జేసి
మనసు నొల్లని వానిగ మసలు కొందు
మరచి పోయి తానెంతయో మారి పోయె.
2.
మోమెత్తి కనులార నావంక నొకమారు
              జూడదే నేనేమి చొక్కి నానొ
నేనట నున్నంత యిటునటు పోబోవు
             యెటొ పారిపోవు నా యెదుట పడదొ
నిన్న మొన్నటి దాక పొందిన యుపకార
              మావంత మదిలో నెమరుకు రాదొ
ఉదయాన్నె యటుబోయి సుప్రభాత మనక
              మనసూ‌రు కోదు నా మాట వినదు
మనువు నొల్లక పోవచ్చు మనసు లేకొ
తల్లి దండ్రుల నెదిరించు దమ్ము లేకొ
మనసు లోమాట నాతోడ మరుగు పరుచ
నేలొ అంత భయ మదేల నీ సుమతికి.
3.
అబ్బడ్డ వారిచే వినరాని వ్యాఖ్యలన్
            వింటి నే భరియించి వీగు తుంటి
కన్పడ్డ ప్రతియడ్డ గాడిదయు యలుసు
             చేసినా సైచితి చెలియ కొఱకు
అటు కన్నవారిటు విన్నవారును జెప్పు
              సలహాలు చాలంటి చాలవింటి
మూడు ముళ్ళకు ముందు తనువంట నంటి నే
              గిరిగీసు కొంటి నిన్ గెలుచు కొంటి
నాతి నామీద ఒట్టంటి నమ్మమంటి
హృదయ మంతయు నీకె యెరుక పరచితి
లేని పోనట్టి యపనింద లేయ కంటి
కంట తడివెట్టి నీమాటె కడకు వింటి.
4.
నీలాటి రేవులో ఉదయాన్నె పలుక రి
            స్తానంటె సరియంటు సరుదు కొంటి
చద్ది కూటికి నాకు తోడొచ్చి కూర్చుందు
            నంటె నీ రాకకై నక్కి యుంటి
కాడికీ మేడికీ మధ్యగా నిలుచుంట
            నొల్లకో మంటె నే నొల్లకుంటి
ఆల మందల తోటి పొలిమేర కొచ్చి నే
            నాడు కుం టానంటె నా బులాకి
రా చిలుక రాగములు తీయ రాదనంటి
రాత్రి యేళకు కలలేవి రావనంటి
నేరుగా తీరుగ మసల నేర్వమంటి
మనసులో నిన్ తలచి నేను మరులు గొంటి.
5.



           

Monday, March 11, 2019


ఈ మౌనం  నా
అసమర్థతకు ఆనవాలు కాదు
ఆదర్శాలకు తిలోదకాలూ కాదు
ప్రత్యర్థులకు మరో అవకాశం కాదు
అనుయాయులకు అసహనమూ కాదు
ఈ మౌనం. ఓ
అసాధారణ వజ్రాయుధం
అప్రమేయ శిలా శాసనం
కాలానికీ కాలుడికీ రాజమార్గం
దుందుడుకుల లోతులు చూచే కొలమానం
నా మౌనం
వేనవేల ప్రశ్నల శరాఘాతం
శత సహస్ర మాటల తూణీరం
లక్ష్యం కోసం రణనిన్నాదం
శత్రువు గుండెల్లో దింపిన గునపం
నా ఈ మౌనం
ధర్మ దేవతను నిలదీసే యత్నం
న్యాయం కోసం ప్రకృతికి విన్నపం
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ నాదే అన్న
భగవానుని కట్టెదుట సత్యాగ్రహం.

Sunday, March 10, 2019

    ప్రకృతి పారవస్యం

నభో వీథిలో తారా నివహపు వెలుగులు
పశ్చిమాన లలితారుణ తృతీయా నెలవంక
చీకటిలో మోటరు సైకి‌లు పై పయనం ఓ వంక
పశ్చిమాద్రి ఒడికి వడివడిగా లఘువేసే సాహసం
మహదాహ్లాద భరిత నిశ్శబ్ద సంగీత నిస్వన ఝరి
ప్రకృతి వినా కనుచూపు మేరలో వేరెవరూ లేని తరి
ఆకాశం అంచులపై మబ్బులలో తేలిపోతూ
అంతరిక్షంలోకి అడుగిడుతున్న పసందైన అనుభూతి
మందస్మిత మధురాధర మలయ మారుత స్పర్శ
నిన్న రాత్రి ఓ మారుమూల కుగ్రామం లో పెళ్ళికి
విహాయస విహారమో మనోహర విలాసమో
నన్ను మంత్ర ముగ్ధుణ్ణి చేసి కట్టి పడేసిన ప్రకృతి
కివే నా జోహార్లు. నా సరి జోతలు. 

Friday, March 8, 2019

    నా అంతరంగంలో

తనంత తానుగా ఓ సారి పలుకరిస్తే
అనంత సుందర స్ఫురద్రూపం కనిపిస్తే
పలవరింతలై కలవరింతలై మరింతలై
కట్టెదుట నిలుచుంటే నన్ను పిలిచుంటే
పరవశించనా బరితెగించనా మున్నెంచనా
ఎదురేగి చెలరేగి తను జేరి దరిజేరి
ఆదుకోమంటూ నన్నందుకోమంటూ
మోకరిల్లనా ప్రాకులాడనా బ్రతిమలాడనా
ఆదరించినా సాగనంపినా వేచి యుంచినా
అభిమతం అభీష్టం అంతా ప్రతిపాదితం
అనుగ్రహం పరిగ్రహణం అంతా వరప్రసాదం
బాలా  పంచదశీ షోడశీ తురీయ గాయత్రీ
అన్నీ నా ఆరాధ్య రూపాలే నా ఉపాస్యలే
నా హృదయాంతరంగంలో అంతర్లీనాలే.

Wednesday, March 6, 2019

         రంగూన్ పైడయ్య.

 పని జేయలేనోడు పనికి మాలినోడూ దేశానికి బరువే అంటాడు పైడయ్య. అతనికి ఎప్పుడూ ఏదో పని చేసుకోవాలి. ఏ పనీ లేక పోతే గొడ్ల పాకలో పశువుల బాగోగు చూసుకోవాలి. జొన్నచొప్ప పచ్చి గడ్డి మార్చి మార్చి మేపాలి.
ఓ సారి సిక్కోలు తాతగారింటికి వెళ్ళి వచ్చాడు. అక్కడ నుంచి చాలా మంది బర్మా కంట్రాక్టర్ల దగ్గర కూలిపనికి ఒప్పుకుని ఓడెక్కి రంగూన్ వెళ్తున్నారు.
"ఓ పాలి ఎల్లొస్తే నాలుగు కాసుల బంగారం కొంత డబ్బు తెచ్చుకోవచ్చంట. మనవూ ఎల్దామా" మేనమామ అడిగాడు.
"నీ కొడుకు కూలీఓడు కాకుండా కామందుని సెయ్యాలంటే ఎల్రా" అన్నాడు తాత.
వాళ్ళతో బాటు ఇతనూ కాగితాల మీద వేలిముద్రలు వేసి బయానాగా నూరు రూపాయలు తీసుకుని వచ్చాడు. అన్నమాట ప్రకారం ఓడెక్కి వెళ్ళాడు. పదేళ్ళ తరువాత వచ్చాడు. ఎప్పుడేనా సిక్కోలు నుంచి ఎవరైనా వస్తే తన పెళ్ళాం పిల్లల కబుర్లు తెలిసేవి.
పదేళ్ళ తరువాత  ఎలాగైతేనేం కాస్త డబ్బు మూటగట్టుకుని వాళ్ళ వూరు వచ్చేసాడు.
ఊరంతా కలిపితే ఓ నూరు గడప కూడాలేదు.  ఐదారొందల జనాభా ఉండొచ్చు. ఎవరికీ స్వంతంగా భూముల్లేవు. ఊరి భూములన్నీ దొరగారివే. ఓ రాజుగారు యీనాంగా రెండువేల ఎకరాలు ఇచ్చారుట. ఆ దొరగారు ఎక్కడ జాగా చూపిస్తే అక్కడే ఓ గుడిసె వేసుకుని ఉండాలి ఎవరైనా.
దొరగారు చాలా విచిత్రమైన మనిషి. వారి మనవలకి చదువు చెప్పించాలని తెలిసున్న వాళ్ళని పట్టుకుని ఓ బడి పెట్టించు కున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1940 ప్రాంతంలో రెండు ఊర్లకు కలిపి ఓ బడి, ఆ బడికి ఓ చక్కటి ఆవాసం ఏర్పాటు చేసారు. దానిని బిల్డింగ్  బడి అని పిలిచేవారు. మంచినీటి కోసం బడి పక్కనే ఓ బావి ప్రభుత్వం తరఫున సాధించారు. దానికి బిల్డింగ్ నుయ్యి అని పేరు. కొండజల పడింది. వేసవిలో నాలుగైదు గ్రామాలకు మంచినీరు అందించేది.
అల్లూరి సీతారామరాజు ఓ సారి అటుగా వచ్చి ఆ నూతి దగ్గర స్నానం చేసి మన్నెం ప్రజ‌లతో కలిసి దొరగారిని కలిసారట.
విశాఖపట్నంలో ఇప్పటి జిల్లా పరిషత్ దగ్గరలో ఒక నుయ్యి యీ దొరగారే తవ్వించారు. దాని ఆనవాళ్లు యింకా అలానే ఉన్నాయి.
దొరగారి తల్లి చేతికి ఎముక లేదని పేరు. ఏ ఆడది ఆ గడప తొక్కినా చేతిలో ఏదోటి పెట్టి పంపేది. ఊరి వారంతా దొరగారి కమతంలో పనిచేసుకోడం అడివిలో కట్టెలు అడ్డాకులు వెదురు తెచ్చుకుని వడ్లుకి మార్పిడి చేసుకునే వారు. దొరగారు చాలా వరకూ భూములు కౌలుకి ఇచ్చేసి శ్రమ తగ్గించు కున్నారు.గాంధీ గారి ప్రాబల్యం కామోసు. ఖద్దరు బనీను గావంచా పైమీద ఓ తుండు  చేతిలో ఓ చాపాటి కఱ్ఱ ఆయన ఆహార్యం. తరచూ విశాఖ పట్నం వెళ్ళి వచ్చేవారు.
ఇంతలో స్వతంత్రం వచ్చింది. ఆపైన కొద్ది కాలానికే ఈనాం ఏక్టు వచ్చింది. దున్నే వాడిదే భూమి అన్నారు. రెండువేల ఎకరాల నుంచి ఒంద ఎకరాలకు తగ్గిపోయింది వారి భూమి. జమీందారు ఒక్కసారిగా సామాన్యుడై పోయారు. ఆబెంగతో మరి కొన్నాళ్ళకే కాలంచేశారు.
దొరగారి అన్నదమ్ములు విడిపోయారు. నలుగురికీ తలో పాతిక ఎకరాలు వచ్చింది. కాని పిల్లలు ఎవరూ సరిగా చదువుకో లేదు. దొరగారి ఆశ తీర లేదు.
అది మండు వేసవి. నిప్పులు చెరిగే ఎండలు. రాత్రిళ్ళు ఉక్కబోతలు. మహా కరువు రోజులు.
గుక్కెడు మంచినీళ్ళు కూడా గగనమే. బిల్డింగ్ నుయ్యి కాస్త దూరమైనా శుభ్రమైన తియ్యని నీరు వట్టి పోకుండా ఊరేది.
పైడయ్య భార్య కాలంచేసింది. రంగూన్ నుంచి పైడయ్య తిరిగి వచ్చేసరికి బాగానే ఉండేది ఆమె. అక్కడ నుంచి తెచ్చుకున్న డబ్బుతో ఐదెకరాల మెరక భూమి ఓ ఎకరం పల్లం భూమీ కొన్నాడు పైడయ్య.
కోడలు బాగా గయ్యాళీ. వీలైనంత వరకూ చేలోనే గడిపేవాడు పైడయ్య.
ఓ రోజు కొడుకుతో ఏదో గొడవ పడి రంగూన్ పైడయ్య అర్ధ రాత్రప్పుడు ఆ నూతిలో దూకేసాడు ఆత్మహత్య చేసుకోవాలని. వలస కూలీగా బర్మా వెళ్ళి రంగూన్ లో పనిచేయడంతో అతన్ని రంగూన్ పైడయ్య అనేవారు.
మనిషైతే చావలేదు కాని నీళ్ళు కలుషితం ఐపోయాయి. తాగడానికి మంచినీరు దొరికే మరో మార్గం లేదు.
ఊరు ఊరంతా వచ్చి నీళ్ళు తోడి పారబొయ్యడం మొదలు పెట్టారు ఇద్దరు ముగ్గురు కన్న ఎక్కువమంది ఒకేసారి తోడలేరు. నూతి ఒర చిన్నది బాగా.
రెండు రోజులు రాత్రి పగలు తోడినా తరగ లేదు గంగ. మూడో రోజుకు పూర్తిగా తోడారు. తోడి వెలిపిన నీరంతా ఓ గుంటలోకి మళ్ళించారు.పశువుల కోసం.
అక్కడికి ఒక కోసు దూరంలో పెనుగొండ ఉంది. అక్కడ ఒక జలధార ఉంది. అది కూడా ఎప్పుడూ ఎండి పోలేదు. ఈ రెండే వేసవిలో మంచినీటి వనరులు.
వేసవిలో పశువులన్నింటినీ ఆ పెనుగొండ శిఖరానికి తోలుకు పోయి తొలకరించే వరకూ అక్కడే
అందరూ జీవాలను ఆచుకునే వారు. ఆ కొండ
 పైన 'చదును' అంటే సమతల నేల ఊట బావి ఉన్నాయి. పచ్చిక ఎప్పుడూ ఉంటుంంది.
రంగూన్ పైడయ్య కొడుకుతో గొడవపడి విరక్తితో నూతిలో దూకాడు. అయినా చావు రాలేదు. భార్య పోయి చాలా కాలం అయింది. రెండ్రోజులు ఎలాగో నిభాయించుకుని టీ కొట్లో టీ తాగి కాలక్షేపం చేసాడు. ఇంటికి పోబుద్ధి కాలేదు.
చివరికి పెనుగొండ చదునుకి వెళ్ళిపోయాడు. అక్కడ మిగతా పశువుల మేకల కాపరులతో కొన్నాళ్ళు గడిపాడు. ఆ తరువాత మన్నెం ప్రజలలో కలిసి పోయి అల్లూరి పితూరి గుంపుకి వంటలు వండుతూ కుదురుకున్నాడని వినికిడి.
రంగూన్ నుంచి వచ్చేటప్పుడు డబ్బు బంగారం తెచ్చాడు. భార్య పోయాక ఇంటిలో ఆదరణ కరువైంది. శరీరం బరువైంది. గౌరవం పోయింది. కొడుకూ కోడలూ ఓ మిద్దె ఇల్లు కట్టుకున్నారు.
ఒకరి కష్టార్జితం మరొకరికి హక్కు భుక్తం అయ్యింది.
పెనుగొండ మీద ఉన్నప్పుడు తరచూ పైడయ్య ఇలా పాడుతూండేవాడు.
కొడుకెవడురా
కోడలెవతెరా
నా ఖర్మ మింతేరా
తినీ తినకండా డబ్బు పోగేసినా
వట్టుకొచ్చి కొడుకు చేతిలో బోసినా
వయసు మీదైనాక పలకరింపే లేదు
మనసు మీదైనాక ఆదరింపూ లేదు
నా ఖర్మ మింతేరా
నా పున్నె మింతేరా.
కాలచక్రం గిర్రున తిరుగుతోంది. పైడయ్య కొడుకు రంగయ్యకి నలుగురు పిల్లలు. ఒక అబ్బాయి ముగ్గురమ్మాయిలూ.
అందరికీ పెళ్ళిళ్ళు ఐ పోయాయి. కూతుర్లకూ ఒకో ఎకరం కట్నం ఇచ్చాడు. కొడుకు వట్టి తుంటరి. జూదరి. రంగయ్యకి ఏదో తెలీని జబ్బు. వైద్యం చేయించే దిక్కులేదు. భార్య ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది.
మా నాన్నకు నేజేసిన అన్యాయమే ఇలా కట్టి కుడుపుతోందని విచారించేవాడు. కాలం వెనక్కి రాదు.
పాపం. ఎప్పుడు ఎక్కడ ఎలా గతించి పోయాడో పైడయ్య ఎవరికీ తెలియదు.
కొడుకును భూకామందు చేసినా ముసలోడ్ని వదిలేసిన కొడుకు.
 పాపం రంగూన్ పైడయ్య.

Tuesday, March 5, 2019

  అనుకున్నా నెన్నెన్నో

ఆత్మావలోకనం చేసుకుంటూ
జడభరతునిలా బ్రతకాలనుకున్నా
పరంజ్యోతి పరిశోధనలతో
అరుణాచల గిరివలయమై
నిరంతరాన్వేషినై మిగలాలనుకున్నా
తపో నిష్టతో గురు శుశ్రౄషలో
కాలడిలో కాలం గడపానుకున్నా
వేద వేదాంగాధ్యాయినై
నిత్యాగ్నిహోత్రునిగా
శేష జీవితం గడిస్తే చాలనుకున్నా
పరోపకారంతో పరస్పర సహకారంతో
ప్రజాభిమాన ప్రతిరూపంగా ఉండాలనుకున్నా
స్వావలంబనతో స్వాభిమానంతో
నిస్స్వార్థంగా నిలవాలనుకున్నా
లలిత లలిత పద కవితలతో
మందార మకరంద ప్రద పద్యాలతో
ఇష్టదైవం వద్ద మోకరిల్లాలనుకున్నా
లలిత కలిత  మనో చలిత శ్రీ లలిత
పద సన్నిధిలో త్వమేవాహమ్ అంటూ
శివోహమ్మంటూ లీనమై పోవాలనుకున్నా
అభీష్టం ప్రతిపాదితమైనా
ఆమోదం వరప్రసాదమే
అనుగ్రహం అమ్మదైతే
అనుభవం ఈ మేనులో నేను ది
సర్వం శ్రీ జగన్నాథం అంటూ
గెలుపు ఓటముల ఓతప్రోతంగా
కలిమి లేముల పదద్వయంగా
కన్నీ‌ట ములుగుతూ
 పన్నీ‌ట తడుస్తూ
ఇప్పటికీ తప్పటడుగుల
తడబాటు పోక
గుండె దిగాలు పోక
ఎందుకిలా మిగలా‌లి
కిమ్మనకుండా మనగలగాలి.