Wednesday, March 6, 2019

         రంగూన్ పైడయ్య.

 పని జేయలేనోడు పనికి మాలినోడూ దేశానికి బరువే అంటాడు పైడయ్య. అతనికి ఎప్పుడూ ఏదో పని చేసుకోవాలి. ఏ పనీ లేక పోతే గొడ్ల పాకలో పశువుల బాగోగు చూసుకోవాలి. జొన్నచొప్ప పచ్చి గడ్డి మార్చి మార్చి మేపాలి.
ఓ సారి సిక్కోలు తాతగారింటికి వెళ్ళి వచ్చాడు. అక్కడ నుంచి చాలా మంది బర్మా కంట్రాక్టర్ల దగ్గర కూలిపనికి ఒప్పుకుని ఓడెక్కి రంగూన్ వెళ్తున్నారు.
"ఓ పాలి ఎల్లొస్తే నాలుగు కాసుల బంగారం కొంత డబ్బు తెచ్చుకోవచ్చంట. మనవూ ఎల్దామా" మేనమామ అడిగాడు.
"నీ కొడుకు కూలీఓడు కాకుండా కామందుని సెయ్యాలంటే ఎల్రా" అన్నాడు తాత.
వాళ్ళతో బాటు ఇతనూ కాగితాల మీద వేలిముద్రలు వేసి బయానాగా నూరు రూపాయలు తీసుకుని వచ్చాడు. అన్నమాట ప్రకారం ఓడెక్కి వెళ్ళాడు. పదేళ్ళ తరువాత వచ్చాడు. ఎప్పుడేనా సిక్కోలు నుంచి ఎవరైనా వస్తే తన పెళ్ళాం పిల్లల కబుర్లు తెలిసేవి.
పదేళ్ళ తరువాత  ఎలాగైతేనేం కాస్త డబ్బు మూటగట్టుకుని వాళ్ళ వూరు వచ్చేసాడు.
ఊరంతా కలిపితే ఓ నూరు గడప కూడాలేదు.  ఐదారొందల జనాభా ఉండొచ్చు. ఎవరికీ స్వంతంగా భూముల్లేవు. ఊరి భూములన్నీ దొరగారివే. ఓ రాజుగారు యీనాంగా రెండువేల ఎకరాలు ఇచ్చారుట. ఆ దొరగారు ఎక్కడ జాగా చూపిస్తే అక్కడే ఓ గుడిసె వేసుకుని ఉండాలి ఎవరైనా.
దొరగారు చాలా విచిత్రమైన మనిషి. వారి మనవలకి చదువు చెప్పించాలని తెలిసున్న వాళ్ళని పట్టుకుని ఓ బడి పెట్టించు కున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1940 ప్రాంతంలో రెండు ఊర్లకు కలిపి ఓ బడి, ఆ బడికి ఓ చక్కటి ఆవాసం ఏర్పాటు చేసారు. దానిని బిల్డింగ్  బడి అని పిలిచేవారు. మంచినీటి కోసం బడి పక్కనే ఓ బావి ప్రభుత్వం తరఫున సాధించారు. దానికి బిల్డింగ్ నుయ్యి అని పేరు. కొండజల పడింది. వేసవిలో నాలుగైదు గ్రామాలకు మంచినీరు అందించేది.
అల్లూరి సీతారామరాజు ఓ సారి అటుగా వచ్చి ఆ నూతి దగ్గర స్నానం చేసి మన్నెం ప్రజ‌లతో కలిసి దొరగారిని కలిసారట.
విశాఖపట్నంలో ఇప్పటి జిల్లా పరిషత్ దగ్గరలో ఒక నుయ్యి యీ దొరగారే తవ్వించారు. దాని ఆనవాళ్లు యింకా అలానే ఉన్నాయి.
దొరగారి తల్లి చేతికి ఎముక లేదని పేరు. ఏ ఆడది ఆ గడప తొక్కినా చేతిలో ఏదోటి పెట్టి పంపేది. ఊరి వారంతా దొరగారి కమతంలో పనిచేసుకోడం అడివిలో కట్టెలు అడ్డాకులు వెదురు తెచ్చుకుని వడ్లుకి మార్పిడి చేసుకునే వారు. దొరగారు చాలా వరకూ భూములు కౌలుకి ఇచ్చేసి శ్రమ తగ్గించు కున్నారు.గాంధీ గారి ప్రాబల్యం కామోసు. ఖద్దరు బనీను గావంచా పైమీద ఓ తుండు  చేతిలో ఓ చాపాటి కఱ్ఱ ఆయన ఆహార్యం. తరచూ విశాఖ పట్నం వెళ్ళి వచ్చేవారు.
ఇంతలో స్వతంత్రం వచ్చింది. ఆపైన కొద్ది కాలానికే ఈనాం ఏక్టు వచ్చింది. దున్నే వాడిదే భూమి అన్నారు. రెండువేల ఎకరాల నుంచి ఒంద ఎకరాలకు తగ్గిపోయింది వారి భూమి. జమీందారు ఒక్కసారిగా సామాన్యుడై పోయారు. ఆబెంగతో మరి కొన్నాళ్ళకే కాలంచేశారు.
దొరగారి అన్నదమ్ములు విడిపోయారు. నలుగురికీ తలో పాతిక ఎకరాలు వచ్చింది. కాని పిల్లలు ఎవరూ సరిగా చదువుకో లేదు. దొరగారి ఆశ తీర లేదు.
అది మండు వేసవి. నిప్పులు చెరిగే ఎండలు. రాత్రిళ్ళు ఉక్కబోతలు. మహా కరువు రోజులు.
గుక్కెడు మంచినీళ్ళు కూడా గగనమే. బిల్డింగ్ నుయ్యి కాస్త దూరమైనా శుభ్రమైన తియ్యని నీరు వట్టి పోకుండా ఊరేది.
పైడయ్య భార్య కాలంచేసింది. రంగూన్ నుంచి పైడయ్య తిరిగి వచ్చేసరికి బాగానే ఉండేది ఆమె. అక్కడ నుంచి తెచ్చుకున్న డబ్బుతో ఐదెకరాల మెరక భూమి ఓ ఎకరం పల్లం భూమీ కొన్నాడు పైడయ్య.
కోడలు బాగా గయ్యాళీ. వీలైనంత వరకూ చేలోనే గడిపేవాడు పైడయ్య.
ఓ రోజు కొడుకుతో ఏదో గొడవ పడి రంగూన్ పైడయ్య అర్ధ రాత్రప్పుడు ఆ నూతిలో దూకేసాడు ఆత్మహత్య చేసుకోవాలని. వలస కూలీగా బర్మా వెళ్ళి రంగూన్ లో పనిచేయడంతో అతన్ని రంగూన్ పైడయ్య అనేవారు.
మనిషైతే చావలేదు కాని నీళ్ళు కలుషితం ఐపోయాయి. తాగడానికి మంచినీరు దొరికే మరో మార్గం లేదు.
ఊరు ఊరంతా వచ్చి నీళ్ళు తోడి పారబొయ్యడం మొదలు పెట్టారు ఇద్దరు ముగ్గురు కన్న ఎక్కువమంది ఒకేసారి తోడలేరు. నూతి ఒర చిన్నది బాగా.
రెండు రోజులు రాత్రి పగలు తోడినా తరగ లేదు గంగ. మూడో రోజుకు పూర్తిగా తోడారు. తోడి వెలిపిన నీరంతా ఓ గుంటలోకి మళ్ళించారు.పశువుల కోసం.
అక్కడికి ఒక కోసు దూరంలో పెనుగొండ ఉంది. అక్కడ ఒక జలధార ఉంది. అది కూడా ఎప్పుడూ ఎండి పోలేదు. ఈ రెండే వేసవిలో మంచినీటి వనరులు.
వేసవిలో పశువులన్నింటినీ ఆ పెనుగొండ శిఖరానికి తోలుకు పోయి తొలకరించే వరకూ అక్కడే
అందరూ జీవాలను ఆచుకునే వారు. ఆ కొండ
 పైన 'చదును' అంటే సమతల నేల ఊట బావి ఉన్నాయి. పచ్చిక ఎప్పుడూ ఉంటుంంది.
రంగూన్ పైడయ్య కొడుకుతో గొడవపడి విరక్తితో నూతిలో దూకాడు. అయినా చావు రాలేదు. భార్య పోయి చాలా కాలం అయింది. రెండ్రోజులు ఎలాగో నిభాయించుకుని టీ కొట్లో టీ తాగి కాలక్షేపం చేసాడు. ఇంటికి పోబుద్ధి కాలేదు.
చివరికి పెనుగొండ చదునుకి వెళ్ళిపోయాడు. అక్కడ మిగతా పశువుల మేకల కాపరులతో కొన్నాళ్ళు గడిపాడు. ఆ తరువాత మన్నెం ప్రజలలో కలిసి పోయి అల్లూరి పితూరి గుంపుకి వంటలు వండుతూ కుదురుకున్నాడని వినికిడి.
రంగూన్ నుంచి వచ్చేటప్పుడు డబ్బు బంగారం తెచ్చాడు. భార్య పోయాక ఇంటిలో ఆదరణ కరువైంది. శరీరం బరువైంది. గౌరవం పోయింది. కొడుకూ కోడలూ ఓ మిద్దె ఇల్లు కట్టుకున్నారు.
ఒకరి కష్టార్జితం మరొకరికి హక్కు భుక్తం అయ్యింది.
పెనుగొండ మీద ఉన్నప్పుడు తరచూ పైడయ్య ఇలా పాడుతూండేవాడు.
కొడుకెవడురా
కోడలెవతెరా
నా ఖర్మ మింతేరా
తినీ తినకండా డబ్బు పోగేసినా
వట్టుకొచ్చి కొడుకు చేతిలో బోసినా
వయసు మీదైనాక పలకరింపే లేదు
మనసు మీదైనాక ఆదరింపూ లేదు
నా ఖర్మ మింతేరా
నా పున్నె మింతేరా.
కాలచక్రం గిర్రున తిరుగుతోంది. పైడయ్య కొడుకు రంగయ్యకి నలుగురు పిల్లలు. ఒక అబ్బాయి ముగ్గురమ్మాయిలూ.
అందరికీ పెళ్ళిళ్ళు ఐ పోయాయి. కూతుర్లకూ ఒకో ఎకరం కట్నం ఇచ్చాడు. కొడుకు వట్టి తుంటరి. జూదరి. రంగయ్యకి ఏదో తెలీని జబ్బు. వైద్యం చేయించే దిక్కులేదు. భార్య ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది.
మా నాన్నకు నేజేసిన అన్యాయమే ఇలా కట్టి కుడుపుతోందని విచారించేవాడు. కాలం వెనక్కి రాదు.
పాపం. ఎప్పుడు ఎక్కడ ఎలా గతించి పోయాడో పైడయ్య ఎవరికీ తెలియదు.
కొడుకును భూకామందు చేసినా ముసలోడ్ని వదిలేసిన కొడుకు.
 పాపం రంగూన్ పైడయ్య.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home