Thursday, March 31, 2016

అది గోదావరి నీటి మహిమ. 
అది ఆదికవి సంచరించిన నేల. 
అది శ్రీ చక్రం భూమికి తీసుకు వచ్చిన గొఉతమీ తీరమ్. 
అక్కడ ఓనమాలు దిద్దిన ప్రతి వాదికీ 
పదాలు పద్యాలు పాటలు వెన్నెల్లో ఆటలు సహజ లక్షణాలు. 

Sunday, March 27, 2016

సంసారం 

ఒకరితో ఒకరుగా ఇద్దరు ఒక్కరుగా 
సరదాలు సంబరాలు 
ఆనందాలు సంతోషాలు 
భేదాలు ఖేదాలు 
ఆవేదనలు ఆలోచనలు 
ఆక్రోశాలు ఉక్రోషాలు 
పంచుకుంటూ పెంచుకుంటూ 
పరిణతితో సర్దుకుంటూ 
వర్తమానంలో శాంతితో 
భవిష్యత్తులో విశ్రాంతితో 
ఒక ఆడ మగా కలిసి 
సాగించే పయనమే 
సంసారం. 

Saturday, March 26, 2016

సాంత్వన 

మనస్సు వికలమైనప్పుడల్లా
ఒంటరిగా ఉండాలనిపిస్తుంది.
నింగిలోకి తొంగి చూడాలనిపిస్తుంది
సాగర తీరంలో పడిలేచే కెరటాలవైపు
తదేకంగా చూడాలనిపిస్తుంది.
ఓడిన ప్రతిసారీ
పోతనగారి అశ్వత్థామ గర్వ భంగం
చదవాలనిపిస్తుంది.
కృంగిన ప్రతిసారీ
భట్టీ విక్రమార్కుణ్ణి తలచుకోవాలనిపిస్తుంది.
ఓదార్పు , సాంత్వన పట్టుదలా
అన్నీ ఆ ప్రకృతిలోనే పొందాలనిపిస్తుంది.  

జీవితం 

అమ్మ కడుపులో ఉన్నప్పుడు 
ఈ నరకం నుంచి తప్పించమని 
నేలపై పడేయమని వేడుకున్నా 
నేలపై పడ్డాక పలుకు రాక 
అన్నిటికీ ఒకటే ఏడ్చా 
మాటలొచ్చాక 
ప్రతిదీ కావాలని ఏడ్చా 
బడికి వెళ్ళనని ఏడ్చా 
పాఠమ్ రాకపోతే ఏడ్చా 
చదువయ్యాక 
పనికి కుదురుకునేదాకా ఏడ్చా
కుదురుకున్నాక 
స్థాయి పెరగలేదని ఏడ్చా 
పనిలోపడి సరదాలకు 
సమయం దొరకక ఏడ్చా 
రిటైరయ్యాక కాలం గడవక ఏడ్చా 
ఈ ఏడుపులన్నిటికీ మూలమ్ 
తృప్తి లేని జీవితం 
సంతృప్తి లేని జీవన గమనం 
ఉన్న దానితో తృప్తి పొందాలి 
లేనిదానికై వెంపర్లాడితే 
ఏడుపే నీ జీవితం
ఇదే జీవితం.  
  

Friday, March 25, 2016

ప్రేమ అంటే 


అవుసరమే అన్వేషణకు మాతృక.
అది భాషైన కావచ్చు వలపైనా
లేదా మరేదైనా సరే
ఈడేరిన అమ్మాయికైనా
నూనూగు మీసాల  అబ్బాయికైనా సరే
హార్మోన్ల ఘర్షణ మొదలైతే
తారసపడిన వారిలో ఎవరో ఒకరిపై
మనసు పారేసు కోవడం
కేవలం మానసిక, శారీరక అవుసరం మాత్రమే .
పరిచయాలు పెరిగి ఆంతరంగికాలు ఎరిగి
కలియ తిరగడాలూ
రాసుకు పూసుకోవడాలూ ఆ కోవలోవే.
అదే ప్రేమ దోమా అని
భ్రమపడితే పాకుడు రాళ్ళపై
దిగజారటమే చాలవరకూ.
పెళ్ళికి ముందే ఎందుకు ప్రేమించాలి
మూడుముళ్ళ తరువాత
ఆఇద్దరూ హాయిగా ..ఇంచుకుంటే
ఎవరికి  బాధ?
  

Tuesday, March 22, 2016

తల్లి పిల్ల మమకారం 

'అవనిలో  అన్నిటికన్నా అమ్మే మిన్న'
'నవమాసాలు మోసి కన్న బిడ్డే  మిన్న'
'అమ్మ ఒడికన్నా  విశ్వంలో ఏదీ గొప్ప కాదు'
'బిడ్డ స్పర్స కన్నా మధురానుభూతి లేనే లేదు''
తల్లికి బిడ్డా బిడ్డకు తల్లి 
పరస్పరం అపురూపం 
ఆనందానికి పరమావధి అమ్మ 
అపురూపానికి మరో పేరు బిడ్డ 
పశువులైనా మనుష్యులైనా 
జీవమున్న ఏ ప్రాణికైనా 
అమ్మ అమ్మే 
అమ్మా అంటే అంబే 
అమ్మే అంబ.  

 

Monday, March 21, 2016

పెద్దలు కుదిర్చిన పెళ్లి 


సంగీత సాహిత్య సరస సల్లాపాలలో
ఇద్దరమూ ... సరి సగమూ
మధురానురాగానుభూతిలో
ఇద్దరమూ... చెరి సగమూ
 అనుబంధ బాంధవ్యాలలో ఒద్దికగా
ఇద్దరమూ... సమతూకాలు
కర్తవ్య దీక్షలో బాధ్యతా భారావాహంలో
ఇద్దరమూ ... సంపూరకాలు
అమ్మ నాన్నల ఇష్టాపూర్తి
జీవిటానికి ఓ  కొత్త స్పూర్తి
చేతులు కలిపిన శుభ సమయం
చేతలు కలిసిన మనోద్వయం
జంటగా మనగలిగే మహా వరం
సమాజం ఆదరణే  అండ
కుటుంబం ఆలంబనే ఊపిరి.   

Wednesday, March 16, 2016

బ్రతుకు బాగు పడాలంటే 

కావాలి ఒక స్ఫూర్తి ప్రదాత 
కావాలి ఒక మార్గ దర్శి 
దొరకాలి ఆపై ఒక 
సద్గురువు 
ఆ గురువు తలిదండ్రులైనా కావచ్చు 
విద్యాలయంలోనో, 
దేవళంలోనో
ఆ మహామనీషి 
దొరకవచ్చు. 
జీవిత గమనాన్ని మార్చే 
తీర్చిదిద్దే సత్సాంగత్యమే 
మహా వర ప్రసాదం. 
ఆపై స్వయం కృషి .  

       అమ్మ 

అమ్మ తానొక అమ్మల గన్న అమ్మ 
అమ్మ అంటే ఆది పరాశక్తి 
అమ్మ అంటే ఓ అమృత మూర్తి 
అమ్మ మన కళ్ల ముందు నడయాడే దేవత. 
చంటిబిడ్డగా ఉన్నప్పుడు 
నేనే అమ్మకు సర్వసం 
నాకూ అమ్మంటే అంతే  ఇష్టం
ఆటా మాటా పాటా అన్నీ 
అమ్మే తొలి గురువై నేర్పింది 
నడకా నడతా సభ్యతా 
అన్నీ తానే నేర్పింది 
నెల బాలుడప్పుడు 
నా ఊహలకు భాష్యాలల్లింది 
ఊసుల ఉయ్యాలలో 
జోల పాట పాడింది 
అన్నీ తానై నన్ను తీర్చి దిద్దిన 
కన్నతల్లీ నీకు పాదాభివందనం 
మనసా వాచా కర్మణా నీకు సాష్టాంగ ప్రణామం.  

Tuesday, March 15, 2016

తప్పులెన్ను వారు 

తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు 
అన్నాడు వేమన. 
తప్పులెంచడం వేరు 
విమర్శించడం వేరు 
ఆ తప్పు జరక్కుండా ఇలా చేసి ఉంటే బగణ్ణు 
అనటం తప్పుకాదు. 
అందులో ఎదుటి వ్యక్తిపై 
ఏదో మమకారం అలా తోపిస్తుంది. అలా అనిపిస్తుంది. 
తప్పు అని తెలిసీ  ఎవరోకాని 
తప్పు చేయాలనుకోరు. 
తెలియక చేస్తేనే తప్పు 
తెలిసి కుడా చేస్తే అది ముప్పు. 
తప్పును చూపే వాడే లేకుంటే 
అన్నీ తప్పులే జరుగుతాయేమో? ఏమో?
అంచేత నన్ను తిట్టేవాడే 
నన్ను విమర్శించే వాడే 
నా శ్రేయోభిలాషి. 

Sunday, March 13, 2016

సారధి ఎవరు సైంధవుడెవరు?

జరామరణాలు అప్రయత్నాలు 
మనస్సంకల్పాలు చిత్త చామ్చల్యాలు
ప్రారబ్ద పూరకాలు
 జీవన నావకు
ఒడిదుడుకుల సుడిగుండాలు
గమనా గమన నిర్ధాయకాలు.
సారధి, సైంధవ కృత్యాలు
అవుసరం మేరకు
కాలానుగుణాలు. 
కష్టార్జితంతో బ్రతికేవారు ఎవరికీ తలవంచరు కాని అలా నిలపడ్డానికి ఎన్ని అవస్తలో.
ఎన్నెన్ని అవమానాలు మరెన్ని అవహేళనలు ఇంకెన్ని ఉథ్థాన పతనాలు
బ్రతుకు బాట అంతా  గతుకుల మయం
నితీ నిజాయతీ కొరవడిన ప్రపంచంలో
అదొక దుర్గమన మార్గం .  
మరణం తప్పనిది
అది ఎదురైతే
నిర్భయంగా స్వాగాతిస్తా
కాని అప్పుడు కూడా
చిత్తం శివుడి మీదే వుండాలని
కోరుకుంటా.
దానికి ఎవరి సంతాపం నాకొద్దు
ఎవరి కన్నీరు అసలే వద్దు
నా ప్రోద్బలంతో
నా కృషి తో
బాగుపడ్డ నలుగురు
అప్పుడప్పుడు
తలచుకుంటే చాలు.

Friday, March 11, 2016

               చెలిమి 

అంగ లార్చేవాడు ఆదుకోబోడు 
అంట కాగినవాడు ఆమడ దూరాన ఉంటాడు 
సహాధ్యాయులు అసూయాపరులు 
గ్రామస్తులు స్వార్ధపరులు 
బంధువులు బాదర బందీలు
దాయాదులు దారులు వేరు
భార్యా సుతలు భయస్తులు
ప్రకృతి వినా లేరెవరు
నా మనసు తెలిసినవారు
పంచ భూతాలు,  పుస్తకాలు
ఇంకా నాకు  మిగిలిన
నా నేస్తాలు.



Thursday, March 10, 2016

ప్రేమకు నాలుగు సోపానాలు 

1. ఆకర్షణ 
2. అన్వేషణ 
3. ఆరాధన 
4 ఆలాపన 
ఈ నాలుగు మెట్లు ఒక్క లఘువు లో ఎక్కాలనుకుంటే 
బోల్తా తప్పదు. ప్రతి మెట్టు పైనా ఆచి తూచి అడుగేయాలి 
అందం చూసో ఒంటి బలుపు/మెరుపు చూసో 
కలిమి/బలిమి చూసో మత్తులోకి జారకుడదు. 
కన్న తల్లి తండ్రుల కన్నా 
హితైషులు ఎవరూ ఉండరు 
వారి అభీష్టాన్ని  మన్నించితే 
అంతా  శుభమే.   

అవలోకనం 

ఎదిరించే మనసే లేకుంటే 
ఎద ఎత్తులు చేరేదా?
నిలదీసే మది లేకుంటే 
నిలదొక్కుకు నిలచేనా ?
అవమానం తెలియకుంటే 
మానం మిగిలేదా?
అనుమానం తప్పంటే 
అభిమానం మిగిలేదా?
కుర్రతనం, వెర్రితనం 
ఏదైనా పరిశీలన నేర్పింది. 
అతివల చూడకుంటే 
అవలొకనమబ్బేనా?
ఎదపై  పయ్యెదపై 
సరి చూసుకుంటూ 
సరి చేసుకుంటూ 
కంట పడకుంటే 
తలదించుకు పోవడమొచ్చేనా
ఎన్నో కలలు ఎన్నెన్నో ఆశలు 
వాటి మధ్య మరికొన్ని 
ఆశయాలు  ఆరాటాలు 
చలం గారి మైదానం లో 
కృష్ణ శాస్త్రి ఊర్వసిని 
కృష్ణ పక్షంలో వెదకాలనుకున్నా 
వేయిపడగల నీడలో 
కిన్నెరసానిని, వెన్నెలలో 
విశ్వనాధ వారి 'కవిత'ను 
చుడాలనుకున్నా 
నండూరివారి ఎంకి 
మాటల్లో మహా పెంకి 
ఇంకా పూర్ణమ్మ, కాంతం, లకుమ
ఒకరేమిటి ఎందరో 
నా ఆరాధ్య మూర్తులు 
చివరకు 
శైలూషి  పీయూషి బిక్షగా 
షోడశి దక్కింది. 
అదే చివరకు మిగిలేది. 

 
 



ఇదో కోరిక 


అరవయ్యో పడిలో కూడా
నేను నాది అనుకుంటూ కూచ్చుంటే
జనత కోసమో  ఘనత కోసమో
బ్రతికేదేప్పుడు  వెదికేదేప్పుడు
'నేను సైతం ప్రపంచాగ్నికి'
అని మురిసేదేప్పుడు?
వెలుతురుండగానే
ఇల్లు చక్క బెట్ట మన్నారు కదా
ఓ నేస్తం!
ఆలోచించు పేరా వారి కోసం
ఓ సంగడి మనసా
ఏదైనా చెయ్యాలి
పది కాలాలు పెరుండి పోయేలా.
ఇదొక నూత్న  యవ్వనంగా
పరోపకారమే లక్ష్యంగా
గడపాలని
పరమేశ్వరుడే పరమావధిగా

బ్రతకాలని ఉంది