Tuesday, December 31, 2019

   వీడ్కోలు
సీ.
కంట కునుకు లేదు యింట మెతుకు లేదు
                 అమరావతికిపుడు ఆశ లేదు
మూడు ముక్కల యాట రాజధానికి బాట
                ముచ్చోట్ల కాపురములకు వేట
ఓటు వేసిన వారికిన్ కోటి దండాలు
                అరదండములట కాదన్న వార్కి
ప్రాంతీయ విద్వేషములతొ తన్నుకు చావ
            వలెనేమొ నికమీద వాస్తవముగ
తే.గీ.
కొమ్ము  కాసెడి వారలు కొందరుండ
క్రుంగ దీసెడు వారలిం కొందరుండ
రెండు వేల పందొమ్మిది రిక్త హస్త
వెడల యినుప గజ్జెల రేని వేడు కొందు.

Monday, December 30, 2019


True to my heart and
True to my thoughts
May January bring Joyful moments
February fall in favour of you
March may make you march forward
April may open more avenues
May may take you to a bay
June may fine tune
July may rely on holy truth
August may keep you at august audience
September may awaken you from slumber
October may salute to your caliber
November may  make you  remember and
December may shower flowers on you.
Wishing you the whole year with
Best of luck and God's grace.



Thursday, December 26, 2019

నాకేటి వెఱపు

 నాకేటి వెఱపు
తే.గీ.
ఎడద లోతుల సాక్షి మిన్నేటి సాక్షి
వైరి వర్గము సాక్షి నా వాక్కు సాక్షి
సర్వ జన హితైషిని విశ్వ శాంతి కోరు
దెవ్వరేమను కున్న నాకేటి వెరపు.

కుదిరితే యుపకారమో కుదర కున్న
మౌనమే నాకు తెలుసు ఓనమాలు దిద్దు
బిడ్డ చెప్పినా వినుకొందు పేర్మిగాను
ఎవ్వ రేమనుకున్న నాకేటి వెరపు.

వెకిలి నవ్వుల గొట్టంపు వెంగళాయి
వెక్కిరించ వెల్తి పడను  విడచి వేతు
వాని ఖర్మకు వాని యవాకు లనను
ఎవ్వ రేమనుకున్న నాకేటి వెరపు.

తలపు తలపున నాకు యంతర్మథనమె
పలుకు పలుకున నాకు సౌభాగ్య మొకటె
తెనుగు పలుకుబడులతొ వాతెరలు కదులు
ఎవ్వరేమనుకున్న నాకేటి వెరపు.

నా తెలుగు యూపిరులనూదు నంత బలిమి
తెలుగు తియ్యందనాలతో తిరుగు కలిమి
తెలుగు తేరుల పైకి నెత్తేటి పసిమి
ఎవ్వరేమనుకున్న నాకేటి వెరపు.

తెలుగు వలదనుటొక నూత్న తెగులు గాదె
తల్లి దండ్రులిచ్చిన యాస్థి తెలుగు పలుకు
వంశ పారంపరపు యాస్థి వదల గలరె
ఎవ్వ రేమనుకున్న నాకేటి వెరపు.


Tuesday, December 17, 2019


ఉ.
ఎక్కితి నేడుకొండలను యెంతయొ శక్తి సమీకరించి నే
నెక్కితి రెండు మార్లిపుడు యెంతయొ నా మది భక్తి మీరగా
దక్కెను దివ్య దర్శనము దవ్వుల నుండియె నర్ధరాత్రి యిం
కొక్కటి సుప్రభాతము మరొక్కటి దాతగ నాదు భాగ్యమై.
ఉ.
నాలుగు నాళ్ళలో నచట నాలుగు మార్లు లభించె దర్శన
మ్మేలన మేలు మేలనుచు మేమదియే పనిగా శ్రమించ మ
మ్మేలు కొనెన్ యనాథ ధవుడే మలయప్పయె నచ్చటన్
యే లకుచిక్కులన్ బడక యేమిది నంతయు నీశ్వరేచ్ఛయే.
.
మ.
పదివేలిచ్చిన దాతకున్ మిగుల సంభావ్యంబుగా జూపగా
మది సంతోషము చెప్పజాలను యసామాన్యంబుగా జూచితిన్
పదివేల్చొప్పున నాల్గు పొందితిమి సొంపారన్ సుమర్యాదగా
పదిమందొక్కొక గుంపుగా నిలిపి జూపెన్ జన్మ ధన్యంబుగా.
శా.
దర్శింపన్ గల భాగ్యమిచ్చితివి యంతా నీ కృపాధిక్యమే
దర్శింపించిరి జన్మ సార్థకత పొందన్ వేంకటేశా హరీ
దర్శింతున్ పలుమార్లు నీ కరుణచే దాక్షిణ్య సంపత్తిచే
స్పర్శించిన్ కనుమీ కులీనుని మనస్సంతా  ప్రభో శ్రీ హరీ

Monday, December 16, 2019


శా.
ఎవ్వారిన్ననిమేషమున్ దలతు నేనెవ్వారి సేవన్ సదా
పువ్వాటంబును లేక జేసెదనొ నా పుణ్యంబుగా దల్చుచున్
యవ్వారల్ తొలి దంపతుల్ కరుణతో యావత్ప్రపంచానికిన్
యివ్వన్ జూతురు భోగభాగ్యముల నాకీరే మమాభీష్టముల్.
శా.
కుయ్యాలింపరె మమ్ముగావరె పరాకున్నుందురే భళా
చెయ్యూతన్నిడరే పురాణ పురుషుల్ శ్రీ పార్వతీ భర్తలున్

Tuesday, December 10, 2019


ఒక జీవితకాలపు వాంఛ
ఓడిన  ప్రతిసారీ  ప్రతీకారేచ్ఛ
జీవితంలో ఒకసారైనా
ఏడుకొండలవాని వేడుకోవాలనీ
సుప్రభాత సేవలో మైమరచి పోవాలనీ
అమ్మ ఆశీర్వదించింది
రమారమణుడు రమ్మన్నాడు
ఇదిగో నే బయలుదేరుతున్నా
నడిచి నీ కొండ లెక్కుతా
నీ దివ్య మంగళ మూర్తిని
తనివితీరా జూచి ఉప్పొంగిపోతా
చిన్నప్పుడు నోరారా పాడుకున్నా
నీ సుప్రభాతమూ మంగళారతీ
ఇన్నాళ్ళకు మన్నించావా మలయప్ప స్వామీ
ఆదుకో చేదుకో అంతే కాని ఆడుకోమాకు
అన్నమయ్యను కాను పదకవితలతో పొగడ
పోతన్నను కాను మందార మకరందాలు జల్ల
మాది వట్టి రాళ్ళపల్లి, రాళ్ళలో మొలచిన
వట్టి గడ్డిబరక నా కవిత నీకు విన సొంపౌనా
పవిత్ర మార్గళిలో నీ సుప్రభాత సేవ
నన్ను మరింత భాగవతుణ్ణి చేయాలి
తతిమ్మా అన్నీ ఆ ఈశ్వరేచ్ఛ ఆపై నా ప్రారబ్దం.

Monday, December 9, 2019

     కలువ కన్య
ఈ రాకా నిశా రాజశ్రీ మరీచీ రాకకై
తహతహలాడే నీలోత్పలానన్యపూర్వనై
అదును చూచి ఎదను పరచి ఎదురు చూచీ
అలసి సొలసి వివశనై విషణ్ణ వదననై యుంటే
అతిశీత శబ్ద తరంగమేదో నా అంతరంగాన
'కలువ లేమ! మనమింకా కలువ లేమా' యన
అనన్యపూర్వను నీ కనపాయిని కాలేనా
కలువరాదనుకొంటే ఈ కలువ రాదనుకొంటే
మన కలయిక ముమ్మాటికీ ఓ కల యిక
తారా నివహపు పరిష్వంగాల ఉడుకుకు లోనై
సితారా బలిమికి గ్రహణం పడితే ఉడుకుమోతునై
కన్నీరు కార్చలేక పన్నీరు చెమర్చ లేక లేవలేక
తెల్ల కలువనై  తెలిమంచు తెరలలో తెలతెల్ల బోనా?
నీలోత్పలమునై నిలువునా నీ కొరకు రాలిపోనా?
(అనన్యపూర్వ = కన్య , అనపాయి = విడువకుండా తోడుగా ఉండునది, భార్య ,
సితారా = ప్రారబ్దము , భాగ్యము )

Sunday, December 8, 2019

  నీ కొలువుగా    నే కొలువగా

కోరి నే కోరకనే నిను కొలువగా
మనసంత జేసితి నీ కొలువుగా
ఏరి కొలిచేవారి కొంగుబంగారమై
ఏరి ప్రాపకమూ మాకనవసరమై
నీ సేవలో మమ్ము మననీయుమమ్మా
నీ సేవకే మమ్ము నియమించు మమ్మా //   //
ఆర్తితో పిలచితే ఆపన్నహస్తమిచ్చేవు
అల్లాడిపోతే అమ్మవై అభయమిచ్చేవు
నిన్ను నమ్మిన వారి నెప్పుడూ ఆదరించేవు
నా అన్నవారికందరికి అండగా నిలిచేవు //   //
ఈతి బాధలూ గోతి నక్కలూ నాకేల
కలిములమ్మవు లేమి కిచట చోటేల
అస్తి నాస్తి తో నీవుండగా భయమేల
నా యాస్తి యంతయూ నీవె కావేల //   //
         అంతా ఆ ఈశ్వరేచ్ఛ
హిమవంత శీత మారుత నిశా హేమంతమంత
నా మనస్సరసీరుహాన కలువలై విరబూసినంత
నీలోత్పల ధవళోత్పల అదృశ్య సౌరభమంత
పలుకరిస్తే ఉరకలేస్తే ఊరిస్తే నన్ను ఉసిగొలిపితే
ఈ తనూస్పర్శలో విస్పష్ట విపంచిగా నే తలచినంత
భావాంబర వీధి విసృత విహారి గీర్వాణాంధ్ర భారతి
తలపుల నెలవై పలుకుల కొలువై కవితల చెలువై
నన్ను నిలబెడుతూ నిలదీస్తూ నిరసిస్తూ తీర్చి దిద్దితే
అక్షరమైన అక్షరాలకే పరిమితమౌతూ పరితపిస్తూ
సాగే కొనసాగే ఉచ్ఛ్వాశ నిశ్వాసాలలో నిరంతరం
జప తపస్సమాధిగత ప్రాణిలా యత్నిస్తా నహరహం
మాకందం నాకానందం అనుబంధం  అక్షర విన్యాసం
కవనానికి పవనానికి నన్ను మైమరపించే తమో గుణం
రాటుతేలినా పాటు మారినా అంతా ఆ యీశ్వరేచ్ఛ.