Monday, December 9, 2019

     కలువ కన్య
ఈ రాకా నిశా రాజశ్రీ మరీచీ రాకకై
తహతహలాడే నీలోత్పలానన్యపూర్వనై
అదును చూచి ఎదను పరచి ఎదురు చూచీ
అలసి సొలసి వివశనై విషణ్ణ వదననై యుంటే
అతిశీత శబ్ద తరంగమేదో నా అంతరంగాన
'కలువ లేమ! మనమింకా కలువ లేమా' యన
అనన్యపూర్వను నీ కనపాయిని కాలేనా
కలువరాదనుకొంటే ఈ కలువ రాదనుకొంటే
మన కలయిక ముమ్మాటికీ ఓ కల యిక
తారా నివహపు పరిష్వంగాల ఉడుకుకు లోనై
సితారా బలిమికి గ్రహణం పడితే ఉడుకుమోతునై
కన్నీరు కార్చలేక పన్నీరు చెమర్చ లేక లేవలేక
తెల్ల కలువనై  తెలిమంచు తెరలలో తెలతెల్ల బోనా?
నీలోత్పలమునై నిలువునా నీ కొరకు రాలిపోనా?
(అనన్యపూర్వ = కన్య , అనపాయి = విడువకుండా తోడుగా ఉండునది, భార్య ,
సితారా = ప్రారబ్దము , భాగ్యము )

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home